12_012 సాక్షాత్కారము 03

 

తే. గీ.     పూవు కాయయు దూటయు పూట పూట

            కూరగా నుపయోగించు కోసకు-ఆకు

            కూడు కుడువంగ మనుజులకుం బ్రియమ్ము !

            అరటి ప్రతిభాగ ముపయోగ్య మగును గాదె ?

 

తే. గీ.     స్వాదుజలమును మీగడ పైన పెంకు

            కమ్మనౌగుంజు పీచును కాండ మాకు

            పరుల కుపయోగపడినట్టిభాగ మేది ?

            శ్రీలలిత మైనవితరణశీలమునకు

            పెట్టినది పేరు కొబ్బరిచెట్టు కాన !

            అదియ భూలోకకల్పక మనగ చెల్లు !

 

తే. గీ.     అరుచి పోనాడి రోగము నపనయించి

            పరుల కుపకార మొనరింప పాలుపడుచు

            తీపితేనీయ లందించువేపపూల

            జన్మమే జన్మ మాది యెంతసార్థకమ్మొ !

 

తే. గీ.     ఎండవానలలోన తా మెండి తడిసి

            శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;

            తమఫలమ్ముల నొకటియున్ తాము తినక

            పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

 

తే. గీ.     ఆకుపౘ్చనిఅందాల రేకు విప్పి

            అదిర ! యిన్నాళ్లు నవనవలాడి యాడి

            పండబారి బంగరుకాంతి పరిఢవిల్లి

            కాల మైనంత ఆకులు నేల రాలు !

 

తే. గీ.     నేల రాలును పూచినపూలు కొన్ని !;

            చిగురుబోణులసీగలలో చేరు కొన్ని ;

            అదిర ! పరమేశపాదపూజార్పితమ్ము

            లయినపూవులె ధన్యమ్ము లగు ధరిత్రి !

 

తే. గీ.     తరువునకు అల్లుకొనుతీవ తరువుతోడ

            పౘ్చగా పదికాలాలు పరిమళించు ;

            తరువు నిలిచిన తీవయు ధరణి నిలుచు ;

            శాఖి కూలిన లతయును సహగమించు !

 

తే. గీ.     అదిగొ ! చూడుఁడు బంతిచె ట్టాకునుండి

            పూవువఱకును పరిమళమ్ములు వెలార్చు

            పరులకోసమె వలపులు పంచి పంచి

            రాలిపోయెడువితరణశాలివోలె !

 

తే. గీ.     తరువునుం బోలువాడెపో పురుషు డరయ

            తీవవంటిదె యిల్లాలు తీవబోణి !

            నరులలో పశుపక్షులన్ సహజమైన

            పుణ్యగుణ మిది యీకర్మభూమిలోన !

 

తే. గీ.     సిగ్గు లొలికెడునునులేతబుగ్గలట్లు

            ఎఱ్ఱనెఱ్ఱగ నున్నది యీగులాబీ !

            కులుకులేజవరాలిచిన్నెలను చూపి

            బొద్దుగా నున్న దదిగొ ! ఆ ముద్దబంతి !

 

తరువాయి వచ్చే సంచికలో…..

 

****************************************

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి