నృత్య సంగీత నాటిక (బ్యాలే)
వసంత ఋతువు:
(గేయం)
ఋతురాజును నేనే ఋతురాజును నేనే
నను గాంచిననే బ్రతుకు బాధలను
మరతురులే మైమరతురులే ||
వన తరులతలవే పూచెనహో
మధుపవనములవే వీచెనహో
డోలాయాంచలమాయెనహో
ఆనంద మాధురి నిండెనహో ||
(దర్శకత్వం)
(వసంత ఋతురాజు గర్వంగా తన వింటిని మీటి నిటారుగా నిలబడతాడు)
గ్రీష్మ ఋతు ప్రవేశం
ధగధగా కాంతులీనే రవి కిరణాలను తన తోడబెట్టుకొచ్చాడు గ్రీష్ముడు.
గ్రీష్మ: (గేయం)
తేజము గాంచితిరా
నా ప్రతాప తేజము గాంచితిరా ||
తాపము పెరిగెను, వ్యాకులమందును
భీకర రూపము గాంచితిరా
గ్రీష్మపు ఎండను భరింప జాలరు
అయినా జనులకు నేనే కావాలి ||
ననుగని విరిసెను కమలములు
మరిమరి పండును మామిళ్లూ
ఫలరాజములు పుష్పరాజములు
కోరినచో, మరి కోరినచో
నేలను ఇంకిన నీరంతా
ఆవిరియై మరి ఆవిరియై
చల్లగా వానలు కురవాలంటే
ధరణీ మాతా ఆమె పుత్రులూ
తపించినా మరి జ్వలించినా
నేనంటే మరి గౌరవమే ఇక
నేనంటే మహ గౌరవమే
వచనం: అందుకే,
గేయం:
ఋతురాజును నేనే
ఋతురాజును నేనే
(దర్శకత్వం)
(తన ప్రతాపంతో ప్రజలను భయపెట్టాననే గర్వంతో మదించిన గ్రీష్మ ఋతువు, పై పాటకు అభినయిస్తూ
వసంత ఋతువు వంక ఏహ్యంగా చూస్తూ నిలబడతాడు)
ఇంతలో వరుణుడు అటుగా వస్తాడు :
గేయం :
నల్లని చల్లని కృష్ణుని వోలే
ఆకాశమంతట నిండితి లే
చల్లని నీటను తడిసిన గాలులు
చల్లని నీటిని నింపిన మబ్బులు
మనసుకు హాయిని గొన లిపేనులే
గ్రీష్మపు ఎండను భరింపజాలని
జనులకు నేనే కావాలిలే ||
ప్రియుని రాకకై వేచిన చెలికీ
ప్రేమ పన్నీరు వాన జల్లులా
గాలికి నటనములాడే ఆకులు
నూతన వధువుల చందమునా
లజ్జితలై తనుకంపిత లై
ప్రియుని రాకకై వేచిన వేళా ||
అందుకనే మరి అందుకనే
ఋతురాజును నేనే
ఋతురాజును నేనే ||
చల్లని జల్లుల తడిసిన భూమి
నూతన జీవితమందించునుగా
పచ్చని పైరుల పయ్యెదపై
పైట కొంగులా సవరించి
నర్తనమాడెను చూడండి
నా గరిమను తిలకించండి
ఈ భూమికి మరి నేనే కాదా
ప్రాణదాతను నేనెగదా||
వచనం: అందుకే
గేయం: ఋతురాజును నేనే, అన్నిట ఋతురాజును నేనే
(దర్శకత్వం)
వర్ష ఋతువు తన ఘనతను చాటుకుని, విర్రవీగుతున్నట్టు నిలబడుతుంది. కళ్ళలో సకల జగత్తుకూ తనే ప్రాణదాతననే గర్వం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇంతలో
శరదృతువు వయ్యారంగా అటు వస్తుంది
గేయం :
శరదృతువు:
చూడగనే, నను చూడగనే
నభమున ఆ రేడు ఈడేరెనే
జాబిల్లి, తారలు ఆటాడెనే
ఇక ఆటాడెనే, ఆటాడెనే ఇక ఆటాడెనే ||
చంద్ర కిరణాల కాంతులలో
వికసించెనులే కమలములూ
అల్లాడే కాంతులలో, కాంతులలో
మెరసెనులే ఈ జగమే
శారద రజనీ శోభా
కురిసెనులే కురిసెనులే||
వచనం: అందుకే
గేయం : ఋతురాజము నేనే, ఇలలో ఋతురాజము నేనే
(దర్శకత్వం)
తన రాక ప్రజలకు ఎంత ఆహ్లాదం కలిగిస్తున్నాడో అన్న విషయాన్నీ తెలుపుతూ, శరదృతువు, గొప్పలు పోతూ నిలబడుతుంది.
అప్పుడే మెల్లమెల్లగా ప్రవేశించిన హేమంత ఋతువు న గొప్ప కూడా ఏమాత్రం తక్కువ కాదన్నట్టు ఆతృతగా వస్తుంది.
గేయం:
జోరుగ వీచే శీతల పవనం
కంపించెను లేలేత కుంజము
గడగడ వణికిరి బాలకులు
గడగడా వణికిరి బాలికలు
రవి ఉదయించెను మందముగా
వాసముఖమ్మున నిలువగలేక
ముఖమును చాటుగ చేసుకుని
భూమికి దూరము అయినాడే
చిన్నగయైనవి ఈ దినముల్
గడవక నున్నవి రాతురులు
హేమంత ఋతువదె గాంచితిరా ||
వచనం:
సూర్యుని వేడిని తగ్గించగల దక్షత నాకే ఉంది. అందుకే,
గేయం:
ఋతురాజము నేనే
అన్నిట ఋతురాజము నేనే
(దర్శకత్వం)
హేమంత ఋతువు కూడా తన గొప్పను చాటుతూ ఠీవిగా నిలబడుతుంది. ఇంతలో శిశిర ఋతువు దొంగలా చొరబడుతుంది.
గేయం:
తరులదె నిలచెను పర్ణహీనమై
శీతల వాయువు సోకినంతనే
పర్ణహీనమై, వర్ణహీనమై
వాడిన మోడులు దీనముగా
విరహాతురులై నిలచినవే ||
వసంత ఋతువును పిలచెనదే
ఈ వన శోభలు తిరిగి ఫలించే
తరుణమిదేలే అది నావలనేలే
ప్రాణమిచ్చునది నేనేలే||
బృందావనిలో నందకిశోరుడు
అందముగా నర్తించే వేళా
గోపీ రమణుల రాసలీలలో
రంగురంగుల అటల తేల్చే
సమయమిదేలే సమయమిదేలే||
వచనము: అందుకే,
గేయం: ఋతురాజము నేనే ఋతురాజము నేనే
(దర్శకత్వం) అంతదాకా, ఈ ఋతువుల తగవును నిశ్శబ్దంగా గమనిస్తున్న భూమితల్లి ముందుకు వచ్చి వారికిలా నచ్చ చెప్తుంది.
గేయం:
తగదు తగదు మీకిదీ
ఈ రీతిగ తగవులాడ ||
కలసి మెలసి ఉండాలి
తమ పనులను చేయాలి
నేను గొప్ప నేను గొప్ప
అనుకుంటే, మీరనుకుంటే
ఇలలో ఈ ఇలలో
ఏమి కాను ప్రజల గతీ, ఈ ప్రజల గతీ?
వచనం: అందుకే ,
నామాటను వినరండీ
సమసమతను పెంచండి
మీలో ఏ ఋతువైనా
పెరిగినా, తరిగినా
ప్రజలకు మరి బాధకదా
మీ బాధ్యత కాదా?
అందుకే మరి అందుకే
ఏ ఋతువుకు ఆ రీతిగ
సకల జనుల సుఖానికై
తమ విధులను నిర్వహించి
కలిసి మెలసి పనిచేసి
ఈ ధరణికి కావలసిన
సుఖ శాంతులు ఇవ్వాలి
సుఖ శాంతులు ఇవ్వాలి.
(దర్శకత్వం)
అందరూ కలిసి పాడతారు (కోరస్)
గేయం:
మనమంతా ఒకటే
జగమంతా ఒకటే
భారతమాతా, శాంతిప్రదాతా
విశ్వ విధాతా, విమల చరిత్రా
సర్వం శాంతిమయం , సర్వం శాంతిమయం
సర్వే జనా సుఖినో భవంతు||
( సంగీత రచన కావాలనుకునే వారు ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ కళాకారిణి, రచయిత్రి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారిని
ఈ నెంబర్ లో సంప్రదించండి – 9810435949. )
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾