12_003 చేతికొచ్చిన పుస్తకం 07

 

చేతికొచ్చిన పుస్తకం-31:

విలక్షణ ప్రణాళికతో ‘కొప్పర్రు చరిత్ర’

 

సమిష్టి కృషికీ సమగ్రమైన ప్రణాళికూ ఆచరణతో కూడిన ఆలోచనకూ ..ముంజేతి అద్దం లాంటిది ఈ ‘కొప్పర్రు చరిత్ర’! ఇటీవల కాలంలో ఇలాంటి ప్రయత్నం జరగడమే ఓ ఉత్సవం వంటిది!!

విజయవాడ నుంచి ఫేస్బుక్ మిత్రులు బి వి పద్మరాజు ఓ వారం క్రితం ఎంతో అభిమానంతో ఈ పుస్తకం పంపారు. తెరిచి పరికిస్తే పుస్తక నేపథ్యం ఎంత ఉత్తేజకరంగా ఉందో, పుస్తకం ప్రణాళిక అంత సమగ్రంగా ఉందనిపిస్తోంది. పద్మరాజు పంపకపోతే ఈ పుస్తకం మిస్సయి ఉండేవాడిని!

పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు ఉనికి, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, విద్య, ఆర్థిక, వ్యవసాయ, క్రీడ, వైద్య, మహిళ, యువత…ఇలా విభజించి క్లుప్తంగా 17 అధ్యాయాలు సాగాయి. అట్లని మిగతా ప్రపంచాన్ని విస్మరించని ఉదార దృష్టి స్పష్టంగా కనబడుతుంది.

ఈ పుస్తకం పరిశీలిస్తే ప్రతి ఊరికీ ఈ పద్ధతిలో ఓ రచన రావాలని పిస్తోంది.

(సంపాదకుడు: పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే

రచన: నూకల రత్నాజీ

బొల్లాప్రగడ వెంకట పద్మరాజు

ప్రతులకు: కుంకటి చంద్రశేఖర్ 9642577757)

 

చేతికొచ్చిన పుస్తకం-32:

ఇప్పచెట్టు నీడలో…

 

ఓ ఐఏఎస్ అధికారి ఆదివాసీ సంవేదన

ఫిజిక్స్ చదివి, ఐఏఎస్ అధికారిగా రాణించిన కర్నూలు జిల్లా వాసి డా. దాసరి శ్రీనివాసులు. అదే ఎస్వీ యూనివర్సిటీలో చదివిన కూడా, వారు బాగా సీనియర్ కనుక 2004 లో విశాఖపట్నం ఆకాశవాణి లో పనిచేసే కాలంలో మాత్రమే నాకు పరిచయం. సహృదయులైన మిత్రులు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా! వీరి గురించి విశాఖపట్నం పెద్దలు సి ఎస్ రావు ఎన్నో సార్లు గుర్తు చేసేవారు.

నేను మద్రాసు లో పనిచేస్తున్న కాలంలో దాసరి శ్రీనివాసులు ‘నవ్య’ వీక్లీ లో రాసిన అనుభవాలు మిస్సయ్యాను. సాహితీ సర్కిల్ 2018 లో ప్రచురించిన పుస్తకాన్ని వారు ఇటీవల మరో పుస్తకం తో కలపి పంపారు. ఈ 180 పుటల పుస్తకంలో అంతగా లభ్యం కాని ఫోటోలు; కె రామచంద్ర రావు,జయధీర్ తిరుమలరావు రాసిన ముందు మాటలు మరింత విలువైనవి.

ఆహారం, నీడ ఇవ్వటమే కాదు; భద్రాద్రి రామయ్య పెళ్ళికీ, ఇప్పటి ఆదివాసుల యాతనలకూ పోరాటాలకు కూడా ఇప్పచెట్టు సంకేతం! ఉద్యోగం లో చేరిన రోజునే అనుభవం చవి చూసిన దాసరి శ్రీనివాసులు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం లో నాలుగు సార్లు అడవి అన్నల ఆతిథ్యం స్వీకరించారు. ఇలాంటి పుస్తకాన్ని ఇటువంటి ఎక్స్పోజర్ ఉన్నవారే రాయగలరు! అపురూపమైన అనుభవాలను ప్రోది చేసిన, వ్యాఖ్యానించిన విలువైన డాక్యుమెంటేషన్ ఇది.

ఆసక్తి ఉన్న వారు sanchari.hyd@gmail.com ను సంప్రదించవచ్చు.

 

చేతికొచ్చిన పుస్తకం-33:

జి.కృష్ణ గారి ‘కన్నవి-విన్నవి’

 

సి వి రామన్ కు తెలుగు తెలుసా?

మూడు దశాబ్దాలకు మించి పాపులర్ సైన్స్ వ్యాసాలు రాస్తున్నాను గానీ, ఏ పుస్తకం లోనూ సి వి రామన్ కు తెలుగు తెలుసునని స్పష్టంగా కనబడలేదు. అలాంటి స్పష్టమైన అనుభవంతో జి కృష్ణ రాసిన విషయం ఈ పుస్తకంలో తారస పడింది! జి. కృష్ణ చేసిన అనువాదం గురించి మరింత సరళంగా ఉండాలని సి. వి. రామన్ సలహా కూడా చెప్పారని తెలుస్తోంది!

ఆంధ్ర భూమి దినపత్రికలో, ఆకాశవాణిలో తొలుత వెలుగు చూసిన జర్నలిస్టు జి.కృష్ణ అపురూపమైన అనుభవాలూ ‘విన్నవీ-కన్నవీ’గా వయోధిక పాత్రికేయ సంఘం 2021 అక్టోబర్ లో ప్రచురించడం అభినందనీయం! 168 పేజీలు, 54 వ్యాసాలే కావచ్చు, ఎన్నో ఆసక్తికరమైన సంగతులు! అంతకు మించి వ్యాసరచనలో చెయ్యి తిరిగిన తనం!!

అరవయ్యేడో పేజీలో కనబడే వాక్యం చూడండి: “..1945లో (హరీంద్ర ఛటోపాధ్యాయ) వచ్చి ప్రసంగ, గేయ, నాట్య, లాస్య, అభినయ, ఆవేశ కదంబ ప్రదర్శన చేశాడు. ” ఇదీ కృష్ణ వ్యాసలీల!

ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతుల కోసం 9394712208 నెంబర్ ను సంప్రదించవచ్చు.

 

చేతికొచ్చిన పుస్తకం-34:

 

అదృశ్యమైన నిప్పుపిట్ట కోసం…

 

పాతికేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణికి వచ్చాక నాకు ముఖాముఖి పరిచయమైన కథారచయితలలో ఒకరు డా వి చంద్రశేఖర రావు. మద్రాసులో పనిచేస్తున్న కాలంలో విజయవాడ సమావేశంలో వారిని కలవడం చివరిసారి కావచ్చు. మూడురోజుల క్రితం కాట్రగడ్డ దయానంద్ తో ఫోన్ లో పలకరించినపుడు మళ్ళీ ఆ సంగతులు కొన్ని గురుతు కొచ్చాయి, కొన్ని ముచ్చటించుకున్నాం.

2017 జూలై 8 న డా చంద్రశేఖర రావు కన్నుమూశాక, నివాళి సంకలనంగా వారి పుస్తకాల కొన్ని ముందుమాటలు, వారి మిత్రుల జ్ఞాపకాల వ్యాసాలు కలిపి 2021 ఏప్రిల్ లో కాట్రగడ్డ దయానంద్ ఈ 200 పుటల డా వి. చంద్రశేఖర రావు సాహిత్యావలోకనం పుస్తకాన్ని కూర్చారు. చంద్రశేఖర రావు సాహితీ కుటుంబం వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 29 మంది రచయితల 34 రచనలు లభ్యమవుతున్నాయి.

రాసే విషయాలు, చదివే సరంజామా పక్కన బెట్టి 20 గంటల వ్యవధిలో ఉన్న పళంగా పుస్తకం మొత్తం చదివేశాను. సందర్భం హృదయ విదారకం కావడంతో ఆపకుండా చదివాను.

వంద రూపాయల ఈ పుస్తకం నవోదయ, విశాలాంధ్ర, నవచేతన లలో దొరుకుతుంది.‌

 

చేతికొచ్చిన పుస్తకం-35:

 

కొంగలు గూటికి చేరే వేళ

 

… చదివి మీ కళ్ళు చెమర్చినట్లైతే … అని కాళ్ళకూరి శైలజ తన తొలి కవితాపళ్ళేరాన్ని మన ముందుంచారు!

మూడున్నరేళ్ళు క్రితం నాకు పరిచయం అయిన చెల్లాయి డా కాళ్ళకూరి శైలజ 2021 లో ఓ వ్యాస సంకలనం, మరో అనువాద పుస్తకం వెలువరించారు. సంక్రాంతి-ఉగాది మధ్య ఈ కవితాపుష్పకం రావడమే కాదు, ఈ ఏడాదే శైలజ కథాదీపావళి కూడా ఉంటోందని ‘అనల్ప’ చెబుతోంది!

ఇద్దరి ముందు మాటలు, నాలుగు విభాగాలుగా సాగిన 38 కవితలు 106 పేజీల్లో ఒదిగిపోయాయి. పుస్తకం అందంగానే కాకుండా ప్రచురణ కర్త శ్రద్ధ తీసుకున్న విషయాన్ని సంకలనం బహిర్రూపు చెబుతోంది.

” బతుకు చిత్రాల కతలు ఇడమరచి చెపితే మచ్చలే అగుపిస్తాయి” ఇంకా ” శతాబ్దాల వడపోత తర్వాత ఆల్చిప్పలు, ఇసుక ఒకేలా తెల్లగా నవ్వుతాయి” అని కూడా వాస్తవాన్ని చెప్పే కవయిత్రి కి అభినందనలు!

₹150 విలువైన ఈ కవితా సంపుటి కావాలనుకుంటే 7093800303 లేదా www analpabooks.com లేదా అమెజాన్ లేదా నేరేడుమెట్ట లోని షాపు ను సంప్రదించవచ్చు.

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾