10_013 తో. లే. పి. – కె. విజయాదిత్యన్

.

                గురుశిష్యుల సంబంధం వంటిదే వృత్తిలో పై అధికారికి, అతని క్రింద పని చేసే ఉద్యోగస్తునికీ మధ్యన ఉండే సంబంధం. గురువు తనవద్ద విద్యను అభ్యసించే విద్యార్థి నుండి కోరుకునేవి వినయవిధేయతలు, చదువుపట్ల ఆసక్తి, అంకితభావం, గురువుపట్ల గౌరవభావం. అదేవిధంగా అధికారి  క్రింద పనిచేసే ఉద్యోగి కూడా తన బాధ్యతలను ఎరిగి తదనుగుణంగా ప్రవర్తిస్తే, లభించే విజయం లో అతనికి కూడా స్థానం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇందుకు భిన్నంగానూ, నియమాలకు విరుద్ధంగానూ ప్రవర్తిస్తే వచ్చే అపకీర్తి లో తనకి కూడా తప్పకుండా భాగస్వామ్యం ఉండి తీరుతుంది. 

.

నా మటుకు నాకు నా ఉద్యోగ పర్వంలో వివిధ సందర్భాలలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయాయి. అంటే అవి రెండు విధాలుగానూ – అటు మంచీ-చెడుగా కూడా అన్నమాట.  కాగా, నా క్రింద పనిచేసే ఉద్యోగస్తులలో చాలామంది తమవంతు పూర్తి సహాయ, సహకారాలని నాకు అందించడంతో నా ఉద్యోగ ధర్మాన్ని విద్యుక్త ధర్మం గా భావించి సక్రమంగా నిర్వహించగలిగాను. అందుకు ప్రతిఫలం గా పై అధికారుల నుండి మెప్పు, మన్ననలను పొందగలిగాను. ఒక వంక వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటూనే వేరొకవంక అవసరమైన సందర్భాలలో వారు అడగకుండానే వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఉండేవాడిని. ఆ కారణంగా వారు కేవలం నాపట్ల, వారి పై అధికారిగా గౌరవాన్ని చూపడమే కాకుండా, ప్రత్యేక అభిమానాన్ని కూడా వ్యక్తపరచేవారు. వారి ఆ స్పందన  నన్నెంతగానో సంతోషపరిచేది.  

.

ప్రస్తుత విషయానికి వస్తే, 1993 లో నేను, ఉద్యోగం లో పదవోన్నతి మీద కర్నూలు జిల్లాలో నంద్యాల లోని తెలుగు గంగ ప్రాజెక్ట్ లో మెకానికల్ డివిజన్ కు ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా నియమింపబడి అక్కడ ఆ పదవి లో చేరాను. మా డివిజన్ లో నాలుగు సబ్ డివిజన్ లు ఉండేవి. రెండు ఫీల్డ్ మెషినరీ సబ్ డివిజన్లు, ఒక స్టోర్స్ సబ్ డివిజన్, ఒక ఎలెక్ట్ర్రికల్ సబ్ డివిజన్. ఇందులో ఎలెక్ట్రికల్ సబ్ డివిజన్ కి డెప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా విజయాదిత్యన్ పని చేసేవారు. బాధ్యతాయుతం గా తాను పని చేస్తూ తనకింద వారిచేత కూడా పనిచేయించడం అయన లోని ప్రత్యేకత. వ్యక్తిగతం గా సౌమ్యుడు విజయాదిత్యన్. 

.

నేను సెప్టెంబర్ 2000 లో పదవీ విరమణ చేసి విజయవాడ లో స్థిరపడడం జరిగింది. అయినా కూడా అంతక్రితం నా వద్ద పని చేసిన వారు నాతో కాంటాక్ట్ లో ఉంటూ ఉండేవారు. అలాగే విజయాదిత్యన్ కూడా. విజయాదిత్యన్ అటు పిమ్మట, ఎక్జిక్యూటివ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్ గా కొంత కాలం పని చేసి తరువాత చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ మీద హంద్రీ నీవా ప్రాజెక్ట్, అనంతపూర్ లో పోస్ట్ చేయబడ్డారు. పదవి లో చేరిన వెంటనే నాకు ఆ శుభవార్తను అందజేస్తూ, కృతజ్ఞతలను తెలుపుతూ ఆయన వ్రాసిన ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. ఆ ఉత్తరం లోనే తన కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావిస్తూ, తన కుమార్తె అంతకు మూడు సంవత్సరాల క్రితం న్యుమోనియా జ్వరం తో బాధపడుతూ కన్ను మూసినట్లుగా విషాద వార్త ను అందించారు. దాదాపు 15 సంవత్సరాల వయసు ఆ పాప ది. ఆయన ఉత్తరం లో ఆ విధంగా ఒక సంతోషకరమైన వార్త,.. తన ప్రమోషన్ గురించి, వేరొక వంక విషాద వార్త… కుమార్తె అకాల మరణం గురించి – చాలా సంతోషం వేరొకవంక బాధ కలిగాయి ఆ ఉత్తరం చదువుతూంటే… 

.

ఈ సంఘటన జరిగిన మరికొన్ని ఏళ్ళకి….   

విజయాదిత్యన్ ఉద్యోగం రీత్యా  హైదరాబాద్ కు బదిలీ చేయబడ్డారట. ప్రతీ రోజు ఈవెనింగ్ వాక్ చేయడం  ఆయనకు అలవాటని. ఒకరోజు సాయంత్రం బయటకు వెళ్లి వాక్ చేస్తూ ఉంటే, ఆయన వెనుకనుండి vehicle హారన్ మ్రోగించకుండా వేగం గా వచ్చి ఆయనను గట్టిగా ఢీ కొట్టినట్లు, ఆ కారణం గా ఆ ప్రమాదం లో ఆయన తీవ్రంగా గాయపడి మరణించినట్లు !. ఇది  నాకు అందిన మరో విషాద వార్త !! చాలా బాధాకరం అనిపించింది నా మనసుకి. 

.

అయితే, ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రస్తావించాలి … విజయాదిత్యన్ భౌతికంగా కనుమరుగైనా అతనికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం ఎన్నేళ్లు గడిచినా నాటికీ, నేటికీ కూడా చెక్కు చెదరలేదంటే నమ్మండి. 

.

<><><>*** నమస్తే … ధన్యవాదాలు ***<><><>