11_004 ముకుందమాల

జగత్తును అంధకారం నుండి ప్రకాశానికి కొనిపోగల్గిన ఓ దేవా! అజ్ఞానంతో ఆత్మస్వరూపుడవైన నీ ఉనికిని గుర్తించలేకున్న మాలోని అహంకార తమస్సు నుండి, జ్ఞాన ప్రకాశంలో నిల్పి ఉద్ధరించు ఓ జగద్గురూ! కంసచాణూరాది రాక్షస సంహారం చేసిన వసుదేవ తనయా! కుమారునిగా నిన్ను పొందగల్గిన తల్లి దేవకికీ భగవంతునిగా ఆరాధించే మాకూ శాశ్వత సుఖస్వరూపుడవైన ఓ కృష్ణా! ఇదే నీకు మా వందన సహస్రం.

          వసుదేవుని కుమారుడూ, దేవకీదేవికి పరమానంద సంధాయకుడూ, కంసచాణూరాది రాక్షసులకు మారకుడై, సంహారం చేసిన అసహాయశూరుడూ, జగద్గురువూ అంటూ భగవానుడైన శ్రీకృష్ణుని వర్ణించారు. కృష్ణుడు జగద్గురువు! ‘‘గు’’ అంటే అంధకారమనీ, ‘‘రు’’ అంటే దానిని తొలగించేవాడనీ అర్ధం! బాహ్యంలోని చీకటిలాగే ఆంతర్యంలో కూడా అజ్ఞానమనే చీకటి ఆవరించి ఉంటుంది. చిరుదివ్వె బాహ్య చీకటిని పోగొడుతుంది. కానీ అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి, జ్ఞాన జ్యోతిని వెలిగింప జేసేవాడు గురువు. శిష్యునికి కర్తవ్యం బోధించి, కార్యోన్ముఖుని చేసేది గురువే!

య చ్చ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే-హంశాధిమాం త్వాం ప్రపన్నమ్‌

 

అని మోకరిల్లిన అర్జునునికి గీతను బోధించి కర్తవ్యముపదేశించిన గురువు (దైవం) శ్రీకృష్ణపరమాత్మ. ఒక్క అర్జునునికే కాదు లోకానికంతకు కర్మ, భక్తి, జ్ఞాన రూపాలను తెలిపి, జీవన సమరంలోనూ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనూ కూడా తాను కాని దానిని తానుగా భావిస్తూ పెంచుకునే మమకారమే ఈ అహంకారం. ఈ అహంకార మమకారాల వల్ల పుట్టేవి రాగద్వేషాలు. చాణూర ముష్టికులైన రాక్షసులు ఈ రాగద్వేషాలే! శ్రీకృష్ణుడవతరించి వీరందరినీ మర్ధించాడు. ఈ విధంగా అహంకార మమకారాలను పోగొట్టి, నిరతిశయ ఆనందాన్ని కలిగించేవాడు వసుదేవ తనయుడు పరమానంద మాధవుడు. నిత్యానందాన్ని అర్ధించి, శ్రీకృష్ణునికి ప్రణామమాచరిద్దాం.

 

శ్లో ॥ ఏకోపి కృష్ణస్య కృత ప్రణామః

      దశాశ్వమేధావ భృతేనతుల్యం

   దశాశ్వమేధీ పునరేతి జన్మః

      కృష్ణప్రణామీ నపునర్భవాయ ॥

 

ఒక్కసారి శ్రీకృష్ణునకు మనసా శిరసా ప్రణామం చేస్తే దశాశ్వమేధ యాగ అవబృధ స్నానం చేసిన ఫలం. దశాశ్వమేధ యాగం చేసిన వారు మరు జన్మనెత్తగలరేమో కానీ, ఎందుకంటే యజ్ఞయాగాది కర్మలు పుణ్యఫలాలనిస్తాయి. స్వర్గాది సౌఖ్యాలు కలగజేస్తాయి. ‘‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’’ అని పుణ్యఫలం తీరగానే పునర్జన్మ తప్పదు. తిరిగి మానవలోకంలోకి రాకతప్పదు. కాని కృష్ణ ప్రణామికి మాత్రం జన్మరాహిత్యమే!

          జన్మాంతర సుకృత వశం వలన లభించిన మానవజన్మకు ముక్తిదాయక మైనది భక్తి. అమృత స్వరూపుడైన భగవంతుని చేరితేనే కాని, మానవునికి జన్మతః సంప్రాప్తించిన అనంత దుఃఖం తీరదు. ఆ పరమేశ్వరుని పొందడానికి అనేక మార్గాలు సూచించబడ్డాయి. అనాదిగా భారతదేశంలో ఉపనిషద్విజ్ఞానము సూత్ర వ్యాఖ్య, వివరణల రూపంలో లోకానికి అనుగ్రహించి, మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి ఎన్నో బాటలు వేసి, దారులు చూపిన ఆచార్యులు, ప్రవక్తలు ఎందరో ఉన్నారు. అందులో జ్ఞానం, కర్మ, యోగం, ఉపాసన, భక్తి, అర్చనాదులనే విభాగాలతో ఎన్నో ప్రత్యేక సిద్ధాంతాలు కనబడతాయి. వేరువేరుగా వీటి తత్వాలను తెలుసుకొని, సామరస్యమును గుర్తెరిగి మహానుభావులైన వారు ఏక లక్ష్యానికి రాగలరేమో కానీ, సామాన్యులు వీటిని భేదవాదములుగా భావించి, నిలకడ లేక, పరిభ్రమించే ప్రమాదం ఉంది.

          పైన చెప్పిన ప్రత్యేక సిద్ధాంతాలనన్నింటినీ, ఆత్మానుభూతితో భక్తిసూత్రంచే ముడిపెట్టి మానవుని జన్మమొదలు ముక్తివరకు గల క్రమవికాసమును సమగ్రంగా, సరళంగా, భక్తిపూర్వకంగా అనుభూతమొనర్చుకుని, పరంధాముని రూప, గుణ విభవాలను హృదయములో నింపుకుని, ఆ పారవశ్యంలో శ్రీకృష్ణ పాదారవిందాలపై ఉంచిన భక్తికుసుమాల మాల ఇది.

          భగవద్గీతలోనే కర్మ భక్తి జ్ఞాన యోగాల గురించి చెప్పారు కృష్ణస్వామి. కాని కేవలం కర్మ, జ్ఞాన యోగాలు అహంకారానికీ, అజ్ఞానానికీ దారి తీసే ప్రమాదముంది. అందుకే భక్తిమార్గం సర్వోత్కృష్టం. అని పేర్కొనబడింది.

          ‘‘భక్త్యామామభిజానాతి యావాన్‌ యశ్చానిస్మితత్వతః` భక్త్యాత్వనన్యయాశక్యః॥ అని భగత్ప్రాప్తి కలిగించేది అనన్యభక్తి అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మభగవద్గీతలో. భక్తికి శక్యంకానిది ఏదీలేదు. ‘‘సాత్వస్మిన్‌ పరమ ప్రేమరూపా’’ అంటారు నారదుల వారు భక్తిసూత్రాల్లో! భగవంతునిపై ప్రేమే భక్తి. భక్తి మానవహృదయాన్ని దేవాలయంగా మార్చి, లక్ష్యసాధనకు పురిగొల్పుతుంది. అట్టి ప్రేమగలవారిని పరమాత్మ వదలలేడు. వారికి తానే వశం కాగలడు. ఆ ప్రేమకు ఏవిధమైన ఇతర కోరికలూ ఉండవు. ఈ విధమైన భక్తికి దృష్టాంతంగా చెప్పబడిన వారు గోపికలు.

          అటువంటి కృష్ణభక్తిని ఈ యుగంలో అనుభవించి తరించిన వారు ఆళ్వార్లు. విశిష్టాద్వైతంలో ఈ ఆళ్వార్లది ప్రముఖస్థానం. ‘ఆళ్వార్లు’ అన్నమాటకి తమిళంలో ‘ఆళ్‌బవర్‌’ అంటే పాలింపవచ్చినవారనీ, ఆదుకోవచ్చినవారనీ, ఇంకా భక్తిలో మునుకలిడిన వారనీ అర్థాలు చెప్పుకోవడం కద్దు. వీరికి భక్తి సహజసిద్ధం. గోపికల వంటి అనన్య భక్తి వీరిది. ఈ భక్తి వల్ల ఉద్భవించిన జ్ఞానం, పరమాత్ముని అనంతత్వాన్ని అవగతం చేసుకుని తరించేందుకు సహకరిస్తుంది. ‘‘అన్యస్మాత్‌ సౌలభ్యం భక్తౌ’’ అన్నిటికన్నా భక్తి సులభం! అంటారు నారదుల వారు తమ భక్తి సూత్రాల్లో.

          ‘‘ఎవ్వాడు జీవింపననేకులు జీవింతురో వాని జన్మమే ధన్యము. శ్రేష్ఠులైన వారు తాము నమ్మి ఆచరించిన తరుణోపాయాన్ని, సామాన్యులకు కూడా బోధించి, అచరింపచేసి, తమతో పాటు పరమార్ధం సాధించేలా చేస్తారు. జాతి, మత, కుల వివక్ష లేకుండా, అందరిలోనూ జన్మించి, తమ విశిష్టవర్తనం ద్వారా మహనీయులని పించుకుని, సామాన్యులను కూడా భగవదున్ముఖులను చేయడంలో వీరు గురుస్థానాన్ని పొందియున్నారు.

          ద్రావిడ దేశంలో ప్రసిద్ధి పొందిన పన్నిద్దరు ఆళ్వార్లలో శ్రీకులశేఖరులు ఒకరు. గత శతాబ్దపు ప్రారంభంలో జీవించిన వీరు భగవంతుని కౌస్తుభాంశతో జన్మించారు. వీరు రచించిన 40 శ్లోకాల ‘‘ముకుందమాల’’ సాధకులకు మార్గదర్శినియైన గ్రంధరాజము. భక్తిబాటలో పయనించి, భగవంతుని పొందా లనుకునే సాధకులకు ఎన్నో సూచనలందించారు. మహారాజు ఎన్నో మార్గాలను చూపించారు. కానీ కేవలం స్మరణ మనన ధ్యానాదుల మాత్రం చేత ఆ పరమాత్మ లభించేవాడు కాడు. ఆస్వామి ఎవరిని వరించునో వారికి మాత్రమే లభించగలవాడు’’ అని ముండకోపనిషత్తులోనూ, కఠోపనిషత్తులోనూ కూడా చెప్పబడిరది కదా! మరి భక్తి భగవంతుడు ప్రసాదించవలసినదే అయినపుడు, ఇక మన ప్రయత్నమేమిటి? అనే సందేహం రాకమానదు. నిజమే.భక్తి భగవంతుడు ప్రసాదించవలసినదే కానీ, అంతమాత్రం చేత, మన ప్రయత్నమేమీ లేకుండానే భగవంతుడు భక్తిని అనుగ్రహిస్తాడని అనుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే, మన ఆలోచనల, మనం చేసే కర్మల ఫలితంగానే కదా మనకు ఏది లభించినా? విచక్షణా జ్ఞానం కల్గిన మానవుడు చిత్తశుద్ధిని, సద్భుద్ధినీ అలవర్చుకోవడం ద్వారా పరమేశ్వర అనుగ్రహం పొందవచ్చు.

          ఈనాడు మనం సుఖమూ, సంతోషమూ, పొందుతున్నాము అంటే, గత జన్మలో మనం చేసుకున్న సుకృతం వల్లనే! మరి ఈ జన్మలో ఆ సుఖాలను అనుభవించడంలోనే జీవితాన్నంతా గడిపి, అహంకారంతో దుష్కర్మలకు పాల్పడితే? తప్పక మరుజన్మలో దాని ఫలము అనుభవించక తప్పదు మరి! సాధారణ కర్మల విషయంలోనే ఇది వర్తించినప్పుడు ఇక భక్తి విషయం వేరే చెప్పాలా?! అందుకే ప్రయత్నపూర్వకంగా ధర్మశ్రద్ధను అలవరచుకుంటే, సాత్విక గుణం వృద్ధిపొంది, వాసనారూపంగా, అంతరంగంలో నిలిచి ఉంటుంది. వృద్ధి పొందిన ఈ సాత్విక భావం మనసు భగవంతునివైపు మరలడానికి సహకరిస్తుంది. ఇదుగో… ఇదే మన అర్హతగా, భగవంతుడు మనకు భక్తినీ, తద్వారా ముక్తినీ ప్రసాదించగలడు. పరమాత్మ చేత వరింపబడటానికి మనకుండవలసినది భక్తి. భగవంతునిపై అనన్య ప్రేమే భక్తి. తపోజ్ఞాన సమాధుల చేత కూడా పొందజాలని భగవానుని మనకు వశపరచేది భక్తి.

          ఈ ప్రేమ ఆంజనేయుని భక్తి వలె దాస్యరూపం కావచ్చు. అర్జునుని వలె భగవంతుని సఖునిగా భావించి, ప్రేమించడం వలన కావచ్చు. గోపికలవలె తమ సర్వస్వాన్ని అనురాగంతో అర్పణ చేయడం వలన కావచ్చు. ఆండాళ్‌ చేసినట్లు అర్చనారూపంకావచ్చు. ప్రహ్లాదునివలె అన్నింటికీ ఆ నారాయణునిపై ఆధారపడటం వల్ల కూడా కావచ్చు. పరీక్షిత్తువలె భాగవత కథాశ్రవణాసక్తి వలన కూడా కావచ్చు. భక్తి యొక్క వివరణలో ‘‘స్వస్వరూపాను సంధానం భక్తిరిత్యభిధీయతే, స్వాత్మతత్త్వాను సంధానం భక్తిరిత్యపరేజగుః’’ అని శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తులను తెల్పియున్నారు. ఇవన్నీ వేరువేరు కావు. భగవంతుని యెడల భక్తి వ్యక్తీకరణలో వివిధ దశలు అంతే! తాను సాసించే సర్వమూ తన ఆత్మగా అనుసంధానించడమే భక్తి! ఇదీ జ్ఞానం!!! భక్తియోగం యొక్క స్వరూపం అదే!!! గతంలో ఎందరో ఆయామార్గాలను అనుసరించి, తాము తరించి, మరికొంతమందిని యథాశక్తిగా తరింపచేశారు.

          ఇటువంటి విధానం సృష్ఠి రహస్యాలలో ఒకటి. భగవానుడు ఎంతో దయామయుడు. తన సృష్టిలోని ప్రతి విషయంలోనూ తగినంత ఏర్పాట్లు చేసే ఉంచాడు. ఉదా:` విత్తనం చిన్నమొలకగా మారి, తనంతతానుగా వ్రేళ్లూని, స్వయంగా ఆహారం సంపాదించుకోగలిగే వరకూ దానికి సరిపడే ఆహారాన్ని విత్తనంలోనే పొందుపర్చాడు. జీవులు కూడా తమంతతాము ఆహారం తినగలిగే వరకూ తల్లి నుండి ఆహారం అందించే వెసులుబాటు కలిగించాడు.

          జీవుల శరీరానికి వ్యాధి సోకితే దాని నుండి రక్షింపబడటానికి తగిన నిరోధక శక్తిని శరీరంలోనే నిక్షేపించి ఉంచాడు. నిరోధకశక్తికి దోహదం చేసేందుకు వైద్యుల రూపంలో తాను అందుబాటులో ఉన్నాడు. ఈ భౌతికంగా కనపడే శారీరక రోగాలే కాక, మరికొన్ని కనబడని వ్యాధులు కూడా బాధిస్తూంటాయి. అవే భవరోగాలు! వీటి నుండి మనలను కాపాడటానికే భగరోగభిషక్కులను కూడా చూపించాడు.

          ఏ కాలమందైనా భాగవతుల హృదయస్పందన ఒకే విధంగా ఉండటం చూడగలం. వివిధ కాలాల్లో జీవించిన భక్త శిఖామణులు ప్రహ్లాద, నారద, పరాశరాదులూ, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసూ, భక్తకబీరూ, భక్త మీరా, శంకర భగవత్పాదాలు, భక్తపోతనాది కవులూ, శ్రీ కులశేఖరులూ, మొౖదలైన భక్తుల అనుభవాలు తెల్పుతున్నాయి. ఆ విషయాన్ని శాస్త్రమూ ధృవపరిచింది. ఇంకా ఈ విషయాన్నే ఉపనిషత్తులూ, భగవద్గీతా, నారద భక్తిసూత్రాలు వంటివి ధృవీకరించాయి. ఈ విషయాన్ని సోదాహరణంగా, భక్తితత్వము, ముకుందమాలలో నిరూపించడానికి ప్రయత్నించాను.

          ముందుగా ఈ భక్తికుసుమ మాలను మనకనుగ్రహించిన శ్రీ కులఖేఖరులకు ప్రణామాలర్పిద్దాం.

          శ్రీ కులఖేశర మహారాజు తమ ముకుందమాలలో అన్నివిధాలైన భక్తిని గురించి చెప్పారు. ఏంచేసినా, ఏం మాట్లాడినా సదా శ్రీ స్వామి భావనలోనే ఉండిపోవాలని వాంఛిస్తారు. దేవకీనందనుని అర్చించి, ఆ స్వామి చింతనామృత పానంలో పరవశించాలన్నది వీరి కోరిక. భక్తిని సాధించే మార్గంలో మనసుపాత్ర చాలా ప్రాముఖ్యమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ సాధకుడు మనసును ఏవిధంగా స్వాధీనపరచుకోవాలో చెబుతూ…

          ‘‘యతోయతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం. తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశంనయేత్‌ ॥ అంటారు. ఆ పై సాగరం లాంటి సంసారాన్ని నిరపాయంగా దాటించే విష్ణుపోతం గురించీ, భవభయం పోగొట్టడానికి శ్రీకృష్ణ మంత్ర ఔషధాలను చెప్పి, ఆపై అష్టాక్షరీ మంత్రం జపించమంటారు. దేహేంద్రియ మనోబుద్ధులు సదా స్వామి సేవలోనే నిమగ్నమై ఉండాలన్నది వారి వాంఛ. అన్నింటికన్నా వీరికి పరమ ప్రీతికరమైనది భగవద్భక్తుల సేవ. వారిని దర్శించడం ఏకకాలంలో గురు గోవింద దర్శన సేవాఫలాన్నందిస్తుంది. అందుకే వారు భాగవతుల భృత్యునిగా ఉండటాన్నే సదా కోరుకుంటారు. భక్తుల పాదధూళి తనపై పడటం కోసమే తిరుమల వేంకటేశ్వరుని దేవాలయంలో ‘‘కులశేఖర పడిగా (గడపగా) వెలిశారు.

          ఈ విధంగా ‘‘శ్రీకృష్ణభక్తి’’ సూత్రంగా వివిధ భక్తిమార్గాలను పూలుగా కూర్చి, మాల అల్లి ముకుందునికి అలంకరించారు. ఈ భక్తి కుసుమాల సుగంధం సాధకులను భాగవతులుగా, భగవదనుగ్రహ పాత్రులుగా చెయ్యాలన్నదే వారి కోరిక.

          సాధారణంగా ఉత్తములైన పరిపాలకులు తమ రాజ్యంలోని పౌరుల సుఖజీవనం కోసం భౌతికమైన వారి అవసరాలను గుర్తించి తీర్చడం చూస్తూంటాం. కాని కులశేఖర మహారాజు వారి ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కూడా తాపత్రయ పడటం చూస్తాం.

          అందుకే :`              ఘష్యతేయస్య నగరేరంగ యాత్రా దినే దినే!!       

 

 

 

తరువాయి వచ్చే సంచికలో……

 

——–   ( 0 ) ——-