12_012 విప్రనారాయణ చరితం

పరమ భక్తుడైన విప్రనారాయణుడు విష్ణువుని రంగనాథుడి రూపంలో కొలుస్తూ ఉంటాడు. చోళ రాజు ఆస్థానంలో నృత్య ప్రదర్శన తర్వాత నర్తకి దేవదేవి తన చెల్లెలు మధురవాణితో కలసి వస్తూ విప్రనారాయణుని ఆశ్రమం మీదుగా వస్తూ ఉంటుంది. తనని పట్టించుకోకుండా దైవ కైంకర్యంలో మునిగిపోయిన నారాయణుని చూసి అహంకారిగా, పొగరుబోతుగా తలచి, అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అనాధగా చెప్పుకుంటూ నారాయణుని ఆశ్రమం లోకి ప్రవేశించి సహాయం కోరుతుంది. అయితే ఆమె ఆశ్రమంలో ఉండడంలోని ఉద్దేశ్యాన్ని పసిగట్టిన నారాయణుడి శిష్యుడు రంగరాజు అభ్యంతరం చెప్పినా వినకుండా అతన్ని బయిటకు పంపించి దేవదేవిని శిష్యురాలిగా చేసుకుంటాడు నారాయణుడు. క్రమంగా అతను దేవదేవి పట్ల ఆకర్షితుడై ఆమె మోహంలో పడిపోతాడు. దానితో ఆమె అహం తృప్తి పడి ఇంటికి బయిల్దేరుతుంది. నారాయణుడు కూడా ఆమెతో బాటు వెడతాడు. అయితే అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడం చూసి దేవదేవి తల్లి రంగసాని అతన్ని బయిటకు గెంటి వేస్తుంది. నారాయణుడిని గెలిపించడానికి రంగనాథుడు రంగరాజు రూపంలో దేవదేవి దగ్గరకు వచ్చి శ్రీరంగం దేవాలయంలో వంటగదిలో ఉండే బంగారు పాత్ర నొకదానిని ఇస్తాడు. ఆ పాత్ర మాయమైన విషయం, అది దేవదేవి ఇంట ఉన్న విషయం ఆ దేవాలయ పూజారులు రాజుకు ఫిర్యాదు చేస్తారు. నారాయణుడిని దోషిగా నిర్థారిస్తారు. దొంగతనం చేసినందుకు శిక్షగా అతని చేతులు నరకమని రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో రంగనాథుడు ప్రత్యక్షమై నిజాన్ని తెలియజేయడంతో బాటు నారాయణుడు వైకుంఠంలో తనకు ప్రీతిపాత్రమైన పూలదండ వైజయంతీ అవతారంగా, దేవదేవి గంధర్వ కన్యగా, శాపవశాత్తు మానవ జన్మ ఎత్తినట్లు తెలియజేస్తాడు.

ఈ విప్రనారాయణుడి వృత్తాంతాన్ని ఇటీవల గుంటూరు లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో యక్షగాన మహోత్సవం 2023 సందర్భంగా విశ్వనాథ సాహిత్య పీఠం సహకారంతో ప్రదర్శించిన ‘ విప్రనారాయణ చరితం ‘ నుంచి కొన్ని అంశాలు. ఈ కార్యక్రమానికి గురు కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారు నిర్వహణ, రచన, నృత్య దర్శకత్వం వహించారు. శ్రీ కుమార సత్యనారాయణ గారు సంగీతం సమకూర్చారు. వారితో బాటు శ్రీమతి సుధారాణి గారు గాత్ర సహకారం అందించారు. వైయోలిన్ మీద శ్రీ పాలపర్తి ఆంజనేయులు గారు, మృదంగం మీద శ్రీ సురేష్ బాబు గారు సహకరించారు.

****************************************

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి