10_018 పాలంగి కథలు-యానాం పెళ్లి 2

.

‘‘నేను చెప్పనా? మరేమో హంసరాయబారం బొమ్మలో దమయంతిలా?! అచ్చుమచ్చు అలాగే ఉందనుకో! నాకైతే చాలా నచ్చింది సుమా!”

“నిజమే మావయ్యా. డాక్టర్‌ తాతగారింట్లో పందిరి పట్టెమంచం ఉన్న గదిలో ఉన్నాయి చూడు. హంస రాయబారం? రాసలీల, రాధాకృష్ణ ఫొటోలు? కదే పిన్నీ? అవేగా నువ్వు చెబుతున్నవి?”

“అవును. అవి రవివర్మ చిత్రాలట. చిన్నక్క చెప్పింది. చెన్నపట్టణంలో వాళ్లింట్లో కూడా ఉన్నాయిట.”

అన్నీ జార్తగానే విన్నాడు శాస్త్రి. కానీ పెద్దగా ఆసక్తి లేనివాడిగా ముఖం పెట్టి– ‘‘సరేలెండర్రా ఒంతులోయి మరీ చెబుతున్నారు. ఆ చెంబులో మంచినీళ్లున్నాయి. అందుకోండి. అలిసిపోయారు గానీ, కాసిని మీరు తాగి, నాక్కాసినివ్వండి’’.

‘‘ఔనులే అన్నయ్యా ఎదురుచూసి, విని నువ్వు అలిసిపోయావు మరి. ఇదిగో మంచినీళ్లు. నీకు పలహారం పెట్టనే లేదు వదిన్ని చూడాలనే హడావుడిలో. ఇటు వచ్చి పీట మీద కూర్చో అన్నయ్యా. చిన్ని వెండికంచంలో వడ్డిస్తాను. ఆ ఇలాయి దీపం ఇటు పెట్టవే చిన్నీ. అబ్బో…మిఠాయి, కారబ్బూందీ ఉన్నాయిరా. ఇది మినప పోలి (ఆవిరికుడుములు) కాబోలు. వెచ్చగానే ఉందిరా. అల్లం పచ్చడి కాబోలు. ఇదిగో మాగాయ పచ్చడి కూడా ఉంది. వెయ్యనా? అన్నట్లు తేనె పానకం ఉందిరా గ్లాసులో. నీకిష్టంగా…వెయ్యనా ఈవైపు?’’

‘‘అబ్బా…ఉహూ వేసెయ్‌కే తినలేను’’.

‘‘పట్టుమని తిన్నదేదిరా! రేపింక చద్దెన్నం అవీ ఉండవు సుమా! పెళ్లయ్యే దాకా ఉపవాసమే. కాస్త మెల్లిగా తిను. మీరు కూడా తినండే”

– “అలాగేలే నీదవనీ. ఒరేయ్‌ అన్నయ్యా…ఒదినుంటే దీపం అక్కర్లేదురా. అంత వెలిగిపోతోందనుకో’’.

‘‘చాల్లేవే…వచ్చినప్పటినుంచీ అదే ధ్యాస?’’

“మావయ్య మాత్రం వెలిగిపోవడం లేదేమిటి పిన్నీ.”

“నిజం! చీకట్లో ఆ బుడ్డిదీపం వెలుగు పడ్డప్పుడల్లా ఆ చెవిపోగులకున్న రాయి తళుక్కుమని మెరుస్తుంటే మరీ అనిపిస్తుంది. చూడు కావలిస్తే?”

‘‘ఏమర్రా…ఇందకణ్ణించి చూస్తున్నాను. అబ్బో కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయే? పెళ్లికూతుర్ని,  పెళ్లి కొడుకునీ తెగ బేరీజు వేస్తున్నారు’’ అప్పుడే లోపలికొచ్చిన రంగం మావయ్య ఇంకా ఏదో అనబోతుంటే…

“ఓహో! రంగం మావయ్యా…నువ్విక్కడున్నావా? నువ్వెప్పుడొచ్చావ్‌? చూడలేదు.”

“నేను అరగంటైంది. అప్పటికి అందరూ పెళ్లివారింటికెళ్లిపోయారు. వీణ్ణి పలకరించి మరీ వెళదామనుకుంటుంటే మీ మాటలు విన్నాను”– రంగం వెళ్లొచ్చిన చిన్న మావయ్య లోపలికొచ్చి కూర్చుంటూ.

‘‘ఊ…ఏరోయ్‌ పెళ్లికొడుకూ, పెళ్లికి పట్టు లాల్చీ అదీ కుట్టించాడే మీ నాన్న. మెళ్లో చంద్రహారం, చెవిపోగులు…వీళ్లన్నట్లు వెలిగిపోతున్నావ్‌ సుమా!’’

‘‘ఏవిటి మావయ్యా నువ్వుకూడా. వీళ్లకి నేనొకణ్ణి దొరికాను వేళాకోళానికి. విస్తరిదగ్గరున్నాను క్షమించు మావయ్యా నమస్కరించడానికి’’.

‘‘ఏం ఫర్వాలేదులేరా మేనల్లుడా. పెళ్లికొడుకువు కదా! మేమే నీదగ్గరికి రావాలి’’

‘‘ఇంకా ఎవరైనా చుట్టాలొచ్చారేమో చూసి రమ్మన్నారు. ఇందాక ఓ రాదారి పడవ వచ్చిందట? అందులో ఎవరైనా దిగారేమో? అడిగి భోజనానికి వచ్చేయమని చెప్పమన్నారు” –అంటూ ఆడపెళ్లివారి తాలూకు అబ్బాయి వచ్చాడు.

‘‘ఆ…ఆ… నేనూ, నాతోపాటు ఇంకో ముగ్గురం దిగాం. వస్తాం పదండి. పట్టుబట్టకట్టుకుని. ఇదిగో అబ్బాయ్‌… వీధరుగు మీద కూర్చున్నారు చూడు గంటినుంచి వచ్చారు. వాళ్లతో కూడా చెప్పు. మడికట్టుకుని భోజనానికి రమ్మని. ఇదిగో ఈ పక్క సావిట్లో పెట్టుకోవచ్చంటావా? అమ్మాయీ ఇదిగో సంచీ’’.

“అలాగే మావయ్యా– లాంతరు తెస్తానుండండి.”

………………………..

సన్నాయివాళ్లు భూపాల రాగం మొదలుపెట్టారు. కావమ్మ హడావుడి పడిపోతోంది. అన్నీ ఇవాళే! తెల్లారకట్లే పెళ్లికొడుకుని చేయడం, వెంబడే స్నాతకానికి కూచోవాలి. ఏవిటో ఇంట్లో ఇంచక్కా పెళ్లికొడుకుని చేసి, పేరంటం ఊరంతా పిలిచి చక్కగా చేసుకోవాలని ఎంతగా అనుకున్నానో! గోదారి దాటాలిగా! అందుకని స్నాతకం కూడా ఇంట్లో చేసుకోవడానికి లేకుండా పోయింది. అన్నీ యానాంలోనే!

“పిల్లల్ని అలా పడుకోనివ్వండర్రా. గది తలుపులు ఓరవాకిలిగా వేసిరండి. దీపం అలా కింద పెడతావేం? పిల్లలు లేచి దీపం మీద పడగలరు. లాంతరు తగిలించడానికి కొక్కెం ఉంది చూడు. దానికి తగిలించు.”

“అమ్మా… చలిగా ఉందే.”

“వెనకవైపు పెరట్లో నూతిదగ్గిర పొయ్యి వెలిగించి నీళ్లు కాస్తున్నారు చాకళ్లు. వెళ్లి బాల్చీలో నీళ్లు తొలిపి ఇమ్మని త్వరగా స్నానం చేసిరా. అక్కడే మనతో వచ్చిన చాకలి మంగి కూడా ఉంటుంది. మీరు నలుగురూ పోసుకురండి. మంగిని మీ బట్టలు పట్టుకోమనండి. త్వరత్వరగా తెమలాలి. 5 గంటలకల్లా పెళ్లికొడుకుని చెయ్యాలి మరి. ఏవిటో చక్కగా లంకంత కొంప! ఊరందర్నీ పిల్చుకుని పెళ్లికొడుకుని చేసి, ఆపై చక్కగా నట్టింట స్నాతకం చేసుకుని, పెళ్లికి బయలుదేరి వెళ్లొచ్చనుకున్నాను.”

‘‘అమ్మా…మళ్లీ మొదలెట్టావూ! ఇప్పుడింకేం మాట్లాడకు. ఇదుగో నీకు బనారసు పట్టుచీర పెట్టెలోంచి తీసి ఇక్కడ పెడుతున్నాను. కట్టుకుందువుగాని. సరా?”

“ఆ చీర స్నాతకానికి కట్టుకుంటానే. ఇప్పుడు తమ్ముడి నెత్తిన చమురు పెట్టి స్నానం చేయించాలి కదా? ఆ బరంపురం పట్టుచీర తీసి ఉంచు.”

“అమ్మా…పెళ్లికొడుకుని చెయ్యడానికి ఆ మండువా పక్క వసారాలో పేరంటానికి పీటా అదీ వేసి, మిగతా అన్నీ సిద్ధం చెయ్యమని పెద్ద చెల్లినీ, పిన్నినీ పురమాయించు. ఈలోగా తమ్ముడిని తీసుకువస్తాను. నువ్వు నెత్తిన చమురుంచి హారతిచ్చాక, స్నానం చేయిస్తాలే తమ్ముడికి. అన్నట్లు పసుపు కొమ్ములు దంచడం ఎలాగే? రోలూ రోకలీ ఇక్కడ ఎలా దొరుకుతాయి?”

“సూరిగాడ్ని పెళ్లివారింటికెళ్లి ఓసారి అడిగిరమ్మను. వాళ్లేం చెబుతారో?”

“బ్రహ్మగారా…రండి, రండి.”

‘‘అమ్మా 5గంటల 5 నిమిషాలకల్లా పెళ్లికొడుకుని చేసెయ్యాలి సుమండీ’’.

‘‘అన్నీ సిద్ధం చేసేశాం. ఆ పసుపు దంచడానికి రోలురోకళ్లూ ఎలాగా అని…’’

‘‘మీరుండండి. ఆడపెళ్లివారు పట్టుకొచ్చారు. నేతెప్పిస్తాను’’.

‘‘అక్కయ్యా ఆడపెళ్లివారు ప్రతిదీ చాలా పద్ధతిగా, ఎప్పుడేం కావాలో గుర్తుగా తెచ్చారు సుమా! పోన్లే. దాలా మంచి సంబంధం. పెళ్లికూతురు కూడా కుందనం బొమ్మలాగుంది.”

‘‘సరే సరే. నడవండి.”

కావమ్మకి మనసులో మురిపెంగానే ఉన్నా ఇంకా ఎక్కడో ఓ మూల కులుక్కుమంటుంది వాళ్లు సమదంతాదారులుకారని!

“కబుర్లు తరవాత. బ్రహ్మగారూ పెళ్లి కొడుకుని చేశాక వెంటనే స్నాతకం పీటలమీద కూచోడమేనా? ఇంతకీ ఈయనగారు ఎక్కడా కనబడరేం? స్నానం అదీ అయిందంటావా అమ్మాయ్‌ మీ నాన్నగారిది?”

‘‘అమ్మా…నాన్నగారూ, బాబయ్యలూ, వాళ్లంతా అనుష్టానం చేసుకుంటున్నార్లేవే. వచ్చేస్తారు’’.

‘‘అమ్మాయ్‌…నువ్వూ, పిన్నిగారి లక్ష్మీ పెళ్లివారింటికెళ్లి బొట్టుపెట్టి పిలిచి రండి.

“ఇదుగో…అమ్మాయిని పెళ్లికూతుర్ని చేస్తున్నారుగా. పిలుపులకి వాళ్లొచ్చేశారప్పుడే. బొట్టు పెట్టించుకోండమ్మా అందరూ.”

“ఆడపెళ్లివారింటికి కొందరు వెళ్లండి పేరంటానికి. తక్కిన వాళ్లిక్కడి ఏర్పాట్లు చూడండి. పెట్టెల్లోంచి వెండికంచాలు, పన్నీరు బుడ్డీ అవీతీసి, సద్దండి మరి! తాంబూలాలు సద్దండి. అరటిపళ్లగెలలుఆ వీధిలో అరుగు మూల పెట్టించారు. ఈపాటికి పచ్చబడతాయి. చూసి అత్తాలు కోయించండి ఒకరు వెళ్లి. ఈ తాటాకు బుట్టలో అత్తాలు విరిచి తెచ్చుకుంటే వీలుగా ఉంటుంది. తాంబూలం అదీ ఆ వెండిపళ్లాల్లో సద్ది, గంధం, అక్షింతాలూ, పసుపుకుంకం ఆ కమలం పళ్లెంలో పెట్టుకుని వచ్చినవాళ్లకి బొట్టూగంధం అవీ ఇద్దురుగాని!”

“అమ్మా…నేను బొట్లు పెడతానే. గంధం ఒంచేస్తానంటారుగా. బుల్లెక్కను రాయమను.”

“మరే…నేనే పన్నీరు జల్లుతా. అన్నీ నువ్వేనేమిటి? నేనోమరి?”

“అబ్బబ్బా…పోట్లాడుకోకండర్రా. తలోటి తలోళ్లూ ఇద్దురుగాని లెండి. పసుపు రాయడం, తాంబూలాలివ్వడం పెద్దవాళ్లు చేస్తారు సరా.”

“ఊ…అమ్మా, అత్తయ్యలు, పిన్నీ, నేనూ ఆడపెళ్లివారింటికి వెళ్తున్నాం. పేరంటానికి. చంటాడు గదిలో పడుకున్నాడులే.”

‘‘అలాగే పెందరాళే వెళ్లి వచ్చేయండి. వాళ్లని కూడా ఇక్కడి పేరంటానికి రమ్మని చెప్పండి’’.

‘‘అమ్మమ్మా…నేను పేరంటానికి వెళ్లను. మావయ్య కాళ్లకి పసుపు రాసి, పారాణి పెడతా!’’

‘‘అబ్బే మరీ చిన్నపిల్లవి. నువ్వు పసుపు రాస్తే ఇల్లూ వాకిలీ పులిమేస్తావ్‌’’

‘‘మరి సుందరి మాత్రం రాయెచ్చేం…?’’

‘‘అది నీకంటే పెద్దది కదే? సరేలే పసుపు నువ్వు రాద్దువుగాని. ఇంతకీ మావయ్య ఒప్పుకుంటేనూ’’

‘‘నువ్వు చెప్పమ్మమ్మా–నాచేత పసుపు రాయించుకోమని’’.

‘‘అబ్బబ్బా…ఊరికే నస పెట్టకే చెబుతాలే. చిన్నారిచేత పసుపు రాయించుకో నాన్నా ఇవాళ్టికి. వద్దని దాన్ని ఏడిపించడం ఎందుకు?’’

“అలాగేలేవే చిన్నారి. పసుపు రాద్దువుగానిలే…”

మనసంతా ఏదో ప్రేమ భావం అలుముకుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎవరిని చూసినా ఏదో ఆత్మీయంగా అనిపిస్తోంది. ఆనందంగా ఉంది. హృదయాన్ని ఆవరించిన ఆనందం గదంతా వ్యాపించినట్లు అందరిలోనూ ప్రతిఫలిస్తున్నట్లు ఒక భావన. పెళ్లికూతుర్ని చూసివచ్చినవారందరూ ఆ అమ్మాయిని పొగిడేవారే!! సాక్షాత్తూ లక్ష్మేమనట. ఇందాక బుల్లి మావయ్య కూడా–‘‘ఒరేయ్‌ శాస్త్రీ! చాలా అదృష్టవంతుడువిరా. ఆ పిల్ల మనం చదువుకున్న ప్రబంధ సుందరిని గుర్తుకు తెస్తూంది. మరీ చిన్నపిల్లలా ఏం లేదు సుమా! నీకన్ని విధాలా తగిందిరా. నాకు చాలా ఆనందంగా ఉందిరా శాస్త్రీ!’’

కొంచెం బిడియంగా అనిపించినా మావయ్య వరసకే గానీ సహాధ్యాయుడూ, ఆత్మీయుడూను. అందుకే–‘‘నిజంగానే మావయ్యా. నీ మాటలు అత్యుక్తులు కావు కదా!’’

‘‘అబ్బే కాదురా అబ్బీ. విజయవిలాసంలో – సుభద్ర, గిరిక, దమయంతి, కుముద్వతి…వాళ్లంతా గుర్తుకొచ్చారు. చిన్నపిల్లలా అనిపించలేదు. నిజానికి దేవతామూర్తిని చూసినట్టు అనిపించింది సుమా! నిజం. అత్యుక్తి ఏమాత్రం కాదు’’.

మావయ్య మాటలు వింటుంటే అమ్మాయిని గురించిన ఆరాటం శాంతించింది. భగవంతుడా నా సంసార జీవితం ఏ ఒడిదుడుకులూ లేకుండా సాగనీ !

‘‘మావయ్యా. కాలుకాస్త ముందుకు చాపు మరి….’’

‘‘అలాగేనమ్మా’’.

పసుపూ, పారాణీ, బుగ్గన చుక్క. ఆడపిల్లలంతా చుట్టూ చేరి ఒకటే హడావుడి.

“వచ్చారర్రా పేరంటానికి వెళ్లి? ఇంకా రాలేదేమా! అనుకుంటున్నాను.”

“ఆ…ఆ…వచ్చేశాం అమ్మా. పెళ్లికూతురు ఉదా పట్టుచీరలో ఎంత బాగుందనుకున్నావ్‌? బాల తొడుగు, మెళ్లో కంటె, చేతికి గాజుల జత పెట్టారమ్మా.”

“అయినా కోడలే చాలు! కోటి నగల పెట్టు! నిజం…అవునక్కయ్యా. ముద్దూ ముచ్చట్లూ ఏమాత్రం చెయ్యగలరా అనుకున్నాం గానీ ఏలోటూ లేకుండా చేసేవాళ్లల్లాగానే ఉన్నారు. పోనీలే అక్కయ్యా. అన్నీ కోరుకున్నట్లు జరుగుతున్నాయి. అంతే చాలు!”

అన్నీ వింటున్న కావమ్మ జవాబు చెప్పకుండా బింకంగా పనులు చేసుకుపోతోంది. పెళ్లికొడుకుతోపాటు ఆవిడా చూడలేదు పెళ్లికూతుర్ని ఇంతవరకూ!

పెళ్లికొడుకును చేశాక ఆ వెంటనే స్నాతకం పీటల మీద కూచోవడం అయింది. నాన్నగారు, అమ్మ పక్కన కూర్చుని యధావిధిగా కార్యక్రమం పూర్తి చేశారు. ‘అక్కలు ఆరుగురూ, చెల్లి, అందరూ పట్టుకుని హారతిస్తూ ‘రాధాపతే మంగళం’ అంటూ ముక్తకంఠంతో పాడుతుంటే వీళ్లందరి ప్రేమకూ నేను పాత్రుణ్ణి అనుకుంటుంటే మనసు ఆర్ద్రత పొందింది. నాన్నగారు ఘనంగా అందరికీ అర్థ నూటపదహార్లూ హారతి పళ్లెంలో వేయడం, అక్కలంతా తాంబూలాలు అందుకుని తర్వాతి కార్యక్రమాలకు సిద్ధం కావడం మొదలుపెట్టారు. కాశీయాత్రకంటూ పాంకోళ్లు తొడుక్కుని గొడుగు పట్టుకుని నడుస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. సరే, కాబోయే బావమరిది వచ్చి బెల్లం అచ్చు గెడ్డం కింద పెట్టి బ్రహ్మగారు చెప్పమన్నట్టు చెప్పడం…పరాచికాలు…మొత్తానికి తంతు పూర్తి చేసుకున్నాం.

విశాలమైన వీధిలో కొబ్బరాకుల పందిరి వేయించారు. వీధంతా పచ్చగా కళాపి చల్లి, చక్కగా ముగ్గులు తీర్చారు. పచ్చని మామిడాకు తోరణాలతో కళకళలాడుతోంది పందిరి. ఆడపెళ్లివారు అన్నీ ఎంతో పొందిగ్గా చేస్తున్నారు. ఎక్కడా ఏ వస్తువుకీ తడుముళ్లాట లేదు! ఇదంతా వాళ్ల ఊరి మోతుబరి రాజుగారి ఏర్పాట్లేట! ఆయన ఈ పెళ్లి బాధ్యత తనమీద వేసుకుని ఎక్కడా లోటన్నది రాకుండా చూస్తున్నారట! పల్లకీతోసహా కావలసినవన్నీ పడవల్లో వేయించి చేరేశారట యానాం. ఇంతకీ పెళ్లికి వచ్చినవారందరికీ పెళ్లి భోజనాలు ఆయన ఖాతాలోనేట. అందరూ చెప్పుకుంటున్నారు.

రామ్మూర్తిగారికి చాలా ఆనందంగా ఉంది తన అంచనా మేరకే అన్నీ సజావుగా జరిగిపోతుంటే! స్నాతకం పీటల మీద పక్కన కూర్చున్న కొడుకుని చూసుకుంటుంటే మనసు ఉప్పొంగింది. ఇంతవరకూ కన్యాదానాలే చేశాడు. ఈరోజు తన వంశోద్ధారకుడికి వధువును నిర్ణయించి కొద్దిసేపట్లో కల్యాణం చేయబోతున్నాడు. క్షణకాలం కళ్లు మూసుకుని, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి నమోవాకాలు అర్పించాడు.

భజంత్రీల మోత! కన్యావరణం జరుగుతోంది. ఆపై ప్రవర చదువుతున్నారు. రామ్మూర్తిగారికి ఆ ప్రవర వింటుంటే, పితృదేవతలంతా అదృశ్యరూపంలో నిలిచి దీవిస్తున్నట్లనిపించింది. మనసులోనే నమస్కరించుకున్నాడు.

తెరవెనక మేనమామలు బుట్టలో తీసుకువచ్చి కూర్చోబెట్టిన పెళ్లికూతురుంది. కొద్దిక్షణాల్లో తన జీవితంలోకి రాబోతున్న వధువు ఉనికి అంతరంగానికి అనుభూతమవుతూంది శాస్త్రికి! తాను నారాయణుడు. అలాగనే తన పాదాలు కడుగుతున్నారు మామగారు. జీలకర్ర, బెల్లం కలిపిన ముద్ద చేతికిచ్చారు. భజంత్రీలు తారస్థాయిలో మ్రోగుతున్నాయి. మొదటి స్పర్శ! శిరస్సు! జీలకర్ర, బెల్లం మాధ్యమంగా!! వెంటనే తెరదించి పరస్పరావలోకనం చెయ్యమన్నారు. సుముహూర్తంలో పెళ్లికూతురిని మొట్టమొదటిసారి చూడగానే క్షణకాలం కళ్లలో మెరుపులు మెరిసినట్లనిపించింది. ముందు అమ్మాయి తలెత్తి చూడటానికి జంకినట్లుంది. బ్రహ్మగారు “ఇదిగో అమ్మాయ్‌…పెళ్లికొడుకు కళ్లల్లోకి చూడాలమ్మా. తలదించుకోకూడదిప్పుడు. తలెత్తి చూడు. ఆ–అదీ. అలాగన్నమాట!” అంటూ ప్రోత్సహించాడు. మొట్టమొదటిసారి కలిసిన చూపులు. ఒళ్లు జల్లుమంది. తెర తొలగి  చూపులు కలిసిన క్షణం ఆంతర్యంలో ‘ఈ అమ్మాయి నాకెప్పటినుంచో పరిచయం’ అనిపించింది. భగవంతుడు నాకోసం నిర్ణయించిన ఇల్లాలు ఈ పిల్ల. బ్రహ్మగారు పెళ్లి తంతు ఒక్కొక్కటీ నిర్వహింపజేస్తున్నారు. మాంగళ్యం తంతు నానేనా…మమ జీవన హేతునా…పెళ్లికూతురి మెడలో(మాంగళ్యం) మంగళసూత్రం ముడివేస్తూ ఈ ముడులకు నేను కట్టుబడి ఉంటాను. ఈ బంధం ఇప్పటిది కాదు… మనసులో భావాల పరంపర సాగుతోంది. బాహ్యంలో పెళ్లితంతూ సాగుతోంది. ఆశీస్సులతో కూడిన అక్షింతల జల్లులు. తలంబ్రాల తంతు మొదలుపెట్టారు బ్రహ్మగారు. కుర్రకారంతా కేరింతలు కొడుతూ వెనక చేరారు. అమ్మో పెళ్లికూతురు వెనక చాలామందే ఉన్నారే. వాళ్లంతా హుషారు చేస్తుంటే బిడియంగా, ముచ్చటగా, తలంబ్రాలు పోసుకోవడం…శరీరమూ, హృదయమూ ఆనందతరంగితమైనట్లుంది. మొత్తానికి అక్కడికా పెళ్లి తంతు పూర్తయింది. ఊ…మనవాడు గృహస్తయ్యాడు.

రామ్మూర్తిగారు చక్కని కోడల్ని తెచ్చారు.

“ఏరా బామ్మర్దీ (చినమావయ్య ఆనందం ఎక్కువైనప్పుడు అలాగే పిలుస్తాడు.) నేను చెప్పింది నిజమేనా అమ్మాయి గురించి?” గుసగుసగా దగ్గరకొచ్చి అన్నాడు.

‘అవును నిజం. ఆ మధుపర్కంలో ప్రబంధసుందరిలాగే ఉంది. ధన్యోస్మీ! పరంధామా! ధన్యోస్మీ! అనుకున్నాడు మనసులో! మర్నాడు హోమాలు, వేడుకలు, ఆడంగులందరూ కలిసి మమ్మల్ని నిమిత్తంగా చేసుకుని వాళ్లు సరదాలు తీర్చుకుంటున్నారు.

నలుగులూ, బంతులాటలూ, అలకపాన్పులట! అక్కలూ, బాబయ్యగారి పిల్లలూ, వదినలూ, అందరూ చుట్టూ చేరి ఏవేవో చేయించారు. చెప్పొద్దూ. నాకే బిడియం అనిపించింది. పెళ్లికూతురికి ఇంకెంత అనిపించిందో. మధ్యమధ్యలో మావాళ్ల వేళాకోళాలకి, నా పక్కన కూర్చున్న ఆ పిల్ల…కాదు వెంకటలక్ష్మి బుగ్గలు ఎర్రబడటం కనపడింది ఓరగా చూసిన నాకు! ముచ్చటగా అనిపించింది!

ఇహ మర్నాడు విడిది గృహప్రవేశానికి పల్లకిలో ఊరేగించి తీసుకొచ్చారు. తలుపుల దగ్గర అక్కలందరూ చేరి పేర్లు చెప్పందే రానివ్వమని!! చెప్పాలని అనుకున్నా, వెంటనే మాట పెగలందే అందర్లోనూ!! మొత్తానికి నేనే చెప్పాను ముందర! లేకపోతే ఎంతసేపు నిల్చుంటాం!? తనూ చెప్పింది వినీవినబడకుండా! అమ్మగుమ్మంలోపల నిలబడి ఇద్దర్నీ మురిపెంగా చూడటం గమనించాను. అక్కలు హారతిచ్చాక లోపలికి వచ్చి, అమ్మ కాళ్లకి దండం పెట్టాం ఇద్దరం. ఆపై నాన్నగారికి దండం పెట్టి ఆయన కళ్లలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూశాను. అర్ధం చేసుకున్న నాన్నగారు ఇద్దర్నీ దీవించి, కదిలివెళ్లబోతున్న మమ్మల్ని  ఆపి, మరోసారి ఇద్దర్నీ మార్చి, మార్చి చూసి ‘‘అమ్మీ! నీ కొడుకూ కోడలూ ఎలాగున్నారంటావ్‌? లక్ష్మీనారాయణుల్లా లేరూ?’’ అంటుంటే ‘‘అవునండీ– ఎవరి దిష్టీ తగలకుండా–అమ్మాయ్‌…ఎర్రనీళ్లు తెచ్చావా? తమ్ముడికీ, మరదలికీ దిగదుడిచి పోసి, లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టండి. ఆ చివర పెట్టెమీద ఎర్ర రంగు దుప్పటీ ఉంది. ఆ చాపమీద పరచి, వాళ్లని కూర్చోమనండి. కాస్త తినడానికేమైనా పెట్టండి అంటూ పురమాయించిన అమ్మ మాటకు అక్కలంతా హడావిడిపోతూ పూర్తిచేశారు.

జీవితంలో మొట్టమొదటిసారి ‘నా’దైన అమ్మాయి పక్కన కూర్చున్నాను. ఈ అమ్మాయి నాది అనుకుంటుంటే ఏదో గమ్మత్తుగా అనిపించింది!

మర్నాడు సదస్యం. సదస్యానికి పడవల మీద వచ్చారు. గోదావరి జిల్లాల పండితులు ఖండవిల్లి రామ్మూర్తిగారింటి పెళ్లికి! ఘనంగా వేదాశీస్సులందించిన వేద పండితులనందర్ని అంత ఘనంగానూ సత్కరించారు రామ్మూర్తిగారు. తృప్తినిండిన మనసులతో–వంశాభివృద్ధిగా శతమానం అని దీవించి వధూవరుల శిరస్సులపై అక్షింతలు జల్లారు వేదవిదులైన విప్రులు.

పెళ్లితంతు చివరికొచ్చింది. ఆ రోజు అప్పగింతలు. గతంలో ఎన్నో పెళ్లిళ్లు చూసినా ఈ రోజు ఈ కార్యక్రమం మనసును బరువెక్కిస్తోంది. అక్కలందరినీ ఇలాగే పంపారు నాన్నగారు. మావగారు, అత్తగారు, మా ఇంట్లోవాళ్లని పేరుపేరునా వరసనా కూర్చోబెట్టి, పెళ్లికూతురు చేతులు పాలతో తడిపి మరీ అప్పజెప్పారు.

‘‘అష్టవర్షాభవేత్‌ కన్యా పుత్రవత్‌ పాలితామయ’’

అంటుంటే వాళ్లందరిలోనూ భావోద్వేగం పెల్లుబికి కన్నీరవడం చూసిన నాకూ చాలా బాధనిపించింది. ఆడపెళ్లివారంతా కళ్లనీరెట్టుకునేవారే! ఇలాంటి సన్నివేశం అక్కల పెళ్లిళ్లలోనూ జరిగినదే. కానీ, ప్రత్యక్షంగా సన్నివేశంలో ఉండటం వల్ల మరీ అనిపిస్తోంది కాబోలు!

అప్పగింతలప్పుడు తనకిచ్చిన చీర అటూ, ఇటూ తిప్పి చూసుకుంటూ, చీరబాగానే ఉందికానీ, పసుపు పచ్చ రంగు చీరై ఉంటే ఎంతో బాగుండేది అన్న బుల్లెక్క మాటలు విన్న పెళ్లికూతురు మేనత్త కాబోలు–‘‘పసుపు పచ్చ రంగు చీర మీ మూడో అక్కకు కాబోలు ఇచ్చారు. కావాలంటే మీరూ మీరూ మార్చుకోండి. మీకు ఏ రంగు ఇష్టమో మాకు తెలీదు కదమ్మా’’– విన్న అమ్మ అక్కకేసి కోపంగా చూసేసరికి అక్కడినుంచి వెళ్లిపోయింది చీర తీసుకుని.

యానాంలో పెళ్లి పూర్తి చేసుకువచ్చారు రామ్మూర్తిగారు కొత్త కోడల్ని తీసుకుని. తగూలో పిండివంటలూ, అప్పగింత బట్టలూ, పెళ్లి ఏర్పాట్లూ, మర్యాదలూ, అన్నీ ఘనంగానే ఉండి అందరినీ తృప్తి పరిచినై! ఏ శషభిషలూ లేకుండా పెళ్లి సజావుగా సాగి ఆనందంగా జరిగిపోయింది.

తన వంశోద్ధారకుడు తాను ఎంచిన కోడలి చిటికెన వేలు పట్టుకుని, గుమ్మం ముందు నిలబడితే, ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తూ, తన సంకల్పం నెరవేరి, నట్టింట వెలుగులు చిమ్మే కోడలు వచ్చినందుకు భగవంతుడికి మనసులోనే నమోవాకాలు అర్పించాడు రామ్మూర్తిగారు. భర్త పక్కన నిలబడ్డ కావమ్మగారికి కూడా అన్నివిధాలా తృప్తిగానే ఉంది. పైకి కనబడటం ఆవిడ నైజం కాదు. అంతే!

సత్యనారాయణ వ్రతం సమయానికి వియ్యాలవారందరినీ బంధుమిత్ర సహితంగా రమ్మని కోరిన రామ్మూర్తిగారి మాట తీసెయ్యలేక కేశనకుర్రు నుంచి అందరూ వచ్చారు, నడింపల్లి రాజుగారితో సహా.

‘‘ఎలా జరగుతుందోననుకున్న యానాం పెళ్లి అన్నివిధాలా చక్కగా జరగడం అందరికీ ఆనందంగా ఉంది. రాజుగారూ! మీ ధర్మమా అని పిల్ల పెళ్లి నేను చెయ్యగలిగినదానికంటే ఘనంగా జరిగింది. ఇదంతా మీ పుణ్యమే!” అంటూ రాజుగారి రెండుచేతులూ పట్టుకుని కళ్లకద్దుకున్నాడు ఉద్వేగంగా పెళ్లికూతురి తండ్రి!

‘‘రాజుగారూ! మీ వంటి శ్రేయోభిలాషులు స్నేహితులైతే ఏ కార్యమైనా జయప్రదమే. స్నేహం అంటే మీదే! నాకు మీ ఇద్దరినీ చూస్తుంటే బహుముచ్చటేస్తుంది సుమండీ’’ రామ్మూర్తిగారు మనస్ఫూర్తిగా అభినందించారు.

‘‘రామ్మూర్తిగారూ! మా చిన్న పల్లెటూళ్లో వారు మాకూ, వారికి మేమూ! మిమ్మల్ని గురించి కోనసీమలో ఘనంగా చెప్పుకుంటారు. వినడమే కానీ గతంలో మీ పరిచయభాగ్యం కలగలేదు. ఈ పెళ్లిద్వారా మీతో కూడా సాన్నిహిత్యం కలగడం మా అదృష్టం.

కాస్త మనసులు విశాలం చేసుకుని కార్యాలు చేసుకుంటే ఎంత ఆనందం పంచుకోవచ్చో. మీ వియ్యంకులిద్దరినీ చూస్తే తెలిసింది కార్యం సక్రమంగా గట్టెక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది.”

ముంగండలో రామ్మూర్తి శాస్త్రి గారి ముంగిట్లో వేసిన పందిట్లో మాట్లాడుకుంటున్నారు మగవాళ్లు. కాసేపట్లో నూతన వధూవరులు సత్యనారాయణ వ్రతం ప్రారంభించాలి.

బంధువులంతా, పెళ్లికి రాలేకపోయినవారూ ఇక్కడ వ్రతానికి వచ్చారు. ఒకటే కోలాహలం. పందిట్లో పిల్లల పరుగులూ, పెద్దల కబుర్లూ, ఇక లోపల ఆడంగులు పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో ఆ ముచ్చట్లన్నీ నెమరేసుకుంటూ, అక్కడికి రానివారికి వివరించే పనిలో ఉన్నారు.

శాస్త్రి సహాధ్యాయులు ఓపక్క చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిలో చాలామంది రామ్మూర్తిగారి శిష్యులే. గురువుగారింట వివాహ వైభవాన్ని ఒకళ్లకొకళ్లు చెప్పుకుని ఆనందిస్తున్నారు.

బ్రహ్మగారు వీధరుగు మీదకొచ్చి, ‘‘శాస్త్రి గారూ ! లోపలకి దయచేయండి అందరూ. వ్రతం మొదలుపెడదాం’’

“ఆ…ఆ…వస్తున్నాం. రండి. అందరం లోపలికి వెళ్లి కూర్చుందాం.”

‘‘లక్ష్మీనారాయణుల కల్యాణం ఒక కమ్మని అనుభూతినిచ్చింది మావయ్యా’’

’’ నిజమేరా అబ్బీ’’

తరువాయి వచ్చే సంచికలో……

.

*******************