13_005

ప్రస్తావన

 

సుమారు 200 సంవత్సరాలు భారతదేశం పరాయి దేశ పాలనలో మ్రగ్గిపోయింది. అంతకుముందు కూడా అనేకమంది ఇతర దేశస్థులు మనదేశాన్ని ఆక్రమించి పరిపాలన సాగిస్తూ తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. మన ప్రజల్ని ఎన్నో బాధలు పెట్టారు. ఈ దేశంలో తమ ఉనికిని స్థిరపరుచుకోవడానికి అనేక ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు వంటివి నాశనం చేసి, తమ ఉనికికి పరినికి వచ్చే కట్టడాలు నిర్మించింది. ఇలా పరాయి దేశస్థులు మన మీద పెత్తనం చెయ్యడానికి ముఖ్య కారణం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా విడి విడిగా పాలన చేస్తున్న వారి మధ్య ఐక్యత లేకపోవడం. ఈ పరిస్థితిని విదేశీయులు ఉపయోగించుకుని మన రాజుల మధ్య విబేధాలు సృష్టించి, వారిని రెచ్చగొట్టి కలహాలు రేపి, వారికి సహాయం చేసే వంకతో వారిని గుప్పిట్లో పెట్టుకుని క్రమంగా ఈ దేశాన్ని ఆక్రమించి పాలకులైపోయారు. ప్రజలను పీడించి పన్నులు వసూలు చెయ్యడం, మన దేశ ఖనిజ సంపద వంటివి వారి దేశాలకు తరలించుకు పోవడం వంటివి చేశారు. వారి దేశాల ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుని వ్యాపారం చేసుకున్నారు. వందల సంవత్సరాలు ఈ పరిస్థితిలో మ్రగ్గిపోయిన ప్రజల్లో నెమ్మదిగా చైతన్యం వచ్చింది. రాజుల మధ్య ఐకమత్యం లేకపోయినా ప్రజల్లో ఐకమత్యం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఆ ప్రయత్నాల్లో ముఖ్యమైనది, దేశ ప్రజల్లో సింహభాగాన్ని ఒకే తాటి పైకి తీసుకువచ్చింది భారత జాతీయ కాంగ్రెస్. 1885 వ సంవత్సరంలో కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఈ ఆవిర్భావానికి కారణమైన వారు, దేశ ప్రజలలో పరాయి పాలన విమోచన, స్వాతంత్ర్య సముపార్జన భావాలని వెలికి తీసిన వ్యక్తి భారతీయుడు కాదు. ఎవరినుంచి అయితే విముక్తి కోరుకున్నామో ఆ బ్రిటిష్ దేశానికి చెందిన వ్యక్తి. ఆ బ్రిటిష్ అధికారి పేరు ఏ. ఓ. హ్యూమ్. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధులు పాల్గొని ఉమేష్ చంద్ర బెనెర్జీ ను అధ్యక్షుడిగా, ఏ. ఓ. హ్యూమ్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. అప్పటినుంచి సంవత్సరానికి ఒకసారి దేశంలోని వివిధ నగరాలలో మహాసభలు నిర్వహించి ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే విధంగా ప్రేరేపించేవారు.

మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటంలోకి అడుగు పెట్టడంతో కొత్త అధ్యాయం మొదలైంది. పోరాటం వేగం పుంజుకుంది. గాంధీజీ పోరాట పటిమ, వ్యూహ రచన, నాయకత్వ లక్షణాలు స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూర్చాయి. ఆయన దిశా నిర్దేశంతో పోరాట పంథా మారింది. కాంగ్రెస్ మహాసభల్లో ఆయన చేసే ఉత్తేజభరితమైన ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతుల్ని చేశాయి.

38వ అఖిలభారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు మన రాష్ట్రంలోని కాకినాడ పట్టణంలో జరిగాయి. ఆ మహాసభలకు దేశంలోని అనేకమంది మహా నాయకులు హాజరయ్యారు. కాకినాడ మహాసభ నిర్వహణలో మహర్షి బులుసు సాంబమూర్తి గారి పాత్ర విశిష్టమైనది. తెలుగు నాయకులు ఈ సభల నిర్వహణలో శక్తివంచన లేకుండా పనిచేసి నిర్వహణలో, ఆతిథ్యంలో దేశ నాయకులందరినీ మెప్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక విషయాల్లో దేశ ప్రజల్ని ఉత్తేజపరచింది. ముఖ్యంగా ‘ సంపూర్ణ స్వరాజ్యం ’ అనే భావన కి నాంది పలికింది. ఆ తర్వాత రోజుల్లో ఆ భావన మరింత బలపడి మరింతమంది ఈ ఉద్యమంలోకి రావడానికి దోహదపడింది. ఈ పోరాటంలో ‘ మేము సైతం ’ అంటూ పాల్గొనడానికి మహిళలు సైతం ఉత్సాహం చూపడం కూడా ఈ సభల విశేషం.

ఇంతటి చారిత్రాత్మకమైన ఘట్టానికి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 2023 డిసెంబర్ 28 నుంచి కోకనాడలో కాంగ్రెస్ మహాసభల శతవసంతోత్సవాలు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న వారు ఇప్పటి తరానికి అప్పటి పోరాట పటిమ, నాయకుల అకుంఠిత దీక్ష గురించి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.

నిజమే ! ఇప్పటి తరానికి అప్పటి చరిత్ర తెలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తెలిసిన తరం తెలియజెప్పటంలో నిర్లక్ష్యం వహిస్తోందనిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది నాయకులు తమ స్వార్థానికి స్వాతంత్ర్య పోరాట చరిత్రను మార్చివేసే, మరుగుపరచే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటం ఒక మహోద్యమం. ఎంతోమంది తమ సంపదలను త్యాగం చేశారు. చాలామంది ప్రాణత్యాగం చేశారు. ఎన్నో అవమానాలను సహించారు. హింస ను భరిస్తూ కూడా మహాత్మాగాంధీ అహింసా మార్గాన్ని వదలలేదు. ఏళ్లపాటు కుటుంబాలకు దూరంగా జైళ్ళలో మ్రగ్గిపోయారు. ఇలా ఎన్నో, ఎందరో త్యాగఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్చాస్వాతంత్ర్యాలు. ఈ త్యాగాల గురించి నేటి తరానికి తెలియజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. యువత వక్ర మార్గాలు పట్టకుండా ఉండడానికి, వారిలో దేశభక్తి పెరగడానికి ఇది దోహదపడుతుంది.        

***************************

మాలతీచందూర్ నవలపై పరిశోధనాత్మక వ్యాసం పోటీ… 2024 

         

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page