11_012 భక్తి విప్లవకారులు – భగవద్రామానుజులు

                                          సమతామూర్తి      

               

                 ఈ డిజిటల్ ప్రపంచంలో వేయెళ్ల కిందటి చరిత్రను మానవాళికి గుర్తు చేస్తూ మరో  వేయేళ్ళ చరిత్రను లిఖించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి. 1017 లో ప్రభవించి రమారమి 120 ఏళ్ళ వారి సుదీర్ఘ జీవన ప్రయాణంలో వారు ప్రపంచానికి చేసిన సేవలు ఏనాటికీ చిరస్మరణీయాలు. అయితే ఇటీవలి మన జీవన విధానంలో వస్తున్న అపూర్వ మార్పులు ఎంతటి ఘన చరిత్రను అయినా అవసరం కోసం తెలుసుకోవడం తప్ప దానిలో గల విలువలు, పరమార్థం, ఆ చరిత్రలో ఉన్న అనేక విషయాలు నేటికీ ఆచరించడం అత్యంత అవసరం అనే భావాలు లేకుండా పోతున్నాయి.  ఆ రకంగా మహామహులను గురించి తలచుకోవడం, వారు సమాజానికి చూపిన సన్మార్గంలో నడవడం మరచిపోయాము. అలాంటి అలవాటు మనకి నేర్పడం, భావి తరాలకు మనదైన ఘన చరిత్రను అందించడంలో భాగంగా భగవద్రామనుజుల సమ సమాజ స్ఫూర్తిని సమతా కేంద్ర నిర్మాణం ద్వారా కలిగించారు శ్రీ చిన్న జీయర్ స్వామి. 216 అడుగుల భారీ విగ్రహాన్ని పంచలోహాలతో అత్యద్భుతంగా, అపూర్వంగా, అసాధారణంగా, అనన్య సామాన్యమైన రీతిలో  స్థాపించారు. 2017 లోనే శ్రీ రామానుజుల సహస్రాబ్ది.  నాటికే ఈ స్థాపన జరగాలని శ్రీ స్వామి వారి సంకల్పం. కానీ 2022 కి అంబరాన్ని అంటే ఆనందాలతో అత్యంత శోభాయమానంగా, ప్రపంచమంతా “ఔరా” అనుకునేలా జరగాలని జగదాచార్యుల సత్సంకల్పంతో సాకారం అయింది.

ఈ  రామానుజ సహస్రాబ్ది సమారోహ సంరంభం అనే మహాయజ్ఞం 12 రోజులు మహాద్భుతంగా,  అత్యంత పవిత్రంగా, కన్నుల పండువగా జరిగింది. 1035 యజ్ఞ కుండాలను  రామాయణ కాలం నాటి పర్ణశాలలను తలపించే 144 యాగశాలల్లో ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్తిగా వైదిక ప్రక్రియలో చేయడం గొప్ప విశేషం.  మొదటి రోజు అంకురార్పణ గావించి, దేశం నలుమూలల నుండి అయిదువేల మంది ఋత్విజులు, రోజూ రెండు పూటలా పూర్ణాహుతి, చివరి రోజున అంటే 11వ రోజు ఉదయం మహాపుర్ణాహుతితో 10 రోజులు నిర్విరామంగా యజ్ఞం చేయడం ఇప్పటి తరానికి అత్యంత ఆశ్చర్యానందాలను కలిగించింది. ప్రత్యక్షంగా చూసిన భక్తులు ధన్యత చెందారు. వారికి ఒడలు పులకించి, కళ్ళ వెంట ఆనందబాష్పాలతో తరించామని అనడమే దీనికి నిదర్శనం.

ఇక ఈ మహాద్భుతమైన కార్యక్రమానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలి రావడం రామానుజుల పట్ల భక్తి, చిన్న జీయర్ స్వామి పట్ల వారికి గల గౌరవాదరాలు తెలుస్తున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద విగ్రహంగా (స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ) వాసి కెక్కిన ఈ సమతా మూర్తిని జాతికి అంకితం చేయడానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వైదిక వేషధారణతో రావడమే కాకుండా తన అత్యద్భుతమైన ప్రసంగ భాషణం మరో చారిత్రక ఘట్టం అయింది.

 ఇక ఈ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో మరో ముఖ్య విషయం ఏమిటంటే భగవద్రామానుజుల 120 కిలోల స్వర్ణ విగ్రహం. దీని ఆవిష్కరణ భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ గోవింద్ గారి కర కమలాల మీదుగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారి ప్రసంగం గొప్ప ఇతిహాసానికి నాంది పలికింది. చిన్న జీయర్  స్వామి సమతామూర్తి కేంద్రాన్ని నిర్మించడం చరిత్రలో నిలిచిపోయే మహా అద్భుత ఘట్టాన్ని రచించారని వారిని ప్రశంసించారు రాష్ట్రపతి. ఇంకా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉపరాష్ట్రపతి, గృహ మంత్రితో పాటూ ఇతర శాఖల కేంద్ర మంత్రులు, స్వ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ఎంపిలు, ఎమ్మేల్యేలు, న్యాయాధిపతులు ఇలా ఎందరో ప్రముఖుల ఆగమనంతో సమతా మూర్తి కేంద్రం అంతా క్రిక్కిరిసి పోయింది. ప్రతిరోజూ లక్షమంది భక్తులు, వచ్చిన వారందరికీ నిత్యం ప్రసాదాల వితరణ, యాగ నిర్వహణకు వచ్చిన వేల సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకు, ఋత్విజులకు, భక్తులకు మొదలైన సందర్శకులు అందరికీ ఎలాంటి లోటు పాట్లు లేకుండా 8 వేల మంది వికాస తరంగిణి కార్యకర్తలు, వైద్య సౌకర్యం కోసం 200 మంది వైద్యులు, వారి గుడారాలు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రక్షణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది విలువైన సేవలను అందించాయి నీటి వనరులు పుష్కలంగా సమకూర్చడం వెనుక శ్రీ స్వామి వారు, వారి భక్త గణం, వారి సంస్థలు అయిన  జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వికాస తరంగిణి సభ్యుల, కార్యకర్తల, ప్రభుత్వం కృషి అనన్య సామాన్యమైన రీతిలో చేసి అనేకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.

 ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులతో జరగడం మరో విశేషం.

ఇంతవరకు అపూర్వంగా, అసాధారణంగా అత్యంత పవిత్రంగా ఇంత పెద్ద ఎత్తున వైదిక కార్యక్రమం  నేటి సాంకేతిక, డిజిటల్ ప్రపంచానికి ఎనలేని ఆనందాన్ని, ధన్యతను చేకూర్చింది.

ఇంత వైభవోపేతంగా స్థాపించిన ఈ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి అన్నట్లు విశ్వ మానవాళి వీక్షించి తీరాల్సిన పుణ్యక్షేత్రం ఈ సమతా మూర్తి కేంద్రం.

ఇక ‘ రామానుజుల భక్తి విప్లవం ’ గురించి తెలుసుకుందాం…. 

భగవద్గీతలో జగద్గురువు శ్రీక్రృష్ణుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అర్జునుడంతటి వాడే కర్తవ్య విముఖుడైనప్పుడు స్వామి అర్జునికి ధర్మాధర్మాలను, మానవ జన్మ సార్థకతను, కర్తవ్యాన్ని బోధించాడు. అర్జునుని నెపంగా చూపిస్తూ సర్వమానవాళికి కర్తవ్య పాలనను, మానవుడు ఆచరించాల్సిన ధర్మాన్ని జగద్గురువుగా బోధించినా అర్జునుడు సైతం ఆ సమయానికి తనలో ఉన్న అజ్ఞానం తొలగించుకున్నా యుద్ధరంగంలోనే మళ్ళీ భవబంధాలకు కట్టుబడి, అహంకార మమకారాలకు లోనై ధర్మం తప్పి ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సకల చరాచర సృష్టి కారకుడైన పరమాత్మే స్వయంగా బోధించినా మనిషి పూర్తిగా ధర్మవర్తనుడు కాలేకపోయాడు అంటే అతిశయోక్తి కాజాలదు. మాయ మనిషిని అలా కమ్మేస్తుంది. ఆ మాయను తొలగించుకుని తన ధర్మాన్ని నిర్వర్తించడం సామాన్య మానవులందరికి సులభసాధ్యం కాదు. మహాత్ములకు, సమాజాన్ని ఉద్ధరించే మహానుభావులకు, మహర్షులకు మాత్రమే సాధ్యం.

ప్రతి యుగంలోనూ కొందరి మహానుభావుల ఆగమనం వల్ల ఈ ప్రపంచంలో ధర్మవర్తనులు సంఖ్య ఉంటూనే ఉంది. అయితే దేశ కాలాదులను బట్టి ధర్మం కొంత మారుతూ ఉంటుంది. ఆయా సమయ సందర్భాలననుసరించి సమాజోద్ధరణ గావించేవారు వారి కాలానికి తగినట్లుగా ధర్మబోధనలు చేస్తుంటారు. అయితే ఏ కాలంలోనైనా వారి సమకాలీన సమాజంలో ఉన్న దురాచారాలను ఖండించడం, సదాచారాలను బోధించడం తద్ద్వారా మానవులను ఉద్ధరించడం, నవసమాజ నిర్మాణం గావించడం అరుదుగా జరుగుతుంటాయి.

నేటి ఆధునిక సమాజానికి వస్తే అభ్యుదయ వాదుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం మన దేశం పరాయిల పాలనలోనే కొన్ని వందల సంవత్సరాలు మగ్గి ఉండడమే. మనదైన సంస్కృతి సంప్రదాయాలను మనమే కాదనుకున్నాం. ఇలాంటి తరుణంలో సమాజోద్ధారకుల సంఖ్య పెరిగి, వారి బోధనల వల్ల నేటికీ మన దేశంలో మనదైన సంప్రదాయాన్ని, నాగరికతను పూర్తిగా కాకున్నా కొంత నిలుపుకుంటున్నామనే చెప్పాలి. మ్లేచ్చుల ,పాశ్చాత్యుల సహవాసంతో ఛిన్నాభిన్నమైన  సంస్కృతిని నిలుపుకోవడం కోసం విప్లవాలు రకరకాలుగా ఉద్భవించాయి. అయితే దేశం మనదే. పాలకులు మనవారే. సంస్కృతి సంప్రదాయాలు మనవే. అయినా ఒక విప్లవం ఉద్భవించింది. మనలోనే ఉన్న తారతమ్యాలను, ఎక్కువ తక్కువలను ఆ విప్లవం అణగదొక్కింది. స్వార్థాన్ని, అసూయా ఈర్ష్యా ద్వేషాలను రూపుమాపింది. కుల, మతభేదాలను ఎండగట్టింది. భక్తి విప్లవాన్ని రగిలించి ఆ విప్లవజ్యోతితో నాటి ప్రజల మనసుల్లో అలముకున్న అంథకారాన్ని పారద్రోలింది. భక్తి జ్ఞానజ్యోతి వెలిగించి సమసమాజాన్ని స్థాపించింది. ఆ విప్లవం పేరే రామానుజుల భక్తి విప్లవం. తన భక్తి విప్లవంతో నవ్య సమాజనిర్మాణం గావించారు  భగవద్రామానుజులు.

నేటికి సరిగ్గా వెయ్యేళ్ళ క్రితమే భక్తి విప్లవాన్ని సృష్టించారు. క్రీ.శ.1017లో వైశాఖమాసం ఆర్ద్రా నక్షత్రంలో అసురి కేశవ సోమయాజి, కాంతిమతి దంపతులకు నేడు శ్రీపెరంబుదూర్ అనబడే భూతపురిలో ఒక శుభయోగంలో ఉద్భవించారు రామానుజాచార్యులు. రమారమి తన నూట ఇరువది యేళ్ళ సుదీర్ఘ జీవితంలో వారు సమాజానికి చేసిన సేవ వటవృక్షంలా వేళ్ళూనుకుని, దశదిశలా వ్యాపించి, వారి శిష్య ప్రశిష్యుల మూలంగా గత వెయ్యేళ్ళగా కొనసాగుతూనే ఉందనడంలో సందేహం లేదు. వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుడు “ఏకం సత్ విప్రాః బహుధా వదంతి” గా భాసిస్తాడు. మన మహర్షులు మానవ నైజం తెలిసి దూరదృష్టితో చూసి పరమాత్మ తత్త్వాన్ని అనేకవిధాలుగా ఆవిష్కరించారు. ఎవరే మార్గాన్ని అవలంబించినా చేరుకునే గమ్యం ఒకటేనని బోధించారు. అంతటా తానే నిండి ఉన్న పరమాత్మని దర్శించడానికి అనేక దారులను ఏర్పరచారు. ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళి పరతత్త్వాన్ని అందుకునే సౌలభ్యాన్ని వారి తపోబలంతో మనకందించారు. పరమాత్మ సగుణుడనీ, నిర్గుణుడనీ రెంటినీ చెప్పింది వేదం. అలా వచ్చిన భక్తిమార్గాలే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. అందుండి ఏర్పడిన మతాలే వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, కౌమారం, సౌరం మొదలైనవి. 11వ శతాబ్దం నాటికి సమాజంలో ఉన్న కులమత వైషమ్యాలను రూపుమాపదలిచారు విశిష్టాద్వైత మత ప్రవర్తకులు, శ్రీవైష్ణవ సంప్రదానుయాయి అయిన రామానుజులు. భక్తిమార్గంలో వారు వెలిగించిన విప్లవజ్యోతి నేటి వరకు వెలుగుతూనే ఉందనడంలో సందేహం లేదు. భగవత్సేవా కైంకర్యాలు, మంత్రోచ్చారణ, ఆలయ సందర్శనం కేవలం అగ్రవర్ణాల వారికే పరిమితమైన కాలంలోనే ఒక భక్తిచైతన్యాన్ని తెచ్చి విప్లవజ్వాలని రగిలించి సమాజోద్ధరణకు  శ్రీకారం చూట్టారు.     

భగవద్రామానుజుల జీవిత చరిత్రలో అనేక కోణాలున్నాయి. కాని ఈ వ్యాసంలో వారు గావించిన సమ సమాజనిర్మాణం కోసం వారు అనుసరించిన మార్గాన్ని, అవలంబించిన విధానాలు రేఖామాత్రంగా స్మరింపబడతాయి. రామానుజులు పసిప్రాయం నుండే సంఘంలో ఉన్న అసమానతలను చూసి కలత చెందారు. సమస్త విశ్వాన్ని సృష్తించి, తానే స్థితి కల్పించి అణువణువునా వ్యాపించి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. అంతటా తానై ఉన్న సృష్టిలో ఎక్కువతక్కువలెందుకున్నాయని ప్రశ్నించారు. అందరిలో అంతర్యామిగా కొలువున్నది శ్రీమన్నారాయణుడే అన్న విశ్వాసం నాటి సంఘంలో లేదే అని విచారించారు. ఈ అసమానతలను తొలగించాలని చిన్ననాటనే సంకల్పించారు. వేదవేదాంగాలు తరచి చూసి తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో విశేషాలు సాధించి చూపారు. విశిష్టమైన తన భావాలతో, ఉన్నతమైన తన వాదనలతో, అపూర్వమైన తన వ్యాఖ్యానాలతో తాను సంతరించిన ప్రస్థాన త్రయంతో ప్రపంచంలో ఆర్తి ఉన్న ప్రతి ఒక్కరూ భగవద్కైంకర్యానికి అర్హులే అని గోపురమెక్కి చాటారు. పృథ్వి అంతా పులకరించి పావనమయ్యేలా, పరమాత్మని చేరుకోవాలన్న తపన గల అందరికి గోప్యంగా ఉన్న అష్టాక్షరీ మహా మంత్రాన్ని బాహ్యంగా వెలిబుచ్చారు. ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవలసిన విషయం ఒకటుంది. శ్రీ వైష్ణవంలో భగవంతునికన్నా ఆచార్యులకు అత్యున్నతమైన స్థానాన్ని కొందరిచ్చారు. దీనికి ఉదాహరణగా మధురకవి ఆళ్వార్లు ప్రముఖంగా కనిపిస్తారు. అలాంటి సంప్రదాయానికి చెందిన వారై ఉండి ఆచార్యుల ఆజ్ఞను సైతం ధిక్కరించి, తాను నరకానికి పోయినా నష్టం లేదంటూ పరమగోప్యంగా ఉంచాల్సిన మహామంత్రాన్ని మానవాళి తరించాలని బహిర్గతం చేసిన రామానుజాచార్యులు భక్తి విప్లవకారులంటే అతిశయోక్తి లేదు.             

తన 32వ యేట త్రిదండం పుచ్చుకుని యతిరాజుగా స్వామి సేవకే తనను అంకితం గావించుకున్నారు. అద్వితీయమైన తన వాక్పటిమతో ప్రజల్లో భక్తి చైతన్యం గావించి జనమంతా “రామానుజ యతిభ్యోనమః” అంటూ వందలాదిగా శిష్య ప్రశిష్యులు ఆయన వెనక నడిచారు. దేశమంతటా పర్యటించి తన ప్రవచనామృతంతో అనేకమందిని తన భక్తులను చేసుకున్నారు. నేటికీ బీహారు లాంటి ప్రదేశాలనుండి భక్తులు సహస్రాబి ఉత్సవాల్లో పాల్గొని ఆచార్యులను సేవించుకుంటున్నారు. అక్కడ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు వాడవాడల జరుగుతున్నాయని వచ్చిన భక్తులు చెబుతున్నారు. యతిరాజు అయ్యాక అనేక ఆలయాల్లో వివిధ ఉద్ధరణలకు, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామి సృష్టిలో నిమ్నకులాలు, అగ్రకులాలు ఏవీ లేవంటూ అందరూ అ స్వామి సేవకు అర్హులేనంటూ వారిని ఆలయప్రవేశం చేయించడమే కాకుండా ఆలయాల్లో వివిధ కైంకర్యాలకు కూడా నియమించిన అభ్యుదయవాదులు. శ్రీరంగం లాంటి మహా ఆలయాల్లో ఉన్న అవకతవకలను కడిగేసి సరైన పాలనా సంరక్షణను ఏర్పాటు చేసిన పరమభాగవతోత్తములు. అంతటా, అందరిలో పరమాత్మని దర్శించమన్నారు. సంప్రదాయవాదుల ఆగ్రహానికి గురైనా, వారిని కూడ తన దారిలోకి తెచ్చి సమసమాజ స్థాపన 11వ శతాబ్దిలోనే గావించిన మహా మహిమాన్వితులు భగవద్రామానుజులు. శ్రీరంగనాథుడే అబ్బురపడి వరం కోరుకోమన్నాడు. అప్పుడు తనతోపాటూ తన సంబంధీకులందరికీ మోక్షాన్ని అనుగ్రహించమని వరమడిగిన పరమ భాగవతోత్తముడు. కోరుకున్న వరంలో కూడా కించిత్ స్వార్థానికి తావియ్యని నిస్వార్థ జగదాచార్యులు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకుంటున్న రామానుజులను చంపడానికి ప్రయత్నాలు జరిగినా కూడా మానవాళిని ఉద్ధరించే విషయంలో ఎంతమాత్రం రాజీ పడని అత్యున్నతమైన సంఘసంస్కర్త. తాను చేసిన మార్పులు అనాదిగా కొనసాగి మానవాళి అంతా కులమత భేదాలు లేకుండా, అసమానతలను తొలగించుకుని శ్రీమన్నారాయణుని సకల సృష్టిలో అందరూ సమానంగా జీవించాలని 74 సింహాసనాలను ఏర్పరచారు. వాటికి అధిపతులుగా తన శిష్యగణాన్ని నియమించారు. తనతోనే ఈ భక్తి చైతన్య ఉద్యమం అంతం కాకుండా సమాజమంతా చల్లగా ఉండాలని, ఒకరినిఒకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి జీవించి స్వామి సేవలో తరించాలని ఆచార్య పరంపరని స్థాపించారు. వారి దూరదృష్టికి అందరం కైమోడ్పులర్పిద్దాం. భగవద్రామానుజుల సమానత్వ భావాలను ఔపాసన చేస్తూ వారు చూపిన దారిలో ధర్మమార్గంలో నడుస్తూ, మానవత్వంతో మెలుగుతూ కలిసి నడుద్దాం. ఒక్క సహస్రాబ్దికే  రామానుజుల సిద్ధాంతాలు పరిమితం కాకుండా ఆచంద్రతారార్కం, సృష్టి ఉన్నంతవరకూ రామానుజాచార్యుల సిద్ధాంతాలను మానవాళి ఆచరించాలని ప్రార్థిస్తూ….  

పాఠకులందరికీ భగద్రామానుజుల సహస్రాబ్ది శుభాకాంక్షలతో…

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾