12_011 చేతికొచ్చిన పుస్తకం 14

 

చేతికొచ్చిన పుస్తకం: 66

యాభయ్యేళ్ళ యన్నార్ చందూర్ జగతి డైరీ

డైరీలనేమాట పేరులో కలిగిన పుస్తకాలన్నీ డైరీలు కాకపోవచ్చు, ఇది మాత్రం 1960 నుంచి 2010 దాకా సాగే మాలతీ చందూర్ గారి భర్త చందూరు నాగేశ్వరరావు డైరీనే! 1953లో తెలుగు రాష్ట్రం ఏర్పడినా మద్రాసు లో ఉండిపోవడం, భార్య మాలతి 1952 నుంచి కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో ‘ ప్రమదావనం ‘ నిర్వహించడంతో ఎన్నార్ చందూర్ ను అలా చెప్పక తప్పదు! నిజానికి ఈయన మాలతీ చందూర్ వెనుక ఛాయగా మిగిలిపోయిన ‘అన్ సంగ్ హీరో వంటి హస్బెండ్’.

ఎందుకో ‘జగతి డైరీ’ గుర్తుకు వచ్చింది, అంతే, మద్రాసు చిరకాల మిత్రులు వై ఎస్ రామకృష్ణకు ఫోన్ చేసి వివరాలు కనుక్కొన్నాను. విజయవాడలోని క్వాలిటీ పబ్లిషర్స్ పతంజలి కి ఫోన్ చేసి, పైకం పంపి పోస్ట్ లో ఈ 2013 ప్రచురణ, 1376 పేజీల బౌండ్ పుస్తకం పొందాను. ఎందుకు అంత సడెన్ గా తెప్పించడం? ఒకేసారి చదివే వీలు లేని బుక్ అది! ఇంట్లో స్పేస్ లేకపోయినా వివరంగా చూడాలని భావించి తెప్పించా!

1978-80 ప్రాంతంలో హిందూపురం లైబ్రరీల్లో, 1983-87 ఎస్వీయూ లైబ్రరీ లో ‘ జగతి ‘ పత్రిక చూశాను, అపుడపుడు చదివాను. తక్కువ పేజీలు, 1/8 డెమ్మి సైజ్, తెల్ల కాగితం పై ఎర్రని బ్యాక్ గ్రౌండ్ లో తెల్లని అక్షరాల టైటిల్ గుర్తుంది. అందులో పనస తొనలు పేరున కవర్ పేజి తిప్పగానే కొటేషన్స్ బాగా గుర్తు! తర్వాత ఆసక్తి కరమైంది ‘జగతి డైరీ’. ఇందులో ఆయన హాజరైన సభల, సమావేశాల కబుర్లు హాయిగా సాగేవి. ఆలిండియా రేడియో మద్రాస్ లో కొంతకాలం పనిచేశారట వీరు. తర్వాత ‘కథావీధి’ ‘మాలి’ పత్రికలు నడిపి కొంతకాలం తర్వాత రెండింటినీ కలిపి ‘జగతి’ చేశారని అంటారు.

సందర్భం, విశేషం ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. ఆలిండియా రేడియో, సినిమా, సంగీతం, నాట్యం, నాటకం, సాహిత్యం, పత్రికా రంగం, రాజకీయాలు, వారిద్దరి పర్యటనలు… ఇలా చాలా సమాచారం ఇందులో ఉంది. ఒక్కసారి అది నాటక, సంగీత, సినిమా సమీక్షలు కావచ్చు లేదా ట్రావెలోగ్ కూడా అవుతుంది.

మొదటి రోజు అరగంటలో ముప్పయి నలభై పేజీలు తిరగేస్తే చాలా సంగతులతోపాటు ఒక తమాషా గమనించాను. మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి తన వ్యాపారాల కోసమని, మరోసారి పిల్లల చదువులకని కారణంగా చెప్పారు! ఇలాంటివి బోలెడుంటాయి పరికిస్తే ఈ ఉద్గ్రంధం లో!

 

చేతికొచ్చిన పుస్తకం: 67

కస్తూర్బా గాంధీ బయోగ్రఫీ

ఈ మధ్య మా పొరుగు అపార్ట్మెంట్ లో ఉన్న సాహితీ విమర్శకులు, చిరకాల మిత్రులు ఎ కె ప్రభాకర్ చాటింగ్ మధ్య ‘సౌదాఅరుణ’ గారి కస్తూర్బా గాంధీ బయోగ్రఫీ గురించి ప్రస్తావించారు! ఈ రచయిత పేరు చాలా సార్లు పత్రికలలో గమనించాను అయితే వారు గానీ ఈ పుస్తకం గానీ పరిచయం కాలేదు. వివరాలు తీసుకుని సంప్రదించి, పుస్తకం తెప్పించాను.

ఆకర్షణీయమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ 64 పేజీల పుస్తకం కస్తూర్బా గాంధీ కుటుంబపు పూర్వ చరిత్రతో పాటు ఆమె జీవిత విశేషాలను కూడా క్లుప్తంగా పరిచయం చేస్తుంది. కస్తూర్బా గాంధీ మనవడు అరుణ్ గాంధీ, ఆయన భార్య సునంద కలిసి శ్రమించి 1967 నాటికే పూర్తి కస్తూర్బా-గాంధీజీ శతజయంతి ఉత్సవాల సమయానికి వెలువరించాలని ప్రయత్నాలు చేసినట్లు ఉన్నారు. రెండు దశాబ్దాల తర్వాతనే స్పానిష్, జర్మన్ భాషలలో ఆ పుస్తకం తొలుత వెలువడింది.

‘The Forgotten Woman: The Untold Story of Kasturba Gandhi’ పుస్తకమూ మరి కొన్ని ఇతర పుస్తకాల ఆధారంగా రచించిన ఈ చిరు పుస్తకాన్ని దస్య థియేటర్, హైదరాబాద్ వారు 2018లో ప్రచురించారు.

కస్తూర్బా గాంధీ గురించి తెలుగులో వెలువడిన తొలి బయోగ్రఫీ ఇదే కావచ్చు! రచయితలకు అభినందనలు!!

( ఆసక్తి ఉన్న వారు 9247150243 ను సంప్రదించవచ్చు, వెల ₹100 )

 

చేతికొచ్చిన పుస్తకం: 68

భూమికసంపాదకీయాలు – వాడిపోని మాటలు

వాడిపోని మాటలు – ఇదీ స్త్రీ వాద పత్రిక ‘భూమిక’ సంపాదకులు కొండవీటి సత్యవతి గారు తన సంపాదకీయాలు సంకలనానికి ఎంచుకున్న శీర్షిక. 1993 లో తొలుత త్రైమాసికంగా మొదలైన పత్రిక క్రమంగా మాస పత్రికగా స్థిరపడింది. గతంలో తొలి సంపుటం వచ్చింది. 2012 నుంచి 2017 దాకా రెండో సంపుటం; తర్వాతవి మూడో సంపుటంగా మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 13 న హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు.

స్త్రీవాద పత్రిక సంపాదకీయాలు కనుక ముప్పై ఏళ్ళ కాలంలో మనదేశంలో, ముఖ్యంగా మన తెలుగు సమాజంలో సంభవించిన పరిణామాలను సమీక్షించడం, వ్యాఖ్యానించడం ఎలాగూ ఉంటుంది. సంపాదకీయం కనుక చాలా గంభీరంగా వ్యాఖ్యానించాలనే ధోరణి కాకుండా చాలా ఇన్ ఫార్మల్ గా ప్రారంభం, భాష ఉండటం హర్షణీయం. అలాగే నిడివి కూడా ఇంతే ఉండాలని కాకుండా అంశం బట్టి మారడం ముదావహం. అలాగే ఎంపిక చేసుకునే విషయం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘అగ్నిపుత్రి’ అంటే మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్ అని కొందరికైనా స్ఫురించవచ్చు కానీ రమణ చెల్లెల్ని మింగేసిన కోస్టల్ కారిడార్ – అనే శీర్షిక లో ఎవరీ రమణ అని అందరికీ అనిపించక మానదు. చేనేత మహిళల సమావేశానికి వెళ్ళి ఆ సమావేశ విషయాలు ఆధారంగా కాకుండా అనుకోకుండా టాక్సీ డ్రైవర్ గా తారసపడిన రమణ చెప్పిన విషాదగాథ నుంచి సంపాదకీయం అంశం అందుకోవడం ఆమె ‘న్యూస్ నోస్’ ప్రతిభా విశేషం.

ఒక్కోక్కటి 232 పేజీలున్న ఈ రెండు పుస్తకాలలో మొత్తం 107 సంపాదకీయాలు ఉన్నాయి. సింహభాగం సత్యవతి రాసినా అక్కడక్కడ ప్రశాంతితో కలసి రాసినవి, ఇంకా పి సత్యవతి, బమ్మిడి జగదీశ్వర రావు,దేవి, అనిశెట్టి రజిత, కాత్యాయని విద్మహే,కవిత పులి,ఆట్టాడ అప్పలనాయుడు, వసంత కన్నాభిరాన్,ఎ. సునీత వంటి వారు రాయడంతో వైవిధ్యంతోపాటు రీడబిలిటి పెరిగింది.

 

చేతికొచ్చిన పుస్తకం: 69

ఆహ్వానంమాసపత్రిక సంపాదకీయాలు

ఎసెస్ లక్ష్మి అంతరంగ పరిమళం

1993 ఏప్రిల్ లో మొదలైన తెలుగు సకుటుంబ మాసపత్రిక ‘ఆహ్వానం’ ఐదేళ్ళ నాలుగు నెలలు మాత్రం నడిచినా సృజించిన చరిత్ర గొప్పది. ఉత్తమ సాహిత్యంతో పాటు సంగీతం,చిత్రకళ, నాట్యం, సైన్స్, మెడిసిన్, మహిళాభివృద్ధి, మానవాభ్యుదయం పట్ల ఆసక్తి, అభిరుచి, అధ్యయన దృష్టితో ఈ పత్రిక నడిచింది.‌

ఆహ్వానం లక్ష్మి గా పేరుగాంచిన ఆ పత్రిక సంపాదకులు 2010 లో 150 పేజీలు, 45 వ్యాసాలతో ‘అంతరంగ పరిమళం’ పేరుతో సంపాదకీయాలనం సంకలనంగా వేశారు. సౌందర్య దృష్టే, విద్య, కళ, కథ, ఆకర్షణ, సహజీవనం, ఆనంద పరిమళం, మనిషి, జ్ఞానం, అభిరుచి,అమృతఝరి, చదువు ఇలాంటివి శీర్షికలు. వీటి గురించి మనకు చాలా తెలుసునని భావిస్తాం. కానీ లక్ష్మి గారు చాలా సరళంగా, క్లుప్తంగా, తన పరిశీలనను, అవగాహనను ఫిలసాఫికల్ గా వివరించారు.‌

విజయవాడలో 2023 ఏప్రిల్ 17న కనుమూసిన ఆహ్వానం లక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఈ పుస్తకం గురించి మీతో పలకరించాను.

 

చేతికొచ్చిన పుస్తకం: 70

మూడు దశాబ్దాలకు మించి సేవలందిస్తున్న చెకుముకి సైన్స్ మాసపత్రిక

‘ విద్యార్థి చెకుముకి ‘ అని కొందరు సవరించవచ్చు, కానీ 32 సంవత్సరాల క్రితం చెకుముకి గానే మొదలైంది కనుక ఎంతో మందికి గుర్తుకు తేవచ్చని అలా రాశా!

నేను చదువుతున్న పత్రికల గురించి అపుడపుడు ప్రస్తావించమని కొందరు మిత్రులు కోరుతున్నారు కనుక వాటి కోసం వేరే శీర్షిక కాకుండా ఇందులోనే అపుడపుడు రాస్తా!

కరోనా విపత్తు తర్వాత ఈ పత్రిక ఆర్ట్ పేపరుతో, రంగుల చిత్రాలతో, 34 పుటలతో మహా ముచ్చటగా ఉంటుంది. నిజానికి 1991-92 కాలంలో మొదలైనప్పుడు ఈ పత్రిక ఎడిటోరియల్ బోర్డులో ఉన్నాను, కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని సమావేశాల్లో గెస్ట్ గా పాల్గొన్నాను. కానీ ఆకాశవాణి ఉద్యోగపరమైన వత్తిడి, బదిలీల కారణంగా పత్రికను పూర్తి ఫాలో కాలేదు, కానీ పరిణామాలు గమనిస్తున్నాను. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు కూడా వెళ్ళాను, ఆ సందర్భంలో ఈ పత్రిక ఎలా ఉండాలో కాస్తా చర్చించాను.

పిల్లలు, పెద్దలు ఆనందంగా చదివే రీతిలో ఇప్పుడు విద్యార్థి చెకుముకి సైన్స్ మాసపత్రిక రూపుదిద్దుకుంది. నేను చందాదారుణ్ణే! సంవత్సర చందా 300 రూపాయలు, ఆసక్తి ఉన్న వారు 9490098908/9908246760 సంప్రదించండి.

******************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page