10_007 ఆనందవిహారి

తెలుగువారు తెల్లవారిన దగ్గరి నుంచి రాత్రి పడుకొనేవరకు సంస్కృతం మాటలు చాలా ఉపయోగిస్తుంటారని, పిల్లల పేర్లు పెట్టడానికి, సభా కార్యక్రమాలకి, రోజూ నిర్వహించే వ్యవహారాలకి మనం వాడే పదాలు సంస్కృతానివే అని నవీన అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నవంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం యూట్యూబ్ లో ” నెల నెలా వెన్నెల ” కార్యక్రమం ప్రసారం చేసింది. ఇందులో ” దైనందిన జీవితంలో సంస్కృతం ” అంశంపై నగరానికి చెందిన, సంస్కృత భాషలో పి హెచ్ డి చేస్తున్న బులుసు నవీనతో ముఖాముఖి జరిగింది. 

మానవ వనరుల విభాగంలో ఆంగ్లంలో ఎం బి ఏ చదివిన తనకు చిన్నప్పటి నుంచీ తెలుగంటే ప్రీతి అని, కానీ బడిలో తెలుగు నేర్చుకునే అవకాశం లేదని అన్నారు. దాంతో, తెలుగు సినిమా శీర్షికలు, పత్రికల్లో శీర్షికలు చూసి ఏ అక్షరం ఏదయ్యుంటుందో ఊహించి సొంతంగా తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నానని, తమిళ, ఆంగ్ల భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు కూడా చేసే స్థాయికి ఎదిగానని తెలిపారు. 

 –

రెండేళ్ళు ఉద్యోగం చేసిన తరువాత సంస్కృత భాష పట్ల ఆకర్షితురాలయ్యానని, ఆ భాషకు తెలుగు చాలా దగ్గరి భాష అని గ్రహించానని చెప్పారు. సంస్కృత భాషలో ముందుకెళ్ళాలని  నిర్ణయించుకున్నానని నవీన పేర్కొన్నారు. తెలుగువారు సంస్కృతం పేర్లే వాడతారని చెప్పారు. వేదికల మీద నిర్వహించే కార్యక్రమాల్లో ఉపయోగించే అధ్యక్షులు, కార్యదర్శి, వేదిక, ఉపన్యాసం, ప్రసంగం, ధన్యవాదాలు తదితర మాటలన్నీ ఆ భాషలోనే ఉన్నాయని అన్నారు. అశేషాంధ్ర ప్రజానీకం, కరతలామలకం, కాకతాళీయం తదితర పద బంధాలకు అర్థం వివరించారు. తెలుగువారి పేర్లన్నీ సంస్కృతమయమేనని అంటూ… శశి అంటే కుందేలని, కుందేలు ఆకారంలో మచ్చ ఉన్నవాడు కాబట్టి చంద్రుణ్ణి శశి అంటారని వివరించారు. రాజమౌళి అంటే  రెండు అర్థాలున్నాయన్నారు. రాజు అంటే చంద్రుడు అన్న అర్థం కూడా ఉంది కాబట్టి శివుడు అని, రాజులకు రాజు అని చెప్పవచ్చన్నారు. రాజమౌళి గురించి అనుకున్నప్పుడు కీరవాణి గురించి కూడా అనుకోవాలని చమత్కరించారు. కీరవాణి అంటే చిలుక పలుకని పేర్కొన్నారు. జానకి, సీత, అమితాభ్, ఆశుతోష్, శశి, బాహుబలి, నగేష్, రమేష్, రాజేంద్ర తదితర పేర్ల అర్థాలు వివరించారు. సినిమాలకు సంబంధించిన నిర్మాత, దర్శకుడు, నటీనటులు అన్నవి సంస్కృత పదాలేనని అన్నారు. భారత రిపబ్లిక్ ‘సత్యమేవ జయతే’ అన్న నినాదాన్ని స్వీకరించిందని, పలు సంస్థలు, సుప్రీం కోర్టు ( యతో ధర్మస్తతో జయః ), ఆకాశవాణి ( బహుజన హితాయ బహుజన సుఖాయ ), ఎయిమ్స్ ( శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం ), ఎల్ ఐ సీ ( యోగక్షేమం వహామ్యహం ) లాంటివి ప్రాచీన సంస్కృత గ్రంథాల నుంచి అర్థవంతమైన మాటలను తమ నినాదాలుగా ఎంచుకున్నాయని తెలిపారు. 

మిగతా అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో, ఈ దేవభాషలో కూడా అలాగే ఉంటాయని తెలియజేశారు. యువతరాన్ని దీనిపట్ల ఆకర్షితులయ్యేలా అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న అభిలాషను ఈ యువ వక్త  వెల్లడించారు. నవీనతో గుడిమెళ్ళ మాధురి ముఖాముఖి నిర్వహించారు. 

**********************************