11_014 ముకుందమాల – భక్తితత్వం

.

అత్యంత దయామయుడైన, జగన్మోహనాకార కిశోరమూర్తి, తలపై నెమిలి పింఛం ధరించి వ్యత్యస్త పాదారవిందుడై, వేణువూదుతూ, ‘‘ప్రాణ ప్రయాణ సమయేమమ సన్నిధత్తామ్‌’’॥ ప్రాణం పరలోకానికి ప్రయాణమయేవేళ (ప్రాణావసాన కాలంలో) నాకు దర్శనమిచ్చునుగాక! అంటారు తమ కృష్ణకర్ణామృతంలో లీలాశుకులు. 

            ఇలా శరీరం పూర్వకృత కర్మననుసరించి, ఏం బాధపడినా మనసు మాత్రం మాధవునిపైనే నిల్పి ఉంచుకోవాలనీ, ఆ మూర్తి (ఆ స్వామి భావం) ఆ సంకట సమయంలో కూడా అందిరావాలన్నదే ఈ భక్తుల కోరిక!!!

                        ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చినవేళ, రోగముల్‌

                        గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్‌

                        గప్పిన వేళ, మీ స్మరణ కల్గునో కల్గదొ, నాటి

                        కిప్పుడె తప్పక జేతు మీ భజన దాశరధీ కరుణాపయోనిధీ ॥

            జీవితపు చరమదశలో (ముసలితనమున) యమకింకరులు కళ్ళముందు నిల్చుని భయపెట్టే వేళ, జరావ్యాధులు శరీరాన్ని శిధిలంచేసి, కఫవాత పిత్తాదులు ఊపిరి సలపనీయని దయనీయస్ధితిలో విచార వదనాలతో బంధువర్గమంతా చుట్టుముట్టి జాలితో చూచే వేళ, భయంతో, వేదనతో నీ స్మరణ చేయలేకపోవచ్చు స్వామీ! అందుకే ఇప్పుడే మనఃశ్శరీరాలు స్వస్థతతోనుండగానే మీ భజన చేస్తాను. దాశరధీ! ఆ మనశ్శక్తులను ప్రసాదించు తండ్రీ కరుణాపయోనిధీ!! అంటారు కంచెర్ల గోపన్న తన దాశరధీ శతకంలో.

                        అంతఃకరణ విశుద్ధిం భక్తించత్వయి సతీంప్రదేవి విభో

                        సాంబసదాశివ శంభో శంకర శరణంమే తవ చరణయుగం ॥

            ‘‘హే శంకరా! అంతఃకరణ శుద్ధిని నిర్మల భక్తిని ప్రసాదించు సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ కమలములే నాకు శరణ్యము ’’ అని శ్రీ శంకరాచార్యుల వారు స్తుతిస్తున్నారు ‘‘సువర్ణమాలా స్తుతిలో’’.

పురందరదాసుల వారి దేవర నామ

            ప॥        నారాయణా నిన్న నామదస్మరణయ

                        సారావృత వెన్న నాలిగే బరలి                       ॥ నారాయణా ॥

            చ. 1      కష్టదల్లిరది ఉత్తిష్టదల్లిరది

                        ఎష్టాదరు మది కెట్టి బరలి

                        కృష్ణాకృష్ణా! యంభో ఇష్టరు హేళువ

                        అష్టాక్షర మహామంత్రదనామవ                       ॥ నారాయణా ॥

            చ. 2      సంతత హరి నిన్న సారసిదళునామ

                        అంతరంగ దల్లి నిడిసి

                        ఎంతో పురందర విఠలరాయన

                        అంత్యకాల దల్లి చింతితో హాడే                       ॥ నారాయణా ॥

            కష్టాల్లోనూ, సుఖాలలోనూ “ కృష్ణకృష్ణా ” అంటూ ఇష్టంగా అన్నావు. అష్టాక్షరీ మహామంత్రాన్ని అనవరతం జపించావు. శ్రీహరి నామాన్ని జపిస్తూనే గడపడం వల్ల అంతరంగంలో ఆ స్వామిని నిల్పుకునే అదృష్టం కలిగింది. నిజమే కానీ, నాలుకా! అంత్యకాలంలో కూడా విఠలరాయని (విఠలనారాయణుని) రూపాన్ని చింతిస్తూ, నామాన్ని అనడం మానకుసుమా! అంటారు పురంధర దాసులవారు.

            ఏ భాగవతోత్తముని భావాన్ని పరిశీలించినా అవే కోరికలు! అదే తపన!! అదే పరవశం!!! జీవితమంతా జన్మనిచ్చిన జగన్నాధుని నామ స్మరణతోనే గడిపి వేయాలన్నదే భక్తులైన వారందరి కోరిక!!

  1. చింతయామి హరిమేవసంతతం

                                    మందమందహసితాన నాంబు జం

                                    నందగోపతనయం పరాత్మరం

                                    నారదాది ముని బృందవందితం ॥

            సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందూ అవిచ్ఛిన్నంగా ఏ ఆటంకమూ లేక నిరంతరం హరిస్మరణ కొనసాగాలనీ, అదే తనకు కావాలంటూ కోరిన కులశేఖరులు తన కోరిక ననుసరించి లభించిన హరిని అనుభవించిన తృప్తితో ఇలా అంటున్నారు శ్రీకృష్ణుడు నందనందనుడు. నారదాది మునీశ్వరులచే సేవింపబడే పరాత్పరుడితడు! ముగ్ధసుందర మందహాసంతో నవ్వు రాజిల్లెడు మోముతో అమృతపు వెల్లువ కురిపించే నాధుని సదా ధ్యానింతును గాక! అంటారు పరవశంతో.  “ హరినామమెకడు ఆనందకరము మరుగవో మరుగవో మనసా ” అంటారు అన్నమయ్య.

            శ్లో॥       కమనీయ కిశోర ముగ్ధమూర్తేః

                        కలవేణుక్వణితా దృతాననేన్దోః

                        మమవాచి విజృమ్భతాం మురారేః

                        మధురిమ్ణ కణికపికాపికాపి ॥

            తన మధుర మురళీగానంతో పరవశింపజేసే కమనీయ ముగ్ధకిశోరుడైన శ్రీకృష్ణుని బాలసుందరరూపం చూస్తూ, పదేపదే వర్ణించాలని నాజిహ్వ (నా వాక్కులు) త్వరపడుతూంది సుమా! అంటారు లీలాశుకులు తన కృష్ణకర్ణామృతంలో.

            భగవానుని యందు నిరతిశయ ప్రీతి భక్తి. ఈ భక్తికి ధర్మార్ధ కామమోక్షాలు పొందాలనే కోరిక లేదు. కర్మనాశంకాని, నరక నివారణ కాని, త్రిగుణాతీత స్థితి యందుండటం కాని అపేక్షితాలు కావు. భక్తి భక్తి కోసమే. అది ఒక్కటే పరమ పురుషార్ధం. ఈ భక్తి సర్వావస్థల యందూ, ఆత్మ ఉండేంత వరకూ ఉండవలసినదే. ఒకప్పుడుండి మరొకప్పుడు పోయేది కాకూడదు.  ఆ భక్తి ఈ జన్మలో మరణ సమయంలో జన్మాంతరాలలో ఎప్పుడూ ఉండవలసిందే! దీనినే ఆత్యంతిక భక్తీ, ఏకాంతిక భక్తీ అంటారు.

            భగవంతునిపై ఫ్రేమే భక్తి. ఇదే గోపికల భక్తి. నారదుడు నిర్వచించిన భక్తి. ఈ భక్తినే కోరి ప్రార్ధించి అటువంటి ప్రేమతో తాను అనుశీలించే శ్రీ కృష్ణుని దివ్య మంగళ మూర్తిని ఈ శ్లోకంలో స్మరిస్తున్నారు. శ్రీకృష్ణుడు హరి. మనం ఆ స్వామిని దర్శించడానికీ, తెలుసుకోవడానికీ, పొందడానికీ ఉన్న ప్రతి బంధకాలను అతడే హరించగలడు.  మనలను తనలో చేర్చుకోగలడు.  అందుకే అతడు హరి. ఆ హరియే శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణుడే మా నందనందనుడు. పరాత్పరుడతడే. ఆ స్వామికి గుర్తు మధురమందహాసం! వాత్సల్యంతో ఆ స్వామి ముఖం దరహాసయుతమై వికసిస్తుంది. వాత్సల్య మాధుర్యాలు తొణికిసలాడే ఆ పరతత్వమే నారదాది భక్త బృందం చేత సేవింపబడేది. ప్రకృతి కంటే పరుడైన జీవుని కంటే పరుడైన వాడీ పరాత్పరుడు. ఆ పరతత్వమే సౌలభ్యంతో, నందగోపునికి కుమారునిగా మెలగినది. ఆహా! ఏమి సౌలభ్యం! ఏమి వాత్సల్యం! ఏమా మాధుర్యం! ఏమి సౌందర్యం!! దివ్యమంగళ స్వరూపుని, ఆ హరిని సదాస్మరింతును గాక!

                        చేతోమదీయ మతసీ కుసుమావభాసం

                        స్మేరాననం స్మరతి గోపవధూకిశోరం

            అతసీ కుసుమ సంకాశుడు ` అగిశెపూవుల కాంతితో నగుమోము గల వానిని గొల్లసతి యశోదనందనుడైన పసివానిని అనవరతమూ స్మరింప మనసు వేగిర పడుతూంది. సదా ఆ ముద్దుబాల కృష్ణుని ధ్యానించుచున్నది మనసు అంటారు లీలాశుకులు.

                        కనకనరుచిరా కనకవసన నిన్నూ ॥

                        దినదినమును మనసున చనవున నిన్నూ ॥ కనక ॥

            అంటూ ఆ పీతాంబరధుని అందాన్ని మనసున చనువుతో ఏ రోజు చూస్తే ఆ రోజే చూడచూడ కొత్త రుచులీనుతూ, ఆనందింపజేస్తుంది ఆ సుందరరూపం. త్యాగరాజుల వారికి.

                        వనితల సదా సొక్క జేయుచును మ్రొక్కజేసే

                        పరమాత్ముడదియుగాకయశోద తనయుడంచు

                        ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి ॥

                        సమయానికి తగు మాటలాడెనె॥

            అంటూ మురిపెంలో ఆ యశోద తనయుని కిశోర చేష్టలను మరీ మరీ చెప్పుకుంటూ భక్తితో పరవసించిపోతారు త్యాగరాజు.

            తాను కృష్ణలీలాతరంగాలు పాడుతూంటే ఎదుట గోపాలుడు నాట్యం చేయడాన్ని కన్నులారా చూచి తరించిన నారాయణ తీర్థులు ధన్యులు.

                        ఏహిముదం దేహి శ్రీ కృష్ణా కృష్ణా

                        మాంపాహీ గోపాల బాల కృష్ణా కృష్ణా

                        నందగోపనందన శ్రీ కృష్ణా కృష్ణా

                        యదునందన భక్త చందన శ్రీ కృష్ణా కృష్ణా ॥

            ‘‘నారదాది మునిగేయ కృష్ణా కృష్ణా`శివనారాయణ తీర్ధ వరద కృష్ణా కృష్ణా!’’ అంటూ తీర్ధనారాయణులు పాడటం. ఆ భక్తుడు ముదమందేలా శ్రీకృష్ణుడు ‘‘అందెలు ఘల్లనిమ్రోయగా చిందులు త్రొక్కుచూ వేడ్క చెలువారంగా ” ` ఆడటం, ఆ భక్తుడు పరవశించడం ` ఎంత అదృష్టం!

            భగవంతుని అనుక్షణం కన్నుల నింపుకోవాలీ అనుకునే భక్తుల మనోవీధిలో వారి మనసుకు నచ్చిన రీతిలో దర్శనమిచ్చి ఆనందింపజేస్తాడు భగవంతుడైన బాల కృష్ణుడు. పరాత్పరుడు!! భక్తవత్సలుడు!!

            సర్వాంతర్యామియైన భగవంతుని ఒక ప్రదేశంలోనో ఒక మూర్తిలోనూ దర్శించడం భక్తుని ప్రాధమిక అవస్థ. భక్తి విషయంలో అవగాహన పెరిగినకొద్దీ సర్వత్రా ఆ స్వామిని భావించి, దర్శించుకోగలిగే శక్తి వస్తుంది. ప్రకృతిలోని ప్రతి అంశంలోనూ పరమాత్మని దర్శించుకోగలిగే దృష్ఠి ఏర్పడుతుంది. పరిణితి చెందిన భక్తుని తన్మయభావం. అందులోని ఆనందం, ఆ అనుభవం ఎలాంటివో వివరిస్తున్నారు మహారాజు ఈ శ్లోకంలో.

  1. కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే

                                    శ్రమముషిభుజలీచీ వ్యాకులే గాధమార్గే

                                    హరిసరసివిగా హ్యాపీయతేజో జలౌఘం

                                    భవమరుపరిఖిన్నః ఖేదమద్యత్య జామి ॥

            గత శ్లోకంలో శ్రీహరి మూర్తిని భావించి, కన్నుల ముందర నిల్పుకుని తన్మయులై పరవశులైన మహారాజు ఈ శ్లోకంలో హరిని సరస్సుతో పోల్చి, అనుభవిస్తున్నారు.

            ఇంతకాలానికి ఈ హరి సరస్సు చేరుకోగలిగాను అని ఆనందంతో నిట్టూరుస్తున్నారు. సరస్సు జలంతో నిండి ఉంటుంది. శ్రీహరి తేజస్సు అనే జలంతో నిండి యుంటాడు. ఆదివ్య తేజోమయమైన హరి సరస్సులో స్వామి కరచరణాలే తామరలు. శోభావంతాలైన నేత్రాలే మిలమిలలాడే మీనాలు.  భుజాలు కదలాడే తరంగాలు. జన్మమృత్యువులనే సంసారపుటెడారిలో ప్రయాణించి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములనే ఎండలో అలసి దప్పిగొన్న నాకు ఈ హరి సరస్సు శ్రమను తొలగించి, తాపాన్ని చల్లార్చి, దప్పిక తీర్చి, బాహ్యవిషయరాగ దూషితమైన అపవిత్రతను పోగొట్టింది. విషయములు దూరమై, శరీరం చల్లనై హాయిని పొందుతోంది. పవిత్రమైన ఈ సరస్సులోని జలం తాగడం వల్ల అంతర్భహిస్తాపాలు తీరి సుఖాన్ని పొందగల్గుతున్నాం. అద్భుతమైన అనుభవం!

            అర్చనం, వందనం, కీర్తనం ఇవన్నీ చేయడం వలన సర్వేంద్రియ పరితర్పణం అయింది.  శ్రీకృష్ణరూపం కేవలం తేజోరూపమే కాదు. దివ్యమంగళ విగ్రహం కలది కూడా! ఆమూర్తిని హృదయపద్మంలో స్ధిరపరచుకోవడం ద్వారా ధ్యానం! అదే ఆ మూర్తి తేజో జలపానమొనర్చడం. ఇది లోపలి పిసాసను ఉపశమింపజేస్తుంది. అద్భుతమైన అనుభవం! మండుటెండ వంటి తాపముతో తపించిన జీవుడు కృష్ణానుభవమనే సరస్సులో దూకి, ఆ ఆనందములో బాహ్య విషయాలు గోచరంకానంతగా మునిగిననాడు ఆతాదాత్మ్యతలో కేవలం భగవదనుభవం తప్ప మరొక్కటి లేకుండా బ్రహ్మానందంలో ఓలలాడటం జరుగుతుంది.

                                                                    తరువాయి వచ్చే సంచికలో……

 

                                         ——–   ( 0 ) ——-

.

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾