ఏమిటీ..కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో కుస్తీపడుతూ, దాన్ని కోప్పడుతున్నావెందుకూ అంటారా?
ఆ! కుస్తీయే. మేనేజ్మెంట్ స్టాఫ్ అందరం మా ఉద్యోగాలు ఉండాలంటే ఆన్ లైన్ లో ఈ పరీక్ష ఏదో తప్పనిసరిగా తీసుకు ఏడవాలిట! దానికి రేపే ఆఖరి రోజు. అన్నీ అర్ధంపర్ధం లేని విషయాలు.,,.తలాతోకా లేని ప్రశ్నలు అడుగుతుంటే కోపం రాక ఏమవుతుందీ?
ఎప్పుడో.. ఎక్కడో ఏదో జరిగిందనో, లేకపోతే ఎవరో.. ఏ వెధవపనో చేసాడనో అవన్నీ తెచ్చి మనమీద రుద్దుతారు. “ఎంకి పెళ్ళి సుబ్బి చావు” కొచ్చిందన్నట్టు చేసిన వాళ్ళ సంగతేమోగానీ మధ్యలో ఈ తిప్పలన్నీ మనకి. హాస్పిటల్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే మాకు, పేషంట్ ట్రీట్ మెంట్ విషయంలో జరిగే అవకతవకలు…పేషంట్స్ రైట్స్…….మాల్ ప్రాక్టీస్ గురించిన ప్రశ్నలు ఎందుకూ?
చిన్నప్పుడు బళ్ళో “పరీక్ష” అంటే పది ఆమడలు పరిగెత్తి పోయే నేను, ఇంతవయసొచ్చికూడా ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నాను. “లోభికి ఖర్చెక్కువ…బద్ధకిష్టికి పనెక్కువా” అని మనం ఏది తప్పించుకుందామనుకుంటామో అదే మనకు ఎదురౌతుంది!
అసలు దీనికంతకూ మూల కారణం మీరు…అవును ముమ్మాటికీ మీరే!
మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే పరీక్షలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చనీ.. బోలెడన్ని చీరలు.. నగలు కొనుక్కోవచ్చని… హాయిగా కార్లో షికార్లు కొట్టచ్చని అనుకున్నాను. మొదట్నించీ నాది మొక్కుబడి చదువు, బలవంతపు చదువే. నా ఒంటికి చదువు పడదనీ… నాకు, చదువుకు చుక్కెదురనీ మా అన్నయ్య నన్నుఒకటే ఎగతాళి చేస్తుండేవాడు! అసలు ఇప్పటి కాలంలో పిల్లల్ని అడిగినట్లు “వాట్ డు యూ వాంట్ టు డు? ఇట్ ఈజ్ అప్ టు యూ” అంటూ బుజ్జగిస్తూ అడిగుంటే, నేను వెంటనే “ఉయ్యాళ్ళూగుతూ…చెరువులో ఈతలు కొడుతూ…గోరింటాకులు పెట్టుకుంటూ..పేరంటాలకెళ్తూ “పండగ” చేసుకుంటానోచ్” అని చెప్పుండేదాన్ని!
ఆడపిల్లలకు పెళ్లిచూపుల్లో పాడటానికి కాస్త సంగీత జ్ఞానం, మొగుడికి ఉత్తరం రాసుకోడానికి కాస్త అక్షరజ్ఞానం ఉండాలని మా అమ్మమ్మ అంటుండేదట. ఎంచక్కా నేను ఆ రోజుల్లో పుట్టుంటే ఎంత బావుండేదో. మంచి రోజులంటే అవి!
కానీ, ఆడపిల్లకు పెళ్ళయిన తర్వాత మొగుడికి వండిపెట్టడానికి వంటా..వార్పు రావాలని, పుట్టబోయే పిల్లలకి చదువు చెప్పటానికి ఓ డిగ్రీ ఉండి తీరాలన్నది మా అమ్మ సిద్దాంతం. అలా విధి లేక…మా అమ్మ పోరు పడలేక పుస్తకాల్లో పాఠాల్నిముక్కున పట్టి అత్తెసరు మార్కులతో ఎలాగో డిగ్రీ అయిందనిపించాను.
సరిగ్గా అదే సమయంలో మీరు అమెరికా నుంచి ఊడిపడ్డారు! మా రఘు అన్నయ్యని చూడ్డానికి వచ్చి పనిలో పనిగా పెళ్ళిచూపులు కూడా కానిచ్చేసుకున్నారు మీరు! అక్కడ ఉన్నన్నాళ్ళు మా ఇంటికి అన్నయ్యకోసమే వస్తున్నారనుకున్నాను కాని….నన్ను ఓ కంట కనిపెడుతున్నారని..నన్ను చూసి ఇష్టపడ్డారని నాకేం తెలుసు? ఓ రోజు సాయంకాలంపూట అన్నయ్య, వదిన ఇంట్లో లేనప్పుడు వచ్చారు.
మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ కదా…అంత దూరం నుంచి వచ్చారుకదా….పోనీ పాపం కదా అని కాఫీ చేసి పట్టుకొచ్చి ఇవ్వబోతుంటే, హటాత్తుగా “ ఐ వాంటు మారీ యూ..వాడ్డు య్యూసే?” అంటూ ఇంగ్లీషులో స్టయిల్ గా అడిగేసారు! మీరు అడిగిన తీరుకు కంగుతిని, ఆ కంగారులో కాఫీ మీ మీద ఒలకబోసాను గుర్తుందా?!
ఏమిటీ…ఆ కాఫీయే మీ కొంప ముంచిందంటారా?!!
మా అన్నయ్యింట్లో నేను ఉన్నన్నాళ్ళు కాఫీ సెక్షన్ నాదే! మా వదిన అన్నీ అక్కడ పెట్టి పక్కకు తప్పుకునేది పాపం!
అబ్బాయి ఆరడుగులున్నాడు…అమెరికాలో ఉంటున్నాడు కదా అని ఇప్పటి అమ్మాయిల్లా “చూద్దాంలే.. ఆలోచిద్దాంలే” అంటూ ఎక్సట్రాలు పోకుండా బుద్ధిగా తలూపాను. ఒప్పుకోడానికి అసలు కారణం, అప్పుడు కనుక మీకు “నో” చెప్తే మళ్ళీ పై చదువులు..పరీక్షలు గట్రా అంటారేమో ఎందుకొచ్చిన రిస్క్ అని “ఎస్” అనేసాను. నలభై ఏళ్ళ కిందట నాకేం తెలుసు, నేను పొయ్యి లోనుంచి పెనం మీద పడుతున్నానని?!
అమెరికా వెళ్తే లైఫ్ అంతా హనీమూనే కదా అనుకుని సంబరంగా పెట్టే బేడా సర్దుకుని సంబరపడిపోతూ వచ్చాను! అనకాపల్లి లో బయలుదేరిన నేను అమెరికా చేరాక వారంరోజులు ఒళ్లెరక్కుండా పడి నిద్రపోయాను. ప్రయాణం బడలిక తీరీ తీరకుండానే మీరు ఇంతలావు పుస్తకం తీసుకొచ్చి చదవమంటూ నా చేతికిచ్చారు. ఓహో! చాలా రొమాంటిక్ గా ఏదో లవ్ స్టోరీ ఇస్తున్నారనుకుని మురిసిపోయాను! తీరా చూస్తే అట్టమీద తాటికాయంత అక్షరాలతో “కార్ డ్రైవింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ – డ్రైవర్ లైసెన్స్ మాన్యువల్” అనివుంది.
ఇదేమిటీ….ఇది నాకెందుకూ? అంటూ భయంగా అడిగాను.
“ఎందుకేమిటీ? ఓ నెల రోజుల్లో పరీక్ష రాయాలి…కారు డ్రైవింగ్ రాకపోతే ఇక్కడ ఎందుకూ పనికి రాము. ముందు రిటెన్ టెస్టు రాయాలి, ఆ తర్వాత డ్రైవింగ్ టెస్టు ఉంటుంది. ఈ పుస్తకం చదివి ముందు ఇది పాస్ అవుతే ఆ తర్వాత కారు నడపటం ఎలాగో నేర్చుకుందువుగాని” అంటూ, థీరీకి…..ప్రాక్టికల్స్ కి ముడిపెట్టే మా రామనాధం సైన్స్ మాస్టారల్లే మాట్లాడారు. చచ్చినట్టు పుస్తకం చదివి “దేవుడా దేవుడా” అనుకుంటూ పరీక్ష రాసి ఎలాగో గట్టెక్కా!
ఇక అక్కడ్నించీ ప్రతి శని, ఆదివారాలు ఏదో కొంపలు ముంచుకు పోతున్నట్లు ఒకటే హడావిడి. మా చిన్నప్పుడు, పొద్దూకుతూనే పలహారం చేసి ముసుగెట్టి పడుకునే మా తాతయ్య, తెల్లవారుఝామున నాలిగింటికి లేచి “భజగోవిందం…భజగోవిందం” అంటూ ఇంటిల్లిపాదిని లేపేవారు! మా తాతయ్య లాగే మీరుకూడా పొద్దున్నే లేచి, నన్ను లేపి ఆ చలిలో “పదపద” అంటూ కారు స్టార్ట్ చేసేవారు. షాపింగ్ సెంటర్స్ లో ఉండే పార్కింగ్ లాట్ కు తీసికెళ్ళి అక్కడికి మీరేదో పెద్ద రేస్ కార్ డ్రైవర్ అయినట్టు పోజులు కొడ్తూ క్లాసు పీకేవారు. మీరు చెప్పినట్టుగా నేను చెయ్యడం లేదని కోపంగా చూసేవారు! మీ కోపం చూసి నా కాళ్ళల్లో వణుకొచ్చి మరిన్ని తప్పులు చేసేదాన్ని. మొదటి సారి నేను డ్రైవింగ్ టెస్ట్ తప్పినప్పుడు నా వంక గుర్రుగా చూసారు గుర్తుందా?! డ్రైవింగ్ టెస్టు మొదటి సారి తప్పినా రెండోవిడతలో పాసై “లైసెన్సు” తెచ్చేసుకుని హమ్మయ్యా! అనుకున్నాను.
“కారుడ్రైవింగ్-లైసెన్స్” అంటే జాన్ గుర్తుకొస్తున్నాడు. పాపం! ఏ లోకంలో ఉన్నాడో?
మనం ఉన్న పక్క అపార్టు మెంట్ లోనే జాన్, అతని భార్య జూలి ఉండేవాళ్ళు. మ్యూజిక్ వింటూ ఎప్పుడూ కార్లు తుడుచుకుంటూ ఉండేవాడు. కనిపిస్తే చాలు “హల్లో డియర్!” అంటూ చెయ్యూపుతూ నవ్వుతూ పలకరించేవాడు. ఏవేవో కబుర్లు చెప్పేవాడు. అప్పట్లో నా ఇంగ్లీషు పాండిత్యం అంతా జాన్ మీద ప్రయోగించేదాన్ని. ఓరోజు జాన్ కారు టైర్లు శుభ్రం చేసుకుంటుంటే, నేను మర్నాడు నాకు డ్రైవింగ్ టెస్ట్ ఉందని… మళ్ళీ ఫెయిల్ అవుతానేమో భయంగా ఉందంటూ ఏడుపు మొహం పెట్టాను. జాన్ వెంటనే నవ్వుతూ “షో యువర్ లెగ్స్ కిడో…యు విల్ గెట్ యువర్ లైసెన్స్” అంటూ కన్ను గీటాడు! అది కూడా పరీక్షలో ఓ భాగం కాబోలు, కిందటిసారి అందుకే పరీక్ష తప్పాననుకొని చాలా సీరియస్ గా “ఓకే” అన్నాను! జాన్ వెంటనే పకపకా నవ్వాడు!
ఆరోజు సాయంకాలం మీరు ఇంటికి రాగానే జాన్ ఇచ్చిన సలహా మీకు చెప్పగానే, మీరూ నవ్వటం మొదలు పెట్టారు!
ఆ తర్వాత ఓ రోజు కొత్త ప్యాంటు, షర్ట్ కొనిపెట్టి నన్ను వేసుకోమని, మీరు పనిచేస్తున్న హాస్పిటల్ కు తీసికెళ్ళి నన్ను ఎవరికో పరిచయం చేసారు. వాళ్ళేం అంటున్నారో..దేన్నీ గురించి మాట్లాడుతున్నారో సరిగ్గా అర్ధం కాలేదు. కానీ చివర్లో “కెన్ యూ స్టార్ట్ నెక్స్ట్ వీక్” అంటే వెంటనే తలాడించాను! అలా నాకు తెలీకుండానే నాకు ఏమి తెలియని ఉద్యోగంలో చేరిపోయాను. మూడ్నెల్లు ముప్పతిప్పలు పడ్డ తర్వాత పని కాస్త అలవాటైందనుకుంటుంటే ఓ ఫైన్ మార్నింగ్ మా బాస్ ఇంతలావు పుస్తకం నా చేతిలో ఉంచి “దిస్ షుడ్ హెల్ప్ యూ ఫర్ యువర్ టెస్ట్” అంటూ వెళ్ళిపోయింది. ఆ పుస్తకంలో మెడిసిన్ కు సంబంధించిన మాటలు.. రకరకాల రోగాల పేర్లు వాటి కోడ్ నెంబర్లు వగైరా వగైరా ఉన్నాయి. నా బి.ఎ డిగ్రీ కేవలం ఉద్యోగం రావడానికి మాత్రమే పనికొచ్చిందని…అటుపైన జాబ్ కు ఉండవలసిన అర్హత చచ్చినట్టు నేను సంపాదించుకోవాలని అప్పుడు తెలిసింది!
ఏమిటీ…ఇప్పుడు నేను ఇంత మంచి పొజిషన్ లో ఉండటానికి కారణం మీరు అంటారా? అందుకు నేను మీకు థాంక్స్ చెప్పుకోవాలా?!
అవునౌను తప్పకుండా చెప్పుకోవాలి మీకు!
“ఆవుకు నాలుగు కాళ్ళుండును. అశోకుడు బావులు తవ్వించెను…బౌద్ధమతాన్ని ఆదరించెను. అల్లసాని పెద్దన “మనుచరిత్రము” అన్న గ్రంధాన్ని రచించెను” అంటూ…. బట్టీపట్టిన చదువుల సరస్వతిని తీసికెళ్ళి హాస్పిటల్ లో మెడిసిన్ కి సంభందించిన ఉద్యోగంలో పడేసారు. ఇక అక్కడినుంచి ఈవినింగ్ కాలేజీలు….కోర్సులు… ఎక్జామ్స్ ….క్రెడిట్లు అంటూ తిప్పలు పడ్డాను.ఇప్పటికి ఎన్ని పరీక్షలు రాసానో?! ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కు వెళ్ళగలిగాను?
ఏమిటీ….వచ్చిన కొత్తల్లో మనం కాస్త నిలదొక్కుకునే దాకా, వేన్నీళ్లకు చన్నీళ్ళుగా సాయంగా ఉంటానని, నన్ను ఉద్యోగంలో చేర్పించారే కాని…రాక్షసిలా ఇంతలా కష్టపడతానని…ఉద్యోగాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటానని మీరు ఊహించలేదంటారా?
మరి ప్రసన్న అంటే ఏమనుకున్నారు?! “పట్టు పట్టరాదు….పట్టి విడువరాదు” అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా?!
మీకు ఓ నిజం చెప్పనా! నా అన్న వాళ్ళు లేకుండా, కేవలం తాళి కట్టించుకున్న కారణంగా ఉన్న దేశాన్ని, అయిన వాళ్ళని వదిలి, అత్తెసరు చదువులతో ఆరోజుల్లో అమెరికా దేశం వచ్చిన నాలాంటి అమాయకపు ఆడవాళ్ళకి అన్నీ పరీక్షలేనండీ!.
అడుగు పెడుతూనే ఇక్కడ ఎలా ఉండాలో.. ఎలా మాట్లాడాలో… ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడంతో మొదలయ్యేవి ప్రాధమిక పరిక్షలు. తల్లీ తోడు లేని దేశంలో భయాన్ని…దిగులుని దిగమింగుకుని, ఒంటరిగా పిల్లల్ని సాకటం బెంగతో కూడిన పరీక్ష.
చిన్నవయసులోనే అన్నింటికీ “వై యామై డుయింగ్…వై డు అయి హావ్ టు డు?” అంటూ యక్ష ప్రశ్నలేసే పిల్లలకు సమాధానం చెప్పటం “బుర్ర గోక్కునే పరీక్ష”.
పిల్లలు కాస్త పెద్ద వాళ్ళయిన తర్వాత అన్నీ తమకే తెలుసుననుకుని వాదించే వాళ్ళతో గెలవటం “బుర్ర తినేసే పరీక్ష”.
“అయి డోంట్ లైక్ గోయింగ్ ఇండియా….హూ ఆర్ ఆల్ దీజ్ పీపుల్?” అనే మన పిల్లల తరానికీ,
‘ఇదేమిటే! ఈ పిల్లలు ఇంత అయోమయంగా పెరుగుతున్నారు? అమెరికాలో నీ పెంపకం ఇదేనా?” అనే పై తరానికి మధ్య ఇరుక్కోడం “అదో నలుగుడు పరీక్ష”.
ఆఫీసు వ్యవహారాలు…ఊళ్ళో వ్యవహారాలే తప్ప ఇల్లుని, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోని మొగుడున్ననాలాంటి ఆడవాళ్లకి ప్రతిరోజు ఉండేది “డైలీ పరీక్ష”.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఉన్నట్టుండి హఠాత్తుగా “ఐ డ్రాప్డ్ ఔట్ ఆఫ్ కాలేజ్……వుయి ఆర్ ఎంగేజ్డ్…. వుయి ఆర్ లివింగ్ టుగెదర్ మామ్”…అంటూ అనౌన్స్ చేసాక బయటవాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పటం “భయంతో కూడిన పరీక్ష”. ఇలా చెప్పాలంటే బోలెడు!.
అటువంటి ఆ జీవిత పరీక్షల ముందు, వెధవది కాగితాలమీద… కంప్యూటర్ల మీద తీసుకునే ఈ పరీక్షలొక లెక్కా! చెప్పండి?! పైగా ఈ పరీక్షలు పాసైతే సర్టిఫికెట్లు…ప్రమోషన్లు….డబ్బులు…గుర్తింపు వస్తాయి. క్లాసులో చక్కగా ముందుగానే పరీక్ష ఎప్పుడో….ఏం చదవాలో….ఎలా ప్రిపేర్ అవ్వాలో క్షుణ్ణంగా చెప్తారు. కానీ జీవితంలో పరీక్షలు ఎప్పుడొస్తాయో ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. అవి పాస్ అవడానికి పుస్తకాలు గట్రా ఎక్కడా ఉండవు. అధవా ఎలాగో అలా మనంతట మనమే తెలుసుకుని కష్టపడి అవి పాస్ అయినా, మనల్ని ఎవ్వరూ మెచ్చుకోరూ…గుర్తించరు కూడా. అది నీ డ్యూటీ అన్నట్టు చూస్తారు. కర్మ కాలి జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఫెయిల్ అయితే మాత్రం వెంటనే హేళన చేస్తూ నువ్వు “ఫెయిల్యూర్”వి అంటూ వేలెత్తి చూపిస్తుంది సమాజం.
“జీవితం అంటేనే పరీక్ష” అన్న జీవిత సత్యం తెలియని నేను, చిన్నప్పుడు చదువుకుంటేనే పరీక్షలు ఉంటాయని… పెళ్ళిచేసుకుంటే పరీక్షలనేవే ఉండవని భ్రమపడ్డాను!!
ఏమిటీ…ఇన్నేళ్ళుగా మిమ్మల్ని,పిల్లల్ని ఓపిగ్గా భరిస్తూ, మీ మంచి చెడ్డలు చూస్తున్న నాకు, మీరు నూటికి నూరుమార్కులు ఇచ్చేస్తున్నారా?
మీతో ఏకీభవిస్తూ…..కంప్యూటర్ కూడా నా ఆన్ లైన్ పరీక్షకు అవే మార్కులు ఇచ్చింది లెండి!
ఏమిటీ….అర్జెంటుగా నా చేతి కాఫీ తాగాలనిపిస్తోందా మీకు?!!
– తొలి ప్రచురణ “వంశీ ప్రచురణ” 2018
పరీక్ష-నేపధ్యం
ఈ ముచ్చట రాయడానికి మెటీరియల్ కోసం ఇంట్లో నా వాళ్ళ దగ్గరనుంచో, లేక బయట ఫ్రెండ్స్ దగ్గరనుంచో వెతుక్కోవలసిన అవసరం లేకుండా, నలభై అయిదేళ్ళ కిందట అమెరికాదేశంలో అడుగుపెట్టిన ఆ శ్యామల్లోనే దొరికిపోయింది! జీవితాన్ని ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా అప్పటి వయసు…ఆ అమాయకత్వం…ఆ అజ్ఞానం…ఏ విషయం మీద అవగాహన లేకపోవడం ఇవన్నీ కళ్ళముందు కనిపించి నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను! దాదాపుగా ముప్పయి సంవత్సరాలు హెల్త్ కేర్ ఫీల్డ్ లో పనిచేసి రిటైర్ అయిన నేను కొద్ది సంవత్సరాల కిందట సరదాగా ఓ చిన్న పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయినప్పుడు, మొదటి రోజు నా బాస్ నా దగ్గర కొచ్చి “అన్నట్టు నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఆన్ లైన్ లో ఈ టెస్ట్ తీసుకుని రెండు రోజుల్లో సబ్మిట్ చెయ్యాలి.” అని అన్నప్పుడు ఈ ముచ్చట రాయాలనిపించింది!!
.