12_008 ఆనందవిహారి

పెండ్యాల …. ఓ సంగీత స్వరనిధి

 వెనకటి తరం సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు తనకు దేవుడేనని ప్రముఖ సినీ స్వరకర్త సాలూరి వాసూరావు పేర్కొన్నారు. ఆయన స్వరపరిచిన “శివ శంకరి”, “రసిక రాజ”, “శేష శైలవాస” పాటలు ఆయన విద్వత్తుకు గీటురాళ్ళని కూడా అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం “నెల నెలా వెన్నెల” నెట్టింటి కార్యక్రమం అంతర్జాలంలో ప్రసారమైంది. ఇందులో “పెండ్యాల …. ఓ సంగీత స్వరనిధి” పేరిట సాలూరి వాసురావుతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల స్వర రచనా పటిమను, తన తండ్రి రాజేశ్వరరావుతో ఆయన అనుబంధాన్ని, మరెన్నో విషయాలను వాసురావు గుర్తు చేసుకున్నారు. 

 ముందుగా పెండ్యాలను “భిన్న సంగీత సాంప్రదాయ విశేష ప్రవీణ, తరగని స్వరగని” గా ముఖాముఖి నిర్వహించిన చిర్రావూరి మదన్ మోహన్ అభివర్ణించారు. ఆయన నాటకాలు, బుర్రకథలు, హరికథలతో మొదలుపెట్టి చిత్రసీమ ద్వారా రసరమ్య రాగాలను అందించారంటూ స్వీయ కవితను కూడా వినిపించారు. “తన తండ్రి దారినే తను కూడా పయనించి వంశ కీర్తికి వాసు వన్నె తెచ్చే” అంటూ యువ సంగీత సామ్రాట్” సాలూరి వాసురావు మీద కూడా ఒక చక్కని స్వీయ కవితను చెప్పారు. వాసూరావు మాట్లాడుతూ… 36 మంది స్వరకర్తల వద్ద తను బేస్ గిటార్ వాయించానని, పెండ్యాల వద్ద కూడా వాయించే భాగ్యం కలిగిందని గుర్తు చేసుకున్నారు. దక్షిణాదిన ఈ వాయిద్యాన్ని ఉపయోగించిన మొట్టమొదటి కళాకారుడిని తానేనని వెల్లడించారు. పెండ్యాల స్వర సారథ్యంలో “దాన వీర శూర కర్ణ”లోని “చిత్రం భళారే విచిత్రం” పాట రికార్డింగ్ సందర్భంగా తను మహానటుడు ఎన్టీఆర్ పక్కన కూర్చొని వాయించల్సి వచ్చిందని అన్నారు. తను భయపడుతుండగా పెండ్యాల ధైర్యం చెప్పారని, ఆ చిత్రంలో అప్పటివరకు సంగీతం అందించి తరువాత మానేసిన సాలూరి రాజేశ్వరరావు కుమారుడినని తెలిస్తే ఆయన కోప్పడతారేమోనని భయపడ్డానని చెప్పారు. అయితే, తన భయాన్ని పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ ఎంతో అభిమానంగా పలకరించారని ఆనందంగా గుర్తు చేసుకున్నారు. పెండ్యాల కూడా ఎటువంటి భేషజమూ లేకుండా తనను కళాకారుడిగా తీసుకున్నారని అన్నారు. “శివ శంకరి”, “రసిక రాజ”, “శేష శైలవాస”, “మాణిక్య వీణా” తదితర అజరామర గీతాలను అందించిన పెండ్యాల మారిన యుగళ గీతాల ధోరణి నచ్చక సొంత ఊరు వెళ్ళిపోగా… తన తండ్రి ఉత్తరం రాసి మళ్ళీ రప్పించారని, ఆరోజులు అటువంటివని వ్యాఖ్యానించారు.  

సాలూరి, పెండ్యాల మధ్య గొప్ప అనుబంధం ఉండేదని, ఫలానా రాగంలో పాట కూర్చాను, వినండి అంటూ ఫోన్లో ఒకరికొకరు వినిపించుకొనేవారని వాసూరావు చెప్పారు. తను పెండ్యాల వద్ద పనిచేయడం ఒక ప్రశంసా పత్రం అందుకోవడం వంటిదని అనేవారని “మన అబ్బాయి ఎదిగాడు” అని తన శ్రీమతితో అన్నారని వివరించారు. గొప్ప సంగీత దర్శకుడైన తన తండ్రిని కలిసేందుకు మాత్రమే మద్రాసుకు వచ్చిన పెంద్యాలలోని విద్వత్తును గ్రహించి “నా అంతటి స్వరకర్త అవుతారు” అని తన తండ్రి ఆశీర్వదించిన వైనాన్ని వేటూరి సుందర రామమూర్తి ద్వారా తెలుసుకున్నానన్నారు. ఇద్దరూ సూర్యచంద్రుల వంటివారని, ఒకరిని తలచుకుంటూ మరొకరిని కూడా తలచుకోవడంలో తప్పు లేదని వాసురావు అభిప్రాయపడ్డారు. ఇద్దరూ పలు వాయిద్యాలు వాయించేవారని, హార్మోనియం వాయించడంలో ఇద్దరూ దిగ్గజాలేనని గుర్తు చేశారు. పెండ్యాలకు మరో రెండు మూడు వాయిద్యాలలో కూడా ప్రావీణ్యం ఉండేదని తెలిపారు. కర్ణాటక, హిందుస్తానీ శాస్త్రీయ బాణీలలోనే కాక పెండ్యాల పాశ్చాత్య బాణీలో  కూడా స్వర రచన చేశారని అంటూ “ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల” పాటను ఉదహరించారు.

  ఆయనకి, తన తండ్రికి విద్వత్తు పరంగా ఎన్నో పోలికలు ఉన్నాయని, అందుకే అనేక వేదికల మీద ఆయనను తన “పెదనాన్న”గా చెప్పుకుంటానని పేర్కొన్నారు. 

మహా గాయనీమణులైన  సుశీల, ఎస్. జానకి ఇద్దరినీ వెండి తెరకు పరిచయం చేసిన ఘనత పెండ్యాల దని వాసూరావు అన్నారు. ఇక… ఘంటసాల ఎంతో గొప్ప గాయకుడైనా శాస్త్రీయ సంగీత ఆధారంగా చేసిన పాటల రికార్డింగ్ కి ముందు కొన్ని రోజుల పాటు ఆయన చేత పెండ్యాల రిహార్సల్స్ చేయించేవారని చెప్పారు. అందుకే ఆ పాటలు నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. ఘంటసాల, సాలూరి, పెండ్యాల త్రిమూర్తులు అని, వారికి సాటి రాగలవారు ఉండబోరని అన్నారు. 

 ఎంతో ప్రతిభ ఉండిన పెండ్యాలకు రావలసిన  గుర్తింపు, పురస్కారాలు రాలేదని అవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆ పురస్కారాలే ఆయనను చేరుకునేందుకు నోచుకోలేదని అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమం వీడియో ఈ క్రింద…..

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Please visit this page