13_001 ఆనందవిహారి

తెలుగు సాహితి – ప్రాచీనత, ఆధునికత

భాష అనేది రెండక్షరాల మాట కాదు, కొందరికే పరిమితమైన విన్యాసం కాదు, అది ఒక ఒక సంపూర్ణ, సమగ్ర జీవన విధానమని సీనియర్ పాత్రికేయుడు, సాహితీవేత్త జంధ్యాల శరత్ బాబు వ్యాఖ్యానించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఈ మాసపు “నెల నెలా వెన్నెల”లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన “తెలుగు సాహితి – ప్రాచీనత, ఆధునికత” అంశంపై ప్రసంగించారు. జూలై 15వ తేదీ శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో ముందుగా ఐ. ఎఫ్. హెచ్. డి ( ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్) మీడియా డైరెక్టర్ శింగనమల్లి కరుణాకర్ వక్తను పరిచయం చేస్తూ… ఆయన ఈనాడు దినపత్రికలో పని చేస్తుండగా “చతుర”, “విపుల” మాసపత్రికల కోసం అనేక రచనలు చేశారని, “తెలుగు వెలుగు” మాస పత్రిక కోసం ఎంతో కృషి సలిపారని తెలియజేశారు. 

అనంతరం శరత్ బాబు మాట్లాడుతూ…. మన విద్యలు, శాస్త్రాలు, కళలు, విశ్వాసాలన్నీ మన భాషా సామర్థ్యాన్ని పరిపుష్టం చేస్తున్నవే కాబట్టి… భాష అనేది రెండక్షరాల మాట కాదు, కొందరికే పరిమితమైన విన్యాసం కాదు, అది ఒక సంస్కృతి, నాగరికత, విశ్వాసం, వీటన్నిటికీ మించి ఒక సంపూర్ణ, సమగ్ర జీవన విధానమని వివరించారు.

తెలుగు భాష అనగానే హితం, వర్ణన, అలంకారం, భాష, శైలి, భావం, తాత్పర్యం ఇత్యాది విషయాలు తప్పనిసరిగా స్ఫురణకు వస్తాయని పేర్కొన్నారు. తెలుగు పదాల వివరాలను అలనాటి “గాథా సప్తశతి” తెలియజేస్తుందని తెలిపారు. ప్రాచీన శాసనాలలోని తెలుగు భాష మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. 

ఇక “ఆంధ్ర వాఙ్మయ చరిత్ర” అన్నప్పుడు కావ్యాలు గుర్తుకొస్తాయని, నిజానికి సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం అనేవి మూడు పదాలుగా ఉన్నా స్థూలంగా వాటి అర్థం ఒకటేనని అన్నారు. హితం కలిగించేది సాహిత్యం, సరస్వతీ సంబంధమైనది సారస్వతం, కావ్య సంబంధమైనది వాఙ్మయ రూపమని అర్థం చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ కూడా వాటిలోని తీపి, శబ్దాలు, సంభాషణలు తెలుగుదనాన్ని మనకి తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. ప్రాచీనం నుంచి అత్యాధునికం దాకా మన భాషలో వ్యక్తీకరణ శక్తి చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. 

శ్రీకృష్ణ దేవరాయల “భువన విజయం”, రాయల సమక్షంలో అష్టదిగ్గజ కవులు వెలయించిన సాహిత్యం తెలుగును పరిపుష్టం చేశాయని శరత్ బాబు చెప్పారు. గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం రాకుండా భవిష్యత్తు రాదు కాబట్టి భాషాంతరీకరణ విషయంలో వెనక్కి చూడాలని అభిప్రాయపడ్డారు. మౌఖిక, లిఖిత కవితలు, పాటలు తదితరాలన్నీ తెలుగు సారస్వతరూపాలేనన్నారు. 

సుధాంశు కవి విరచిత “సువర్ణ అభివందనం” అనే కావ్య ఖండికలో పేరుపేరునా అనేక ప్రాచీన కవుల ప్రత్యేకతను తెలిపే పద్య భాగాన్ని రసరమ్య రాగయుక్తంగా వినిపించారు. పల్లెవాసులైనా, పట్టణవాసులైనా భాషా ప్రేమికులేనని, ముఖ్యంగా పల్లెవాసులు తమ పాటలతో, పదాలతో తెలుగును జగజ్జగేయమానం చేశారని అన్నారు. ఇక తెలుగుకు మాత్రమే ప్రత్యేకించిన హృద్యమైన పద్య సాహిత్యం, అవధానం ఒక విశిష్ట ప్రక్రియ అన్నారు. దానికి అటూ ఇటూగా ఉన్న ప్రక్రియలన్నీ కూడా అశేష విశేషాలేనని అభిప్రాయపడ్డారు. 

కథలు, కథానికలు, పద్యాలు, గద్యాలు, నాటికలు, నాటకాలు, రూపకాలు, పాటలు, వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు, అత్మకథా చరిత్రలు, ఇంకా అనేకం మన అమ్మ భాష మధురిమను అప్పుడూ ఇప్పుడూ చాటి చెబుతున్నాయని అంటూ…. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించి మాతృ భాషా పరిరక్షణకు తోడ్పాటునందించాలని హితవు పలికారు. 

పద్యాల్లో వస్తుశక్తి, శబ్దశక్తి అనే రెండిటి గురించి, విమర్శ ప్రాముఖ్యత తదితర విషయాల గురించి ప్రస్తావించారు. విద్వాన్ విశ్వం రచించిన “పెన్నేటి పాట” సరళమైన చిన్న చిన్న పదాలు, వాక్యాలతో, సహజ సుందరమైన భాషా ధ్వనిభరిత రచన కాబట్టి ప్రత్యేకంగా ప్రస్తావనార్హమని అన్నారు. అవినాభావ సంబంధం ఉన్న సంగీత సాహిత్యాలు చలన చిత్రాల ద్వారా కూడా వెల్లి విరుస్తున్నాయని పేర్కొన్నారు. వెన్నపూస భాష, ఏదైనా సాధించగలిగే జనశ్వాస కాబట్టే తెలుగు అజరామరంగా ఉంటూ వచ్చిందని అంటూ…. బోధన ఉన్నత స్థాయిలో కూడా ప్రాంతీయ భాషలో కొనసాగాలని అన్నారు. అసలు తెలుగు భాష ఉండాలా లేదా అన్న గందరగళానికి ప్రభుత్వాలు మూల కారణంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిలో ప్రాచీనతకి, ఆధునికతకి మధ్యనున్న వ్యవస్థను పరిగణించాలి అన్నారు. అది వెనకటి మంచిని, ఇప్పటి ధాటిని సమన్వయం చేస్తుందన్నారు. 

నేడు అంతర్జాలంలో తెలుగు అని టైప్ చేయగానే కనిపిస్తున్న విషయాల పట్ల వక్త ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శకులు అయితేనే మన భాష, మన ఉనికి నిలుస్తాయని లేకపోతే జాతికే నష్టమని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమ వీడియో……… 

***********************************************

 

మోటివేషనల్ ప్రసంగ కార్యక్రమం

జూలై నెల 20వ తేదీన బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం కె. యేనుగుపల్లి లంక లోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మోటివేషనల్ ప్రసంగ కార్యక్రమంలో కాకినాడకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు వక్కలంక రామకృష్ణ పాల్గొన్నారు.

కాకినాడలో పరివర్తన, ప్రజా విద్యాలయం, సంగీత విద్వత్ సభ, లైఫ్ ఫౌండేషన్, గాంధీ భవన్ వంటి సంస్థలకు కార్యదర్శిగా వ్యవహరిస్తూ రెడ్ క్రాస్ సొసైటి, శ్రీరామకృష్ణ సేవాసమితి, ఇంటాక్, సిరి మెంటల్లీ రేటార్డెడ్ హోం వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం కలిగి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రామకృష్ణ గారు.

విద్యార్థుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువుతో బాటు సంస్కారం కూడా అలవరుచుకోవాలని, తోటి వారిని ముఖ్యంగా పెద్దవారిని గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. పాఠశాలలో నేర్చుకునే పాఠాలతో బాటు పెద్దల నుంచి జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటే భవిష్యత్తులో వచ్చే అనేక కష్టానష్టాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చునని అన్నారు.

ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, అందుకే వారిని పెద్దలు కనిపించే దైవాలుగా వర్ణించారని పేర్కొంటూ ప్రస్తుతం మిమ్మల్ని ఫలానా వారి పిల్లలు అని అందరూ చెప్పుకుంటున్నారని, భవిష్యత్తులో ఫలానా వారి తల్లిదండ్రులు అని వారి గురించి అందరూ చెప్పుకునేలా మీరు ఎదగాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల విద్యార్థులతో బాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.   

 

***********************************************

 

కార్గిల్ విజయ్ దివస్

పాకిస్థాన్‌పై కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకునే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు. 1999వ సంవత్సరంలో మే 3 నుంచి జూలై 26 వరకు (2 నెలల 3 వారాల 2 రోజులు) అంటే దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత, భారత బలగాలు వివాదాస్పద ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించాయి. ఆ యుద్ధంలో సైనికుల ధైర్యసాహసాలు మరియు త్యాగాలను గౌరవించటానికి ఈ రోజును జరుపుకుంటారు.

సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశ నెరవేరకపోయినా, టోరి రేడియొలో వ్యాఖ్యాతగా అవకాశం లభించినప్పుడు, దానినే దేశానికి పరోక్షంగా సేవ చేసే మహాద్భాగ్యంగా మలచుకొంది జయ పీసపాటి. “జై హింద్” అనే టాక్ షో లో అనేక సాయుధ దళాల అధికారులు, ముఖ్యంగా విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. ఆ తరుణంలో అనేకమంది కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నవారితో ‘జై హింద్’ లో పరిచయాలు చేసింది. వారిలో కొందరు…

o             మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో – అతి విశిస్ట్ సేన మెడల్, సేనా మెడల్

o             మేజర్ డి. పి. సింగ్, భారతదేశపు మొదటి బ్లేడ్ రన్నర్

o             మేజర్ దీపేంద్ర సింగ్ సెంగార్ – కమాండో డాగర్

o             కెప్టెన్ నవీన్ నాగప్పా – సేనా మెడల్

o             సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ – పరమ వీర చక్ర

o             మేజర్ రాకేష్ శర్మ – శౌర్య చక్ర

o             కల్నల్ డాక్టర్ DPK పిళ్లే – శౌర్య చక్ర

o             గ్రేహౌండ్స్ ఇన్‌స్పెక్టర్ లేట్ కర్ణం ప్రసాద్ బాబు – అశోక్ చక్ర

o             శ్రీమతి. భావన ద్వివేది W/o లేట్ C B ద్వివేది, సేన పతకం

o             శ్రీమతి. చారులత ఆచార్య W/o లేట్ మేజర్ పద్మపాణి ఆచార్య, మహా వీర్ చక్ర.

అలా RJ జయ తన రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలను వారి కుటుంబాలను గౌరవించే ప్రయత్నంలో సామాన్య పౌరులకు తెలియజేయడానికి అనుసంధానకర్తగా వుంటూ మరొక కార్యక్రమం కార్గిల్ విజయ్ దివస్ చేయనారంభించారు. ప్రతి ఏటా చేసినట్టే, కోవిడ్ మూడు సంవత్సరాల తరువాత, ఈ సంవత్సరం “సురభి … ఏక్ ఎహసాన్ ‘ అనే పేరుతో పునః ప్రారంభించారు.

దేశభక్తి పాటలతో, నృత్యాలతో పిల్లలు పెద్దలు ప్రేక్షకులని భావపూరితులని చేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రవీణ్ అగర్వాల్ మరియు సౌరభ్ రాఠీ వ్యవహరించగా, మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కోరాడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ మరియు సంజయ్ గుహ స్వచ్ఛంద సేవకులుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం సైనికుల వీడియో సందేశాల్ని ప్రేక్షకులకి చూపిస్తుంటారు, కానీ ఈ సారి RJ జయ చేసిన జై హింద్ టాక్ షో అతిధి “ఉమేష్ గోపినాథ్ జాదవ్” ఆర్మీ అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి 1.2 లక్షల కిలోమీటర్ల మేర మూడు సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన “ఉమేష్ గోపినాథ్ జాదవ్” గారి మాటల్లో వారి సందేశాన్ని ప్రేక్షకులకి చూపించారు. ఉమేష్ గారు “సురభి ఏక్ ఎహసాన్” కు శుభాభినందనలు తెలుపుతూ, భారతీయులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అభినందించారు.  

కార్యక్రమానికి  శ్రీమతి పూనమ్ మెహతా – బి ది చేంజ్ వ్యవస్థాపకులు; కమ్యూనిటీ కనెక్టర్ జుబిన్ ఫౌండేషన్; జాతి సామరస్యం, హోం వ్యవహారాల బ్యూరో ప్రభుత్వ సెక్రటేరియట్ కమిటీ నియమించబడిన సభ్యురాలు మరియు శ్రీమతి నీనా పుష్కర్ణ – రిటైర్డ్ సివిల్ సర్వెంట్ మరియు సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్ గా వున్న శ్రీమతి రానూ వాసన్ ముఖ్య అతిథులుగా  కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంఘాల నుంచి అనేక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాంగ్  కాంగ్ లో నివసిస్తున్న భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజయ్యారు.

హాంకాంగ్‌లోని భారతీయులందరినీ కలుపుతూ దేశభక్తిని చాటుతున్నారు. నిజంగానే ఈరోజు కార్యక్రమం హృదయాన్ని హత్తుకునేలా ఉంది మరియు ఈ నాటి వేదిక మన మాతృభూమి వేదికగా భావించబడుతుంది. ముందుకు తీసుకెళ్తున్న మీకు మరియు మీ స్ఫూర్తికి వందనం అని సభ్యులందరూ ప్రశంసించారు. మనందరినీ 24×7 రక్షించే మన దేశ వీరుల కు హృదయ పూర్వక నివాళులు అర్పించారు. ప్రతి వయస్సు వారికి ఇది ఒక అద్భుతమైన వేదిక..భారతదేశం గురించి, భిన్నత్వంలో ఏకత్వం, మాతృభూమిపై ప్రేమ మరియు అద్భుతమైన ప్రదర్శనలలో వారు చేసిన కృషిని వీక్షించగలిగారు. కార్యక్రమం చాలా మనోహరంగా…. అద్భుతంగా వుంది, ఇందులో భాగమైనందుకు చాలా కృతజ్ఞతలు అని తెలిపారు. కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం చేయబడిన ఇటువంటి మహత్తరమైన ఈవెంట్‌లో హాంకాంగ్‌లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు & బృందాలు పాల్గొనే అవకాశం కల్పించే ఈ అద్భుతమైన ఈవెంట్‌ను మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మీ సమయం, కృషి మరియు మా మాతృభూమి పట్ల వున్న ప్రేమకు వందనాలు. పుట్టిన గడ్డ దూరంగా ఉన్నా కూడా మీ కార్యక్రమాలతో సదా భరతమాత పట్ల మన భాధ్యతని గుర్తు చేస్తున్నందుకు పాల్గొన్న వారందరూ ధన్యవాదాలు తెలిపారు.

సురభి ఏక్ ఎహసాస్‌కి పదాలు లేవు, కానీ ఏక్ ఎహసాస్ జో జిందగీ భర్ హమారే దిలోన్ పర్ ఛాయా రహేగా అన్నారు. వేదికపైకి రావడం మరియు మన మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా మన గతాన్ని వర్తమానంతో అనుసంధానించడం మనకు, మన తరువాతి తరానికి గర్వించదగిన క్షణం. ఈ ఈవెంట్‌ను వినోదభరితంగా, విజయవంతం చేసినందుకు మరియు ధైర్యం, త్యాగం మరియు దేశభక్తిని ప్రేరేపించినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి,  ప్రేక్షకులతో సహా వాలంటీర్‌లకు హృదయపూర్వక అభినందనలను అందించారు.

***********************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page