13_007 చిన్ననాటి జ్ఞాపకాలు

   “ పెదనాన్న గారూ! రామయ్య తాత గారి సంతానంలో పోయిన వారు పోగా, మిగిలిన వారిలో పెద్ద వారు మీరు. ఆ తర్వాత మా నాన్న మోహన్ మాత్రమే. జనవరి ఒకటవ తేదీ కి మీరు మా ఊరు రావాలి. మీరు వస్తానంటే రామయ్య తాత గారి సంతానం అందరినీ పిలుస్తాను. మన కుటుంబం లోని అందరమూ కలుసుకుందాం ” అని సురేష్ అన్నాడు.

  “అలాగే” అన్నాడు శివరావు.

    జనవరి ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటలకు బంధువులందరూ సురేష్ ఇంటిలోని విశాలమైన హాలు లో సమావేశ మయ్యారు. అందరూ ఒకరిని ఒకరు ఆనందంతో పలుకరించుకున్నారు. ఆ ఊరిలోని సురేష్ స్నేహితులు కొందరు వచ్చారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ, టిఫిన్లు ముగించారు.

   కొందరు శివరావు తో “ మీరు మా అందరి లో పెద్దవారు. ఎమ్.ఏ, పిహెచ్. డి చదువుకుని పెద్ద ఉద్యోగం చేసిన వారు. ముందుగా మీరు మీ జీవితంలో మరువలేని చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పండి ” …అన్నారు.

“ 1949 వ సంవత్సరంలో పెద్ద ఉప్పెన గాలి వచ్చింది. అంటే తుఫాను లాంటిది. మా ఇల్లు పెద్ద మండువా ఇల్లు. ఇల్లు రోడ్డు కంటే పల్లముగా ఉండడంవల్ల ఇంటిలోకి నీళ్ళు వచ్చాయి. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లోనుండి బయటకు వెళ్లి చూస్తే, మా చిన్నాన్న గారి ఇంటిలో నారింజ చెట్టు పడిపోయింది. కాయలన్నీ రాలిపోయాయి.

చెరువు గట్టు వైపు చూస్తే, చెట్ల కొమ్మలు విరిగి నేల మీద పడి ఉన్నాయి. కాకులు గుట్టలుగా చచ్చిపడి ఉన్నాయి. ఎన్నో జంతువులు చచ్చిపోయాయి.

పేదవాళ్ళ ఇళ్ళ మీద ఉన్న తాటాకులు ఎగిరిపోతే, వాళ్ళు ధనవంతుల ఇళ్లకు చేరుకుని ఆశ్రయం పొందారు. పొలాలలో ఉన్న కొందరు మనుషులు తాటి చెట్లను పట్టుకుని చనిపోయారని నాన్న చెప్పారు.

మరునాడు నేను నిద్ర లేచిన సమయానికి, పెద్దక్క, రెండవ అక్క ఏడుస్తున్నారు. పెద్దక్క చిన్న కూతురు రెండు నెలల పాప కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఆడుకుంటుంటే, పైన సరంబీ మీద అలికిన మట్టి పెచ్చు ఊడి పాప మీద పడింది. దానితో ఆ పసిపాపలో చలనం లేదు. ఆ పాప చనిపోయిందని వాళ్ళు ఏడిచారు. కాసేపటికి ఆ పాప తేరుకుంది.

సరంబీ కి మెత్తిన మట్టి పెచ్చు అంటే… మనం రోజూ వాడని నీళ్ళ కాగులు, కళాయిలు, బిందెలు, అన్నీ ఎలిసె ( ఇప్పటి లాఫ్ట్ లాంటిది ) కట్టి దాని మీద పెట్టేవారు. ఎలిసె అంటే వరసగా వాసాలు పేర్చి మేకులు కొట్టేవారు.

   దానికి కింద పక్క, పై పక్క మట్టితో మెత్తే వారు. తరువాత పేడతో అలికేవారు. తుఫాను వల్ల నీరు కారి మట్టి తడిసి పెచ్చులు రాలతాయి. కాకపోతే ఆ పెచ్చు రాలి చిన్న పాప మీద పడింది.

మా ఊరికి మా చిన్నతనంలో మట్టి రోడ్డు ఉండేది. మా ఊరి నేల రేగడి నేల అవడం వల్ల, వర్షం వస్తే బురద బురదగా ఉండేది. చిన్న పిల్లలం వర్షం వస్తే ఇంటిలోనే ఉండేవాళ్ళం.

నాకు 9 సంవత్సరాల వయసు లో మాఊరికి కంకర రోడ్డు వేయడానికి రోడ్డు రోలర్ వచ్చింది. మా స్నేహితులం అందరం దానిని ఆనందంగా, ఆశ్చర్యంగా చూసేవాళ్ళం.

మా ఇంటిలో మా నాన్నగారు పండుగలు బాగా చేసేవారు. వినాయక చవితి నాడు రకరకాల పూలు, చెరువులో నుండి తామరాకులు, తామర పూలు, కలువ పూలు తెప్పించేవారు.

పాలవెల్లిని కడిగి పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, దానికి పూల దండలు వేలాడదీసేవారు. చక్కగా అలికి ముగ్గు పెట్టిన ప్రదేశంలో, శుభ్రంగా కడిగిన పీట పెట్టి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేవారు.

ఆ పీట మీద వినాయకుడి పటం పెట్టేవారు. దానిపైన అందంగా అలంకరించిన పాలవెల్లిని అమర్చేవారు. రకరకాలైన పత్రి, పూలు, పండ్లు, అమ్మ వండిన పిండివంటలు పెట్టీ, వినాయకుని పూజించేవారు.

వినాయక వ్రతం పుస్తకం తీసుకుని శ్లోకాలను రాగయుక్తంగా చదివి, కథ చదివేవారు. పిల్లలం మా క్లాసు పుస్తకాలు తీసుకుని వెళ్లి వినాయకుని దగ్గర పెట్టేవారం. మాకు బాగా చదువు రావాలని దణ్ణం పెట్టుకునే వాళ్ళం. మా నాన్న గారు మా తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించేవారు. ఆ రోజు చంద్రుని చూడవద్దని చెప్పేవారు.

దసరా:- ఆశ్వయుజ మాసం లో దేవీనవరాత్రులు చేస్తారు. దుర్గాదేవిని ఆరాధిస్తారు. దశమి నాడు దసరా పండుగ చేస్తారు. మా స్కూలు పిల్లలము, మాస్టార్లు కలిసి మా స్కూలు పిల్లల ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం.

పిల్లలందరం… అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అని పాడేవాళ్ళం. ఆ ఇంటి యజమానులు మాస్టార్లకు డబ్బు, పిల్లలకు బెల్లం కలిపిన మరమరాలు, శనగపప్పులు పెట్టేవారు. పిల్లలందరం ఆనందంగా తినేవాళ్ళం. మా పిల్లల ఆనందం వర్ణనాతీతం.

దీపావళి : ఊరందరు దీపావళి నాడు చీకటి పడగానే, దీపాలు వెలిగిస్తారు. ఇంటిలో, ప్రహరీ గోడ మీద దీపాలు వరుసగా పెడతారు. పిల్లలు టపాకాయలు కాల్చుకుంటారు.

గోంగూర మొక్కలు పీకిన తర్వాత గోంగూర ఆకు కోసుకుని, కాడలను నీటిలో కొంతకాలం నానపెడతారు. ఆ కాడల నుండి నార తీసి, కాడలను బాగా ఎండపెడతారు.

ఎండిన గోగు కాడలను కట్టగా కట్టి,  చివర నిప్పు అంటించి గిరగిర తిప్పుతూ దిబ్బు దిబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగులచవితి అని పాడేవారు.  

రైస్ మిల్లులో వచ్చే మడ్డి ఆయిల్ తో పాత బట్టను తడిపి, దానిని ఒక ఇనుప తీగకు చుట్టి, చివరన నిప్పు అంటిస్తే పెద్ద మంట మండుతుంది. దానిని పెద్ద పిల్లలు పోటీ పడి గిర గిర తిప్పేవారు. పిల్లలకు పెద్దలకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం.

సంక్రాంతి: రైతులకు ఇది ముఖ్యమైన పండుగ. ధనుర్మాసం మొదలవగానే ఆడపిల్లలు ఇంటిముందు పెద్ద ముగ్గులు వేయడం మొదలుపెడతారు.

కన్నెపిల్లలు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి, వాటిని పసుపు, కుంకుమ పూలతో అలంకరించి, గొబ్బెమ్మలను ముగ్గులలో పెడతారు.

హరిలో రంగ హరి అని పాడుకుంటూ హరిదాసులు ఇంటింటికీ వస్తారు. పిల్లలు వారికి బియ్యం ఇచ్చి పంపుతారు.

డూ డూ డూ డూ బసవన్న అంటూ గంగిరెద్దులను తోలుకుని వస్తారు. వారికి బియ్యం ఇస్తే, పాత బట్టను ఇమ్మని అడుగుతారు. రైతులు లేదనకుండా ఇస్తారు.

ఆంబ పలుకు జగదంబ పలుకు అంటూ జంగం దేవరలు వస్తారు. వారికి బియ్యం పోసి పంపుతారు.

ఇల్లంతా శుభ్రం చేసి పాత వస్తువులన్నిటిని, భోగి పండుగ నాడు భోగి మంటల్లో వేస్తారు. ఆడపిల్లలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆరోజు ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి దేవుని పూజించిన తరువాత తీపి పదార్థాలు తింటారు. ఆ సాయంత్రం పసి పిల్లల తలలపై భోగిపళ్లు పోస్తారు.

సంక్రాంతి: ఉదయం లేచి ఇల్లు వాకిలి ఊడిచి నీళ్ళు జల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. కొత్త బియ్యంతో పరమాన్నం, పులిహోర, గారెలు, బూరెలు వండుతారు. దేవుడికి పూజ చేసి, కొబ్బరికాయలు కొట్టి, పిండి వంటలు నైవేద్యం పెట్టి, హారతి ఇస్తారు. అందరూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. తర్వాత భోజనం చేస్తారు. ఆ రోజు ఇంటిలో పాలేరుకు చాకలికి మంగలికి ఇంటికొచ్చిన పేదవాళ్ళకు పిండి వంటలు పెట్టి పంపిస్తారు.

మగవాళ్ళు కోడి పందాలకు వెడతారు.

కనుమ పండుగ అంటే పశువుల పండుగ. ఆ రోజు ఉదయం గొడ్లపాకలు ఊడిచి నీళ్ళు జల్లి ముగ్గులు పెడతారు. పశువులను కడిగి, వాటి కొమ్ములకు పసుపు రాసి, పూల దండలు చుడతారు. మెడలో గంటలు కడతారు. వాటిని ఊరంతా తిప్పుతారు.

ఆ రోజు కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పందేలు వేస్తారు.

****

   సోమయాజులు మాస్టారి ప్రైవేట్ స్కూల్లో నేను 6వ తరగతిలో చేరాను. ఒకరోజు మాస్టారు నాతో… “ నీవు మీ అమ్మ పోలిక. తల్లి పోలిక ఉన్న మగ పిల్లలు, తండ్రి పోలిక ఉన్న ఆడపిల్లలు అదృష్టవంతులు అవుతారు. నీవు మీ అమ్మ పోలిక కాబట్టి అదృష్టవంతుడివి అవుతావు ” అని దీవించారు. ఆ దీవన సఫలమైంది.

నేను బాగా అల్లరి చేసేవాడిని. మాస్టారు నాతో గోడ కుర్చీ వేయించేవారు.

పది సంవత్సరాలు దాటిన మగ పిల్లలం, అరిగి పోయి తీసివేసిన టైర్ల తో ఆడుకునే వాళ్లం. టైరు నేల మీద పడకుండా ఎవరు ఎక్కువ దూరం నడుపుతారోనని పోటీ పెట్టుకుని ఆడేవాళ్ళం.

అంతే గాక గోళీలు, కోతి కొమ్మచ్చి, చెడుగుడు, కర్రా బిళ్ళ, కోకో, బచ్చాలాటలు ఆడుకునేవాళ్ళం.

నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మా పెదనాన్నగారి పాలేరు ( నౌకరు ) తల మీద తిరుగలి లోని ఒక రాయి మాత్రమే పెట్టుకుని వెళుతున్నాడు. నన్ను చూసి శివయ్యగారూ బాగున్నారా? అని నవ్వాడు.

నేను సిగ్గుతో పాలేరుకు చక్కిలిగిలి పెట్టాను. పాలేరు కిలకిల నవ్వుతూ, బ్యాలెన్స్ తప్పి అతని తల మీద రాయి నా తల మీద పడింది. నా తల పగిలి రక్తం వచ్చింది. వెంటనే ఏడుస్తూ ఇంటికి వెళ్ళి,అమ్మనాన్నలకు విషయం చెప్పాను.

వారు మంగలిని పిలిపించి నాకు బోడిగుండు చేయించారు. వైద్యం చేయడానికి ఆ రోజుల్లో మా ఊరిలో డాక్టరు లేడు. పిచ్చి తులసి చెట్టు ఆకు తెప్పించి దాని రసం తీసి తల పగిలిన చోట ఆ రసం రాసి, దాని మీద పిచ్చి తులసి ఆకు పెట్టి కట్టు కట్టారు. కొన్ని రోజులకు నా తల మీద గాయం మానింది. కానీ ఆ జ్ఞాపకం నా మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది.

మా ఊరిలో హైస్కూల్ లేకపోవడం వలన పక్క ఊరి తమిరిశ హైస్కూల్లో, మా అన్న ప్రసాద్ చదువుతూ ఉండేవాడు. నన్ను కూడా ఆ హైస్కూలు లో 8వ తరగతి లో చేర్చాడు. మేము పక్క ఊరికి వెళ్లాలంటే కాలువ దాటి వెళ్ళాలి. కాలువ ఈ ఒడ్డు నుండి అవతలి వైపుకు వెళ్లాలంటే, కాలువ మీద తాటి బొంద వేసేవారు. వర్షాకాలం కాలువ నిండుగా నీటితో ప్రవహిస్తున్నపుడు, తాటి బొంద మీద నడవాలంటే భయం వేసేది. పిల్లలం ఒకరి చేయి మరొకరు పట్టుకుని కాలువ దాటే వాళ్ళం.

ఆ తర్వాత సంవత్సరం ప్రసాద్ అన్న గుడివాడ హైస్కూల్లో చేరాడు. నా తమ్ముడు మోహన్ నేను చదివే తమరిశ హైస్కూల్లో చేరాడు.

మా పొలం గట్ల మీద మా నాన్న బీర, బెండ మొక్కలు నాటేవారు. రోజూ సాయంకాలం స్కూలు నుండి వచ్చేటప్పుడు, నేనూ మోహన్ బీర, బెండ కాయలు కోసుకుని, చేను గట్టు మీద ఉన్న పచ్చగడ్డి కోసుకుని మూటలు కట్టుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. వర్షా కాలంలో ఒక రోజు తాటి బొంద దాటుతూ, కాలు జారి మోహన్ కాలువలో పడ్డాడు. నేను వాడిని లేపి, పచ్చగడ్డి మూట వాడి తలపైన పెట్టాను.

సెలవు రోజుల్లో మా ఊరి కాలువలో మా స్నేహితులు అందరం ఈత కొట్టే వాళ్ళం. పాలేరు రాకపోతే, మా గేదెలను తోలుకుని కాలువ గట్టుకు వెళ్లి, గేదెలను కడిగే వాళ్ళం. గేదెల మీద స్వారి చేసే వాళ్ళం, వాటిలో కూడా పోటీలు పెట్టుకునే వాళ్ళం.

మా పొలంలో తాటి చెట్లు ఎక్కువగా ఉండేవి. మా పెద్దక్క పిల్లలను తీసుకుని మా ఊరు వచ్చింది. వారికి తాటి ముంజలు పెట్టాలని, నేను మా తమ్ముడు పొలం వెళ్ళాము.

తాటి చెట్టు ఎక్కి కొన్ని గెలలు కోశాను. ఆఖరి గెల కోస్తుంటే కత్తి పొరపాటున నా ఎడమ చేతి వ్రేలి మీద పడి తెగి రక్తం కారింది. ఆ వ్రేలి కి నీటిలో తడిపిన చిన్న గుడ్డ పీలిక చుట్టాం. ఇంటికి వచ్చిన తర్వాత అక్క నన్ను చూసి బాధపడింది. అమ్మ నీకు తొందర ఎక్కువ అంటూ తిట్టింది.

ఇవీ నా చిన్ననాటి జ్ఞాపకాలు ” అంటూ శివరావు గారు ముగించారు.

“ తాత గారూ! మీ చిన్ననాటి జ్ఞాపకాలు మా ఊహకు అందని విధంగా ఉన్నాయి. ఎంతో బాగున్నాయి. మీ జ్ఞాపకాలను ఒక కథగా వ్రాసి పెట్టండి. అది చదివి భవిష్యత్తు తరాల వారు మీ కాలపు పల్లెటూరి జీవన విధానం గురించి తెలుసుకుంటారు ” అని సంతోష్ అన్నాడు.

” అలాగే ” అన్నారు శివరావు.

***************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page