“ శాంతా! ” అన్న పిలుపుకు తలెత్తి చూసి “ రా లక్ష్మీ! ” అంటూ ఆహ్వానించింది. “ ఏమిటి శాంతా! బాగా నీరసంగా ఉన్నట్లున్నావు ? ” అన్న ప్రశ్నకు . . . “ జ్వరం వచ్చి తగ్గింది ” అంది శాంత.
“ నిన్నొకటి అడుగుతాను ఏమి అనుకోవద్దు. ఈ వయసులో నీవు అన్నయ్య గారు ఇక్కడ ఉండడం ఎందుకు? మీ కొడుకు ఇంటికి వెళ్లి హాయిగా ఉండవచ్చు కదా! ఈ ఇంటిని అద్దెకు ఇస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చు. ”
“ నీవు చెప్పింది నిజమే లక్ష్మీ! మనం చేసే ప్రతి పనికి ఒక లాభం, ఒక నష్టం ఉంటుంది. మా కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే. పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల మీద ఉంటుంది వాళ్ళ జీవితం.
సమయం ఉంటే ఇంట్లో వండుకు తింటారు. లేకపోతే హోటల్లో తింటారు. మా కోడలు పెద్దింటి అమ్మాయి. వాళ్ళ జీవిత విధానం వేరు. మా ఇంట్లో మా వారికి నచ్చినట్లుగా వండి పెడతాను. మనం వండినవి కోడలికి నచ్చక పోవచ్చుగదా!
మీ అన్నయ్యగారు రిటైరైనా ఆయన దగ్గర చదువుకున్నవాళ్ళు వస్తూ పోతుంటారు. ఆయనకు వాళ్ళతోనే లోకం. ఎంతో దూరం నుండి వచ్చారు. వాళ్లకు భోజనం పెట్టమంటారు. వాళ్ళు కూడా భోంచేసి వెళతారు. మేము మా కొడుకు ఇంటికి వెళితే మా కోడలుకు వాళ్ళు రావడం నచ్చక విసుక్కుంటే, మీ అన్నయ్య గారికి కోపం వస్తుంది. గొడవలవుతాయి. మనసులు విరిగి పోతాయి. మా చివరి దశలో వాళ్లే గదా మమ్మల్ని చూడాలి ” అంది శాంత.
“ నిజమేననుకో. నీ దగ్గర చెపితే నీవు బాధపడతావని నేను ఇన్నాళ్లు నోరు విప్పలేదు. మనకు తెలిసిన వాళ్ళందరూ మీకు, మీ కొడుకు కోడలితోనే పడదంటారు ” అంది లక్ష్మీ.
“ ఎవరు ఏమనుకున్నా చేసేదేంలేదు. మేము హాయిగా ఉన్నాము ” అంది శాంత.
* * * *
“ మీకు కోడలు వచ్చింది మీరు అందరూ చక్కగా కలిసి ఉంటున్నారు. నీవు వంట చేస్తుంటే కోడలు సాయం చేస్తుందా! ” అని శాంత అడిగిన దానికి… “ మా కోడలే అన్ని పనులు చేసుకుంటుంది ” అంది లక్ష్మీ.
“ మీ అన్నయ్యగారు ఏదో మీటింగు ఉందని వెళ్లారు. మనిద్దరం భోజనం చేద్దాం రా లక్ష్మీ! ” అంటూ శాంత వంటింట్లోకి నడిచింది. లక్ష్మి తింటుంటే ఎంతో ప్రేమగా ఆడిగి ఆప్యాయంగా వడ్డించింది శాంత.
“ ఇంత మంచి భోజనం తిని ఎన్నాళ్ళయిందో?. . ”
“ అదేమిటి లక్ష్మీ! అలా మాట్లాడుతున్నావు? ”
“ నిజమే శాంతా! రోజు నేను ఉదయం లేవగానే నాకు కోడలు కాఫీ ఇస్తుంది. కాఫీ తాగి, స్నానం చేసి దేవుడి గుడికి వెళ్లి వచ్చి టిఫిన్ తిందామంటే ఉండదు. నాకు ఈ పూట టిఫిన్ లేదా అంటే అమ్మ గుళ్లో ప్రసాదం తినివస్తుంది, అమ్మ కోసం టిఫిన్ చేయవద్దు అన్నారండి మీ అబ్బాయి అంటుంది నా కోడలు.
మా అమ్మ బరువు తగ్గాలని డాక్టరు చెప్పింది కదా! అమ్మకు అన్నం తగ్గించి పెట్టమన్నారండి మీ అబ్బాయి అంటూ అన్నము తగ్గించింది. పెరుగు గరిట వేసి, కావాలంటే మజ్జిగ పోసుకొండి అంటూ గిన్నె పక్కన పెడుతుంది కోడలు.
పిండి వంటలు చేసి పిల్లలకు పెట్టి, నా కొడుకు కోడలు తింటారు. నాకు పెట్టమని కొడుకుని అడిగితే, డాక్టరు నీకు నూనె వస్తువులు పెట్టవద్దన్నది ఆన్నాడు.
నా పేరున ఉన్న ఇల్లు తనకు వ్రాయమని నా కొడుకు అడిగాడు. ఆ ఇల్లు నీకు, నీ చెల్లికి ఇద్దరికి సమానంగా ఇవ్వమని మీ నాన్నగారు చెప్పారు. నేను పోయాక, మీ ఇద్దరూ తీసుకోండి అన్నా.
చెల్లికి బంగారం పెట్టి పెళ్లి చేసాం. ఇంకా ఇంట్లో వాటా ఇవ్వాలా? అన్నాడు. నాన్నగారు కొన్న స్థలం అమ్మి, ఆ డబ్బు నీవు తీసుకున్నావు. అందులో నీ చెల్లికి పైసా ఇవ్వలేదు. ఇల్లు ఇద్దరు సమానంగా తీసుకోవాలి ఆన్నా. అప్పటినుండి నాతో మాటలు బాగా తగ్గించాడు. ”
“ లక్ష్మీ! మీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కదా! నీకు పెన్షన్ వస్తుంది కదా! ” అంది శాంత.
పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ లో నుండి కూతురికి ఏమన్నా కొనివ్వడానికి డబ్బు తీస్తే, నా కొడుకు గొడవ చేస్తాడు ” లక్ష్మి!
“ అప్పుడు కొన్నాళ్ళు కూతురు దగ్గరకు వెళ్లి ఉండవచ్చు కదా! ” అంది శాంత.
“ మనకు కొడుకు దగ్గర ఉండడటం అలవాటు. ఆడపిల్ల ఇంటికి వెళ్లి ఎలా ఉంటాము శాంతా? నలుగురు ఏమంటారోనని భయము ”.
“ కొడుకుతో సమంగా కూతురికి ఆస్తి ఇచ్చినప్పుడు కూతురికి తల్లిని చూడవలసిన బాధ్యత లేదా? లక్ష్మీ. కొన్నాళ్ళు కూతురు ఇంటికి వెళ్లి హాయిగా ఉండు ” అని సలహా ఇచ్చింది శాంత.
“ నీవు చెప్పినట్లే చేస్తా! ” నంటూ లక్ష్మి వెళ్ళిపోయింది.
* * * * *
లక్ష్మి వెళ్ళగానే శాంత భర్త నారాయణ వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే అతని స్నేహితుడు శివరాం వచ్చాడు. ఇద్దరికి టిఫిన్ కాఫీ ఇచ్చింది శాంత.
“ వదిన గారూ బాగున్నారా? ” అన్న శాంత ప్రశ్నకు . . .
“ మీ వదిన షుగరు ఎక్కువై బాధపడుతోంది. ఈ వయసులో పిల్లలు దగ్గర ఉండి మనను చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఉన్న ఒక కొడుకు విదేశంలో ఉంటున్నాడు. మా ఆరోగ్యం అంతంత మాత్రం గా ఉంది. ఇండియా వచ్చి మాతోనే ఉండు.అంటే. . .
మీ కోడలు ఇక్కడ ఇంత మంచి ఉద్యోగాలు వదులుకొని ఇండియా వెళ్లి ఏమి చేస్తాము? అక్కడికి వెళితే మనకు తగిన ఉద్యోగాలు దొరకవు. ఇక్కడలాగా వసతులు ఉండవు. ఇక్కడ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇండియా వెళ్ళడానికి వీల్లేదు అంటోంది ”.
నిజమే కదా నాన్నా! మీరు ఆలోచించండి. అమ్మకు వంట చేసే ఓపిక లేకపోతే వంట మనిషిని పెట్టండి. మాకు వీలైనప్పుడు వచ్చి చూసి వెళతామన్నాడు.
మేము వాడిని అల్లారుముద్దుగా పెంచాము. ముసలి వాళ్ళను మా కర్మకు వదిలేసాడు ” అన్నాడు ఎంతో బాధగా శివరాం.
“ శివరాం! నేను ఒక విషయం చెపుతా విను. నీవు బాధ పడకూడదు. నిదానంగా ఆలోచించు ” అన్నాడు నారాయణ.
“ మనం మన తల్లిదండ్రులను వదిలి బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాము. మన అమ్మ నాన్నలు పల్లెటూరులో ఉంటే, అక్కడ ఉన్న మన అన్నదమ్ములు వాళ్ళను చూసుకున్నారు. మనం వీలైనప్పుడు వెళ్లి వాళ్ళను చూసి వచ్చాం. ఈ రోజు మన పిల్లలు అదే పని చేస్తే నీవు బాధ పడితే ఎలా?
అదిగో ఆ కాకి గూడు వైపు చూడు. ఆ కాకి ఎక్కడినుండో ఆహారం తెచ్చి, పిల్లలకు ఎంతో ప్రేమగా నోట్లో పెడుతోంది. ఆంత ప్రేమగా పెంచిన తల్లిని వదిలి, పిల్లలకు రెక్కలు రాగానే, పిల్లకాకులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఆ తల్లి పిల్లలకు సంబంధం ఉండదు.
నిన్ననే మా ఇంటి ముందు ఒక ఆవు ఈనింది. నేను శాంత మేడ మీద నుండి చూసాము. ఆవు ఈనిన వెంటనే ప్రేమతో తన దూడ వళ్ళంతా నాకుతోంది. యజమానికి ఆవు ఈనిన సంగతి తెలిసి దూడను ఎత్తుకుని తన ఇంటికి తీసుకు వెడుతుంటే, ఆవు ప్రేమతో తన దూడను చూసుకుంటూ అతని వెంటే పరుగెత్తింది. దూడ పాలు మానేశాక ఆవును పట్టించుకోదు.
కోడి తన పిల్లలను కాకి గాని గ్రద్ద కానీ ఎత్తుకుని వెళ్లకుండా తన రెక్కల కింద దాచి కాపాడుతుంది. కుక్క ఈనినప్పుడు దాని దగ్గరకు ఎవరైనా వెళితే తన పిల్లలను ఎత్తుకు వెళతారేమోననే భయంతో మొరుగుతుంది. అంతే కాదు వారిని కరుస్తుంది. కుక్క పిల్లలు పాలు తాగడం మానేశాక తల్లిని వదిలి వెళ్లిపోతాయి.
సృష్టిలో ప్రతి ప్రాణి తమ సంతానాన్ని అమితంగా ప్రేమించి పెంచుతాయి. పిల్లలు ఎదిగాక తమను వృద్ధాప్యంలో బాగా చూడాలని, తమ మంచి చెడులు పట్టించుకోవాలని, స్వార్ధపరులైన మానవులు మాత్రమే కోరుకుంటారు. నిజమా? కాదా? ” అన్నాడు నారాయణ. శివరాం దీర్ఘమైన ఆలోచనలో మునిగాడు.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com