10_013 వాగ్గేయకారులు – క్షేత్రయ్య … తేనె పలుకుల పదాల కవి

 

 

క్షేత్రయ్య పదాలు దక్షిణ భారత సంగీత నృత్య సాంప్రదాయాన్ని చాలా వరకూ ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. దేవాలయాలలో ఉండే దేవదాసీలతో క్షేత్రయ్యగారికి సన్నిహిత పరిచయం ఉండేది. వీరి రచనలలో వారి ప్రస్తావన అనేక చోట్ల కానవస్తుంది. దేవదాసీలు సంగీతం, నృత్యం, కవిత్వం వంటి అనేక కళలలో ఆరితేరి ఉండేవారు. వారు కళలను ప్రదర్శించే తీరును, సాంప్రదాయాన్ని దక్షిణభారతీయ కళారీతుల్లో అనుకరించటమేకాక, గౌరవిస్తూ కూడా ఉండేవారు. ఇదంతా దేవదాసీ వ్యవస్థ రద్దు చేసేదాకా బాగా కొనసాగిందని చెప్పవచ్చు.             

 

దాదాపు జావళీలలాగే అనిపించే ఈ క్షేత్రయ్య పదాలు పదంలోని భావాభివ్యక్తిలో రాగపు ఎంపికలో ఒక అపూర్వమైన పరిణతిని తెలియచేస్తాయి. కర్ణాటక సంగీతానికి రాగమే జీవం. ” రాగము యొక్క ఉత్కృష్టత, వృద్ధి ఒకనాటిది కాదు. క్రమాభివృధి పొందినది. రాగస్వరూపమును, లక్షణమును క్షేత్రయ్య ఏర్పరిచి తీర్చిదిద్దినదనుటలో అతిశయోక్తి ఏమాత్రమును లేదు ” అని ” క్షేత్రయ్య పదములు – శృంగార రసమంజరి ” లో  పేర్కొన్నారు శ్రీ విస్సా అప్పారావుగారు. 

 

క్షేత్రయ్య పదాలకు బాణీలు ఎలా ఉండేవో ఇదమిత్థంగా తెలియదు. కానీ వంశానుసారం, పరంపరానుగతంగా పాడుకుంటూ వస్తున్న వారి వంశస్థులూ, శిష్య, పరశిష్య గణము నుంచి వాటి రూపం కొంత కొంతగా మనకు దక్కింది. చాలా పదాలకు క్షేత్రయ్యగారే పేర్కొన్న రాగాల్లో బాణీలు చేకూర్చి, స్వరపరచి నేటి గాయకులకు అందచేసిన మహావిద్వాంసులు శ్రీ మంచాల జగన్నాధరావు గారు. అన్నమాచార్య వాడుకున్న రాగాలకూ, క్షేత్రయ్యగారు సూచించిన రాగాలకూ చాలా తేడా ఉన్నట్లు తోస్తుంది. అన్నమాచార్యులవారు వాడిన రాగాలు క్షేత్రయ్యగారి కాలం నాటికి అంతరించాయి. అయినప్పటికీ, అన్నమాచార్య వాడిన అహిరి, కాంభోజి, కేదారగౌళ, ధన్యాసి, భైరవి, మాధ్యమావతి, ముఖారి, రామక్రియ ( నేటి పంతువరాళి ), శంకరాభరణం, సావేరి, సౌరాష్ట్రం వంటి రాగాలు క్షేత్రయ్యగారు కూడా వాడారు. వీరిద్దరికీ మధ్య  దాదాపు వంద ఏళ్లకు పైన తేడా ఉంది. అందుచేత, ఆ సమయంలో వీటి స్వరూపం ఎలా ఉండేదో మనకి తెలియదు. కారణం, అన్నమాచార్యులవారి కృతులను ఎవరూ వంశపారంపర్యంగా మనకు అందచేయలేదు. కేవలం రాగాలు పేర్లు మాత్రమే కనపడతాయి, కానీ ఇంకెవరూ వాటిని పాడిన దాఖలాలు లేవు. కానీ క్షేత్రయ్యగారి విషయంలో అలాకాక, వారు వ్రాసిన పదాలను ఏయే రాగాలలో పాడుకున్నారో మనకు కొంతవరకూ తెలుసు. వారు వాడిన 39 రాగాలలో కాంభోజి ఎక్కువగా కానవస్తుంది. కాంభోజి రాగం శృంగారానికి మారుపేరు. వీరు కళ్యాణి, భైరవి రాగాలను కూడా విరివిగా వాడారు. 

 

క్షేత్రయ్యగారి పదాలలో ముద్రితమైన వాటిలో వాడబడిన కొన్ని రాగాల పేర్లు. 

 1. కాంభోజి 
 2. ముఖారి 
 3. భైరవి 
 4. కళ్యాణి 
 5. సావేరి 
 6. తోడి 
 7. కేదారగౌళ 
 8. పంతువరాళి 
 9. ఘంటారవము  
 10. మోహన 
 11. యదుకుల కాంభోజి 
 12. బిలహరి 
 13. ఆనందభైరవి 
 14. మాధ్యమావతి 
 15. శంకరాభరణము 
 16. ఆహిరి 
 17. ఉసేని/హుసేని 
 18. పున్నాగవరాళి 
 19. సౌరాష్ట్ర 
 20. బేగడ 
 21. నవరోజు 
 22. సైoధవి  (సైన్ధవి)  
 23. నీలాంబరి 
 24. కన్నడ 
 25. ధన్యాసి 
 26. సురట/సురటి 
 27. అఠాణా 
 28. కాపీ 
 29. అసావేరి 
 30. సారంగ
 31. శ్రీరాగం 
 32. మారువ 
 33. నాదనామక్రియ 
 34. వసంత భైరవి 
 35. వరాళి 
 36. ఖండే 
 37. గౌళిపంతు 
 38. కేదార 
 39. గౌరీ 

ఈ పై జాబితా చూసినప్పుడు  కాంభోజి  రాగాన్ని ఎక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. కాంభోజి రాగం శృంగార ప్రధానమని అందరికీ విదితమే. ముఖారి, కళ్యాణి మరియు భైరవి రాగాలు కూడా ఎక్కువగా వాడినట్లు తోస్తుంది. క్షేత్రయ్యగారి సమయంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ రాగాలు వాడబడుతున్నట్టు, ముఖ్యంగా కూచిపూడి, తంజావూరు ప్రాంతాలలో ఇవి ఎక్కువగా లోకప్రియత చెందిన రాగాలయి ఉండవచ్చనిపిస్తుంది. క్షేత్రయ్య పదాలు కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా గానం చేసేవారట. మన్నారుగుడికి చేరువలో గల మూవనల్లూరు లో సభాపతి అనే తెలుగు నాట్యాచార్యులు ఉండేవారట. వారు ఈ పదాలను చాలా రసవత్తరంగా పాడేవారట. కానీ ఈయన 1860 ప్రాంతానికి చెందినవాడు. ఇలా వేర్వేరు సంగీతజ్ఞులు, నృత్యకారులూ ఈ పదాలను పాడుతూ ఉన్నందువలన ఇవి పరంపరానుగతంగా మనకు చేరాయనటంలో సందేహం లేదు. 

 

ఇక క్షేత్రయ్యగారికి రాగాలు, వాటిద్వారా భావాభివ్యక్తి ఏయే విధంగా చేయవచ్చునో ఎంత సంగీతానుభవం ఉన్నదో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఒకే రాగాన్ని వేర్వేరు భావాలకు ఎంత సునాయాసంగా వాడారో చూస్తే వారి రాగస్వరూప చిత్రణ ఎంత పటిష్టమైనదో తెలుస్తుంది. వీరి పదాలలో స్వర సంచారం కనీసం రెండు స్థాయిల వరకూ ఉంటుంది. సాహిత్యాన్ని చక్కగా అర్థవంతంగా తాళాన్ని బట్టి విడదీసి పాడుకునే వీలుంటుంది. సాహిత్యమూ, తాళమూ, రాగము యొక్క అద్భుతమైన మేళవింపు వీరి రచనలు. అనుపల్లవితో ప్రారంభించినా, పాదంలో భావం, తరువాత పాడే పల్లవి, తద్వారా చరణంలోకి రాగయుక్తంగా నిరాటంకంగా ప్రవహించి, గొప్ప రసానుభూతినిస్తాయి. 

 

దీనికి గొప్ప ఉదాహరణ: “అలిగితే, వాడలిగితే భాగ్యమాయే ” – గాయకులు – పద్మ విభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

 

Part 1

 

 

 

Part 2

 

 

 

క్షేత్రయ్య గారి పదాలను గురించి వ్రాయబూనినప్పుడు, ప్రముఖ కూచిపూడి నాట్యకారులు శ్రీ పసుమర్తి విఠల్ గారిని సంప్రదించటం జరిగింది. పసుమర్తి విఠల్ గారు ఢిల్లీ మరియు గురుగ్రామ్ లో కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నారు. ” క్షేత్రయ్య గారు చాలా పదాలను ఆనందభైరవి రాగంలో రచించారు. అవి ఆ రాగంలో కాక మరే రాగంలోనైనా రక్తి కట్టవు, రంజింపచేయవు. వాటిని మరే ఇతర రాగాలలోనయినా ఊహించగలమా ? అవి ఆయా రాగాలలోనే పాడాలని క్షేత్రయ్యగారికి అనిపించి, వారు అలా పాడటం కేవలం దైవసంకల్పితం అనిపిస్తుంది. వారికి లభించిన దైవకృప వలనే నేటికీ అవి అంత లోకప్రియతను కలిగి ఉన్నాయి ” అంటారు. 

 

క్షేత్రయ్యగారు చాలా యాత్రలు చేశారు. మధుర, తంజావూరు, గోల్కొండ, విజయనగర సంస్థానాలలో సన్మానాలు పొందారు. రఘునాథ నాయకుని కోరికపై ” విజయరాఘవ పంచరత్నములు ” అనే ఐదు ప్రత్యేక పదాలను వారి రాజముద్రతో రచించారు. 

 

వీరి మొదటి పదము ఆనందభైరవి రాగం, అద్దితలం లో ” శ్రీపతి ” అనే పదం. 

 

” సాధారణముగా గీతము వాద్యము చేరినప్పుడు దానిని సంగీతమునై వాడుచున్నాము. కానీ ప్రాచీన మతానుసారమున నృత్యము, గీతము, వాద్యము చేరిన గానీ సంగీతము కాదు. అట్టి  పూర్ణత గల సంగీతమునకు క్షేత్రయ్య పదములు ఉనికిపట్లు” అని పేర్కొన్నారు శ్రీ విస్సా అప్పారావు గారు. 

 

ఈ గ్రంథంలో క్షేత్రయ్య గారి గురించి ఇంకా చాలా ఆసక్తికర విషయాలున్నాయి. వాటిలో క్షేత్రయ్య పదాలను అభినయించే పధ్ధతి ఒకటి. బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఒక పదాన్ని ఉదాహరణగా ఎలా అభినయించాలో వివరించారు. నాకు నృత్యం గురించి ఏమీ తెలియదు, కానీ వీరి వివరణ చాలా ఆసక్తిదాయకంగా అనిపించి దానిని నేను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను.

 

మోహన రాగం – ఆదితాళం 

 

 1. శ్రమ హేళన విత్కరం ( వితర్కం) ఔత్యుక్యం రతులు

 

” ఒకసారికై ఇలాగైతే – నొహో! ఇదేమిటీ రతిరా? “

 

 1. ఔత్యుక్యం

 

 1. మక్కువ దీర్చరా! మా మువ్వా గోపాలా! గ్లాని, దైన్యం, చపలత

 

 1. విత్కరం (వితర్కం?), దైన్యం

 

” సొక్కియున్న నీ సొగసది ఏమిర! ”  || ఒక్కసారి|| 

 

దైన్యం, శ్రమ, వితర్కం  సొగసు శ్రమ, వితర్కం 

 

” నెమ్మొగమున నీ బడలిక లేమిరా – నీటుకాడ రొమ్ముదరే దేమిరా? “

 

ధృతి, వితర్కం 

 

” కమ్మని వాతెర కందినదేమిరా ” 

 

సుప్తి వితర్కం శ్రమ వితర్కం 

 

” కన్నుల నిద్దుర గమ్మేదేమిరా – గళమున జెమటలుగారే దేమిరా! “

 

గద్గద శ్రమ వితర్కం 

 

” తిన్నని పలుకులు బలుకవదేమిరా? “

 

జడత వితర్కం 

 

” తెలిసి తెలియకున్నా వదేమిర? ”        

 

ఔత్యుక్యం, హర్షం మోహం 

 

” ఐనాపురి ముద్దుల మువ్వగోపాల! – యేపున నుగలసితి వీవేళ “

 

ఔత్యుక్యం 

 

” మనమున నిన్నే నమ్మితి జాల “

 

విషాదం గ్లాని వితర్కం 

 

” మారుబల్కకున్నా వదియేల “

 

నాయిక సామాన్య, అతృప్త  సురతాసక్తి గల, ప్రౌఢ, హాస్యరసము.

 

పదం అంతటా తొమ్మిది భావాలయిన శ్రమ, ఔత్యుక్యం, చాపల్యం, గ్లాని, సుప్తి, జడత, దైన్యం, విషాదం అనేవి అభినయించి ప్రదర్శించాలి. హర్షం, ధృతి, హేళన, రతులు, మోహం అనే భావాలే కాక, విభావ, అనుభావ సాత్వికాభావాలు సందర్భానుసారం ప్రదర్శించాలని భరతాచార్యులవారు సమయోచితంగా చెప్పారు అనే విషయం నృత్య కళాకారులందరికీ తెలిసినదే. ఇంకా రకరకాల ఆంగిక భంగిమలను గూర్చి కూడా వివరంగా చెప్పబడింది. కానీ సంగీతపరంగా అది ఇక్కడ అనవసరం అనిపించి వివరించటం లేదు. 

 

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్షేత్రయ్య పదాల్లో కానవచ్చే పలురకాల సామెతలు ఇంకా నానుడులు. ఉదాహరణగా కొన్ని తెలియచేస్తాను. ఇవి దాదాపు రెండువందలకు పైగా ఉన్నాయి. అన్నీ కూడా అప్పటి కాలంలో వాడుకలో ఉన్న అచ్చ తెలుగులో ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవటం అంత కష్టమేమీ కాదు. వాటిలోంచి కొన్ని: 

 1. ఆడి తప్పకు దోసము 
 2. అక్కరలేని కాపురమాయె 
 3. ఇంటి దోవ తొంగిచూడడాయే 
 4. నడిగించని గొప్ప ముత్తెమాయె 
 5. కన్నీరు కావేరి కాలువ సుమీ 
 6. తలవాకిలి ఇల్లు సుమీ 
 7. సామాడి జోగివలె పోయే నా బ్రతుకు 
 8. అరటాకు ముల్లు సామ్యము
 9.  చంటి పనులు తీరిన జాళువా రవిక 
 10. అరసొంపు మాటలు 
 11. వాదించి నీ పొందు వద్దని గట్టిగ వక్కలాకులిచ్చెను
 12. ఆశించిన ఫలించే దరుదు గాదటవే 
 13. కాళ్ళ వేళ్ల బెనగుచు
 14. కనుగొన దిటవులేక 
 15. కాలమెప్పటివలె వానితోనే గూడి కాపుజెందగ  జేసెగా 
 16. మీరేమైనా నార్చెరో తీర్చేరో 
 17. వలపనే పాపము పగవారికైన గారాదనేనమంటమారితనమున 
 18. మంటమారి తనమున 
 19. కంటిరెప్పగాచిన క్రమమున బోషించితివి 
 20. ఈనిన పులివంటి కోపము 
 21. దృష్టి తాకేనమ్మలారనేనికటి తలిచితే దైవమొకటి తలచినందుకు  
 22. వలపు సిగ్గెఱుగదు 
 23. విని వినములు చేసితి 
 24. ఒకవేళ నవనీతమొక పాషాణమకట నీ చిత్తము
 25. చాలుచాలు పదివేలు 
 26. నవ్వులంట యున్నావేమో నా పద్దు చూడుమీసారి 
 27. ఈ రాయబారమెందాక  నడిపెదవే 
 28. ఆ చెలి చేతిలో ధారపోసితివి గదవే 
 29. చిటుకు మన్న కోపము సేయు 
 30. ఇన్నాళ్లు మల్లాడినదిందుకోసమా 
 31. బెల్లి వగల మాటలు 
 32. చనువులేని చోట చలమెట్ల ఈడేరు 
 33. నిలివెడు ధనము 
 34. అతడిందు లేక లోకస్తమానమైనట్లు 
 35. చొక్కుపొడి చల్లినట్లాయె 
 36. మనసు రాని పొందు మాను 
 37. పందెమాడుకొన్నారట 
 38. ఇంటికి రావద్దని పలుకరింతురటవే 
 39. పదింటిలో సగమొనరించితినమ్మా 
 40. ఎవ్వతె నిన్ను బోధించెనో 
 41. మోడి చేసుకున్నాడు మొన్నటాలనుండి 
 42. నీరూపు కనుల గట్టినట్లుండునే 
 43. ఇంట గెలిచి రచ్చ గెలువవలెను 
 44. కంచు పదను వంటి మనసు 
 45. మేకవన్నె పులివంటి చెలులే 
 46. నుడువ నోరాడదమ్మ 
 47. నూగింజనైన నాననీయరు మునిముచ్చులు కాయజుని తలిరు పాడాను కట్టెలమ్మా ఈ చెలులు 
 48. ముంచేవో  దరిజేర్చెవో 
 49. ఈ కలికాలమున నుపకారము గలదా ఎవరికైన
 50. పైడి చేతికి వచ్చినదే చాలునటవే 
 51. చేత కాసులేదుగాని చే సైగలే 
 52. అడుగులకు మడుగులొత్తిన మగువ 
 53. దేవుని మనసున మ్రొక్కితే కనుల దీవించినట్లు 
 54. వద్దనుంటే ఒక మాట వాకిటనుంటే ఒకమాట 
 55. తోటకూర దొంగవలె తొలగిపోయే వాడవు 
 56. పూచిన తంగేడు వలే 
 57. సతులనమ్మే పాపజాతి మగవారికి గతులు లేవు 
 58. మగవాని కట్టుబెట్ట మన తరము గాదె 
 59. బావిలో నీరు వెల్లువ బొయ్యినటవే 
 60. అతడెవరో నేనెవ్వరో 
 61. కన్నరు చెలులకు పానకము  కాబోలు 
 62. వ్రతము చెందిన సుఖము లేదాయేగదా 
 63. ఊరికి పోయిన మగడుఁ ఉట్టి పడ్డట్టు వచ్చి 
 64. ముద్దులేని వానితోను ముచ్చటలేలే 
 65. కొన్న మాగాణి వలే కొంగుబట్టి తీసే 
 66. అత్తకంటే మోసము అంగడి బెట్టకుము 
 67. నీళ్లలోని హోమమాయె 
 68. ఏనుగునెక్కి దిడ్డి ఈగ దూరనేలే 
 69. దొడ్డ కొంచమైనా ఏమి 
 70. కాసికాయ మధురమౌనా 
 71. పదివేల చుక్కలైనా చంద్రునికి సరివచ్చునా 
 72. ఇత్తడి సొమ్ములు హెచ్చయిన బంగారమౌనా 
 73. వానాకాలం నటి గరిక వలెను 
 74. శకునము మళ్లించవలెను

క్షేత్రయ్య గారి పదాలలో వాడిన తెలుగును  కొందరు “జాను తెలుగు” అని పేర్కొన్నారు. జాను తెన్నులు అంటే అచ్చ తెలుగు అని కూడా కొందరు భావిస్తూ ఉంటారు. సుదీర్ఘ సంస్కృత సమాసాలు, క్లిష్టమైన తత్సమ పదములు కలవకుండా, సర్వజన సామాన్యానికి ఏది సులభంగా అర్థం అవుతుందో అదే జానుతెలుగు అని తెలుస్తోంది. దీనిని బట్టి క్షేత్రయ్య పదాలన్నీ ఈ జానుతెలుగులో వ్రాయబడ్డాయని మనం భావించవచ్చు. ఈ పదాలన్నిటిలో క్షేత్రయ్యగారి భాషా స్వాతంత్య్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వేరే ఎక్కడా కానరాని స్వంత పదాలను కూడా విరివిగా వాడారు. 

 

అదేవిధంగా మధురభక్తి విధానంలో కూడా శైవశృంగారంలో శృంగారం అసత్యమని, మిథ్య అని నిరూపించటానికి ఉద్యమించినట్లు తోస్తుంది. ఇందులో విరహాన్ని ఎక్కువగా చూపినట్లు కానరాదు. శివునికై విరహోత్కంఠితయినట్లు పార్వతీ దేవిని చూపటం శివభక్తులకు ఎక్కువగా చర్చిస్తున్నట్టూ తోచదు. పార్వతిపై విరహముతో సమాధిని కోరుకున్న శివుని మనోవేదన ఎక్కడైనా చెప్పబడి ఉందా? 

 

ఉదాహరణ: 

 

ఇక్కడ ఒక పాట నాకు గుర్తుకు వస్తుంది. ఎస్. జానకి గారు పాడిన ” శివ దీక్షా పరురాలనురా, శీలమైంతయినా విడువజాలనురా “. 

 

ఇక్కడ దీనిని పేర్కొనటం ఎంత సబబో నాకు తెలీదు. కానీ విజ్ఞులకు తప్పనిపిస్తే, నన్ను మన్నించాలి. 

 

ఇదే విషయంలో క్షేత్రయ్యగారు పురుష రూపాన్ని సౌందర్యవంతంగా వర్ణించి, దానిని ముఖ్యం గావించి, స్త్రీ విరహాన్ని తమ పదాలలో అందంగా అభివర్ణించారు. మువ్వగోపాలుని సాంగత్యానికై ఆత్రుత చెందిన విరహ పరితప్త అయిన ఆత్మగా తనను తాను ఒక మధురభావంతో చెప్పుకున్నందువలన, సంగీత సాహిత్య, నృత్యాలపై మక్కువ, అభిమానం, ఆసక్తి గలవారందరికీ ఒక సులలిత మార్గాన్ని సూచించారు. ఇది సమస్త సాహిత్య, సంగీత నృత్య ప్రియులకూ అందుబాటులోకి తెచ్చిన శ్రీ విస్సా అప్పారావు గారికి, శ్రీ మంచాల జగన్నాధరావు గారికీ మరొకసారి అందరి తరఫునా నమస్సులు, నివాళులు అర్పిస్తున్నాను. 

 

 1. ” నిన్ను జూచి నాలుగైదు నెలలాయే మువ్వగోపాలా ” – పున్నాగవరాళి రాగం, త్రిపుట తాళం 

 

 

 1. ” నమః క్షేత్రయ్య సాహిత్య సాంక్లుప్త స్పష్టమూర్తయే

మువ్వగోపాలా రూపాయస్వాత్మనే రసరూపిణే: 

– జమ్మలమడక మాధవ రామ శర్మ,

నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు. “

 

 

 *******