12_007 కన్యాశుల్కం – ఒక పరిశీలన

పెద్ద కూతురు బుచ్చమ్మ గిరీశం పంతులు తో లేచిపోవడం, రెండవ కూతురు సుబ్బికి కుదిర్చిన పెళ్ళి తప్పిపోవడం, కొడుకు వేంకటేశం అమాయకుడు కావడం, పెళ్ళి ప్రయాణ వృధా వ్యయం ఇవన్నీ కలగలసి అగ్నిహోత్రావధానుల్ని, మానసికంగా కృంగదీసి, బలహీనపరుస్తాయి. అతను రామప్పంతుల వల లో పడి ముంజేతి కంకణం తాకట్టు పెట్టి ఒక చవల వకీలును కుదుర్చుకుని, అతనితో పేచీ పడి ఇంకో నాయుడు వకీలును కుదుర్చుకుని మేజెస్ట్రీట్ గారి చేత మాట పడి, కోర్ట్ లో అవమాన పడతాడు. అదే సమయంలో రామప్పంతులు, గిరీశం అట్నుంచి హత్యా నేరం లో ఇరుక్కున్న లుబ్దావధానుల్ని కూడా కోర్ట్ కేసు లు పెట్టమనీ, దత్త పత్రిక రాయమనీ వేధిస్తూ ఉంటారు, మధురవాణి ప్రోత్సాహం మేరకు రామప్పంతుల్ని హెడ్ కానిస్టేబుల్ కూడా చికాకు పెడుతూ ఉంటాడు. హఠయోగి సారా దుకాణం లో ఎగ్గొట్టిన బాకీ హెడ్డు పీకకి చుట్టుకుంటుంది.

లుబ్దావద్దానులు సౌజన్యరావు పంతులు అనే వకీలుని ఆశ్రయిస్తాడు. పూర్వాపరాలు పరిశీలించిన సౌజన్యరావు పంతులు, గుంటూరు శాస్త్రి ఈ కేసులో కీలకం అనీ, అతన్ని పట్టుకుంటే, లుబ్దావధానులు, నిర్దోషి గా బయట పడతాడు అని చెపుతాడు. అంతకు ముందే గిరీశం సౌజన్యరావు పంచన చేరి, తాను సంఘ సంస్కార నిమిత్తం బుచమ్మ ను వివాహం చేసుకుంటున్నానని నమ్మబలికి అతనితో ప్రాపకం పెంచుకుంటాడు.

కరటక శాస్త్రి అభ్యర్ధన మేరకు మధురవాణి మారువేషం లోసౌజన్యరావు పంతుల్ని కలుసుకుని, అతనితో చర్చించి, అతని సంస్కార డోల్లతనం బయట పెట్టి, గుంటూరు శాస్త్రిని తాను బయట పెడతాను అనీ, దానికి ప్రతిఫలం గా సౌజన్యరావు పంతులు తనని ముద్దు పెట్టుకోవాలి అని షరతు విధిస్తుంది, ముందు బెట్టు చేసిన పంతులు విధి లేక అంగీకరిస్తాడు, మధురవాణి అతన్ని వారించి, గిరీశం నిజరూపం బయట పెడుతుంది,

విషయం గ్రహించిన పంతులు తన డొల్లతనం అంగీకరించి, గిరీశాన్ని దూషించి, అతను పధ్ధతి మార్చుకోని పక్షంలో పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించడం తో “డామిట్ కథ అడ్డం తిరిగింది” అనుకుంటూ గిరీశం నిష్క్రమించడం తో కధ ముగుస్తుంది..

నాటకం అని ప్రచారం చేయబడిన ఈ ఉద్గ్రంధాన్ని చదివిన సగటు పాఠకుడికి ఇందులో కన్యాశుల్క ఆచారాన్ని రచయిత ప్రత్యక్షంగా కానీ, పరోక్షం గా కానీ ఎక్కడ, ఎలా ఖండించాడో స్పష్టత కనబడదు. సగటు పాఠకుడు అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, ఈ గ్రంథాన్ని వాడుక భాషలో జన సమూహానికి అర్ధం కావాలని  రచయిత రాసినట్టు దీని సమర్ధకులు అంటూ ఉంటారు.

ఈ నాటకం లో రచయిత ప్రయోగించిన చాకలీ, బారికా, వెధవ ముండా వంటి లెక్కకు మిక్కిలి పదాలు నేడు ఉచ్చరిస్తే శిక్షార్హులవుతారు.. కన్యాశుల్క దురాచారం అని ప్రస్తావన చేయడం కూడా సరి కాదు. కన్యాశుల్కం ఆ కాలంలో ఒక ఆచారం. అది సదాచారమో, దురాచారమో సమాజమో, ప్రభుత్వమో నిర్ణయించుకుంటుంది.

సుమారుగా పది కోట్ల కు పైగా ఉన్న తెలుగువారిలో సాహిత్య పఠనాభిలాష ఎంత శాతం ఉందో మనకి తెలిసిన విషయమే… వారిలో ఈ పుస్తకం గురించి తెలిసిన వారు, దీనిని చదివి అర్ధం చేసుకున్న వారి శాతం ఎంత ఉన్నది అనే విషయం తెలుసుకుంటే సంఘాన్ని సంస్కరించే ఉద్దేశ్యం తో రాయబడిందని చెప్పుకునే ఈ పుస్తక రచయిత ఆశయం ఎంతవరకూ నెరవేరిందో అవగాహన కు వస్తుంది..

—– సమాప్తం —–

Please visit this page