11_004 హాస్యగుళికలు – భామా కలాపం

 

 

ఆరోజు ఉగాది పండుగ. తెలుగువారందరికీ ఎంతో అపురూపమైన పండుగ. ఆనందోత్సాహాలు వెల్లివిరిసే పండుగ. కొత్త బట్టలు కట్టి, పిండివంటలు దట్టించే పండుగ. కూతుళ్ళు, అల్లుళ్ళు, అయినవారందరూ వచ్చి జరిపించే పండుగ. బ్రహ్మంగారి (చేత) పంచాంగ శ్రవణం విని ఆనందించే పండుగ.

 

       అందరిళ్ళలోలా కాకుండా రామారావు గారింట్లో మాత్రం అన్ని పండుగలు వేరేగా ఉంటాయి. ఉగాది పండుగైతే మరీ ప్రత్యేకం. ఆరోజు రామారావు గారి భార్య భద్ర పంతులుగారి పంచాంగ శ్రవణం బదులు తన పంచాంగం చదివేస్తుంది. ప్రొద్దున్నే లేచి మొదలెట్టేస్తుంది.

      “ఈరోజు పండుగ కదా! సోఫాలో తాపీగా ఎస్వీ రంగారావు లాగా కూర్చొని సిగరెట్ తాగకపోతే కాస్త నాకు పనుల్లో సాయం చేయొచ్చుగా! అయినా మిమ్మల్నని ఏం లాభం? ఇదంతా నా ఖర్మ. హాయిగా ఆ పెనుగొండ సంబంధమో, బొబ్బర్లంక సంబంధమో చేసుకుని ఉంటే ఆస్తికి ఆస్తి, సుఖానికి సుఖంగా ఉండేది! దర్జాగా రాణీ లాగా నేను కూడా కాలు మీద కాలేసుకుని కుర్చీల్లో కూర్చుని ఉండేదాన్ని.

          ” ఏమిటే నీ సొద పండుగ నాడు కూడా! నిజమే. నీ పెనుగాలి తత్వానికి ఆ పెనుగొండ సంబంధం చేసుకునుంటే నీ దెబ్బలకి వాడికీపాటికి ఒళ్ళంతా బొబ్బర్లెక్కేవి. బతికిపోయాడు. నోరు మూసుకొని వెళ్ళి పని చూడు.”

         “ఆఁ చూస్తా! చూస్తా! పెళ్ళికి ముందర నుంచే అసలు నేను మొత్తుకుంటూనే ఉన్నాను. పెళ్ళికి చూడవలసినది మీదీ, నాదీ జాతకం కాదు, మీ అమ్మదీ, నాదీ అని. నామాట వినిపించుకుంటేగా. అందుకే అందుకే సింహ లగ్నంలో పుట్టిన ఆవిడకి మేష రాశిలో పుట్టిన నేను కోడలినయ్యాను. ఇంక మీ చెల్లెలు? రాక్షస గణంలో పుట్టింది! నన్ను తక్కువ కాల్చుకుతిందా!? ఇదంతా మీ అమ్మగారి నవగ్రహ పూజా మహిమ. చక్కగా విఠలాచార్య సినిమాలో కాంతారావు లాగా వచ్చి ఏ హీరోనో ఎగరేసుకుపోతాడనుకుంటే….

        “ఆపవే, ఇక చాలు! ముందు ఉగాది పచ్చడి చెయ్యి. బ్రహ్మంగారు వచ్చే వేళయింది.”

       “ఏరోజు మిమ్మల్ని కట్టుకున్నానో ఆరోజే నా జీవితంలో చేదు, వగరు ప్రవేశించాయి. తీయగా చెరుకురసంలా ఉన్న నా జీవితం – చప్పగా పోపు లేని చారులా తయారైంది. ఇక అత్తా ఆడపడుచుల మాటలే కారాలు, ఉప్పులు, పులుపులూ. ఇంక ఉగాది పచ్చడి ఎందుకు లెండి!”

       “సరే, ఆ పచ్చడేదో నేనే చేస్తాను గానీ వంటయినా చేస్తావా లేదా?”

       “అమ్మాయిలు హస్త, చిత్త, అబ్బాయి భరణి బజార్ కి వెళ్ళారా కూరలకని? వాళ్ళు రాగానే వంట మొదలెడతాను.” అని, రామారావు గారు గదిలోకి వెళ్ళగానే ఈవిడ ఉగాది పంచాంగం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. “లక్షణంగా భరణీ నక్షత్రంలో పుట్టాడు, ధరణిని ఏలతాడనుకుంటే “ధరణి” అనే అమ్మాయిని బాగానే ఏలుకుంటున్నాడు. మొన్న దాన్ని సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు.

         “ఇక ఆడపిల్లలైనా చెప్పిన మాట వింటారా అంటే అదీ లేదు! అదేమి జాతకమోగానీ ఆ హస్త హస్తంలో డబ్బే నిలవదు! మంచినీళ్ళ లాగా ఖర్చు పెడుతుంది. ఇక ఆ చిత్త చిత్తమొచ్చినట్టు ఒకరోజు మాల్ అంటుంది, ఇంకొకరోజు సినిమా హాల్ అంటుంది. బాల్ రూం డాన్సులు నేర్చుకుంటానంటుంది. ఏ కోశానా ఆడదాని లక్షణాలే లేవు. నా కడుపున ఎట్లా పుట్టిందో!

         “ఇక నాకెందుకీ పంచాంగ శ్రవణం! రాజ్య పూజ్యాలకంటే అవమానాలే ఎక్కువ. అది ఆ బ్రహ్మంగారి ద్వారా వినడమెందుకు,  డబ్బు దండగ తప్ప!”

        “నీ పరధ్యానం తగలెయ్య! పిల్లలొచ్చి అరగంటైనా ఇంకా వంటే మొదలెట్టలేదు. పండగ పూట పస్తేనా?” అని పెళ్ళాం మీద అరిచి తానే నడుం కట్టి గంటలో వంట చేసి గంట కొట్టేశాడు రామారావు. ఇంతలో హడావిడిగా బ్రహ్మంగారు రానే వచ్చారు!!!

       బ్రహ్మంగారిని చూడగానే భరణి, చిత్త, హస్తలు స్వాగతం పలికారు. రామారావు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. పంచాంగ శ్రవణం అయ్యాక, “కాస్త మా పిల్లల జాతకాలు గూడా చూడండీ.” అని అర్థించాడు రామారావు పంతులుగారిని.

       “దానికేం భాగ్యం? అలాగే!” అని ముందుగా “చిత్త” జాతకం చూశారు. చూడగానే, ఈ పిల్ల తన ఇష్టం వచ్చినట్లు తన మనసుకి నచ్చిందే చేస్తుందనీ, పెద్దలంటే లెఖ్ఖ లేదనీ అర్థమైంది ఆయనకి. కానీ ఆ విషయం సూటిగా ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నారు.

       “ఏమిటి పంతులుగారూ, ఆలోచిస్తున్నారు?? ఏదైనా సమస్యా? అంతా సవ్యంగానే ఉంది కదా?” అని అడిగింది భద్ర.

   “అబ్బే అదేం లేదమ్మా. దివ్యంగా ఉంది జాతకం! మంచి భర్తే వస్తాడు.” అన్నారు.

   “రాకపోతే నేనూరుకుంటానా? రప్పిస్తాను! ఇప్పటికే అమ్మాయి రూపురేఖలు చూసి బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయి.”

     “కానీ ఆ వచ్చినవి వచ్చినట్లే వెళ్ళిపోతున్నాయి. అవును మరి! మా ఆవిడకి వాడవాడలా ‘గుండమ్మ కథ’లో  సూర్యకాంతమంత పేరుంది.” అనుకున్నాడు రామారావు మనసులో.

     ఇక రెండో అమ్మాయి ‘హస్త’ జాతకం చూసి, “ఈ అమ్మాయి హస్తంలో డబ్బు నిలిచే ప్రసక్తే లేదు. ఖర్చు బాగా చేస్తుంది. అవును గానీ అమ్మా! పిల్లలకి ఈ పేర్లు పెట్టారేమిటి?” అని అడిగారు పంతులుగారు భద్రని.

     “అసలు మేము వీళ్ళకి నామకరణమే చేయలేదు. కాస్త పెద్దయ్యాక వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలని బట్టి పేర్లు పెట్టాం కరెక్ట్ గా! పెద్దది ‘చిత్త’ చిన్నప్పట్నుంచీ అంతే. చాలా choosy. తనకి నచ్చిన వాళ్ళతోటే స్నేహం, మాటలు. దానికి నచ్చింది… బొమ్మ దగ్గరి నుంచి ఏదైనా సరే.. కొనిపెట్టకపోతే అరిచి గీ పెట్టేది. దాని పేచీకి భయపడి అడిగినదల్లా కొనిపెట్టేవాళ్ళం. అందుకే దానికి ‘చిత్త’ అని పేరు పెట్టాం.

      “ఇక రెండోది ‘హస్త’. చేతుల్లో ఏవీ నిలిచేవి కావు! అన్ని వస్తువులూ చేత్తో పట్టుకుని కిటికీలోంచి బయటికి విసిరేసేది లేదా విరిచేసేది. ఇవి చాలవన్నట్లు పక్కింటి పిల్లల్ని కొట్టడం, నెట్టడం చేసేది. ఇది పెద్దయితే మేరీ కోమ్ లా మన దేశానికి పేరు తెచ్చే Boxer అవుతుందని ‘హస్త’ అని పేరు పెట్టాం.

       “ఇక మా అబ్బాయి ‘భరణి’ చాలా బుద్ధిమంతుడు. అల్లరే చేసేవాడు కాదు. వాడి నక్షత్రం ‘భరణి’ అందుకని వాడికాపేరు. ఏమంటారు, పంతులుగారూ? మా పిల్లల పేర్లు వెరైటీగా లేవూ?” సంబరంగా అడిగింది భద్ర.

     “నూటికి నూరు పాళ్ళూ కరెక్ట్ గా పెట్టారమ్మా పేర్లు.” అని పైకి అని, “వీళ్ళ సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది. పండగ పూట నీ మూడ్ పాడు చేయడమెందుకు? నిజం చెప్తే ఈపూట నాకు భోజనం కూడా పెట్టవ్.” అనుకున్నారు పంతులుగారు.

      భోజనాల తరువాత, “అమ్మా, ఇక వెళ్ళొస్తాను.” అని బయలుదేరారు బ్రహ్మంగారు. ఆయనను సత్కరించి కాళ్ళకి దండం పెట్టి “నాకు భర్త రత్న’ గాని కనీసం “భార్యా బాధితుడు” అన్న బిరుదు గానీ రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.” అని మనసులోనే అనుకున్నాడు రామారావు.