12_010 కుంచె గాడి కృతజ్ఞత

 

“ఏం చెప్పను!

కానీ చెప్పాలి!!

ఐదేళ్లప్పుడు పట్టిన బ్రష్…

ఇదిగో ఇప్పుడిక్కడివరకూ నడిపింది.

వర్ణాలేకాదు కష్టాలూ సుఖాలూ కలబోసుకుని వర్ణసముద్రతీరాన కుంచె భుజానవేసుకుని చిత్రతీరాలనడుస్తూ నేడు ఈ “స్వామిదయ”దగ్గర ఓ పెద్ద మజిలీ.

ఎక్కడెక్కడిపువ్వులో దారాన కలిసినట్టు….

అపూర్వమైన ఒకానొక మహత్తర కలయిక నా చిత్రకళను విశ్వవ్యాప్తం చేసింది.

ఓనాడు విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్ అసెంబ్లీహాల్లోకలసినపుడు

“నీ చిత్రకల్పనలు వినువీధుల విశ్వకళాసృష్టికి కొత్త ద్వారాలు తెరవాలి కూచీ!”

అని మహదాశీస్సు ఇచ్చి ఉత్తేజపరచిన “యుగకవి”  శ్రీగుంటూరు శేషేంద్ర శర్మగారి “కవిదీవెన”కు నిలువెత్తు సద్యోయోగం ఈ సందర్భం.

వేలాదిచిత్రాల మెట్లు ఇదిగో ఇలా నన్ను నడిపిస్తూ ఇక్కడ చేర్చాయి.

ఒక ఊహ చైతన్యవంతమై… చినుకు…సునామీగా మారినట్టు…

నా భాస్కర్ రాయవరం మొక్కవోని సంకల్పబలం “B+కథాకళ”గా సాహితీవిశ్వకళావేదికకాగా అక్షరలక్షలప్రయోగాల జైత్రయాత్ర చేస్తోంది.

దేశాలుపట్టిన ఎందరెందరో ప్రతిభావంతమైన సాహితీమూర్తుల్ని…

ఒకచోట చేర్చి..సాహితీసమారాధన చేయించడం…

అనితర సాధ్యం.

నిజానికి ఇదో  విశ్వశ్రేయస్సు కోరే సాహితీక్రతువు…!

చిత్రంగా…

దశరథ క్రతువులో ఒకటే పాయసపాత్ర.

మరి ఈ కథాక్రతువున… అడుగడుగు పాయసాన్నప్రసాదం.

సాహితీమూర్తుల కథా కదంబపు మేలురుచి.

మరి ఈ సందట్లో… భవదీయుని కంచెకు సాదరాసనం వేసి… “గురూగారూ!మీదే ఆలస్యం…వేదికమీదని”

ఆప్యాయతన చేరదీసి…ఎన్నెన్ని ప్రయోగాలకో రంగులతెర లేపి…నన్ను ఈ స్థాయికి “లాక్కొచ్చిన” స్నేహామృతం మాభాస్కరునికి…శతానేక కృతజ్ఞతలు.

కథాకళ కుటుంబానికి వినయాంజలి.

మరీ ప్రత్యేకంగా… ఈ ప్రక్రియకు

వెన్నుదన్నయిన…

మా ‘కిభశ్రీ’ మహోదయులు..

విజయసారధిగారు,

ప్రసాద్ జ్యోస్యుల,

రఘు రాయవరం,

మా మనోన్మని,

సుందరీనాగమణి

మరియు,

నా రికార్డ్ సృష్టిలో నాకు ఊపిరి మా

‘మాధురి’,మా ‘చైతన్య’,

మా ‘మనోజ్ కూచి’…..లకు…

నాకుటుంబసభ్యులకూ…

ఇలాఎందరో … ఎందరెందరో……

వారికి కృతజ్ఞతాభివందన శతం.

12 దేశాలు…127 కథల గళాలూ…27 గంటల నాన్స్టాప్ కథా-చిత్రసమ్మేళనంలో నా చిత్రకల్పనలకు, అటు…”B+భాస్కర్ కథా కళ”కు ఈ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన..మా ‘మనోన్మని’ విశేషకృషి…ఇప్పటికిలా నన్ను “హైరేంజ్ బుక్ ఆఫ్   వరల్డ్ రికార్డ్స్” హోల్డర్ని చేశాయి.

నా చిత్రకళకు ఎనలేని గుర్తింపునిచ్చాయి!

ఇది నాకు,నాచిత్రకళకు రసజ్ఞలోకపు ఆత్మీయులు అందించిన ఎనలేని ప్రోత్సాహం.. నా గీతకో వరం.

అందరికీ వీడి వందనచందనం!!

ఈ జన్మచిత్రవైభవం

నా తల్లిదండ్రులు

శ్రీ కూచివీరభద్రశర్మ, శ్రీమతి వర్ధనమ్మగార్ల పాదపద్మాలకు సభక్తికంగా అంకితం!

💐💐💐💐🙏

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page