11_006 సప్తపర్ణి కథలు – ప్రేమ

‘ ఈ మాటలు ప్రత్యేకించి నీకు ప్రతీచీ ! ‘ 

వైయాసి కంఠం వింటే చాలు . మనసులో ఏదో మాటల్లో చెప్పలేని అనందం, అందం, శాంతి.  

విశాఖ ఉప్పుగాలులు ఎప్పటిలా వీస్తున్నాయి. కొద్దిగా చెమట పడుతోంది కూడా. 

సముద్రపు ఇసుకలో ఇద్దరూ నడుస్తున్నారు. కెరటాల తడి పాదాలకి తగులుతోంది. 

అలలు విరిగిన చప్పుడు చెవులకి హోరుగా ఉన్నా జలపాతాలు మనసుని ప్రక్షాళనం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. 

దశాబ్దాల తర్వాత తాను మళ్ళీ సొంత ఉరికి వచ్చింది.

ఎలాగో అందరినీ తప్పించుకుని వైయాసి దగ్గరకొచ్చింది. 

ఎప్పటిలా సూర్యోదయం చూడాలని సముద్రపు ఒడ్డు చేరారు.

విరిగిన గవ్వలు, నత్తలగువ్వలు గుచ్చుకుంటున్నాయి. 

వంగి చందమామలు ఏరుతోంది. చాలా హాయిగా ఉంది లోపల.

అంతవరకు తనకున్న జీవిత అనుభవాలన్నీ ఒడ్డుచేరి విరిగి వెనక్కి పోతున్న కెరటాల్లా

గతం లోకి వెళ్లిపోతున్నాయి. గతమేమిటో వర్తమానమేమిటో స్పష్టం గా తెలుస్తోంది. 

చిన్న నవ్వు వినిపించింది. పక్కకి చూసింది ప్రతీచి . 

‘ వర్తమాన క్షణాల మీద నిలబడటం అరుదుగా సాధ్యమవుతుంది కదూ ! ‘ 

తాను నిశ్శబ్దంగా నడుస్తోంది. తన ఆలోచనలు  వింటున్నట్లు వైయాసి

మాటలు సమాధానం చెప్తున్నాయి . 

” ఈరోజు ప్రేమ కొత్తగా అనిపిస్తోందా నీకు!  ప్రేమ గురించి చెప్పాలా!

మనసులో ప్రేమ పొంగితే కళ్ళలో నీళ్లు తన్నుకొస్తాయి. లోపల కలిగే శాంతిని వివరించేదేమిటి  ! ఇక అర్ధం కావటమా ! 

పాపం ప్రేమని మనసులోంచి తీసి బుద్ధికి అప్పగిస్తే  బ్రతగ్గలదా ?

బ్రహ్మాన్ని దాటి, అద్వైతాన్ని మించి, శాంతిని మీరి

మన జ్ఞాన పరిధికి అందే విషయం మరొకటి ఉందా ? 
అక్కడ సర్వం ఒక చిరునవ్వు తో సౌహిత్యం గా మారుతుంది…ఇక ప్రేమ విషయానికొద్దాం ! 
ఒక వైపు వాంఛ, మరొక వైపు ధర్మంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న మధనం’ ప్రేమ’.
అంతరంగాల్లో ఉండే ప్రేమ సద్భావం . దోషం కాదు.

దానిని శాంతిగా మలచడం ఒక సంస్కారం.
వ్యక్తిప్రేమ విశ్వగతిగా నడిపించ గలగడం కొందరు చెయ్యగలరు.
ఒక జీవన ధోరణి ఉంటుంది. ఔదార్యం ధీరత ఉంటాయి.

లౌకిక భావం ఆధ్యాత్మిక సంపత్తిగా మారుతుంది. 

వ్యక్తి వికాసం విశ్వ వికాసం అవుతుంది. మనసులోని కామన శాంతిగా పరిణమిస్తుంది.
మొదటిది ఆకర్షణ, రెందోది సాంగత్యం, మూడు సంయోగం. 
మూడు దశలూ భౌతికం, మానసికం అనే రెండు స్తాయి ల్లోను, అంతరువుల్లోను ఉంటాయి.
ఇద్దరి మధ్య ప్రేమ ఈ ఆరు అంతరువుల్లో ముగుస్తుంది.

కాలముండదు, దూరాలుండవు. ఇది ఒక సహజ ధర్మం.

సర్వ కాలాల్లోను, సర్వ జనాల్లోను, ప్రపంచమంతటా ..!!
దీన్ని ఒక వయసు పొంగుగా, కామ కలుషిత వ్యవహారంగా, వికారంగా చిన్న చూపు చూడటం పరిపాటి.
పవిత్ర ప్రేమ అని వేరే ఏదీ మడి కట్టుకుని ఎక్కడో కుర్చుని వేరే లేదు.
దేవాలయాల్లోనో, పుస్తకాల్లోనో, నవలల్లోనో, కొత్త పేర్లతోనో లేదు. మన జీవితంలో ఉంది.

మాటల్లో, కథల్లోనో చెప్పాలని చాలామంది ప్రయత్నించారు. అన్ని దేశాల్లోనూ అన్నిభాషల్లోనూ. మానవ సంబంధాలలో అతి విశిష్టమైనది ఇది.

ఎవరు ఒప్పుకోరు కాని అందరు చేసే పని ఇదే.
ఇది ఎక్కడ ఎవరిమధ్య ఎందుకు జరుగుతుందని ఎవరు చెప్పలేరు.
కానీ నియమాలు నిబంధనలు ప్రకటిస్తారు. సాంఘిక, మత, నైతిక విలువలు నిర్ణయిస్తారు. 
వైయక్తికం గా ఆరంభమైన ప్రేమని అనేక మార్గాల్లో విశ్వ ధర్మంగా నడిపించవచ్చు. 
వాత్సాయనుని కాలమైనా ‘ ఒబామా ‘ కాలమైనా “ప్రేమలో” మార్పులేదు.
చూడడంలో మార్పుంది. అమెరికా రాజకీయ నాయకుడు ఈ వ్యక్తి దృష్టి విలక్షణం గా ఉంది. 

‘ఒబామా మిచెల్’ ఇద్దరిమధ్యా ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది అన్నావు. నేనూ  చూసాను.

వారిద్దరిలో కనిపించే ఆ ఆనంద లక్షణం మనలో ప్రతిఫలిస్తుంది గమనించావా ?  

ప్రపంచంలో ప్రతీదీ పరిణామం చెందుతాయి. మన ఆలోచనతో పాటు. 
వాత్సాయనుని గురించి విన్నాను. చదువుకున్నాను. జీవిత పాఠాలుగా.
రాజకీయ నాయకుడు ఈయన గారు ప్రతిపాదించే సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి.
ఒక దేశంలో ఆరంభమైన ఒక జీవన సిద్దాంతం ఈ రోజు ప్రపంచ సిద్దాంతంగా మారింది. చూస్తున్నాం.
ప్రేమ వలన జంటలుగా విడి పోనక్కర లేదు. అది కాలాన్ని అలంకరిస్తుంది. నూతనత్వాన్ని  నాపాదిస్తుంది.
మొహంలో కామంలో భంగురత సహజం. బుడగలు ..ముర్ముర మంటాయి.

భావోద్వేగం ఒకప్పుడు ఒప్పని మరొకప్పుడు తప్పని అనిపిస్తుంది. ఆలోచించ గలగడం, మనసు కదలడం, మంచిదన్న నమ్మకం పెరగడం,
సాధ్యం అన్న ధైర్యం ఏర్పడడం …చాలు! స్థాయీ భావం ! రస సిద్ధికి !  ప్రేమ మాత్రం సత్యం నిత్యం. అది భావ గతం. భావ సామ్యం నేర్పెదదే !
మనస్సు ఇంద్రియ రాజం కదా ! మన: షష్టాణి ఇన్ద్రియాణి. 

ఒక మిత్రుడుండే వారు. అన్నిటికీ సంస్కృతం ఎందుకు అంటూ !
మనసు స్థానం లోపలి ప్రపంచంలో కాని బాహ్యం లో కాదు. 

మన లోపలి విషయాలు చెప్పాలంటే సంస్కృతం కావాలి.
ఎందుకంటే ప్రేమ మనసుకి సంబంధించింది.

 ఆ భావన లోపలి విషయాలని తెలియ జేస్తుంది, లోకంలో సంగతులని కాదు. 
బయటి విషయాలకి తెలుగు చాలు. దాని బలం అక్కడ సరిపోతుంది.

 ‘చాలని వారి’ అంటే జల్లెడ పట్టిన నీరు అని కదా !
తెలుగులో ఎన్ని అక్షరాల కుప్పలు కూర్చగలం ?  అంత సత్తా ఏదీ !

లేని దాన్ని మభ్య పెట్టి ఉన్నదని చెప్పే వారున్నారు.

ఆకలి శరీరానికైతే కోరిక, మనసుకైతే ప్రేమ. మొదటిది ఎప్పటికప్పుడు, రెండోది ఎప్పటికీ.

అన్నంకోసం వచ్చే ఆకలి కన్నా, కోరిక తో వచ్చే కామ వాంఛ చాలా బలమైనది. 

ఇంగితం పోతుంది అదుపులో లేకపోతే. అర్థమవుతోందా ప్రతీచీ ? ‘ 

అరచేతిలో ప్రతీచి అరచేతి స్పర్శ సముద్రంలో తడిలా తోస్తోంది వైయాసికి.

ప్రతీచి మాటలు వినిపిస్తున్నాయి.  

“ మనిద్దరికీ మొదటినుంచీ  ఉన్నదే ఈ భావోద్వేగం.

ఒకప్పుడు ఇది తప్పనిపిస్తుంది. మరొకప్పుడు ఒప్పనిపిస్తుంది 

కానీ నామీద నాకు ఇష్టం పెరుగుతుంది. భక్తి రక్తికి తోడవుతుంది. 

నామనసంటే నమ్మకం, గౌరవం కలుగుతుంది వైయసీ ! 

దానితో లోపల్లోపల స్థాయీ భావం ఏర్పడిపోతుంది .

జీవితం అసలు పేరు ‘ క్షణం’

క్షణమంటే ‘ బుడగ లాంటి ప్రేమ’ 

ప్రేమంటే   ‘ ఎండి బీటలైన ఎద చెలమ’ 

చెలమంటే  ‘ ఆకాశంనుంచి ఎప్పుడూ కురిసేవాన’

వానంటే ‘ వెలిసిన తర్వాత అందే వెలుగు’

వెలుగంటే   ‘ప్రాణానికి ఆసరా’

ఆసరా అంటే  ‘ చేతి కర్రగా మారిన క్షణ కాలపు ప్రేమ’ 

ప్రేమంటే  ‘మనసు లేని నిశ్శబ్దం ‘  !

మనసంటే   ‘అందక పరుగులు తీసే ఆలోచన ‘ 

ఆలోచన అంటే  ‘ అంచు తెలియని మౌనగీతం’

మౌనమంటే  ‘మునకలువేసే  ఆలోచన’ 

ఆలోచన అంటే  ‘ ఎవరో చెప్పలేని  ‘ నువ్వు ’ ! 

నువ్వంటే   ‘ కాలం తోడుగా కలకాలం సాగే  మన బ్రతుకులు ‘ 

 బ్రతుకంటే  ‘  చివరి వరకూ నేర్చుకోవలసిన పాఠం  ! 

పాఠాలంటే ట్రిగ్నామెట్రీ అని ఇప్పటికర్థమైంది !

పేరుతో పిలవాలనిపిస్తుంది, స్పర్శ అలౌకికం గా ఉంటుంది. ఇది చాలా నిజం, 

దానితో పాటు వెంట తెలియని దుఃఖం. ఈ సముద్రమంత ! ఏదో తెలియని అగాధంలా ! నేనిక్కడకి ఈ క్షణాన రాకపోయినా అక్కడే ఉన్నా నీతోనే ఉంటాను. “

ప్రతీచి కళ్ళలో నిండి బుగ్గల మీద ప్రవహిస్తున్న కన్నీళ్లు ఇద్దరికీ వయసుని దూరం నెట్టేశాయి “ ఆపకు ప్రతీచీ ! ఎండనివ్వకు. ఆ చలమల్లో హరివిల్లులు వస్తాయి.

 ఈ భావాలంకారం నీకర్థమైతే ప్రేమ ని నువ్వు నిర్వచించక్కరలేదు. 

అది అనుభవానికి అందేదేకానీ అర్థానికీ, ఆలోచనకీ, మాటలకీ అందేది కాదు. 

ప్రతీచీ !  అందరికీ సమాన ధర్మం దు:ఖం.

దీని గురించి మాట్లాడటానికి భయపడనవసరం లేదు. 

దు:ఖం తాలుకు భావమే బాధ. గాయపడ్డ శరీరం లో బాధ ఏక దేశం.  

దెబ్బ తిన్న మనసు బాధ సర్వత్రా.
ఇక్కడ అన్వయించవలసినది దృష్టి. వ్యవహార దృష్టి, ధార్మిక దృష్టి.  

వ్యవహారంలో ధర్మాన్ని నిలబెడితే పరమార్థం నిలబెట్టడమే. 
శరీరానికి వ్యవహార దృష్టి. మనసుకు ధార్మిక దృష్టి.  దేని కదే !

ద్వైత అద్వైతాలతో పని లేదు. ధర్మానిది వ్యవహారాన్ని మించిన స్థాయి. 
క్రియని నడిపించే బుద్ధి దే చివరి నిర్ణయం.                                                          

ఆలోచనలకి అందని, దానికి ముందు ఉహకి అందని, ఇంకా ముందుకి వెళ్తే అనుభూతికి అందని బాధ .. దాని కదే. ఆనందానికి ప్రతి! ఈ రెండిటినీ ద్వైదీ భావం తో చూడడం ఉంది అది చూసావా అది కలవర పెట్టే విషయం. ఆనందాన్ని నిర్వచించ గలమా ? బాధని మాటల్లో చెప్పగలమా !
మానవులమైన మనకి ‘బాధ’ మానసిక మైతే ఎక్కువా? శారీరికమైతే అధికమా !
దీనిని తట్టుకోగలం ? శరీరానికి బాధ ఉంటె ఉపశమన మార్గాలు చూసుకుంటాం. 
అదే మనసుకి వస్తే శరీరంలో ఆణువణువూ లోనవుతుంది . ఉడికిస్తుంది. అగ్నిలో పొరలిస్తుంది. మానసికమైన బాధ అనేది చాలా విలక్షణమైనది.                         

ఏ భావం వల్లనో ఉహ వల్లనో లోపల్లోపల ఉన్న అగ్ని రగులుతుంది.
దీనివలన కలిగే బాధ శరీర గత సర్వాణువుల్లోను పరివ్యాప్త మవుతుంది.                      

ఈ స్థితిలో ఒక విచిత్రమైన సహ్యత ఉంటుంది.
పరితపన శరీరం దాకా రాదు. లోపల ఎక్కడ అంటే ఇక్కడ అని చెప్పలేని సర్వాణువుల్లోనూ రగులుతు ఉంటుంది. మానసిక బాధ ఏకాకారం.                                                       

రక రకాలుగా ఉండదు. దేహానికి వచ్చేది కాల గతం. వ్యక్తిగతం. దేశగతం.
మానసికమైతే భావ గతం. బాధ కలిగిన మరుక్షణం సంయమనం పోతుంది.                        

భావ స్థిరత పోతుంది.
ఇది ఒక మహా విషయం. సంపూర్ణ స్వరుపావగాహన అంత సులభం కాదు.              

మానవత్వానికి పరాకాష్ఠ. జలపాతంలా ఆ కొండ రాళ్ళని దాటుకు ముందుకి పోదాం రా ! చాలా దూరం వెళ్ళాలి. రేపో ఎల్లుండో మళ్ళీ  మాట్లాడుకుందాం.                                       

నువ్వు తిరిగి వెళ్ళేదాకా కలుద్దాం రోజూ. మరి అంతా విని మౌనం వహిస్తే నా ‘భాషణ’ ‘సంభాషణ’ అవునో కాదో తెలీదు ! ఈసారి మళ్ళీ నువ్వు వచ్చేసరికి మనం ఏమిటో మనకి తెలీదు. కాలాన్ని మరిపించగలదే ప్రేమ ‘ !!                          సముద్రపొడ్డు వదిలి ఇంటి గుమ్మం దగ్గరికొచ్చినదే తెలియలేదు ఇద్దరికీ !!                      

“ సరే ప్రతీచీ ఎండకి విడిపోక ముందే పారిజాతాలు ఏరాలి. శివుడికి ఇవ్వాలి,                              

జపం పూర్తి చెయ్యాలి. నిజం గానే ప్రేమ ‘ సత్యం శివమ్ సుందరం ప్రతీచీ “ 

వైయాసి లోపలికి వెళ్తున్నది అర్థమవుతోంది.