10_019 బోట్స్‌వానా లో తెలుగు బోధన

Please visit this page

.

మొదటి రెండు, మూడు సంవత్సరాల సందడితో ఉత్సాహం పెరిగి మరికొన్ని పండగలు చేసుకుని, మన సంస్కృతి సంప్రదాయాలని, ఆటపాటలని గుర్తు చేసుకుని, భావాలు పంచుకుని, మాతో ఎదుగుతున్న భావితరానికి తెలియజేయవచ్చని మీటింగులు పెట్టుకుని, ముందుగా ప్రతీ శనివారం కుదిరితే హిందూ టెంపుల్లో, కుదరకపోతే వేరే ఒకచోట కలిసి అంటే విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రం, హనుమాన్ చాలీసా మొదలయినవి రెందు గంటలపాటు చదివి, హారతులు పాడి చేసుకోగలిగాము.

.

కాని పిల్లలకి కొంచెం తెలుగు అక్షరాలు గుర్తించడం, చదవగలగడం నేర్పితే బాగుంటుందని తోచింది. మేము సెలవలకి చెన్నై, హైదరాబాదు వచ్చినపుడు హైదరాబారులో తెలుగు యూనివర్సిటీ వారిని కలిసి వారి సూచనల మేరకి, పుస్తకాల చార్టులు, క్యాసెట్లు తీసుకున్నాం. మరి ఎయిర్ వేస్ వారితో బరువు గొడవ కదా ! ‘ స్పెషల్ పర్మిషన్ ఫర్ ఎ సోషల్ కాజ్ ‘ అని సర్టిఫికెట్ కూడా పట్టుకుని వెళ్ళాం. ప్రతీ శుక్రవారం మా యింట్లో పది పన్నెండు మంది పిల్లలని పోగు చేసి నేర్పించటం మొదలు పెట్టాను.

.

ఈ చార్టులు, క్యాసెట్లు అప్పటి ఇన్‌చార్జి డా. గోపి యిచ్చారు. వారికి ధన్యవాదాలు. నేను కిండర్ గార్డెన్ పద్ధతుల్లో పిల్లలు సులభంగా అక్షరాలు గుర్తించగలిగే పద్ధతి అవలంబించి నేర్పాను. ఏ తల్లి, తండ్రికి వీలుంటే వారు సహాయపడేవారు. పది – పదిహేను సంవత్సరాల మధ్య పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. వాళ్ళు స్కూల్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్వెట్స్‌వానా నేర్చుకునేవారు.

.

పద్ధతి ఏ విధంగా ఏర్పరచామంటే…..

మొదటగా అక్షరమాలలోని 56 అక్షరాలు ఊరికే నోటితో వల్లె వేయించడం జరిగేది.

ముందుగా ఒకే పోలిక గలిగిన అక్షరాలు ఎంచుకుని చిన్న చిన్న చార్టుల మీద రాసి, ఉచ్చారణ చెప్పేవాళ్ళం. ‘ అయ్యో ! అదేమిటి అ, ఆ లు అక్షరక్రమం లేకుండా ? ” అన్న విమర్శ వచ్చింది. అప్పుదు నేను విశదీకరించి పోలికలు గల అక్షరాలు గుర్తించడం నేర్చుకుంటే క్రమం త్వరగానే పట్టుబడుతుందని చాలా శ్రమపడి ఒప్పించగలిగాను. నాకు బోట్స్‌వానా యూనివర్శిటీ లో పనిచేసే ప్రొఫెసర్ మోహన్ సాయపడ్డారు. పేపర్లు ప్రింట్ చేసి ఇచ్చారు.

.

ఉదాహరణకి

ల – అ – చివర గీత లోపలకి.

వ – ప – దూరంగా ఉన్న తలకట్టు

వ – మ – కొమ్ము

మ – య – పెద్ద్ద సున్న

న – స – తలకట్టు దూరంగా

ర – ఠ – మధ్యలో చుక్క

ఈ విధంగా పోలికలు చూపిస్తూ చెప్పాను. ఆ తరువాత, కొన్ని చిన్న మాటలు ఇటు చదివితే ఒకటి, అటు చదివితే మరొకటి….

.

పలక – కలప

గడప – పడగ

మర – రమ

రంగ – గరం

.

ఒకే మాట రెండు సార్లు కలిపినవి……

గలగల

లబలబ

బడబడ

డమడమ

.

ఎటు చదివినా ఒకటిగానే ఉన్నవి, అంతేకాకుండా ఒకే అక్షరం ముందు వెనుక వచ్చేవి……

నటన

కిటికి

కందుకం

మడమ

పులుపు

నందనం

.

ఈ రకంగా చెప్పాక, కొన్ని రోజులకి మిగిలిన అక్షరాలు పోలిక లేనివి చెప్పాను. వారానికి ఒక్క రోజు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లోనే బాగానే నేర్చుకున్నారు. మధ్యలో చిన్న చిన్న పద్యాలు, పాటలు సరేసరి.

.

ఇంక వత్తుల యుద్ధం చాలా పెద్దదే అయింది. మాకు యిచ్చిన క్యాసెట్ లో ‘ పుండరీక దళ నేత్ర హరీ ‘ అని ఉంది. అంత పెద్దమాట చిన్న పిల్లలు ఎప్పుడూ వినని వాళ్ళు వెర్రి ముఖం వేసేవారు. కాని ఒక గడుగ్గాయి “ ఈ డబుల్ డెక్కర్ అక్షరాలు రాయను… ‘ ద ’ వత్తుకి ‘ a’ ఎందుకు లేదు ? తప్పు ” అని వాదించేవాడు.

“ నువ్వు పెద్దయ్యాక ఈ పొంతన లేదనుకున్నవి దిద్దుకుందువు గాని, ముందు పెద్దలు చెప్పినట్లు నేర్చుకో ” అని చెప్పేవాళ్ళం. అలా చేతనయినంత కృషి అందరం కలిసి సరదాగా చేసాము. అన్నీ మా ఇంట్లోనే. పిల్లలకి పాప్‌కార్న్, కోక్ లంచాలు సరేసరి.

.

వాళ్ళంతా పెద్దవాళ్ళయి పెద్ద చదువులు చదువుకుని ఉంటారు. నాకు మళ్ళీ పరిచయం పెరగలేదు. కాని కాలిఫోర్నియా లో చదువుకునే రామలక్శ్మి గారి అమ్మాయి చిట్టి నేను నేర్పించిన పాట పాడినపుడు నేను అనుభవించిన ఆనందం వర్ణించలేను. తరువాత ప్రొఫెసర్ రాధాకృష్ణ దంపతుల్ని కలిసాను. ఈ భాషా ప్రయోగంలో సాయపడిన ఉమాదేవి, కృష్ణన్ లక్ష్మి దంపతులకి శతకోటి ఆశీర్వచనాలు.

.

ఎక్కడున్నారో తెలియని అప్పటి స్నేహితులకి అభినందనలు.

.

*******************************

.