10_006 సూర్య స్తుతి

 

(ఆదిత్య హృదయం ఆధారంగా)

రామరావణుల యుద్ధము

చూచుట కతిభయంకరము

హోరాహోరుగ పోరు సలిపిరి

ఎవరికి వారే సాటనిపించిరి

రావణ సంహారమెట్లు జరుగును?

ఏ శక్తి రాముని గెలిపించును?

అప్పుడు వచ్చెను మహర్షి అగస్త్యుడు

ఆదిత్య హృదయం శ్రీరామునికి

ఉపదేశించెను ఆ మహనీయుడు

ఆదిత్య హృదయము పరమ పవిత్రము

రహస్యమయము శత్రు వినాశకరము

సత్ఫలములిచ్చు దివ్యస్తోత్రము

చదివిన కలుగదు అపజయము

సూర్యుడొక్కడే ఈలోకములను 

బంగరు కిరణాలతో మేల్కొలుపును

సమస్త లోకములను రక్షించును

సురాసురులచే పూజింపబడును

తేజోమయమగు తన కిరణములచే

చీకట్లను పారద్రోలును

ఆయన రథమున కేడు గుర్రములు

వాయువేగమున పరుగిడుచుండును

జనులు చేయు కర్మలు అన్నీ

సూర్యోదయముతో మొదలగును 

ప్రాణాయామం, యోగం, పూజలు

అన్నీ విధిగా జరుగుచుండును

పగటి పూట భాస్కరుడితడు 

ఋగ్వేదరూపుడై వెలుగొందును

మధ్యాహ్నమందున యజుర్వేదరూపుడై

వింత కాంతితో ప్రకాశించును

సాయంకాలమున సామవేద రూపుడై

శాంతించి సౌమ్యముగా సాగును

త్రిసంధ్యలలో వందనీయుడాయెను

ఆరు ఋతువులను కల్పించెను

త్వరితగతిని పయనించెడివాడు

మంచును కరగించి సాగెడివాడు

పద్మములను వికసింపచేయువాడు

ఆకాశమునకే అందము సూర్యుడు

లోకబాంధవుడు – వర్షకారకుడు

పింగళవర్ణుడు – పండితుడు

ఉగ్రరూపుడు – శూరవీరుడు

సహస్రాంశుడీ ఆదిత్యుడు 

గ్రహ నక్షత్రములకు నాయకుడు

పన్నెండు రూపాలతో వెలసినవాడు

దినమునకధిపతి దినకరుడు

సకల కర్మలకు సాక్షీభూతుడు

అజ్ఞానమును పోగొట్టువాడు

అదితి పుత్రుడు సవిత్రుడు 

తిమిర సంహార కారకుడు

నమస్కారప్రియుడు శ్రీసూర్యుడు

స్కంద ప్రజాపతి దేవేంద్ర కుబేర 

రూపాలన్నియు ప్రభాకరుడే

యమ సోమ వరుణ వసు అగ్ని వాయు

అన్నియును సూర్యనారాయణుడే

యజ్ఞ స్వరూపుడు యజ్ఞ ఫలదాత

అన్ని గూడ ఈ భాస్కరుడే

ప్రాణికోటి కంతర్యామితడు

శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు రుద్రరూపుడు 

ఆరు శత్రువుల నరికట్టువాడు

వర్షములనిచ్చి పోషించువాడు

తాపత్రయములు పోగొట్టువాడు

శక్తిని స్ఫూర్తిని ఇచ్చును సూర్యుడు

విజ్ఞానశాస్త్ర సారమంతయు

తన కిరణములలో ఉంచినవాడు

ఆది వ్యాధులను పోగొట్టువాడు

ఆరోగ్యమును ఇచ్చే దేవుడు

ఆపదలందు భయపడినప్పుడు

సూర్యోపాసనే జనులకు దిక్కు

దుఃఖము పోగొట్టి ధైర్యమునిచ్చును

అని అగస్త్యుని దివ్యవాక్కు

ముని వాక్కులు రాముని చింతను బాపెను

శ్రద్ధతో ముమ్మారు స్తోత్రము చదివెను

ధనుర్బాణములు చేత ధరించెను

అవలీలగ రావణు వధియించెను

***************************

మంగళ హారతి 

ఉషా ఛాయ దేవేరుల తోడ

విరాజిల్లు శ్రీ సూర్యదేవా

మంగళ హారతి గైకొను దేవా

సదా మమ్ము బ్రోవగ రావా ౹౹ఉషా౹౹

సూర్యారాధన సూర్యోపాసన

మంగళకరము జయకరము

నిత్యము అర్కుని పూజలు చేసిన

గృహమున సర్వము శుభమయము ౹౹ఉషా౹౹

నమ్మకమను నూనెను పోసి

భక్తి అనే వత్తిని వేసి

హారతి నిత్తుము హేమార్తాండా

నీవే ఇక మా అండా దండా  ౹౹ఉషా౹౹

***************************