10_017 బోట్స్‌వానా లో ఉగాది

.

‘ బోట్స్‌వానా ‘ ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశం. సౌత్ ఆఫ్రికా నమీబియా, జాంబియా, జింబాబ్వే ల మధ్య ఉంది. డైమండ్ గనుల సంపదతో అలరారుతున్న దేశం. “ గేబరోన్ ” ముఖ్య పట్టణం. దీన్ని వాడుకలో ‘ గాబ్స్ ’ అనీ, ఆ దేశ ప్రజల భాష సెట్స్‌వానా ( Setswana ) లో హేబరోని ( Habarony ) గా ప్రసిద్ధి. అటువంటి దేశానికి, మన దేశంలోని ఇండియన్ రైల్వే నుంచి బోట్స్‌వానా రైల్వేకి రైట్స్ ( RITES ) సంస్థ ద్వారా కొంతమంది రైల్వే లైన్ పనుల నిమిత్తం 1989 నుంచి 1994 వరకు పంపబడ్డారు. అందులో సివిల్ ఇంజనీర్ శ్రీ మోహన్ ఒకరు.

నేను వారితో కలిసి ఎక్కువ పరిచయం లేని ఆ దేశంలో అయిదారు సంవత్సరాలు గడిపాను. చాలామంది మన దేశస్థులు అక్కౌంటెంట్స్ గా, మరికొందరు వ్యాపార నిమిత్తం వెళ్ళి నిలదొక్కుకున్న వారిని కలిసాము. ఇంగ్లీష్ వాడుక భాషగా నిలిచిన దేశం కనుక ఇబ్బంది కలుగలేదు.

మన దేశంలోని వాతావరణ మార్పులకి అంటే సీజన్స్ కి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. మన వేసవి అక్కడ చలికాలం లాగ. అక్కడ కరెన్సీ, డబ్బుని ‘ పూలా ’ ( Pula ) అంటారు. మమ్మల్ని అందరూ “ ఊ ! పుల్లలు ఏరుకురండి ” అని ఆట పట్టించారు.

బ్రిటిష్ వారి నుంచి 1966 లో వారికి స్వాతంత్ర్యం వచ్చింది. ‘ బీఫ్ ’ ఎగుమతి, orapa, jwaneng అనే చోట డైమండ్ గనుల వలన దేశంలో ఆర్థిక పరిస్తితి బాగుండేది. బాగా చదువుకునే పిల్లల్ని లండన్ పంపించి చదివించుకునేవారు.

అక్కడ మన దేశస్థులు కలుసుకునేందుకు “ హిందూ టెంపుల్ ” ఉంది. ప్రతివారం మన తెలుగు వాళ్లందరం కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఉగాదికి.

 అంతవరకు కొద్దిమంది కలిసి పండగలు చేసుకునేవారు. కానీ మేము ఉగాదికి భజన కార్యక్రమం మొదలు పెట్టాము. మొదటిసారిగా భజన పద్ధతిగా అంటే – గణేశ ప్రార్థన, భగవంతుని ఇతర నామాలతో భజనలు ఇంగ్లీష్, తెలుగులో రాసి పంచి పాడించేవాళ్లం. ఆఖరుగా మంగళహారతి, ప్రసాదాలతో సహా క్రమ పద్ధతిలో జరుపుకునేవాళ్లం.

ఈ హిందూ టెంపుల్ లో జరిగే తెలుగు అసోసియేషన్ వారి భజన కార్యక్రమాలలో స్థానికులు అంటే బోట్స్‌వానా ప్రజలు, మన దేశం నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు… అందరూ పాల్గొనేవారు. ఆ విధంగా ప్రథమంగా ఉగాది జరిపాము. వేపపువ్వు, చెఱకు మొ. సరంజామా మొదట్లో లేవు కానీ తర్వాత మన దేశం నుంచి తెచ్చి యిచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించారు.

మరుసటి ఏడాది, చిన్నారులందరిని చేరదీసి డ్రామాలు, డాన్సులు నేర్పించి మంచి మంచి ప్రోగ్రాములు చేశాము. ముఖ్యంగా ‘ ఏడాది పొడుగునా’ అని పేరు పెట్టి తెలుగు వారు ఉగాది నుంచి సంవత్సరం పొడుగునా జరుపుకునే పండగలు అన్నిటిని పాటలతో, ఆటలతో ఒక గంటన్నర ప్రోగ్రాము చెయ్యగలిగాము. శ్రీరామనవమి, వసంత రాత్రులు, గణేశ చవితి, శారదరాత్రులు, దసరా, దీపావళి మొదలైన పండగల గురించి కొంచెం వివరణ, పాటలు, డాన్సులు ఏర్చి కూర్చి ఎంతో కష్టపడి ఉత్సాహంగా చేయగలిగాము. ఆ రోజుల్లో ఆ దేశంలో టెక్నాలజి అందుబాటులో లేదు. UNO నుంచి వచ్చిన కృష్ణన్ దంపతులు ( ఉద్యోగ రీత్యా ), అక్కడే బోట్స్‌వానా ఎయిర్‌వేస్ లో  పని చేసే భక్త దంపతులు, సి‌ఏ గా స్థిరపడిన రామారావు గారి కుటుంబం, అల్లుళ్లు, కూతుళ్ళు, మనవలు మాకు బలగం. యూనివర్సిటి ప్రొఫెసర్ గంగప్ప దంపతులు, ఇంజనీర్ కమలాకర్ దంపతులు, అక్కడే స్థిరపడిన డా. రెడ్డి దంపతులు తెలుగువారిలో ముఖ్యులు. మాకు ఎంతో ఆప్తులు.

దూరదేశాన స్వంతవారై మెలగిన వీరికి ఉగాది నుంచి అద్భుతమైన సహకారం, స్నేహం బలపడి పిల్లలందరూ కలిసిపోయి సంతోష తరంగాలు ఎగిసి, ఎగిసి పడ్డాయి. మేం సాధించుకున్న స్నేహసంపద విలువ కట్టలేనిది. అలా మరికొన్ని ఉగాదులు గడిపాము. అక్కడ స్థిరపడిన రామారావు దంపతుల ప్రోత్సాహంతో మా అమ్మాయిని పురుటికి తీసుకు వచ్చాము. సీమంతము, బారసాల మొదలయినవన్నీ సక్రమంగా చేయగలిగాము. మా మనవడు 1991 జూన్ లో విపరీతమైన చలి అక్కడ, ఒక జర్మన్ డాక్టర్ నిర్వహణలోని హాస్పిటల్లో పుట్టాడు. హిందూ టెంపుల్ లో పండగలకి ఇడ్లీ, సాంబారు, వడ తమిళులు చేస్తే మేం అందరం తలో రైస్ కుక్కర్ తో పులిహార చేసి అన్నీ పెద్ద గిన్నెలో కలిపేసి, ఉగాది పచ్చడితో వడ్డించాము.

“ ఉగాది చైత్ర నవోదయము, వసంత రాగా సుధామయము “ అనే పాట పాడాము. ప్రొ. రాధాకృష్ణమూర్తి దంపతులు ఈ కార్యక్రమాలకి ఎంతో ప్రోత్సాహం చూపించి, పాటలన్నీ ప్రింట్ చేయించి యిచ్చేవారు, పాడేవారు.

ఆ విధంగా జరుపుకున్న మొదటి ఉగాది, రెండో ఉగాదికి మా యింట ఆ దేశంలో వచ్చిన అతిథి మా మనవడు.

మరికొన్ని ఉగాదులు, అక్కడ పిల్లలకి నేను నేర్పించిన తెలుగు పాఠాల గురించి మరోసారి. 

*****************************