“ నాద తనుమ్ అనిశం – చిత్తరంజనం ” పుస్తకావిష్కరణ, కనకాభిషేకం
ప్రముఖ సంగీత దర్శకులు, లలిత సంగీత చక్రవర్తి డా. మహాభాష్యం చిత్తరంజన్ గారి 85వ జన్మదినం సందర్భంగా ఆగష్టు 27వ తేదీ శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ, చిత్తరంజన్ గారికి కనకాభిషేకం జరిగాయి.
అమృతవల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభమయిన సభలో ముందుగా కళాపోషకులు బాపట్ల వెంకట రాజా గారు చిత్తరంజన్ గారికి కనకాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. చిత్తరంజన్ గారి శిష్యులందరూ గురువందనం సమర్పించారు.
సభకు అధ్యక్షత వహించిన దూరదర్శన్ విశ్రాంత అధికారి ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ వ్యాసుడు భారతం చెప్పేటప్పుడు విఘ్నేశ్వరుడిని వాయసకారుడిగా పెట్టుకున్నట్లుగా చిత్తరంజన్ మాస్టారు వ్యాసమూర్తి లాగా కూర్చుని ‘ లలిత సంగీత భారతం ‘ చెప్పగా ఈ భారతాన్ని మాధురి గ్రంథస్థం చేసింది అన్నారు.
డాక్టర్ మహాభాష్యం చిత్తరంజన్ గారి జీవిత ఔన్నత్య శిఖరాన్ని తెలియజేసే గుడిమెళ్ళ మాధురి రచించిన “ నాద తనుమ్ అనిశం ” గ్రంథాన్ని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కె. ఐ. వరప్రసాదరెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాదరెడ్డి గారు రచయిత్రి మాధురిని సత్కరించారు.
ఈ గ్రంథాన్ని రచయిత, చిత్రకారులు, ఆకాశవాణి విశ్రాంత అధికారి సుధామ సమీక్షించారు.
సభలో ఇంకా దూరదర్శన్ విశ్రాంత ఉన్నతాధికారి మల్లాది శైలజాసుమన్, ఆకాశవాణి విశ్రాంత అధికారులు కలగ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అమృతవల్లి చిత్తరంజన్ సంగీత విభావరి నిర్వహించారు. ఈ విభావరిలో సురేఖామూర్తి, శశీకళా స్వామి, రామాచారి, ప్రసన్నలక్ష్మీ, హిమబిందు, సురేష్ చింతలపాటి, శారద, అభిరామ్ తదితర ప్రముఖ గాయనీ గాయకులు చిత్తరంజన్ గారు స్వరపరచిన గీతాలను ఆలపించారు. రచయిత్రి గుడిమెళ్ళ మాధురి వందన సమర్పణ చేశారు.
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.