రాధ : చిరు చిరు మొగ్గల చిలిపి తెరలలో
చిటికెలు వేయుచు, చిలిపిగ నవ్వుచు
వడివడిగ వచ్చెను వసంతరాగం
ఎవరికోసమీ సుమభోగం !
కృష్ణ : పిల పిల గాలులు పుప్పొడి దూగ
ఈలలు వేయుచు ఎదలను దూయుచు
ఆమని రాత్రుల యామిని రాగా
ఎవరికోసమీ అనురాగం !
రాధ : ఎవరి కోసమో సుమభోగం !
కృష్ణ : ఈ అనురాగం – ఈ సుమభోగం !
రాధ : పూలతోటలో – కాలి బాటలో
మురిపించెడు నీ మురళి పాటలో
తూగిన నా యెద – ఊయల లూగగ
ఎన్నినాళ్లదీ సహయోగం
కృష్ణ : ఎవరి కోసమీ – సుమభోగం
యమున తీరమున మురళీగానమున
కనులర మూయుచు కలువలు దూయుచు
మయూరి వలె నీ వయారి నాట్యం
ఎవరి కోసమాహ్వానము !
రాధ : ఎన్నినాళ్ళనీ సహయోగం !
మరచిన తలపులు పరుగిడి రాగా
విరిసిన వలపులు పరువము దోగ
మధుర భావనలు మనసున మూగ
ఎవరికోసమీ మధుమాసం
కృష్ణ : అంతులేని సహవాసం
రాధ : ఆరిపోని చిరుహాసం
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾