10_010 పాలంగి కథలు – మా ఊరు పాలంగి

‘మా ఊరు ఒక్కసారి పోయి రావాలి…!’ అంటూ అమెరికా లోనూ, చెన్నై లోనూ, హైదరాబాదు లోనూ, ఇంకా ఢిల్లీ లోనూ, మరెక్కడో ఉండి అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలే చెప్పుకుంటూ ఉంటారు. కానీ నా జ్ఞాపకాలన్నీ పెళ్లయి నేను మెట్టిన ఊరి గురించే. అవునండీ…నేను గుర్తు తెచ్చుకుంటూ చెప్పే ఊసులన్నీ మా ఊరు పాలంగి గురించే. ఈ ఊరు ఎక్కడుందబ్బా అనుకుంటున్నారా? అదే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామం పాలంగే మాది. ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పొలాలు, కంద, అరటి, దొండ, వంగ కూరగాయల తోటలు, మల్లె, చేమంతి, గులాబీ, మందార పూల తోటలు…ఓహో ఎంత సుందరంగా ఉంటుందో మా పశ్చిమ గోదావరి జిల్లా. చూసి తీరాలనుకోండి. సిరిసంపదా! మా జిల్లా సొంతం సుమండి. ఇహ మా ఊరంటారా? పచ్చని పొలాల మధ్య రోడ్డును ఆనుకుని ఉన్న పెద్ద చెరువు. అదే గుర్తు మా ఊరికి. ఊరి పొలిమేరలోనే ఆంజనేయస్వామి గుడి. ఇంతకీ చెరువుకి ఎదురుగా ఉన్న వీధిలో ఎత్తయిన అరుగుల పెంకుటిల్లే మాది.

మరి నేను కాపరానికి వచ్చేనాటికి తణుకు నుంచి పాలంగికి కచ్చా రోడ్డే ఉండేది. కేవలం ఎడ్ల బళ్లు వెళ్లే దారన్న మాట. ఎడాపెడా పెద్ద పెద్ద మామిడి చెట్లు, వేసవికాలం గుత్తులు గుత్తులు కాయలు, మధ్యమధ్యలో బూరుగు చెట్లు. మద్రాసు మహానగరంలో పుట్టి పదహారోయేట పెళ్లయి మొదటిసారిగా వచ్చాను ఈ పల్లెటూరికి.

చెరువు ఎదురుగా ఉన్న సందులో రెండో పెంకుటిల్లే మాది. మెట్లెక్కి వీధి కటకటాలు, హాలు దాటి పెరట్లోకి వెళ్తే ఎదురుగా పెద్ద మల్లె పందిరి. విరగబూసిన గులాబి చెట్లు. పక్కగా తిరిగిచూస్తే రంగురంగుల మందార చెట్లు, నుయ్యి దగ్గరున్న గుమ్మానికి పాకిన మాలతీ. ఓ వైపు నుంచి వంటింటి రేకుల మీదికి పాకిన మాధవి, జాజి తీగల గుబాళింపులతో ప్రకృతి మాత కట్టుకున్న రంగురంగులద్దిన పూల చీరలా ఉండేదా ఇల్లు. పాడీపంటా, పసివాళ్లు, ఎప్పుడూ వచ్చీ పోయే చుట్టాలతో ఇంట్లో ఎవరి మట్టుకు వాళ్లకే బోల్డు హడావుడి. ఎప్పుడూ సందడిగా ఉండేదీ లోగిలి.

తెలతెలవారుతుంటే కావిడిలో చిట్టూ, కుడితి పట్టుకెళ్లి పొలం నుంచి తప్పాలాతో పాలు పితుక్కొచ్చే రైతులు, గుమ్మంలో కళ్లాపి జల్లి ముగ్గులు వేసే ఆడాళ్లు, బిందెలు చంకన ఉంచుకుని ఊర బావి నుంచి మంచినీళ్లు తెచ్చుకునే ఇల్లాళ్లు, నిద్ర కళ్లన అమ్మల వెంటబడి పేచీలు పెడుతూ తామూ సిద్ధమయ్యే పసివాళ్లు. అరుగుల మీద కూర్చుని కబుర్లాడుకునే పెద్దలు. ఉదయం నీరెండలో పల్లె మొత్తం బంగారు రంగు పులుముకుని అందాలు చిందుతూ ఉండేది సందడి సందడిగా. మంద్ర స్థాయిలో చల్లచిలికే చప్పుళ్లు. వాటి శ్రుతిలో కలిపి ఇల్లాళ్లు పాడే గుమ్మడేడే గోపీదేవీ…గుమ్మడేడే కన్నతల్లీ అంటూ పాట వినబడుతూ ఉండేది నేపథ్యగానంలా! తులసికోట దగ్గర బామ్మ మేలుకొలుపు సూర్యనారాయణుడికి ‘శ్రీ సూర్యనారాయణా మేలుకో హరిసూర్య నారాయణా…ఉదయిస్తు బాలుడు ఉల్లిపూవు ఛాయ. ఉల్లిపూవూ మీద… ఒరేయ్‌ నేను మడి కట్టుకున్నాను ముట్టుకోకు. పొద్దున్నే ఆ పరుగులేమిటి ఆగు అక్కడే’ మామ్మల అదిలింపు. మా వీధి దాటి తూర్పుకేసి వెడితే పంటకాలువ మీది చిన్నొంతెన, దాన్ని దాటి ఉత్తరానికి తిరిగి పంటచేల మధ్య కాలిబాట మీద నడిచి వెడితే మా ఊరి శివాలయం వస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రావణబ్రహ్మను చంపిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి నూటొక్క శివలింగాలు ప్రతిష్ట చేశాడట. అలా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టించిందేనట ఈ రామలింగేశ్వరస్వామి లింగం! ఇక్కడ ఈశ్వరుడు ఎప్పుడూ నీటిలోనే మునిగి ఉండటం విశేషం. అంటే గర్భగుడిలో నీళ్లు, అందులో శివలింగం అన్నమాట. ఎప్పుడైనా నీళ్లు లేకపోతే ఊరికి అరిష్టంట. సూరమ్మామ్మ చెప్పేది. చెర్లో నీళ్లు తగ్గి గర్భగుడిలోకి నీళ్లు రాకపోతే బిందెలతో తెచ్చి మరీ నీళ్లల్లో ఉండేలా చూస్తాడు పూజారి. బాలాత్రిపురసుందరి సమేతుడైన రామలింగేశ్వరుడు చాలా మహిమ గల దేవుడు.

దేవాలయానికి ఆనుకుని రెండువైపులా విస్తరించిన కోనేట్లో కలువపూల మధ్య ప్రతిఫలించే గోపురం. కనుచూపు మేరంతా పంట చేలతో ప్రకృతిమాత పరమశివునికి పచ్చని వింజామరలు వీస్తున్నట్టు ఉంటుంది. దర్శనం చేసుకుని కోనేటి మెట్ల మీద కూర్చుని కొబ్బరి చెక్కలు ముక్కలు కొట్టుకుని తింటున్న మనని పలకరిస్తాయి పిల్లగాలులు ఆప్యాయంగా.

శివరాత్రి వస్తుందంటే ఎంత కోలాహలంగా ఉండేదో. టీవీలుండేవి కావుగా! గ్రామంలో జరిగే దేవోత్సవాలకి అందరూ పెద్దలే! కార్యక్రమాల గురించి చాందినీలతో వెలిగిపోయే పందిళ్ల అలంకారాల గురించి ముఖ్యంగా ఆ ఏడాది రాబోయే బోగం మేళాల గురించి (క్షమించాలి. 1950లనాటి మాటలు ఇలాగే ఉండేవి)… మండపేట నుంచా, వేల్పూరు నుంచా లేకపోతే ద్రాక్షారం నుంచా, ఏ జట్టులో అందగత్తెలున్నారు, వాళ్ల చేత ఏ డాన్సులు చేయించాలి…. ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే.

ఇక పౌరాణిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు ఎవరెవరివి ఉంటాయో వచ్చే కళాకారులు ఎవరెవరి ఇళ్లల్లో దిగుతారో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. రావి చెట్టుకింద, రచ్చబండమీద ఇదే చర్చ. చెర్లో బట్టలుతుక్కుంటూ ఆడవాళ్లదీ అదే చర్చ. దేవాలయం కోనేరులో ఈత కొడుతూ అబ్బాయిలు, అరుగుమీద చింతపిక్కలాడుతూ అమ్మాయిలది కూడా అదే చర్చ. శివరాత్రికి జరిగే తీర్థానికి (తిరునాళ్లకి) ఇంటి ఆడపిల్లల్ని, బంధువుల్ని పొరుగూళ్లనుంచి ఉత్తరాలు రాసి మరీ పిలిపించేవారు. చుట్టుపట్ల గ్రామాల, పట్టణాల జనాలు రెండెడ్ల బళ్లలో దిగేవారు. అలా వచ్చినవాళ్లకి ఊళ్లోవాళ్లు, కుటుంబాలవాళ్లూ పిలిచి భోజనాలు పెట్టేవారు.

పౌరాణిక నాటకాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణరాయబారంలో చెల్లియో చెల్లకో…, బావా ఎప్పుడు వచ్చితీవు…లాంటి పద్యాలతో శ్రీకృష్ణ వేషం కట్టిన విశ్వవిఖ్యాత రంగస్థల నటుడు శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజుగారు మా పాలంగి గ్రామస్తులే తెలుసా!

సంక్రాంతి పండగొస్తే ఎంత హడావుడో! తెల్లారగట్లే లేచి క్రితం సాయంత్రం పాలేరు చేత తెప్పించుకున్న ఆవుపేడతో కళ్లాపి జల్లి ఇరుగుపొరుగువాళ్లతో కలిసి ముగ్గులేసి పెరట్లో విరగబూసిన ముద్దబంతిపూలు కోసి తెచ్చి గొబ్బెమ్మల్ని సవరించి మిగిలిన పేడతో పిడకలు చేసి, దండలుగుచ్చి దాచే ఆడపిల్లలు, చీకటితోనే వచ్చే బుడబుక్కలాడు, హరిలో రంగ హరీ అంటూ హరిదాసు సాయంత్రం పూట, చక్కగా జడకుచ్చులతో, బంతిపూల జడలతో, చెవులకి అల్లల్లాడే జూకాలతో, గాజుల గలగలలతో – సుబ్బీ గొబ్బెమ్మా శుభములీయవే, కిట్టమ్మా గోపాలబాల కృష్ణమ్మా… గొబ్బీయెళ్లో…  గొబ్బీయెళ్లో… అంటూ అందరూ కలిసి పాడుకుంటూ గొబ్బి గౌరిని పసుపు కుంకాలతోపూజ చేసి చుట్టూ తిరుగుతూ పాడుతుండే దృశ్యం ఎంత మనోహరంగా ఉండేదో! చివరిగా గౌరమ్మ ప్రసాదం అందరికీ ఇచ్చి పేరంటం పూర్తి చేసేవారు కన్నెపిల్లలు. తెల్లవారాక అయ్యవారి ఇళ్లు ధర్మలోగిళ్లు అమ్మగారి సూపు సల్లని సూపు చిన్నాపెద్దలంతా సల్లంగుండాలి… అవునా బసవన్నా అంటుంటే మెడనిండా రంగురంగుల పూసలతో మువ్వలు, గంటలు గలగలమంటుంటే తల ఊపే బసవని చూస్తే పండగ రోజుల్లో ఆ మాటలు బసవని ఆశీస్సులు ఎవరికైనా సంతోషం కలగజేయక మానవు. వెంటనే ఓ చేటడు ధాన్యం, ఓ రూపాయి కాసు దానం చేయకమానరు. బసవన్నకి నేనంటే నేనంటూ చేటతో ధాన్యం పొయ్యడానికి పిల్లలు హడావిడి పోతుంటారు. అమ్మా బసవన్నకి ఓ వస్త్రం ఇప్పించండమ్మా అంటుంటే ‘ ఏవండోయ్‌. మీ పట్టుపంచె ఎలాగూ పాతబడి పోయింది కదా ! మొన్న పిల్ల పెళ్లికి కొత్తది కొనుక్కున్నారు కదా ! ఆ పాతది తెచ్చి బసవనికి కప్పండి ’ అంటూ పురమాయించే ఇల్లాలిని కాదనలేడుగా! లోపలికి వెళ్లి తెచ్చి బసవనికి కప్పి ఆశీస్సులు పొందుతాడా యజమాని మరోసారి. ఇలాంటి దృశ్యాలన్నీ పండగ రోజుల్లో కనువిందు చేస్తుండేవి. ఇంట్లో ఆడంగులకి ఊపిరాడని పని. పిండి వంటలతో పెద్ద పండక్కి ముఖ్యంగా అరిసెలుండాలి కదా! ఆ తర్వాతే తక్కినవి. తోటికోడళ్లు నలుగురూ, ఇంట్లో కాపురముంటున్న విశాలాక్షి, పక్కంటి రమణపిన్ని, అందరూ కలిసి అరిసెలకు బియ్యం నానబోసుకుని దంపుడు సావిట్లో అందరూ కలిసి కుందిరోట్లో దంపుకుని జల్లించుకుని పెరటి వసారాలో రెండు పొయ్యిల మీదా పెద్ద పెద్ద బూర్లు మూకుళ్లు పెట్టి ఎవరి ఇళ్లల్లోంచి వాళ్లు నూనె, బెల్లం, నువుపప్పు తెచ్చుకుని మొత్తంమీద అందరూ కబుర్లాడుకుంటూ తలోపని అందుకుంటూ పిండివంట పూర్తి చేసి, చేసినవన్నీ అందరూ పంచుకుని మిగిలిన కాకనూనె తలోకాస్తా గిన్నెల్లో ఒంపుకుని పండక్కి పిండివంటలు పూర్తిచేసుకునేవారు. అన్నట్లు అరిసెల పాకం పదును చూడటానికి రత్తమ్మత్త వచ్చి పాకం పదును నిర్ధారించాల్సిందే సుమండీ! అప్పుడే అరిసెలు సరిగ్గా అమిరేది!! చక్కగా కుదిరిన అరిసెలు అందరూ డబ్బాల్లో సర్దుకునేవారన్నమాట! హమ్మయ్య…పండగలో ఓ భాగం పూర్తయినట్లే. భోగినాడు వీధి మొగలో ఓ మంట, ఇంటిపెరట్లో ఓ మంట!! ముందుగానే పోగేసి తెచ్చిన దుంగలు, చితకులు అన్నీ పోగేసి. తెల్లారుజామున 3 గంటలకే లేచి చలిలో ఒకళ్లనొకళ్లు లేపుకుంటూ పెరట్లో చేరి భోగిమంట వేయడానికి సిద్ధం! కిర్సనాయులు తెండర్రా అంటూ అల్లుడుగారు పురమాయిస్తుంటే అమ్మమ్మ కిర్సనాయిలు ఒంపితే చంపేస్తుంది! కొబ్బరి పీచులు, ఎండిన చీపురు పుల్లలు గట్రా వేసి మంట పెట్టాలి. అబ్బే, అలా ఎప్పటికి అంటుకుంటుంది మంట! ఒసేయ్‌ చిట్టీ నువ్వెళ్లి పెరటి చావిట్లో అద్ద(ర్ధ) గోడమీదున్న కిర్సనాయిల్‌ సీసా తెచ్చెయ్‌. నేనడిగానని చెప్పు. పెద్దల్లుడిగారి పురమాయింపు! మొత్తానికి భోగి మంట అందుకుంది! ఆ సందడికి లేచి అక్కడికి చేరుకున్న పిల్లలు ఎవరికి వాళ్లు పక్కవాళ్లకు తెలియకుండా దాచిన భోగి పిడకల దండలు పట్టుకుని మామయ్యా నాచేత మంటలో వేయించవూ,  అత్తా ఈపక్క నుంచి నాచేత వేయించు. మంటంటే నాకు భయం. నువ్వు నన్ను పట్టుకోవే! మళ్లీ ఈ పక్కకురావే వాళ్లాయన పక్కకు చేరిన అమ్మాయి ఓర చూపులకు పరవశించే కొత్తల్లుడు. చలేస్తోంది కదూ? ఉహూ వెచ్చగా ఉంది!! గుసగుసలు!! ఎవర్రా సీసాడు కిర్సనాయిలు ఒంపేశారు అంటూ లోపలినుంచి అత్తగారి పొలికేక. అబ్బే లేదత్తయ్యా…అబ్బే లేదు. కిర్సనాయిల్లో ముంచిన కొబ్బరి ఆకుతో వెలిగించాం అంతే – కోడలి సమాధానం. మొత్తానికి ఇంటిల్లిపాదీ భోగిమంట చుట్టూ చేరి ఛలోక్తులతో, గుసగుసలతో పిల్లల కేరింతలతో భోగినాడు అందరూ కలిసి చలి కాగుతూ మొదటిరోజు పండగ మొదలెట్టుకోవడం మరపురాని అనుభూతి. అంతకుముందు చీకటితో లేచి వీధిలో చుక్కల ముగ్గులు పెట్టడం ఓ పని!

ఇహ ఉగాది వస్తే పిల్లలందరూ ఓపాటి చిన్న సైజు సైన్యంలా బయల్దేరి దక్షిణం పొలంలో వేసిన అరటితోటలో, తయారైన అరటి గెలలు కోయించి, కావు వేయించడంతో మొదలయ్యేది పండగ హడావుడి. పండగ రేపనగా మామిడి చెట్లెక్కి మామిడి పిందెలు, వీధి మొగనున్న వేపచెట్టెక్కి, వేప పూవు కోసం కొమ్మలు దులపటం, పొలాన్నుంచి చెరకు గడలు విరిచి తేవడం….ఇలా కాస్త పెద్ద పిల్లలు హడావుడిగా పరుగులెత్తుకుంటూ పనులు చేస్తుంటే –, వాళ్ల కాళ్లకి అడ్డంపడుతూ –, ఒరే అన్నయ్యా…ఆ చెరుకుగడ నేను మోసుకొస్తా! అన్నయ్య చెట్టునుంచి కింద పడేస్తే ఎన్ని మామిడి పిందెలు ఏరానో!! బావా వేపపువ్వు ఇదిగో… నా పరికిణీలో వెయ్యవూ? చిన్నబావా! నేనూ పనిచేస్తా నాక్కూడా పనిచెప్పవూ? అంటూ వాళ్ల వెనకే ఈ బుల్లి సైన్యం. ఎంత హడావుడో!! క్షణం తీరికలేనట్టు ఇంట్లోకి, వాకిట్లోకి పరుగులు. ఇహ ఆడవాళ్లది మరో రకం హడావుడి. ఇళ్లూ వాకిళ్లూ కడుగుళ్లూ, ముగ్గులు, తలంట్లు, పిండివంటలు, కొత్తబట్టలు… ఓహో! ఎంత సందడి! ఏం హడావుడి! ఇక పండగనాడైతే తలంటు పూర్తిచేయడం (పిల్లలందరికీ) ఓ యజ్ఞం!! సరే వేపపువ్వు పచ్చడి తిని, పంచాంగ శ్రవణానికి అందరూ రామాలయం చేరి శాస్త్రులు గారు చెప్పిన సంవత్సర ఫలాలు విని కొత్త సంవత్సరం ఎలా ఉండగలదో అంచనాలేసుకుంటూ, పండగ పూటా – శాస్త్రులుగారికి దక్షిణతాంబూలాలిచ్చి ఆశీస్సులు పొందడం, తాతలకి, మామ్మలకి దండాలెట్టి, వాళ్ల దీవెనలు, వాటితోపాటు వీళ్లు చేతిలో పెట్టే తృణమో, పణమో ఆనందంగా తీసుకోవడంలాంటి దృశ్యాలు కనుమరుగైపోయాయిప్పుడు!

ఏ పండక్కి ఆ పండగే! ఎంత సంబరంగా జరిగేవి! వినాయకచవితి వస్తుందంటే…పిల్లలందరూ కలిసి బాబయ్యగారి ఆధ్వర్యంలో (ఆయన వాళ్ల ఎలిమెంటరీ స్కూలు టీచరు కూడా) పొలాలవెంట తిరిగి ఏకవింశతి పత్రాలు పోగుచేయడం, ఆయన ఏ ఆకు పేరేదో చెబుతూ దగ్గరుండి కోయించేవారు. అవన్నీ తెచ్చి మా మండువాలో గుట్టగా పోసి, మళ్లీ ఎవరికి వారు వాటినుంచి పేరుపేరునా ఆకులు తీసుకునేవారు. ఆకులనకూడదు వాటిని ‘పత్రి’ అనాలి! శ్యామలక్క పిల్లలందరినీ పోగేసి ఇంత బంక మట్టి తెచ్చి బాగా పిసికి కాస్త పెద్ద పిల్లలచేత మట్టి వినాయకుణ్ణి చేయించేది. పది పదిహేను వినాయకులు సిద్ధం! ఈలోగా దుర్గక్క, వాళ్ల చెల్లి కలిసి గొడుగులు తయారు చేయడానికి సరంజామా సిద్ధం చేసేవారు. రమేష్, సత్తిపండు, రావుడు వెదురుబద్దలు (వాళ్లింట్లో తడిక చివరినుంచి లాగేసిన వెదుర్లు!) సన్నగా బ్లేడుతో చెక్కి గొడుగు కర్రలు సిద్ధం చేస్తే, టౌన్‌ నుంచి కొని తెచ్చుకున్న ముచ్చిబంగారం కాగితాలతో అక్కలు చక్కగా గొడుగులు తయారు చేసి ఒక్కో వినాయకుడి వెనకాల అమర్చడం… ఎంతందంగా వెలిగిపోతున్నారో వినాయకులు! ఇవన్నీ రాత్రంతా అలా మండువాలోనే ఉంచి తెల్లారగట్లే వచ్చి (స్నానం చేశాకే) ఒక్కొక్కళ్లూ ఒక్కో వినాయకుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి పూజ చేయాలన్నమాట! అందరూ దెబ్బలాడుకోకుండా శ్యామలక్క దగ్గరుండి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్కటి గొడుగుతో సహా జాగ్రత్తగా ఓ బాదం ఆకు మీద పెట్టి ఇచ్చేది. పుస్తకాలు అమర్చుకుని బొజ్జ గణపయ్యకి నాన్న, బాబయ్య, అత్తలు, అన్నయ్య… అందరం కూర్చుంటే తాతగారు వచ్చి పూజ చేయించేవారు. ఉండ్రాళ్లు నైవేద్యం ‘‘విఘ్నము సేయకురా వినాయకా’’ అంటూ అక్క పాటపాడేది. ‘‘ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య’’, పద్యాలు వినాయకుడి కథ చదివి అక్షంతలు నెత్తిన వేయించుకుని పండగ భోజనం ముగించుకుని ఊరి మీదకు వెళ్తే…మళ్లీ రాత్రికే ఇంటికి రావడం. వినాయక నిమజ్జనం అదో సంబరం!! ఊరి సావిట్లో నిలిపిన వినాయకుని ఊరేగించి కాలువలో నిమజ్జనం చేసే రోజు ఎంత కోలాహలమో! బుట్ట బొమ్మలు, డప్పులు, బాణసంచా… ఓహో కోలాహలమే కోలాహలం. ఏ పండగకి ఆ పండగే! ఏ ఏటికి ఆ ఏడే ఇప్పుడే కొత్తగా చేసుకుంటున్నామా? అన్నంత సంబరంగా చేసుకునేవాళ్లం. ఆ ఆనందం బహుశా సామూహికంగా చేసుకోవడం వల్ల వచ్చిందేమో! మధ్యమధ్యలో చిన్నచిన్న కోపాలు, తాపాలు, అలకలు, అల్లర్లు ఉన్నా… అవన్నీ తాత్కాలికాలే! ఆనందమే అంతిమ లక్ష్యం. అందరం అయినవాళ్లమేగా, పరాయివాళ్లెవ్వరు! అదీ బంధం!

ఎన్ని మార్పులు? కాలం మారిందా? మనుషులు మారారా?…. ఏమో? మొత్తానికి అంతా మారిపోయింది. కాలానికి మార్పు సహజమే కానీ నాగరికత, గ్లోబలైజేషన్‌ మరీ అంత ఆరోగ్యకరమైన మార్పు తెచ్చినట్లు అనిపించదు నాకైతే! అయినా చేయగలిగిందేం లేదు.

పాలంగి రూపే మారిపోయింది. పెంకుటిళ్ల స్థానాల్లో మేడలు, ఆకాశాన్నంటే అపార్టుమెంట్లు, షాపింగ్‌ మాల్స్‌!! ఇవన్నీ పచ్చటి పొలాలు మార్చి ఏర్పడ్డవే. జీవం తొణికిసలాడుతూ, హృదయాన్ని పరవశింపజేసే పచ్చని పొలాలకు బదులు ఖరీదైన రాళ్లు పరిచిన అంతస్తులు, కళ్లు చెదిరే షాపింగులు ఎక్కడో బొంబాయి, కలకత్తాలను తలపించే ట్రాఫిక్‌ జాంలు… ఇది మా పాలంగేనా?! అనిపిస్తుంది.

సోఫాలో ఒదిగి పడుకుని ఉగాదినాడు టీవీలో పంచాంగశ్రవణం వింటూ, పచ్చడి టిన్‌ మూత తీస్తూ… ‘వేప్పువ్వు పచ్చడి కూడా ‘స్వగృహ ఫుడ్స్‌’ వాళ్లు అమ్ముతున్నారు తెలుసా, టీవీలో ఈరోజు స్పెషల్‌ ప్రోగ్రాం ఉంది కానీ అన్నం ఒక్కటే పడేస్తాను. టౌన్‌కెళ్లి,  ‘సిద్ధాంతి కర్రీ పాయింట్‌’ లో హాయిగా కంద బచ్చలి మీకు, బంగాళాదుంప వేపుడు పిల్లాడికి ఇంకా సాంబారో, పులుసో నచ్చినవి ఏమైనా సరే తెచ్చేయండి. అన్నట్టు చలమయ్య స్వీట్‌ స్టాల్‌లో ఏదో ఒక స్వీటు తెచ్చేయండి చాలు’. ఇలాంటి సంభాషణలు దాదాపు ప్రతి ఇంట్లోనూ వినబడుతున్నాయి.

మారే కాలానికి మౌనసాక్షులం మా తరం. మా ముందు తరం వాళ్లు అదృష్టవంతులు. జీవితాన్ని వాళ్లు అనుకున్న రీతిలో జీవించగలిగారు. కానీ మా తరం మార్పును చూడటమే కాదు… మార్పుకి గురవుతోంది కూడా – అందుకే గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంలో బతికేస్తాం. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అన్నారందుకే! ఇంకా కొంతకాలం గడిస్తే ఉండటానికి ఇళ్లే కానీ, పండించడానికి పొలాలుండవేమో అనిపిస్తుంది. తిండికి కటకటలాడాలా? ఏమో!!! పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ అన్నానికి బదులు ‘గుళికలు’ మింగి బతుకుతారేమో జనాలు!! ఏమో!!? బహుకాలం బతికితే బహు వింతలు కళ్లజూడొచ్చు. ఏమైనా అది మా ఊరు! పాలంగి!

నా జ్ఞాపకాల హరివిల్లు!!!

**********************