10_015 మహనీయుల త్యాగం

.

మహనీయుల త్యాగం మరువలేనిది ( అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం )

.

లక్ష్య సిద్ధికై ప్రాణాలను సైతం లెక్క చేయలేని వీరులు తెలుగువారు. తెల్లవారి గుండెల్లో నిదురించిన అల్లూరి సీతారామరాజు, సాహసనారి మగువమాంచాల వీరధీరవనిత నాయకురాలు నాగమ్మల కన్న పవిత్రభూమి మన ఆంధ్రభూమి. త్యాగధనులు ఎప్పుడూ స్వార్థరహితులే. పరులకోసం పాటుపడే సహృదయశీలురు మన తెలుగువారు.

ఎక్కడో మారుమూల పల్లె పడమటపల్లె. కనిగిరి మండలం, నెల్లూరు జిల్లాకు చెందిన గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతుల బిడ్డడు శ్రీరాములు. ఆ యువకునిలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది.

నాటి పరదేశ పాలనను వ్యతిరేకించే దశలోనే ఆంధ్రరాష్ట్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంధ్రుల భాషైన తెలుగును ముఖ్యాంశంగా చేసుకున్నారు. ఒక్క ప్రక్క వందేమాతరం ఉద్యమం మరో ప్రక్క తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగువారు.

వందేమాతరం ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1910లో ఉన్నవ లక్ష్మీనారాయణ తదితరులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకై పట్టుదలతో ఉద్యమం సాగించారు. 1913లో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఆంధ్రరాష్ట్ర తీర్మానాన్ని కొందరు బలపరిచారు, మరికొందరు వ్యతిరేకించారు. ఇలా సాగుతున్న దశలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణకై అశువులు బాసిన అమరజీవిని గురించి తెలుసుకుందాం.

ఆంధ్రరాష్ట్ర సాధనకై శ్రీ పొట్టిశ్రీరాములు గారు 1952 అక్టోబరు 19వ తేదీన నిరాహారదీక్ష ప్రారంభించారు. కాని అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు ప్రస్తావించి తర్వాత అసలు విషయానికి వద్దాం.

1933లో గాంధీజికి శిష్యుడుగా చేరి అనతి కాలంలోనే వారికి ప్రీతిపాత్రుడైయ్యాడు శ్రీరాములు గారు. శ్రీరాములుగారి సేవానిరతికి గాంధీజి సంతసించి శ్రీరాములు వంటి కార్యకర్తలు మరో పదిమంది ఉంటే స్వాతంత్య్రం ఒక్క సంవత్సరంలో సాధించవచ్చు అన్నారు.

సత్యాగ్రహ సమరంలో పాల్గొన్న కారణాన శ్రీరాములు గారు మూడు సార్లు చెఱసాలకు వెళ్లారు. ఆ తర్వాత గాంధీ ఆశ్రమంలో గ్రామ జనోద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1944లో నెల్లూరులో చర్ఖా గురించి వివరిస్తూ ఊరూవాడా తిరిగారు. సహపంక్తి భోజనాలలో పాల్గొంటూ, సర్వమత సమానత్వాన్ని పాటించారు.

ఆ తర్వాత నెల్లూరులో అందరికి గుర్తుండిపోయే ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే హరిజనుల దేవాలయ ప్రవేశ ఉద్యమం. హరిజనుల ఆలయ ప్రవేశానికై 1946 లోనే నిరాహార దీక్ష చేపట్టారు శ్రీరాములుగారు. అనేక సంప్రదింపుల పిదప హరిజనులు ఆలయ ప్రవేశానికి దారి చూపబడినది.

అప్పటికీ సంతృప్తి చెందని శ్రీరాములుగారు హరిజనులు ఆర్థికంగా స్థిరపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. హరిజనులు దేవాలయ ప్రవేశానికి వారి కడగండ్లు తీరేందుకు ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించేటట్లు చేశారు. శ్రీరాములు ఒక పట్టు పట్టారంటే అది ఉండుం పట్టే. అంత పట్టుదల గల మనిషి వారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.

ఇక వారి జీవితం. అది చాలా బాధాకరమైనది. తల్లిని, భార్యను, బిడ్డను అందరినీ పోగొట్టుకుని కూడా తనలో మెదిలే ఒక లక్ష్య సిద్ధికై చివరి వరకు పోరాడి ఆశువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు.                  

ఇక ప్రత్యేక రాష్ట్ర సిద్ధికై వారు చేపట్టిన కార్యక్రమాలు, అవి అమలయ్యేందుకు చేసిన ప్రయత్నాలు గమనిద్దాం. 58 రోజుల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఈ పోరాటానికి ముందు 1949లో వార్ధా నిరసన దీక్ష చేపట్టారు. ఆపై శ్రీరాముగారు ఎందరెందరో ప్రముఖులను కలుసుకుని తన ఆశయాన్ని వివరించారు. కాని నిరాశే ఆయనకు మిగిలింది.

40 ఏండ్లుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై సాగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో శ్రీరాములుగారు బాధకు లోనయ్యారు. ఇక ఆమరణ నిరాహార దీక్షే శరణ్యం అనే నిర్ణయానికి వచ్చారు. మహర్షి ఋలుసు సాంబమూర్తిగారితో సంప్రదించి వారి గృహంలోనే దీక్ష ప్రారంభించారు.

శ్రీరాములు గారు నిస్వార్థ చింతనతో దీక్షను చేపట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని లక్ష్యసిద్ధికై నిరాహారదీక్షను కొనసాగించారు. శ్రీ సాంబమూర్తిగారు సహృదయులు. మంచి మనసుతో శ్రీరాములు దీక్షను నిర్వహించుకొనేందుకు తన ఇంట్లోనే ఏర్పాటు చేశారు. అవాంతరాలు ఏవీ జరగనీయకుండా స్వయంగా సాంబమూర్తిగారు పర్యవేక్షించేవారు.

ఇటువంటి పవిత్రమైన ఉద్యమానికి సహకరించిన శ్రీ సాంబమూర్తిగారి గురించి రెండు మాటలు ఇక్కడ ప్రస్తావించడం మంచిదన్నది నా అభిప్రాయం. శ్రీ సాంబమూర్తిగారు, రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్న మద్రాసు ప్రెసిడెన్సి శాసనసభకు తొలి సభాపతి. సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని ఎలిగెత్తి చాటిన వారిలో సాంబమూర్తిగారు అగ్రగణ్యులు. వారు వృత్తిరీత్యా న్యాయవాది. దేశభక్తి పరాయణులు. అటువంటి వారి సహకారంతో శ్రీరాములుగారు నిరాహారదీక్షను చేపట్టారు.

తన దీక్ష సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో శ్రీరాములుగారు కొన్ని నియమ నిబంధనలు దీక్షకు ముందే ప్రకటించారు. వాటిని అనుసరించమని విజ్ఞప్తి చేశారు. శ్రీరాములుగారి దీక్షను విరమించమని ఒకప్రక్క విజ్ఞప్తుల వెల్లువ. మరో ప్రక్క వారి నిరసన దీక్షకు సహకారం తెలుపుతూ భారత శాసన సభ నుంచి కొంతమంది శాసన సభ్యులు సభ నుంచి బయటికి వచ్చి నెహ్రూ ప్రభుత్వం అనుసరించే మూర్ఖ విధానానికి ఆక్షేపణ తెలిపారు. జె.వి.పి. రిపోర్టును అనుసరించి ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరుగుతుందని దీక్షను విరమించుకోమని విజ్ఞప్తి చేశారు. నేనిట్టి ఆంధ్రరాష్ట్రానికి కాదు దీక్ష చేపట్టినది అని విరమణకు ఒప్పుకోలేదు శ్రీరాములుగారు.

శ్రీరాములు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. దీక్ష 58వ రోజుకు చేరింది. ఆ రోజు అంతా హడావిడి. వారి ఆరోగ్యం మరింత క్షీణించ సాగింది. కర్నల్‌ టి.ఎస్‌. శాస్త్రి గారు పరిస్థితి గమనిస్తున్నారు ప్రక్కనే ఉండి. అయినా రాత్రి 11.30 గంటకు శ్రీరాములు గారి శ్వాస ఆగిపోయింది. వారు కీర్తిశేషులయ్యారు.

శ్రీరాములు భౌతిక దేహాన్ని పుష్పాలతో అంకరించబడిన రథంపై కూర్చోబెట్టారు. ముందు భాగాన సాంబమూర్తి, శ్రీరాములు గారి మేనల్లుడు ఎన్‌. ఆర్‌. గుప్త, సోదరుడు రంగయ్య గుప్త కూర్చొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం ఆంధ్ర జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా అశేష ప్రజానీకం అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. ఆ త్యాగజీవి పార్థివ దేహానికి నమస్కరించారు.

అక్కడికి చేరిన ప్రజలతో ప్రకాశం పంతులుగారు ‘ శ్రీరాములుగారిని మనం కాపాడుకోలేపోయాం. ఆంధ్రరాష్ట్రానికి తన ప్రాణాన్నే బలిచ్చారు. వారు అమరజీవి అయ్యారు ’ అని వేదనతో పలికారు.

తన జీవితాన్ని అర్పించినా మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కావాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. ఏమైతేనేం నేడు తెలుగువారికంటూ ఒక రాష్ట్రం లభించింది అంటే అది వారి త్యాగ ఫలమే.

సర్వం కోల్పోయినా మరెన్ని ఆటంకాలు కలిగించినా లక్ష్యసిద్ధికై కడవరకు పోరాడి మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని అందించిన ఆయన ఓ ఆదర్శజీవి, అమరజీవి.

.

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నైలో 2017లో ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థకు అధ్యక్షుడిగా డా. (అజంతా) కె. శంకర్రావు గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ వై. రామకృష్ణ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు 12 మంది కార్యవర్గ సభ్యులు సమితికి సేవలందిస్తున్నారు.

స్మారక సమితి ముఖ్యోద్దేశం, అమరజీవి ఆశయాలైన తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు, ప్రచారానికి తగు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

చెన్నై నగరంలోని మరియు చుట్టుపక్కల సమీపంలో ఉండే తెలుగు విద్యార్థినీ, విద్యార్థులకు తెలుగు భాషలో మంచి పాటవం, అభిమానం కలిగించడానికి వ్యాసరచన, వక్తృత్వం, పద్యాలు, దేశభక్తి గేయాలు, అన్నమయ్య-రామదాసు కీర్తనలు, చిత్ర రచన వంటి పోటీలు నిర్వహించి, కొన్ని వందల మందికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విశేషమైన గుర్తింపు పొంది, విద్యార్థుల్లోనే కాక వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకీ, ఆయా పాఠశాలల యాజమాన్యాలు కూడా చాలా ఆసక్తితో, ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారనే ఆతృతతో ఎదురుచూసేవారు. ప్రతి ఏడూ నిర్వహించే ఈ కార్యక్రమం కరోనా కారణంగా 2020లో నిర్వహించలేకపోయాం.

ఇక “నెలా నెలా వెన్నెల” శీర్షికన ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమం చెన్నైలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణను సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్నో సాహిత్య, సంగీత, వినోద కార్యక్రమాలు, ప్రముఖులతో ముఖాముఖి వంటి వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే కార్యక్రమంగా పేరొందింది. 2020లో కరోనా కాలంలో కూడా ఈ కార్యక్రమం విరామం లేకుండా సాంకేతిక సహాయంతో “నెట్” ఇంట్లో సమావేశంగా ప్రతినెలా నిర్వహించబడుతోంది. ఇప్పటివరకూ దాదాపు 110 కార్యక్రమాలు “నెల నెలా వెన్నెల” శీర్షికన చేయడం జరిగింది. ( 2017కి ముందు “అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ” ఉండేది. అనివార్య కారణాల వల్ల ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఈ స్మారక సమితి ప్రారంభించడం జరిగింది )

ఇంతేగాకుండా ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ పేరున ‘మాలతీ చందూర్ పురస్కారం’ ఎవరైనా ఒక ప్రముఖ తెలుగు రచయిత్రికి ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతోంది. అదేవిధంగా వారి భర్త పేరున ‘ఎన్.ఆర్.చందూర్ పురస్కారం’ ఎవరైనా ఒక ప్రముఖ పాత్రికేయునికి ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతోంది. ఈ పురస్కార సభలు హైదరాబాదులో చేయడం జరుగుతోంది. ఎన్. ఆర్. చందూర్ పురస్కార సభ ఒకసారి ఢిల్లీలో ఉపరాష్ట్రపతిగారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

కళాశాల విద్యార్థులకు “యువ” పేరిట జర్నలిజంలో సెమినార్స్, వర్కుషాప్స్ గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం.

ఈవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అనేక విధాలుగా తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేస్తూ చెన్నై నగరంలో ఒక మంచి సంస్థగా పేరొందింది. ఈ సంస్థ చేసే కార్యక్రమాలకి ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉంది.

.

******************************************