11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

 

 

‘ ఎవరిని పిలుస్తున్నావు ? ‘  ఉన్నట్టుండి గురువుగారు అడిగారు. రీమ ఉలిక్కి పడింది.

తాను ఇప్పుడే కదా వచ్చింది ! గుమ్మం లోకి ఇప్పుడే అడుగు పెట్టింది. 

ఇంకా గురువు గారికి నమస్కారం కూడా పెట్టలేదు. 

వెళ్లి పాదాలకి నమస్కారం చేసింది. చేతిలో ఉన్న పువ్వులు గురువుగారు కూర్చున్న చోట పెట్టింది. 

ఈ రోజుకి పదో  రోజు. ఇంకొక్క రోజు తాను రాగలదు. ఇప్పటికి కొద్దిగా తెలిసింది గురువు అంటే. 

దండం పెట్టడం అంటే ఏమిటో. ఎలాగో ! పువ్వులెందుకిస్తున్నట్లో తెలియటం లేదు. 

గురువు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని చెప్పారు. ఆయన ముట్టుకోనివ్వరు. 

ఇంక ఫలిత మేమిటి ?  విసుగొస్తున్న మాట కూడా నిజం. 

ఆయన కూర్చున్న బల్ల మీద దుప్పటి కూడా తాకవద్దన్నారాయన. తనకి కోపం వచ్చింది. 

అవమానం అనిపించింది. తాను వంద పేజీల థీసీస్  రాయాలి. టైము ఎక్కువ లేదు. 

ఈ హిందూ స్వాములందరు ఇంతేనని తనకి తన గైడ్ చెప్పిన మాట గుర్తొచ్చింది. 

పది రోజుల్లో ఏం తెలుసుకుంది తాను ? ఆదేదో ఒక రహస్య ప్రపంచం అని మాత్రం. 

ఇక్కడి వాళ్ళ ప్రవర్తనలు తనలో చాలా విశ్వాసాలని ప్రశ్నిస్తున్నాయి.  

పద్ధతులు కొన్నింటిని పోగొడుతున్న విషయం కూడా వాస్తవమే. 

అన్నింటికీ భౌతికమైన ఋజువులు ఉండవు, సాధ్యం కాదు అని తెలుస్తోంది. 

కొన్ని ఎవరికి వారుగా స్వీయ అనుభవాలతో తెలుసుకోవాలి. గ్రహించాలి. 

ఋజువులు నిజానికి దొరికేది అక్కడ మాత్రమే.

మళ్ళీ గురువు గారి నుంచి మరో మాట ‘ నీకు స్వీయ అనుభవం ఎలా కలుగుతుంది ? గురువుంటేనే కదా నువ్వు అద్దం చూసుకుని నీ మొహం దిద్దుకోవటం ”  ఇది రెండో మాట తాను వింటున్నది. వణుకుగా ఉంది. వెన్నులో సన్న గా నొప్పి. కంఠం లో బండ రాయి చేరినట్లయింది. 

‘ రా కూర్చో రీమా అక్కడ ” ఎదురుగా చెయ్యి చాపి కూర్చోవాల్సిన చోటు చూపిస్తూ అన్నారు గురువుగారు.  

ఈ సారి ప్రేమ వర్షం కురుస్తున్నట్లు, తాను వాన లో తడిసిపోతున్నట్లు అనిపించింది.

కళ్ళతోనే మాట్లాడమని ఆదేశించినట్లయింది. అప్రయత్నం గా  మాటలు బయటకి ధైర్యం తో వచ్చాయి. 

ఆయన చిరునవ్వు నవ్వుతున్నారు. ‘ నేను రేపు బయలుదేరి వెళ్ళాలి స్వామిజీ ! ఇంకా నేను ఏమీ వ్రాయలేదు. రాయలేక పోతున్నాను. ఏదీ స్థిరం కాలేదు నా  లోపల ఆలోచనల్లో. ఇక పరిశోధనా వ్యాసం ఎలా రాయగలను ? ‘. దిగులు ధ్వనించింది రీమా మాటల్లో. ఏదో ఓడిపోయినట్లు ! తాను మోసపోయినట్లు, తన కాలం వృధా అయినట్లు !  చాలా చాలా వినిపిస్తున్నాయి.

‘ నువ్వు వచ్చావు. వస్తూ నీ పుస్తకం అంతా నింపుకుని వచ్చావు. రాసేందుకు చోటేదీ ‘ 

గురువుగారి నుంచి ఈ సారి నవ్వు వినిపిస్తోంది. తల పైకెత్తి చూసే ధైర్యం లేదు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. 

‘ అవతల పారెయ్ నీ పుస్తకం. తెల్ల కాగితాలు తీసుకురా, రాసుకుందువుగాని . ‘ 

ఈసారి ఆదేశంలా వినిపించింది. అర్థం కాలేదు. ‘ ఈ దేశంలో ఎవరూ తిన్నగా, స్పష్టం గా చెప్పరు. 

మెటఫర్లు, ఉపమానాలు ప్రతీదానికీ ‘ . ఓపిక పోతోంది రీమాకి. 

చాలా పుస్తకాలు దొరుకుతాయి. ఏవీ సరైన అర్థం చెప్పవు. గురువు దగ్గర మాత్రమే తెలుస్తుందని 

తాను వింది. చదువుకుంది. రెండు వారాలకి ఈ దేశం వచ్చింది. రోజుకి ఎనిమిది గంటలు పని చేసి,

రాత్రి పూటలు కూర్చుని వంద పేజీలూ రాసెయ్యవచ్చని అనుకుంది. సాధ్యమయే పనా ఇది ? 

తాను వ్రాసింది చదవాలని నిశ్చయించుకుంది. ‘ ఈ దేశంలో కొందరు జాతకాలని నమ్ముతారు. 

కొందరు ఇంటి వాస్తు నమ్ముతారు. ఎవరో మనుష్యుల్ని విశ్వసిస్తారు. కొందరు మంత్రం అంటారు. 

మరి కొందరు తంత్రం అంటారు. నల్ల బట్టలో,  ఎర్ర దుస్తుల్లో కట్టుకుని గుంపులు గుంపులుగా 

వీధుల్లో తిరుగుతారు. అరుపు ల్లాంటి పాటలతో మైళ్ళు  మైళ్ళు నడుస్తారు. కుంభమేళా చూసాను. 

మానవ జాతికి ఏమవుతోంది అన్న ప్రశ్న బ్రహ్మాండ మవుతోంది.

పై దేశాల వాళ్ళ అపోహలకు వీరి నమ్మకాలని ఆచరించే విధానాలే కారణం.

ఒక పధ్ధతి లేదు. శిక్షణ లేదు. సామజిక స్పృహ లేదు. పారిశుధ్యం మాట సరే సరి. 

ఒకసారి చేసింది మరోసారి మరొకరు చేస్తే ఫలితం ఉండదు. 

ఒక వంద మందికి ఒకే విధమైన సమాధానం వస్తే దాన్ని సూత్రం చెయ్యవచ్చు. 

కానప్పుడు ఇది శాస్త్రమెలా అవుతుంది ? సిద్ధాంతాల నెలా ఏర్పరచాలి ? 

ఏమైనా అంటే పది వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉందంటారు. నమ్మేదెలా ? … ” 

” రీమా ! నువ్వు ఈ రోజు అన్నం తిన్నావా ? ” రీమా సమాధానం చెప్పింది “ తిన్నాను స్వామీజీ ”

“ మరి నాకు ఆకలేస్తోందేమిటి ? సరే రోజులా జాగింగ్ చేసి వస్తున్నట్లున్నావు ‘ ‘ అవును స్వామీజీ ‘ 

” అర్థమైందా ? ఇంకా లేదా ? నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది. 

సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం 

అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి. 

మంత్రం  మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది  

తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది. 

యంత్రం మన కున్న ఆధారాలు. ముందు ఈ విషయం అవగాహన కావాలి. 

ఈ విధానాలు వాడుకుని ఎన్నయినా, వేటినయినా సాధించవచ్చు.

నువ్వు తంత్రం గురించి  తెలుసుకోవాలని వచ్చావు. 

మన జీవితాలకి సంబంధించిన శాస్త్రం ఇది.

ప్రధానం గా లౌకిక ప్రయోజనాలకి. తంత్రం ప్రధాన ఉద్దేశం లోక హితం. 

కొందరు ఆ లక్ష్యాన్ని నీరు గారుస్తారు కావాలని. స్వార్థం కోసం వాడుకుంటారు.

కావాలని ఎదుటి వారికి హాని కలిగించే పనులు కూడా సాధిస్తారు.

తాంత్రికులమని చెప్తూ మోసం చేస్తారు. భోగలాలస కూడా సాధించవచ్చు.

మన జీవితాల్లో మనం చేసే పనులే ఇవి. విశేషమేం కాదు. 

మంత్రం, తంత్ర, యంత్ర శాస్త్రాలు చాలా బలమైనవి. వీటి ప్రసరణం లో చ్యుతి ఉండదు. 

మొదలు పెట్టడమే తంత్రం తో ప్రారంభం చేసావు.

మంత్రం శాస్త్రం గురించి నువ్వు తెలుసుకోవాలనుకోలేదు. 

కారణం అవ్యక్త ప్రపంచాన్ని తెలుసుకోవటం ఇంచుమించు అసంభవం. చాలా ప్రయత్నం కావాలి. 

ఈ విద్యకి పూర్వ రంగం ఇందాకా చెప్పిన కొన్ని లక్షణాలు ! అవి కావాలి. గురి కావాలి………. ” 

గురువుగారి మాటలు చాలా గంభీరం గా క్రొత్తగా వినిపిస్తున్నాయి. కొండల్లో లోయల్లో ప్రతిధ్వనుల్లా .. ! 

రీమా తనని తాను సద్దుకుని మళ్ళీ వినటం ఆరంభించింది. మహా జలపాతం లా ఉంది స్వామి కంఠం. 

” ఏ దేశంలోనైనా ఎవరికైనా ఏం కావాలి ? ఆరోగ్యం, ఆనందం, ఇబ్బందులు లేకుండా సుఖం గా ఉండటం. 

అవునా ? మీ దేశం లోనైనా ఈ దేశంలోనైనా ! ప్రస్తుతం ఏమవుతోంది ? లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణం కోల్పోతున్నారు. చిన్న పెద్ద తేడా లేదు. దుఃఖానికి అంతు లేదు. 

మనకిప్పుడు కావలసినది సమాధానం. పరిష్కారమే కానీ పరిశోధనలు కాదు. బేరీజులు కాదు. ” 

రీమా తానెందుకు వచ్చిందో జ్ఞాపకం చేసుకుంది. మహామారి కోవిడ్ వలన తన కుటుంబంలో ఎందరో పోయారు. చుట్టూ భరించలేని దుఃఖం. అశాంతి !! అందరు విల విలలాడిపోతున్నారు.

కానీ జీవితం ఆగదు. స్కూళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, సంసారాలు సరిగ్గా నడవటం లేదు.

బంధుత్వాలు పల్చనవుతున్నాయి. 

చిన్న పెద్ద లేకుండా ఏ తరం వారిలోనూ ధైర్యం లేదు. ఎవరి నుంచీ సమాధానం లేదు. 

భారత దేశం ప్రధాని సాయంత్రం అయేసరికి దీపాలు వెలిగించమని ఆదేశం.

కోటానుకోట్ల జనం దీపాలు వెలిగించారు. 

గంటలు వాయించమని మరో ఆదేశం. దేశం మొత్తంలో గంటల ప్రతిధ్వనులే !

అధైర్యం ప్రాకిపోయింది ప్రపంచంలో. మిగిలిన దేశాలవాళ్లు కూడా దీపాలు వెలిగించారు.

గంటలు మ్రోగించారు. దీనిని శాస్త్రం అని ఎలా అనగలం ? 

సందేహాలు జోరీగల్లా మోగుతున్నాయి రీమాకి. 

తాళ్లు వేసి వెనక్కి లాగినట్లయింది రీమాకి. స్వామివారి కంఠం.

” ఒక విషయం చేసుకుని మనసు ఆ విషయం మీద నిలబెట్టు. 

మన సమస్యలకి ఐదు విధాలయిన పరిష్కారాలుంటాయి.

వాటి రూపాలు వస్తువు, నీరు, కాంతి, గాలి, శబ్దం ఏదైనా కావచ్చు.  

ఈ క్రిమి పదార్ధమంతా వ్యాపిస్తే మిగిలిన మార్గాలు వెతకచ్చుకదా !

మన శరీరం లోపల ఏమున్నాయి ? గాలి, నీరు, శబ్దం తప్ప ? 

తంత్రం అనేది ఒక దివ్యమైన ప్రక్రియ. మన తిండి పదార్థాల్లాగా పాడయిపోయేది కాదు.

గౌరవించాలి, తెలియాలి. 

సరిగ్గా వాడకపోతే ఫలితం మాత్రం అతి ప్రమాదం. ప్రతీదీ ఒక సాధనే !

వాటికీ ప్రత్యేకమైన పధ్ధతి ఉంటుంది. ఒక ఆసనం ఉంటుంది. సమయం ఉంటుంది,

శిక్షణ ఉంటుంది, శబ్ద వినియోగం ఉంటుంది. అదో అగాధమైన ప్రపంచం. కత్తిమీద సాము వంటిదే.

ఈ విషయాలు ఎవరికీ వారుగా తెలిసికోగలవి కావు.

విషయం సంపూర్ణంగా తెలియాలి, తీవ్రమైన క్రమశిక్షణ కావాలి.

భారత ప్రధాని ఉపాసకుడు. వారికీ తెలుసు. ప్రజలు పాటించవలసిన మార్గాలు భయం చేత కాదు.

నమ్మకం వలన, విశ్వాసం వలన, భక్తివలన. ఆశ వలన !!  

ఒక ముఖ్యమైన విషయం చెప్తాను నీకు రీమా !

సృష్టి నిలిచి ఉండటానికి ముఖ్యమైనది అఖండ దృష్టి. ఖండ దృష్టి కాదు. 

మనం మాత్రమే పుట్టించగలది మనం చేసే శబ్దం. పుట్టిన నాటి నుంచి పోయేదాకా మనతో ఉంటుంది. 

మనం మన మంచికోసం, మనదైన సంపద మన నోటి మాట వాడుకోవచ్చు కదా !

దేనికి అభ్యంతరం ? మార్గం తెలియక. అవునా ?

మనకి తెలియని వాటిని స్కూళ్లలో నేరుస్తున్నాం కదా ! ఇదీ అంతే ! 

గురువు దగ్గరకి వెళ్ళాలి. చెప్పినది వినాలి. దీనిని శాస్త్రం కాదంటున్నారు మీ దేశం వారు. 

కత్తి దుష్ట శిక్షణకే కాదు ఆత్మ రక్షణకి కూడా కావాలి కదా ! 

ఒక్కొక్కప్పుడు పొరపాటునో, శిక్షణ లేకనో, చాలకనో దుర్వినియోగం అవుతుంది.

గురువున్నది దానికే నేర్చుకోవాలనుకున్న వారిని సరైన మార్గం లో పెట్టటానికి. 

ఒకప్పుడు ఎముకలు ఉంటే చాలు ప్రాణం ఉండేది మనుష్యులలో.

ఆ తర్వాత చర్మ గతం గా మారింది ప్రాణం. అంటే చర్మం రక్షణ కవచం.

నెమ్మదిగా శరీరంలో కండ బలం ఆవశ్యకమైంది . ఈ రోజు మనం అన్నం లేకుండా బ్రతకలేము కదా. వీలున్నంత వరకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించాలని మనం అనుకుంటాం.

భారతదేశం లో పూర్వం అన్ని మార్గాలు సాధన చేసేవారు. సాధించేవారు. 

మనం ఆ సాధనా మార్గాలలో పూర్తిగా ఫలితం సాధించలేం  అందుకే కొంతైనా ప్రయత్నం కావాలి. 

కనీసం మన అంతరంగ పరిరక్షణకీ, వాతావరణ పరిరక్షణకీ, మానసిక బలానికి ఈ మార్గాలు సహాయం చేస్తాయి. 

సాధన చేసే వారికీ, సాధకులకీ ప్రపంచం తో సంబంధం ఉండదు. మానసిక బలహీనత ఉండదు. 

క్రమశిక్షణ, భక్తి, ప్రపత్తి చాలా అవసరం.

శరీరానికి శక్తి కావాలంటే వ్యాయామం, సరైన ఆహరం కావాలి కదా. 

జ్ఞాపక శక్తి పెరగాలంటే జ్ఞాపక వ్యాయామం చెయ్యాలి. అంటే మన శబ్ద శక్తి అవునా ?

అల్లాగే మన మనసు దృఢంగా ఉండాలంటే మన ఆలోచనలని అదుపులో పెట్టుకోవాలి. 

ఇవేమీ వింత కాదు. పూర్వనుంచీ ఉన్నవే. ఈరోజు వాడుకలో లేవు.

మళ్ళీ మనం మన జీవితాల్లోకి తీసుకు రాటానికే ఈ పరిస్థితి ఏర్పడింది. 

గౌరవించటం నేర్చుకో రీమా ! నమ్మకం పెంచుకో. ఈ రోజు పాఠం ఇదే నీకు.

చాలనుకుంటే తిరిగి మీ దేశం వెళ్ళిపో. కావాలనుకుంటే ఆశ్రమం లో ఉండు “

నిశ్శబ్దం ఆవహించింది చుట్టూ ! ప్రశాంతం గా వాతావరణం మారింది. 

కళ్ళు తెరిచింది రీమా ! స్వామి వారు లేరు అక్కడ.

ఏడాది దాకా రారు అని మాటలు వినిపిస్తున్నాయి ….. !!! 

 

                                                ——– ( 0 ) ———