.
చిన్నతనం నుండీ కష్టపడే నైజము. ఆపదలలో ఉన్నవారిని ఆదుకుని వారికి తగిన సహాయాన్ని నిస్వార్ధంగా అందిస్తూ ఉండడం ఇదీ మా చిన్నాన్న గారి జ్యేష్ఠ పుత్రుడ వెంకటరత్నం స్వభావం. తెలివితేటలు వాడి సొత్తు. అయినా తనలో ఏమాత్రం భేషజం లేదు. వాడి కష్టపడే స్వభావం పదిమందికీ ఎంతో స్ఫూర్తి ని ఇచ్చేది. కాకినాడ లోనే హైస్కూల్ చదువు పూర్తి చేసి ఆ పై పి. ఆర్. కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కాకినాడలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బి. ఇ. కోర్స్ చేసి అదే కళాశాల లో లెక్చరర్ గా ఉద్యోగం చేసాడు రత్నం అన్నయ్య. అప్పటికి నేను ఇంజినీరింగ్ ఐదేళ్ల కోర్స్ లో రెండవ సంవత్సరం చదువుతున్నాను అదే కాలేజ్ లో. నాది మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం. 1958 లో నా కోర్స్ మొదలైంది. తన ఇంజినీరింగ్ చదువు 1960 లో పూర్తి కాగానే అదే కళాశాల లో లెక్చరర్ గా చేరాడు. మాకు ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లేబరేటరీ లో డిమాన్‌స్ట్రేటర్ గా వచ్చేవాడు. విద్యార్థులకు వాడంటే ఎంతో అభిమానం, గౌరవం. అసలు వాడికి ఏ విధమైన భేషజం ఉండేది కాదు. సబ్జెట్ మీద ఎంతో పట్టు ఉండేది వాడికి. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. వాడు చదువుకునే రోజులలోనే రోజూ రాత్రి ఒంటి గంట వరకూ చదువుతూనే ఉండేవాడు. మేడ మీద గదిలో గచ్చు మీద చాక్ పీస్ తో వర్క్ చేసుకునేవాడు. రోజూ కాలేజీ కి నాలుగు మైళ్ళు ( రానూ పోనూ ఎనిమిది మైళ్ళు ) సైకిలు తొక్కుకుంటూ వెళ్ళేవాడు. సీదా సాదా డ్రెస్. నేను రామారావుపేట లో మా మామయ్య ఇంట్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుకున్నాను. రోజూ రాత్రి చదువు కోసమని వాడి నుండీ స్ఫూర్తి కోసమని మా చిన్నాన్న ఇంటికి – మసీదు కి చేరువగా ఉప్పుటేరు కి దగ్గరగా ఉన్న వాళ్ళ ఇంటికి వెడుతూ ఉండేవాడిని. నేను పరీక్షల ముందు పుస్తకాలు తెరిస్తే ( అంతకు ముందు సినిమా హాళ్ల చుట్టూ తిరుగుతూండడం నా కాలక్షేపం !) కాలేజీ తెరిచిన దగ్గర నుండీ చదువు..చదువు.. అంతే.. మరో ఇతర వ్యాపకం అస్సలు పెట్టుకునేవాడు కాదు… అంత శ్రద్ధ చదువంటే !… ఇక మార్కుల గురించి అస్సలు అడగనే అక్కర లేదు… ఎప్పుడు చూసినా ప్రతీ సబ్జెక్ట్ లోనూ 90 %.. ఆపైనే. అసలు మరో విషయం… వింటే మీరే ఆశ్చర్యపోతారు! తాను రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతూండగానే హాస్టల్ పిల్లలు వీడికి సీనియర్లు. వాళ్ళ వాళ్ళ రూం లకు వీడిని పిలుచుకుపోతూ ఉండేవారు, చదువులలో వారి సందేహ నివృత్తి కోసమని. వీడి మేధ ఆ స్థాయి లో ఉండేదన్నమాట !!
కాకినాడ లో ఉద్యోగం… ఆపైన కొంతకాలం ఇరాన్ లోనూ, ఆ పిమ్మట ఖర్గపూర్ ఐ. ఐ. టి. లో ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ చేసి కుటుంబంతో హైదరాబాద్ లో స్థిరపడ్డాడు వాడికి ఒకడే కొడుకూ, ఇద్దరు కుమార్తెలు సంతానము. వారు అందరూ కష్టపడి చదువుకుని పెద్దవాళ్ళై పెళ్లిళ్లు చేసుకుని తమ తమ జీవితాలలో సుఖం గా స్థిరపడ్డారు. దురదృష్టవశాత్తూ, గత కొన్ని సంవత్సరాల క్రితం రత్నం అన్నయ్య కాలం చేసాడు. వాళ్ళ అబ్బాయి రాఘవ వివాహం 1998 లో అమెరికా లో జరిగింది. ఆ వివాహానికి నన్ను ఆహ్వానిస్తూ రత్నం అన్నయ్య వ్రాసిన ఉత్తరం ఇదిగో– మీ ముందు ఈనాటి తోక లేని పిట్ట. వధువు చైనా సంతతి కి చెందిన అమ్మాయే అయినప్పటికీ మన హిందూ సాంప్రదాయాన్ని, కట్టుబాట్లనీ అవగాహన చేసుకుని వాటిని తు. చ. తప్పకుండా పాటిస్తూ, ఆచరిస్తూ ఉన్న వ్యక్తి ఈ కుటుంబానికి కోడలు గా రావడం ఎంతో అభినందనీయం,,. ఆనందదాయకం… !
.
<><><>*** ధన్యవాదములు ~ నమస్కారములు ***<><><>