12_011

‘ రైతే రాజు ’, ‘ రైతే దేశానికి వెన్నుముక ’, ‘ రైతే అన్నదాత ’….. ఇలా ఎన్నో బిరుదలతో రైతుని  గౌరవించేవారు కొంతకాలం క్రితం. 1970వ దశకం వరకు నిజంగానే రైతు మంచి స్థితిలో కొనసాగాడని చెప్పవచ్చు. ఆ దశలో ఇంకా సేంద్రీయ పద్ధతుల్లోనే వ్యవసాయం సాగేది.

తొలకరి రాగానే వ్యవసాయ రంగంలో హడావిడి మొదలయ్యేది. వ్యవసాయ పనుల ప్రారంభించడానికి గుర్తుగా ‘ ఏరువాక ’ పేరుతో పండుగ లాగా చేసుకునేవారు. ఇందులో ప్రధానంగా నాగలి వంటి పనిముట్లతో బాటు ఆ నాగలి ని నడిపే పశువులను కూడా పూజించి వ్యవసాయ పనులకు ఉద్యమించడం జరిగేది. పనినే దైవంగా భావించడం వలన, ఆ పనికి ప్రతిరూపాలైన పనిముట్లను, ఎద్దులను కూడా దైవాలుగా భావించడం, పూజించడం వారికి తమ పని పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి. వర్షాధారంగానో, కాలువలు, చెరువుల ద్వారా లభించే నీటి ఆధారంగానో వ్యవసాయం చెయ్యడం ఆనాటి విధానం. ఆహార ధాన్యాల పంటతో బాటుగా ప్రతి రైతు పశువుల పెంపకం సమాంతరంగా చేసేవాడు. అందువలన పాలు మొదలైన కుటుంబావసరాలు తీరడంతో బాటు ఆ పశువుల ద్వారా లభించే సహజమైన ఎరువులను, వేప నూనె లాంటి సహజ సిద్ధమైన క్రిమి సంహారకాలను వ్యవసాయానికి ఉపయోగించడం జరిగేది. అలాగే విత్తనాలను ఎవరికి వారే తమ పంట నుంచే తయారు చేసుకుని, తర్వాత పంటకోసం ఆ విత్తనాలనే వాడటం జరిగేది. అలాగే పంట చేతికి వచ్చాక ఆ వరికంకులను తమ ఇంటి ముందర కట్టడం ద్వారా పక్షులకు ఆహారం అందించడం వంటి చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవారు. నీరు, పంటల విషయంలో హానికరమైన పదార్థాలు అంటే తెలియని రోజులవి. స్వచ్చమైన గాలి, నీరు, తిండి వారి స్వంతం.

తర్వాత కాలంలో అన్ని రంగాలలో లాగే ఈ రంగంలో కూడా వ్యాపార ధోరణి ప్రవేశించింది. వ్యవసాయంలో స్వల్పకాలిక పంటలని, అధిక దిగుబడి అని, చీడ పీడల రక్షణ అనీ రకరకాల పేర్లతో వ్యాపార వర్గాలు ప్రవేశించి అనేక అనర్థాలకు తోవ చూపాయి. దాంతో రైతు పరిస్తితి దిగజారిపోయింది. విచ్చలవిడిగా రసాయినిక ఎరువులు వాడకం, పురుగు మందుల వాడకం వలన స్వల్పకాలిక ప్రయోజనాలు కనిపించినా, దీర్ఘకాలంలో భూమి లో సారం తగ్గిపోవడం, అధిక మోతాదులో పురుగు మందుల వాడకం వలన వినియోగదారుల ఆరోగ్యం మీద ప్రభావం చూపడం వంటి దుష్పరిమాణాలు సంభవిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి ఎన్నో వ్యయప్రయసాలకోర్చి, ప్రకృతి విప్పత్తుల ధాటికి తట్టుకుంటూ పండించిన పంటకు మద్దతు ధర దొరకక, దొరికినా సింహభాగం దళారుల చేతుల్లోకి పోయి తమకి అరకొర ప్రతిఫలం, ఒక్కొక్కసారి అది కూడా లేకుండా నష్టానికి పంట అమ్ముకునే పరిస్తితి లోకి రైతు నెట్టివేయబడ్డాడు. రైతులను ఈ కష్టాలనుంచి తప్పించడం కోసం, తమ ఉత్పత్తులను దళారులకు కాకుండా నేరుగా ప్రజలకే అమ్ముకుని లాభ పడటం కోసం ఉద్దేశించిన ‘ రైతు బజారు ’ ప్రణాళిక ప్రస్తుతం పూర్తిగా నీరుగారిపోయిందనే చెప్పాలి. దాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, మార్కెటింగ్ యార్డ్ లలో కూడా దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చూడవలసిన బాధ్యత, వారికి అండగా నిలవాల్సిన అవసరం ప్రభుత్వానికే కాదు….. వారు పండించిన పంటను అనుభవిస్తున్న ప్రజలందరికీ ఉంది. ఎప్పుడూ రోడ్డు మీదకు రాని రైతులు ఇటీవల కాలంలో ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వచ్చేది కాదు. మనకి రోజు గడిచి పోతోంది కదా అని ఉదాసీనంగా ఉండకుండా అవసరమైనపుడు రైతుకు అండగా నిలబడితే మనం ఇచ్చే ప్రతి పైసా రైతుకి చేరుతుంది… మనకు తక్కువ ధరకు ఆహార ధాన్యాలు లభించి దళారుల మార్కెట్ మాయాజాలం నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తుంది.

“ ఏరువాక పూర్ణిమ ” సందర్భంగా మనందరికీ అన్నం పెట్టే రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ…..    

***************************************

గమనిక : ఇప్పటివరకు పక్ష పత్రికగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ’ వచ్చే నెల నుంచి మాసపత్రిక గా అనివార్య పరిస్థితుల్లో మార్చవలసి వస్తోంది. గమనించ ప్రార్ధన.

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.

***************************************