10_017 వాగ్గేయకారులు – వీణ కుప్పయ్యర్

.

వీణ కుప్పయ్యర్

(1845-1917)

కర్ణాటక సంగీతం తెలిసిన వారందరికీ వీణ కుప్పయ్యర్ పేరు సుపరిచితమే. వర్ణములు, కృతులు, తిల్లానాలు అనేకం రచించారు. అన్నిటికన్నా, కర్ణాటక సంగీత ప్రేమికులకు, పాడేవారికీ అందచేసిన అఖండ సేవ ఏమిటంటే,  వీరి రచనలన్నీ శాశ్వతంగా నిలిచేలా అచ్చు వేయించి ఉంచారు.

సంగీత త్రిమూర్తులలో ప్రముఖులైన శ్రీ త్యాగరాజస్వామివారి అనేక శిష్యులలో ఒకరు వీణ కుప్పయ్యర్. గొప్ప గాయక, వైణిక విద్వాంసులైన శ్రీ సాంబమూర్తి గారి ఏకైక పుత్రులు. తమిళ బ్రాహ్మణ వంశానికి చెందిన వడమ శాఖ, భరద్వాజ గోత్రస్తులు. చిన్న వయసులోనే సంస్కృతాంధ్ర భాషల్లో విద్వత్తును పొందిన కుప్పయ్యర్ త్యాగరాజువారి వద్ద శిష్యరికం చేసే ముందరే, సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటంతో, త్యాగరాజు గారికి వీరిపట్ల ప్రత్యేకాభిమానం ఉండేదిట.  ఎంతో చక్కని గాత్రం తో శ్రావ్యంగా పాడే వీరికి ” పాట కుప్పయ్య “, ” గాన చక్రవర్తి ” అనే బిరుదులూ ఉండేవి.

ఏటా రెండుమార్లు వీరు రాధారుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఉత్సవాలు చేయించేవారట. ఒకటి చిత్రపూర్ణమి, మరోకటి వినాయక చవితి. ఈ సమయంలో ఎన్నెన్నో సంగీత కచేరీలు, గానసభలు నిర్వహించేవారు. ఇవన్నీ దైవ సన్నిధిలోనే జరిగేవిట. అటువంటి ఒక ఉత్సవ సమయంలోనే, త్యాగరాజుగారు అక్కడ ఉండటం జరిగి, వేణుగోపాలస్వామి దివ్యమంగళ విగ్రహం చూసి తన్మయత్వంతో కేదారగౌళ రాగం లోని ” వేణుగాన లోలుని గన వేయి కనులు కావలె ” అనే కీర్తనను రచించారట.

కుప్పయ్యర్ గారు పెద్ద కృతులు, మధ్యరకపు కృతులు అనేకం తెలుగు మరియు సంస్కృతంలోనూ రచించారు. కానీ సంస్కృతంలో మనకి ప్రస్తుతం కానడ రాగం, ఆదితాళంలో ” జగదభిరామా ” అనే కృతి మాత్రమే ఉపలబ్ధం అవుతోంది.  వీరి ప్రముఖ రచనలు తాన వర్ణములు. ఇవి లేకపొతే మన సంగీత పునాది ఎంత బలహీనంగా ఉండేదో అని అనుకోక తప్పదు.

మద్రాసుకు ఉత్తరంగా ఆరుమైళ్ళ దూరంలో గల తిరువత్తియారులో చాలా సంవత్సరాలు ఉన్నాక, మద్రాసుకు మకాం మార్చారు. వీరు, వీరి కుమారుడైన తిరువత్తియారు త్యాగయ్య గారి కృషి వలన మద్రాసు ప్రజలలో నేటికీ సంగీతాభిరుచి కొనసాగుతూ ఉంది. వీరి తాన వర్ణములు త్యాగరాజు గారికి ఎంతో ప్రీతిపాత్రమని చెప్తారు. వీరు కొవ్వూరు సంస్థాన పండితులు గా ఉండేవారు.

వీరు పెద్ద కృతులు, మధ్యరకపు కృతులు, తిల్లానాలు రచించారు. వీరి కృతులు త్యాగరాజు గారి శైలిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కృతులకు వీరు రచించిన చిట్టస్వరాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ఉదాహరణకి, ” బాగుమీరగను ” అనే వెంకటేశ్వర పంచరత్న కృతి యొక్క చిట్టస్వరంలో మంద్రస్థాయిలో ‘సనిద పదని’ అనే చోట ” నవరోజు ” రాగ ఛాయలు సోకకుండా రచించారు. ” సనిద నీపా ” అని పడితే అది తప్పకుండా నవరోజు రాగ ఛాయలను కలిగి ఉండేది. అందుచేత, చిట్టస్వరం మధ్యమ కాలంలోనే పాడటం ఆవశ్యకం చేశారు వీరు.

” బాగుమీరగను “…..డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ

.

వీరు రచించిన కృతుల జాబితా:

శ్రీ వెంకటేశ్వర పంచరత్నములు

శ్రీ కాళహస్తీశ్వర పంచరత్నములు

శ్రీ తిరువత్తియూర్ త్రిపురసుందరీ కృతులు ఎనిమిది

వీరి సంగీత పోకడల్లో ఆంగ్ల సంగీత ఛాయలు కూడా కానవస్తాయి. బిలహరి రాగంలో ” ఇంత చౌక ” అనే తాన వర్ణంలో ఆఖరి ఎత్తుగడ స్వరం పాశ్చాత్య సంగీతాన్ని పోలి ఉంటుంది. అతి కష్టం మరియు ఉభయావక్ర రాగం అయిన నారాయణగౌళ రాగాన్ని లొంగదీసుకుని, ” మగువ ” అనే అటతాళ వర్ణాన్ని రచించిన ఏకైక సంగీతకారుడని చెప్పవచ్చు. వీరి మరొక ప్రముఖ వర్ణం రీతిగౌళ లోనిది.

” మగువ “ – అటతాళ వర్ణము

వాయులీనం : టి. ఎన్. కృష్ణన్, స్వరకర్త : వీణ కుప్పయ్యర్

.

కుప్పయ్యర్ గారి వేణుగోపాల భక్తి వలన వారి రచనల్లో ” గోపాల దాస ” ముద్ర కానవస్తుంది. 72వ ఏట పరమపదించిన శ్రీ వీణ కుప్పయ్యర్ గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు సంతానం లేదు. రెండవ భార్యకు కలిగిన ముగ్గురు కుమారులలో ఒకరికి గురువుగారి పేరు త్యాగయ్య అని నామకరణం చేసుకున్నారు. తిరువత్తియూర్ త్యాగయ్యగారు తండ్రిగారి రచనలనన్నిటినీ ముద్రించారించారని పైన తెలియచేసుకున్నాను.

కుప్పయ్య గారికి చాలామంది శిష్యులు ఉండేవారు. వీరిలో ప్రముఖులు కొత్తసవాల్ వెంకట్రామయ్యర్, ఫిడేల్ పొన్నుస్వామి మరియు పల్లవి విద్వాంసుడుగా పేరొందిన పల్లవి సీతారామయ్య.

****************