.
అదిగో ! మనజెండా !
అల్లదిగో ! మనజెండా !
దేశభక్తు లెగరేసినజెండా !
తీయనికల పండించినజెండా !
బానిసబ్రతుకుల ముసిరినచీకటి
పటాపంచలుగ చేసినజెండా !
విశ్వశాంతిసందేశము జగతికి
వినిపించిన దిది మనజెండా !
మనభారతజాతికి నీతికి
ప్రతీకగా నిలిచినజెండా !
మనధ్యానం మనప్రాణం
మనసర్వం ఈ జెండా !
రక్తవర్ణ మది వీరచిహ్నము !
పవిత్త్రతాంకము స్వచ్ఛవర్ణము !
పచ్చనిబ్రతుకులప్రతీకగా అదె
పతాకమ్ములో పసిమివర్ణము !
ముప్పదికోటులభారతీయులను
మురిపించేమువ్వన్నియజెండా !
ధరణీచక్రము పులకరింపగా
ధర్మచక్రమును దాల్చినజెండా !
స్వతంత్రభారతసంకేతముగా
శాంతిదూత యెగరేసినజెండా !
శౌర్యధనులవిజయాంకముగా మన
శాస్త్రీజీ నిలబెట్టినజెండా !
ఈదేశప్రజబ్రతుకు పండగా
ఎఱ్ఱకోటపై ఎగిరేజెండా !
మిన్నుల రెపరెప లాడేజెండా !
కన్నుల కలకల లాడేజెండా !
కనుగొన రండీ బాలబాలికలు !
కన్నుల వెన్నెల నిండా !
అదిగో జెండా ! అంజలింపుడీ
దేశభక్తి మది నిండా !
జయ హింద్ !
జయ హింద్ !!
జయ హింద్ !!!
**************************