10_008 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – అమ్మాయి సీమంతం

ఏమిటీ మన అమ్మాయి సీమంతానికి లడ్లు, అరిశలు, సున్నివుండలు, చక్కిలాలు పంచాలీ అంటారా?

అలాగే పంచుదాం లేండి ! అలాంటివి చూసుకుందుకు నేనున్నానుగా?

మీరు తాత కాబోతున్నారని తెలిసినప్పటినుంచీ మీకు భూమి మీద కాలు నిలవడం లేదు. అన్నింటికీ తగుదునమ్మా అని తయారవుతున్నారు !

వాళ్ళ పిల్లకు వాళ్ళకు ఇష్టమైన పేరు పెట్టుకుంటారు. ఫలానా పేరు పెట్టమని మీరు ఎందుకు చెప్పటం ?

వారం రోజులనాడు అమ్మాయికి-అల్లుడికి తెలియకుండా డాక్టర్స్ ఆఫీసుకు ఫోను చేసి బేబీ వివరాలు అడిగారట ? ఇన్నేళ్ళ నుంచీ ఇక్కడ ఉంటూ ఏం నేర్చుకున్నారు? మన పిల్లలైనా పరాయి వాళ్ళతో ఉన్నంత జాగ్రత్తగా ఉండాలని తెలియకపోతే ఎలా ?

 రోజూ షాపింగ్ అంటూ వెళ్ళి మీ ఇష్ట్టం వచ్చినట్లు ఏమిటేమిటో కొనుక్కు తెస్తున్నారు.

నాకు తెలీక అడుగుతాను, ఈ రోజుల్లో పసి పిల్లలకు ఏం కావాలో మీకేం తెలుసుటా ?

అమ్మాయి ఇంటికి రావడం ఆలస్యం “ దానికి అవి చేసి పెట్టు ఇవి చేసి పెట్టూ “ అని నాకు పురమాయింపులు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న అది అడిగిందంటూ అప్పటికప్పుడు నాచేత జిలేబీలు-బజ్జీలు చేయించి శుభ్రంగా మీరు లాగించారు!

అసలు అమ్మాయి బరువు పెరగటం ఎలా ఉన్నా, నెల నెలా మీ బరువు పెరుగుతోంది చూసుకుంటున్నారా?

ఏమిటీ..రాబోయే మనవడినో-మనవరాలినో ఆడించటానికి బొజ్జ ఉంటే బావుంటుందని కావాలనే పెంచుతున్నారా?

అన్నింటికీ ఏవో సమాధానాలు రెడీగా పెట్టుకుంటారు! ఈ మధ్య నేను స్వీట్లు చెయ్యడం మానేసానని, మిమ్మల్ని చిరుతిళ్ళు తిననివ్వటం లేదని అమ్మాయిని అడ్డం పెట్టుకుంటున్నారు. కూతురి సీమంతానికి ఇంత శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారో నాకు బాగా తెలుసు !

నా చిన్నప్పుడు మా అన్నయ్య కూడా స్వీట్ల కోసం నన్ను కాకా పట్టేవాడు !

చిరుతిళ్ళు అంటే మహా ఇష్టపడే మా అన్నయ్య, ఎప్పుడూ ఊళ్ళో ఎవరింట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయా, ఎవరు పేరంటాలకు పిలుస్తారా అని ఎదురు చూసేవాడు. వాడికి ఏ ఏ సందర్భాలలో ఏమేం ఇస్తారో బాగా తెలుసు ! నేను పేరంటం నుంచి రావడం ఆలస్యం, నా జేబురుమాల మీద దాడి చేసి తనకు ఇష్ట్టమైనవి గబగబా తీసేసుకునేవాడు !  

నేను వెళ్ళనంటే నన్ను బతిమిలాడి, నా కోసం దొడ్లో సన్నజాజి పూలు కోసి, వాడే మాల కూడా కట్టి, నా పరికిణి చెంబు ఇస్త్రీ చేసి పెట్టి… ఎలాగో అలా నన్ను మంచి చేసుకునేవాడు. పేరంటాలు అంటే పరమ బోర్ అనుకునే నన్ను, పేరంటం అంటే పరమానంద పడే అన్నయ్యను చూసి, మా అమ్మ నేను మొగపిల్లవాడిగా, అన్నయ్య ఆడపిల్లగా పుడితే బావుండేదని అంటూ ఉండేది !

నేను ఎనిమిదో క్లాస్ లో ఉన్నప్పుడు మా ఊళ్ళో సుబ్బరాజు గారి అబ్బాయి పెళ్ళి చెన్నపట్నంలో ఉన్న అమ్మాయితో జరిగింది. ఆ అమ్మాయి మొదటిసారి అత్తవారింటికి వచ్చిందని ఊళ్ళో ఆడవాళ్లందరిని పిలిచి ఘనంగా పేరంటం చేసారు. అమ్మ వెళ్ళక పోతే బాగుండదన్నా “ నాకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని నేను నోట్స్ రాసుకోవాలని “ వెళ్లనని కూర్చున్నాను. ఇంక మా అన్నయ్య మొహం చూడాలి ! నేను కనుక  పేరంటానికి వెళితే తిరిగి వచ్చేటప్పటికి నా నోట్స్ తనే రాసి పెడతానని బేరానికి వచ్చాడు. అప్పుడు నేనూ ఇదే ఛాన్స్ అని వాడి చేత కొత్త గాజులు, రిబ్బన్లు కూడా కొనిపించుకున్నా!

ఆ రోజు, రాజు గారింట్లో వాళ్ళు పంచిన బూందీ లడ్డూలు…. పంచదార చిలకలు…….కోవా బిళ్ళలు……మెడ్రాస్ మురుకులు……..చక్కిలాలు……..గురించి ఊళ్ళో అందరూ ఎంత గొప్పగా చెప్పుకున్నారో!

పేరంటానికి వెళ్తూ అందరం అలవాటుగా మా జేబురుమాళ్ళు మేం తీసికెళ్ళాం, కానీ పెళ్ళివారు అందరికీ కొత్త  జేబురుమాల్లో ఇవన్నీ పెట్టి ఇచ్చారు! నేను ఇంటికి తీసుకొచ్చిన ఆ మూట చూసి మా అన్నయ్య మొహం మతాబులా వెలిగిపోయింది !!

“ చూసావా పద్మా ! నువ్వు వెళ్లకపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాడ్ని“ అంటూ మా అన్నయ్య నిజంగానే “ పండగ “ చేసుకున్నాడు ! మీరు కూడా ఇప్పుడు “ అమ్మాయి సీమంతం..పేరంటం..పార్టీ ” అంటూ మీకు ఇష్టమైనవన్నీ తినాలని చూస్తున్నారు. నాకు తెలియదనుకోకండి !

అసలు ఈ శ్రద్ధా, హడావిడి నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమైనాయిటా ? !

ఈ అచ్చట్లు ముచ్చట్లు నాకు జరిపించలేదేం ?

ఆ రోజుల్లో మనందరికీ పెద్ద దిక్కయిన సుభద్రమ్మ గారే నాలుగు తెలుగు కుటుంబాలను పిలిచి నాకు సీమంతం జరిపించారు. మీకు గుర్తుందా ఆవిడ చేసిన చలిమిడి పాకం అందరం గ్లాసుల్లో పోసుకుని తాగటం?!

అప్పట్లో మీ మగాళ్ళందరూ పేరుకు అమెరికాలో ఉంటున్నా అసలైన ఆంధ్రా అబ్బాయిల్లాగే ఉండేవారు.  మాకేమి తెలియదని, అమాయకుల్ని చేసి ఆడించేవారు. ఇక్కడెవరూ పేరంటాలు చేసుకోరని అమెరికాలో పురిటికి పుట్టింటికి వెళ్ళరని అంతా ఆసుపత్రి వాళ్ళే చూస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్పేవారు!

మూడు రోజుల పసి గుడ్డును ఇంటికి తీసుకొచ్చాక ఏం చెయ్యాలో తెలియక ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఆ రాత్రి క్రిబ్బ్ లో పిల్లను పడుకోపెట్టి భయంతో ఇద్దరం అక్కడే కాపలాగా కూర్చున్నాం. కుర్చీల్లో కునికిపాట్లు పడుతున్న మనం మధ్య రాత్రి లో పిల్ల ఏడుపుకు ఉలిక్కిపడి లేచాం.   

“ ఇంటికొచ్చాక అంతా నేను చూసుకుంటాను ” అన్న మీరు అర్జెంట్ పనొచ్చిన్దంటూ నా ఖర్మానికి నన్ను వదిలేసి మర్నాడే ఆఫీసుకు ఉడాయించారు. గుర్తుందా?

టైం దొరికితే పసిపిల్ల తో ఆడుకోవటం…….అమ్మాయితో కలిసి సమానంగా అల్లరి చెయ్యటం……. కొండ మీద కోతి అడిగినా తెచ్చి కూతుర్ని ముద్దు చేయడం మీ వంతు అయితే, దాని మంచి – చెడు చూస్తూ దాని ఆగడాలు భరించటం నా వంతు అయింది.

ఇక్కడ పుట్టి పెరిగే పిల్లల్ని పెంచటానికి ఆ రోజుల్లో అందరి తల్లి తండ్రుల్లాగే మనమూ కష్ట్టపడ్డాం.

“ ఇది అంతా మా అమ్మే“ అంటూ మీ అమ్మ గారి పేరు పెట్టి “ తల్లీ “ అంటూ పిలుచుకునే మీ అమ్మాయి అప్పుడే తల్లి కాబోతోంది అంటే ఆశ్చర్యంగా లేదూ? మన కంటికి కనిపించకుండా ఈ కాలం ఎలా పరిగెత్తుతూ ఉంటుందో కదా ?

ఇదిగో మీ మంచి కోరి చెప్తున్నా మీరు, మీ స్పీడ్ తగ్గించుకోక పోతే అసలుకే ముప్పు వస్తుంది,

గ్రాండ్ ఫాదర్ అవకుండానే మిమ్మల్ని గ్రౌండ్ చేస్తారు జాగ్రత్త మరి !                                                               

మొదటి ప్రచురణ : సుజనరంజని ప్రచురణ 2011

*******************************************