11_002 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – జానకి

.

జానకి భర్తతో అమెరికా వచ్చి 40 ఏళ్ళ పైనే అయింది. ఎక్కడో పల్లెటూరిలో పెరిగి స్కూలు ఫైనల్ వరకే చదువుకున్న జానకి పెళ్ళి తమాషాగా ఇట్టే జరిగిపోయింది. బంధువుల ఇంట్లో పెళ్ళికని తల్లిదండ్రులతో వెళ్ళిన జానకి పెళ్ళికూతురై తిరిగొచ్చింది!

.

ఫ్రెండు పెళ్ళికి వచ్చిన రవిని, కుందనపు బొమ్మలా ఉన్న జానకి అందం, ఆమె అమాయకత్వం ఆకర్షించాయి. ఏ ప్రయత్నము చెయ్యకుండానే అంత మంచి సంబంధం రావడం చూసి జానకి అదృష్టానికి తల్లిదండ్రులు మహా సంబరపడిపోయారు. పిల్లవాడు బాగా చదువుకున్నాడు, టిప్ టాప్ గా దర్జాగా ఉన్నాడు. అన్నింటినీ మించి కానీ కట్నం లేకుండా చేసుకున్నాడు!

.

పెళ్ళిలో అప్పగింతలు అవగానే అత్తవారింటికి బయలుదేరి వెళ్తున్న జానకితో తల్లి “ మీ అత్తవారు మనలాగా పల్లెటూరి వారు కాదు. పట్నంలో ఉండే వాళ్ళు..చదువుకున్న వాళ్ళు..పైగా ఉన్నవాళ్ళు. వాళ్ళ పద్ధతులు, అలవాట్లు తెలుసుకుని వాళ్ళకనుగుణంగా నువ్వు మారాలి గుర్తుంచుకో ” అంటూ బోధించింది. అసలే కొత్త చోటుకు వెళ్తున్నానన్న భయంతో ఉన్న జానకి తల్లితో వెంటనే అలాగే అంటూ తలవూపింది.

.

హైద్రాబాద్ లో అత్తవారింట్లో అడుగుపెట్టిన జానకికి అక్కడ అన్నీ వింతగా, కొత్తగా అనిపించాయి. పనివాళ్ళతో  హిందీలోను, బయట వాళ్ళతో జానకికి అర్ధం కాని తెలుగులోనూ, మామగారి ఫ్రెండ్స్ తో కొంత ఇంగ్లీషులో కూడా మాట్లాడే అత్తగారిని చూసి జానకి ఆశ్చర్యపోయింది! కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్తవాతావరణానికి అలవాటు పడుతున్న టైములో జానకి భర్త “ వచ్చే నెలలో మనం అమెరికా వెళ్తున్నాం ” అన్నాడు.

.

బొంబాయిలో విమానం ఎక్కేముందు అత్తగారు జానకిని పక్కకు పిలిచి “ జానకీ! మీరు మనవాళ్ళంటు ఎవ్వరూ లేని దూరదేశానికి వెళ్తున్నారు. దొరలు-దొరసానులు ఉండే దేశం అది. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. వాడి మనసు గ్రహించి వాడి ఇష్టానికి తగినట్టుగా నువ్వు మారాలి గుర్తుంచుకో ” అంటూ సలహా ఇచ్చింది. అత్తగారంటే ఎంతో గౌరవం ఉన్న జానకి వెంటనే భక్తిగా తల ఊపింది.

.

హైదరాబాద్ లో అక్కడి మాటలు, పద్ధతులు వింతగా అనిపిస్తే అమెరికాలో మనుషులతో సహా అన్నీ వింతగా, విచిత్రంగా అనిపించాయి జానకికి. కొత్త దేశంలో, కొత్త వాతావరణానికి, కొత్త రొటీనుకు నెమ్మదిగా అలవాటు పడటం మొదలుపెట్టింది జానకి. బయటకు వెళ్ళినప్పుడల్లా గజగజమని వణికే జానకిని చూసి భర్త “ఎప్పుడూ ఆ నాజుకు నైలాన్ చీరలు కట్టుకుంటే ఎలా? నువ్వు ఇప్పుడు అమెరికాలో ఉన్నావు. ఇక్కడి వాతావరణానికి తగినట్టుగా డ్రెస్ చేసుకోవాలి. నువ్వు మారాలోయ్!” అన్నాడు. తనను ఏరికోరి చేసుకున్న భర్త మాటకు సంతోషంగా తలవూపింది జానకి. బయటకు వెళ్ళేటప్పుడు పాంట్, షర్ట్ వేసుకోడం అలవాటు చేసుకుంది. అంతేకాకుండా పార్టీలకు వెళ్ళేటప్పుడు రవికి ఇష్టమైనట్లు జుట్టు లూజుగా వదిలేసుకోడం, లిప్ స్టిక్ వేసుకోవడం, హైహీల్స్ వేసుకోడం నేర్చుకుంది.

.

చూస్తుండగానే ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఈ పదిపన్నెండేళ్ళలో జానకి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. జానకికి ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి. వీలైనప్పుడల్లా కోర్సులు తీసుకుంటూ..పార్ట్ టైము ఉద్యోగం చేస్తున్న జానకి, చివరివాడు కూడా స్కూలు మొదలుపెట్టగానే ఫుల్ టైము జాబులో చేరిపోయింది.  పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ముద్దు మాటలకు, చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తెలివితేటలకు మురిసిపోయిన జానకి, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో మార్పు రావడం గమనించింది. ఆ మాటే రవితో అంటే “ పెరిగే పిల్లలు..వాళ్ళు మారకపోతే నువ్వూ నేనూ మారతామా? ” అంటూ తేలిగ్గా కొట్టిపారేసాడు. భర్త చెప్పింది నిజమే అని అనుకున్నా, తల్లిగా జానకి మనసులో ఆందోళన బయలుదేరింది.

.

పెద్దవాడు విజయ్ స్కూలు నుంచి ఇంటికి వస్తూనే బుక్ బ్యాగ్ ఓ మూలకు విసురుగా గిరాటేసి, రూములోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఇల్లు అదిరిపోయేటట్లు మ్యూజిక్ ఆన్ చేసేవాడు. కూతురు రేఖ, జానకి వంట మొదలు పెట్టడం ఆలస్యం వెంటనే “వాట్ ఈజ్ దట్ స్మెల్? దిస్ హౌస్ స్టిక్స్” అంటూ ఇల్లంతా స్ప్రే చెయ్యడం మొదలు పెట్టేది. ఇంట్లో ఉన్నంత సేపు ఎప్పుడు చూసినా ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడటమో, పోట్లాడటమో చేస్తుండేది. పై వాళ్ళిద్దరిని చూసి చిన్నవాడు వినోద్ ఇంకా త్వరగా మారిపోతున్నాడనిపించేది జానకికి. ఒకరోజు జానకి పనిమీద బయటకు వెళ్లబోతుంటే “డు యు హావ్ టు గో ఔట్, విత్ దట్ డాట్?” అంటూ ప్రశ్నించాడు. వాడు దేన్ని గురించి మాట్లాడుతున్నాడో తెలియని జానకి ఒక్క క్షణం తెల్లబోయి, తర్వాత తనలో తాను నవ్వుకుంది!

.

అమ్మానాన్నల దగ్గర పెరిగినప్పుడు నుదుట కుంకుమ దిద్దుకునేది. పెళ్ళయి హైదరాబాద్ వచ్చాక అత్తగారు  ఐటెక్స్ తిలకం పట్టుకొచ్చి “ చిన్నపిల్లవు..చక్కగా ఇది పెట్టుకో, నీకు బావుంటుంది! ” అంటే తిలకం అలవాటు చేసుకుంది. తర్వాత అమెరికా వచ్చాక భర్త “ అమ్మవారల్లే అంత పెద్ద బొట్టెందుకు? ” అంటే చిన్న బొట్టు పెట్టుకోవడం అలవాటుచేసుకుంది. ఇప్పుడు వేలెడంత లేడు “ ఆ డాట్ లేకుండా ఉంటే నీ సొమ్మేం పోయింది? ” అన్నట్టు ప్రశ్నిస్తుంటే జానకికి నవ్వొచ్చింది!

.

ఎప్పుడైనా భర్తతో పిల్లల గురించి చెప్తే, వాళ్ళ మీద గట్టిగా అరిచేసి తన బాధ్యత తీరిపోయిందనుకునే వాడు. తండ్రిని బాహాటంగా ఏమి అనలేక, మెత్తగా ఉండే జానకి మీద వాళ్ళ కోపం అంతా తీర్చుకునేవారు. జానకి నోరువిప్పి వాళ్ళతో ఏం మాట్లాడబోయినా, వాళ్ళ తప్పొప్పులను సరిచేయబోయినా జానకి యాక్సెంట్ ని ఎగతాళి చెయ్యడమో, జానకి మాట్లాడే ఇంగ్లీషుని కరెక్ట్ చెయ్యడమో పనిగా పెట్టుకుని, అసలు విషయాన్ని పక్కదోవలు పట్టించే వారు. పోనీ ఏదైనా వేరే విషయాలు మాట్లాడదామంటే “ నువ్వు ఇక్కడ పుట్టి పెరగలేదు  నీకేం తెలియదు ” అన్నట్లు చూసేవారు. ఇలా పిల్లల్లో వస్తున్న మార్పు, వాళ్ళు ప్రవర్తించే తీరు చూసి జానకికి ఏంచేయాలో తోచక దిగులు పడ్డం మొదలు పెట్టింది.

.

ఒకరోజు జానకిని తన ఆఫీసులోనే వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే సునీత కనిపించి “ ఏమిటి జానకీ అలా డల్ గా ఉన్నావు…ఆర్ యు ఓకే? ” అంటూ ప్రశ్నించింది. వయసులో, చదువులో, అనుభవంలో అన్నిటా ఎంతో పైన ఉన్న సునీత అలా అడిగేసరికి జానకి ధైర్యం చేసి తన మనసులోని భయాన్ని, ఆందోళనని బయటకు చెప్పేసింది. జానకి చెప్పిందంతా విని సునీత నవ్వుతూ “ ఇదా నీ భయం! నీ పిల్లలు నీకు చిన్నవాళ్ళుగా కనిపించచ్చు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. దాన్నే ఇక్కడ యడలెసన్ స్టేజ్ అంటారు. ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళలో మార్పు రావడం సహజం. అది నువ్వు అర్ధం చేసుకోవాలి.” అంటూ చెప్పుకుపోతున్న సునీతను మధ్యలో ఆపుచేసి “ కానీ…వాళ్ళు నాతో శత్రువుతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటే, నన్ను హేళన చేస్తూ, అస్తమానం నన్ను విమర్శిస్తుంటే ఎలా భరించేది, వాళ్ళను ఎలా నేను పెంచేది ” అంటూ కన్నీళ్ళతో ప్రశ్నించింది జానకి.

.

సునీత వెంటనే “ నీ బాధ నాకు తెలుసు జానకీ. ఎందుకంటే అది నాకు అనుభవమే. కానీ నువ్వు తల్లినని మర్చిపోయి, ఒక్కక్షణం వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. వాళ్ళు మనల్ని గౌరవించటం లేదు, మన మాట మన్నించటం లేదు అని అనుకుంటాం. కానీ..రోజూ వాళ్ళు బయట ఎన్ని అవమానాలకు, విమర్శలకు,  ఛాలెంజ్ లకు గురి అవుతారో తెలుసా? వెలివేసినట్లు ప్రత్యేకంగా కనిపించే మన పిల్లల్ని, బయట పిల్లలు ఎంత వత్తిడి చేస్తారో ఊహించగలవా? ఇక్కడ పిల్లలందరూ చేసేవాటిని, మన వాళ్ళు చెయ్యడానికి లేదని పిల్లల మీద మనం ఆంక్షలు పెడతాం. ఇంట్లో ఒకటి చూస్తే బయట ఇంకొకటి చూస్తారు. ఎదిగీ ఎదగని వయసులో వాళ్లకు ఇదంతా అయోమయంగా అనిపిస్తుంది. మానసికంగా వాళ్ళలో ఘర్షణ మొదలవుతుంది. మనం పెరిగినట్టు మన పిల్లల్ని పెంచుదామంటే కుదరదు జానకీ! ఇక్కడ పుట్టి పెరుగుతున్న నీ పిల్లలకు తెలిసిన ప్రపంచం ఇదే. అందుచేత వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం వాళ్లకు నెమ్మదిగా నచ్చచెప్పుకోవాలి. నువ్వు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్తాను. వాళ్ళు మారిపోతున్నారని బాధ పడేకంటే, ఇక్కడి పరిస్తితులకు తగినట్టుగా నీ పిల్లల్ని పెంచడానికి తల్లిగా నువ్వు మారాలి ” అంటూ మృదువుగా జానకి బుజం తట్టి వెళ్ళిపోయింది సునీత.

.

సునీత చెప్పిన మాటలు జానకిని ఆలోచింపచేసాయి. జానకి నెమ్మదిగా ఇంటిని, ఇంటి పద్ధతుల్ని, తనని మార్చుకోవడం మొదలు పెట్టింది. క్లాసులు తీసుకుని ఇండియన్ యాక్సెంట్ లేకుండా ఇంగ్లీషు మాట్లాడటం అలవాటు చేసుకుంది. పిల్లలతో మాట్లాడటానికి సినిమాలు, సంగీతం బాగా ఉపయోగపడతాయని గ్రహించిన జానకి వాళ్ళ కిష్టమైన మూవీస్ గురించి, వాళ్ళు వినే మ్యూజిక్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టింది. ఇంతకు ముందులాగా పిల్లల్ని అన్నమే తినాలని బలవంతం చేయడం, తినకపోతే బాధపడటం మానుకుంది. పైపెచ్చు వాళ్ళకోసమని ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరగేసి వాళ్ళ కిష్టమైన వంటలు చెయ్యడం నేర్చుకుంది. పూర్వం లాగా రేఖను ఆరునూరైనా పార్టీలకు ఇండియన్ బట్టలే వేసుకోవాలని బలవంతం చెయ్యడం మానుకుంది. ఈ క్రమంలో నెమ్మదిగా సునీత చెప్పిన మాటల్లోని అంతరార్ధం తెలిసి రాసాగింది జానకికి.

.

ఈ దేశంలో పిల్లలతో స్నేహంగా ఉంటూ, వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ప్రపంచంలోకి అడుగుపెడ్తే తప్ప వాళ్ళను పెంచలేమన్న సత్యాన్ని తెలుసుకుంది జానకి. పదిహేడేళ్ల వయసులో పెళ్ళి పేరిట పల్లెటూరు వదిలిన ఆ జానకి వేరు, నలభైఏళ్ళ పైగా అమెరికాలో స్థిరపడిన ఈ జానకి వేరు. ఇన్నేళ్ళల్లో జానకి ఎంతో ఎత్తు ఎదిగింది. ఎన్నో ఆటుపోట్లు తింది. ఎన్నో సుఖాల్ని, వింత అనుభూతుల్ని పొందింది. అన్నింటికీ మించి జానకి పరిస్థితులకు అనుగుణంగా ఎంతో మారిపోయింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ జానకికి ఇంకొకటి కూడా అర్ధమైంది. పిల్లలతో కనీస సంబంధబాంధవ్యాలు నిలబెట్టుకోవాలంటే వాళ్ళననుసరించి పోతూ, వాళ్ళ ఇష్టమే తన ఇష్టంగా భావించటం తప్ప వేరే మార్గం లేదన్న నిజాన్ని ఎవరూ చెప్పకుండా తనంతట తానే తెలుసుకుంది. అందుకే వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆఖరికి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా జానకి ఎటువంటి అభ్యంతరం పెట్టుకోలేదు.

.

పిల్లలు ముగ్గురూ మూడురకాలుగా వాళ్ళ కిష్టమైన వాళ్ళను చేసుకున్నారు. పెద్దవాడు విజయ్ కాలేజీలో తనతో చదువుకున్న అమెరికన్ అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి రేఖ తన ఆఫీసులో పనిచేసే పంజాబీ అబ్బాయిని చేసుకుంది. చిన్నవాడు వినోద్ గయానాలో పుట్టి పెరిగి, అమెరికాలో స్థిరపడ్డ అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు జానకి గ్రాండ్ మదర్ కూడా అయిపొయింది. ఇన్నాళ్ళు తన పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చెయ్యడంలో అలిసిపోయిన జానకి ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ని కలిసినప్పుడల్లా తనూ ఒక చిన్నపిల్ల అయి వాళ్ళతో ఆడుకుంటూ ఆనందిస్తుంది.

.

పిల్లలందరిలోకి జానకి ఊహకు భిన్నంగా పెద్దవాడి కూతురు నికోల్ జానకిని చూస్తే చాలు వదిలిపెట్టదు. నాలుగేళ్ల నికోల్, జానకి ఏం చేసినా చాలా కుతూహలంగా చూస్తూ యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆప్పటి వరకు తనచుట్టూ తిరుగుతున్న నికోల్ ఉన్నట్టుండి మాయమయ్యే సరికి, జానకి గాబరాగా వెతకటం మొదలు పెట్టింది. కింద ఎక్కడా కనిపించక గబగబా పైకి వెళ్ళింది. అడుగుల చప్పుడు విన్న నికోల్ పరిగెత్తుకుంటూ జానకి దగ్గరకు వచ్చి పట్టుచీరలో, నుదుట కళ్యాణం బొట్టుతో, పువ్వుల జడతో, చేతుల నిండుగా గాజులతో, నగలతో తెలుగుతనానికి ప్రతీకగా ఉన్న జానకి ఫోటో చూపించి “Who is this grandma? She is pretty!” అని అడిగింది.

.

నికోల్ మనస్తత్వం తెలిసిన జానకి, ఆ ఫోటో గురించి ఆనాటి తన ముస్తాబు గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న నికోల్, ఫోటోలో ఉన్న జానకి వైపు వేలు పెట్టి చూపిస్తూ “I want to grow up and look just like her!” అంది. జానకి మొహం ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం మిళితమైన కాంతితో వెలిగిపోయింది! నికోల్ వెంటనే తలపైకెత్తి జానకి మొహంలోకి సూటిగా చూస్తూ “You look so different. Why did you change grandma?” అంటూ అమాయకంగా ప్రశ్నించింది!

.

తొలిప్రచురణ కౌముది పత్రిక- 2007    

.             

జానకి-నేపథ్యం
.
నేను రాసిన కథల్లో బాగా పాపులర్ అయిన కథ జానకి. నాకు అమెరికా వచ్చాక అన్నిటిలోకి  చాలా కష్టంగా అనిపించిన బాధ్యత/పాత్ర తల్లి పాత్ర. ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లల్ని పెంచటానికి కావలసిన పరిజ్ఞానం, సమర్ధత లేవు అని బాధపడే చాలా మంది తల్లుల్లో నేనూ ఒకదాన్ని. ఇప్పటి తరం వారికి ఇది పెద్ద విషయంగా అనిపించక పోవచ్చు కానీ ఆ రోజుల్లో అప్పటి పరిస్థితుల దృష్ట్యా పిల్లల్ని పెంచటం, వాళ్ళతో ఒక ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కలిగి ఉండటం అనేది ఒక సవాల్ గా ఉండేది. అందుకే ఈ అంశం మీద కథ రాయాలని అనిపించి చేసిన ప్రయత్నమే “జానకి”. ఆనాడు ఈ సమస్య అందరికీ వర్తించినా జానకి లాంటి తల్లులకు మరింత ఛాలెంజ్ గా ఉండేది. నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ కథకు “నువ్వు మారాలి” అన్న పేరు పెట్టి ఉండవలిసిందేమో అని!

మాకు బాగా ఆత్మీయులు అయిన వారి కోడలు అమెరికన్ అమ్మాయి. ఒకసారి అందరం కలుసుకున్నప్పుడు ఆ అమ్మాయికి నాకు మధ్య కొంత సంభాషణ జరగటం చివర్లో తను “ ఆంటీ! యు ఆర్ రియల్లీ గ్రేట్! మీరందరూ ఇక్కడ నిలదొక్కుకోవటానికి చాలా కష్టపడ్డారని తెలుసుకున్నాను, కానీ... ఆ సక్సెస్స్ కోసం మిమ్మల్ని మీరు ఎంతో మార్చుకోవాల్సి వచ్చిందని నాకు ఇప్పుడే అర్ధం అయింది.” అని మనస్పూర్తిగా మెచ్చుకోడం ఈ కథకు ప్రేరణ అయింది. అలాగే ఒకసారి నాలుగేళ్ల నా తమ్ముడి కూతురు మా అమ్మ పాత ఫోటో ఒకటి చూసి  “ఈవిడ ఎవరత్తయ్యా” అని అడిగింది. నేను చెప్పినప్పుడు  “మరి నాయనమ్మ ఇలాగే ఉండకుండా, ఇప్పుడు ఎందుకు  వేరుగా ఉందీ?” అని ఎంతో సీరియస్ గా అడిగిన ప్రశ్న ఈ కథకు కొసమెరుపు అయింది!

———(O)———