10_016 తెలుగువారి జానపద కళలు

.

వేట మాత్రమే తెలిసిన ఆదిమ మానవునికి ఆటపాటలు పట్టుబడటం ఒక విప్లవాత్మకమైన మార్పు. నిజమే అలసిన మేను కొంత కులాసా కోరుకోవడం సహజం. వేటలో విజయం పొందినా, మనసైన వారి మనసులను గెలుచుకున్నా ఒక దరహాసం సహజమే. ఇలా హాసముల, విలాస సమయంలో మనసు నుండి పుట్టిన ఒక క్రమబద్ధమైన ఆనంద ధ్వని జానపదం గా రూపు దిద్దుకుంది అనుకోవచ్చును. గలగల సవ్వడి చేసే గంగని, భగభగ మండే సూర్యుడు, చల్లని గాలుల పవనుడు, అందరిని పరవశిoప చేసే మేఘుడు, చెట్టు, పుట్ట మొదలుకుని తన జీవనానికి ఆసరాగా ఉన్న ప్రతి దానిలోనూ ఆదిమ మానవుడు దైవాన్ని దర్శించాడు, తన్మయత్వము చెందుతూ భక్తితో ఆడాడు. మనసులోని భావాలకు అనుగుణముగా నాట్యము చేసాడు. బతుకు కోసం వేట, జీవించడం కోసం పాట నేర్చుకున్నాడు. భావోద్రేకాలు మనిషికి సహజ గుణాలు, ఈ గుణాల ప్రకటన లేదా అనుకరణ ఒక కళ. ఇలా ఇతర మనుషులను, తమతో ఉండే జంతువులు, పక్షులు మొదలగు వాటిని చూసి అనుకరించి తమ కళలకు, భావ ప్రకటనకు మానవుడు మెరుగులు దిద్దుకున్నాడు అనుకోవచ్చు.

.

హాలుని గాధాసప్తశతి లో ఆకాలము నాటి కళలను గురించి వివరించడము జరిగింది. అమరావతీ శిల్పాల అందాలలో మనకు ఎన్నో నాట్య భంగిమలు కనిపిస్తాయి. బౌద్ధ జాతక కథలలో నటుల గురించి సమాచారము లభిస్తుంది. దక్షిణ దేశానికి చెందిన ‘ కువలయ ’ అనే నాట్యకారిణి బుద్ధుని జీవిత విశేషాలను నాట్యముగా రూపొందించి ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. ఇక్ష్వ్వాక రాజులు లలితకళలను ఎక్కువ పెంపు చెయ్యకపోయినా  శాతావాహనుల కళా సంస్కృతిని కాపాడినది వీరే. పల్లవుల కాలంలో రుద్రాచార్యుడు అనే ప్రఖ్యాతి పొందిన సంగీత విద్వాంసుడు ఉండేవారట, ఈయన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ కు సంగీత గురువు. పల్లవుల తరువాత వేంగి ప్రాంతమును రాజధానిగా చేసుకుని పాలించిన శాలంకాయనుల కళాభిరుచి మనకు పెద్దగ కనబడదు. తరువాత వచ్చిన విష్ణుకుండినులు గుహాలయాలకు, వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యతను ఇచ్చారు.  విజయవాడ మొగల్రాజపురం లో ఉన్న బహు బాహువుల నటరాజమూర్తి శిధిలముగ ఉన్నప్పటికీ కళా దృష్టిలో మేలైన నమూనగా చెప్పుకోవచ్చు.

.

కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలపు కవియైన పాల్కురికి సోమన తన బసవ పురాణము లోను, పండితారాధ్య చరిత్ర లోను ఎన్నో పల్లె పాటలను, జానపద కళా రూపాలను వర్ణించాడు. రోకటి పాటలు, భజన పాటలు, ఇంట్లో పాడుకునే భక్తి పాటలు, తుమ్మెద పాటలు మొదలైన పాటల రూపాలు మనకు కనిపిస్తాయి. యక్షగానాలు, తోలుబొమ్మల ఆటలు, కోడంగి ఆటలు ( హాస్య వేషగాళ్ళు ) పలురకాల నాట్య పట్టికలు, ఇవేకాక శ్రీశైలములో శివరాత్రి ఉత్సవములో ప్రదర్శించే జానపద కళారూపాలను గురించి పండితారాధ్య చరిత్రలో వివరించాడు. బసవ పురాణములో పెండ్లి వేడుకలను గురించి కోలాటం, గొండ్లి, పేరిణి మొదలైన కళారూపాలను గురించి వివరించాడు.  జాయప్ప సేనాని నృత్య రత్నావళి లో ఎన్నో నాట్య రీతులను గురించి మనకు తెలుస్తాయి.

విజయనగర రాజుల ఏలికలో మహర్నవమి దిబ్బమీద జరిగే నాటకాలు, ఇవే కాక పగటి వేషగాళ్ళు, భోగం పడచుల నాట్యాలు, దాసరులు, ఎరుకులసానిల ఆటలు, సంగీత సాహిత్య గోష్టులను గురించి, ఆంద్ర తమిళ సంప్రదాయాలు సంగమ మధుర రాజ్యం లో వెల్లివిరిసిన మేలత్తూర్ భాగవతులు, పుత్తుకుడి వీధి నాటకాలు, ద్రావిడ కళారూపం కురవరల కురుంజి, కూచిపూడి భాగవతుల భామా కలాపం, గొల్లా కలాపం, తోలుబొమ్మ లాట, ఇవేకాక ప్రజలు మెచ్చిన పగటి వేషగాళ్ళు – వీరిలో పిట్టల దొర, అంబ పలుకు జగదంబ పలుకు అంటూ వచ్చే జంగమ దేవర, పాట పాడుతూ పార్వతీ శివుల సంవాదాన్ని చెప్పే అర్ధనారీశ్వరుని వేషం, దొమ్మరి వారి ఆటలు, గంగిరెద్దుల ఆటలు, గడి దొరసాని ఆట, రాయలసీమ విప్ర వినోదులు, ఇంద్రజాల విద్యలు, హరి కథలు, బుర్రకథలు, బుడిగే జంగాల కథలు,  అశ్శరభ శరభ అంటూ చేసే వీర విన్యాసాలు, పులి వేషం, దొమ్మరి మేళం, గ్రామ దేవతల జాతరలో ప్రముఖంగా జరిగే గరగల నృత్యం, కోలాటం, జడ కోలాటం, చిందు భాగోతం, తప్పెట నృత్యం, పెళ్లి వేడుకలో భాగంగా జరిగే కోల (ళ్ళ) సంబరం ( వేంకటేశ్వరుని పెళ్లి కథ ), ప్రభల విన్యాసం, గణాచారుల విన్యాసం, సుద్దుల కథలు, గోండు, ధింసా  నృత్యాలు, పెళ్లి పాటలు, బతుకమ్మ, గొబ్బెమ్మ ఆటలు, డప్పుల నృత్యం, లంబాడీ నృత్యాలు, కర్ర సాము, కత్తి సాము. కొయ్య కాళ్ళ మనుషులు ఎన్నో మరెన్నో ఇవన్ని ఆదిమకాలం మానవుని నుండి నేటి ఆధునిక మానవుని వరకు రంజింప చేస్తున్న విభిన్న జానపద కళా రూపాలు.

.

జానపద కళలు మనసుకు ఆనందము కలిగించడమే కాకుండా, సమాజానికి మార్గ నిర్దేశనము, సాంస్కృతిక వికాసము, చరిత్రను ముందు తరాలకు అందజేయటము, ప్రకృతిలో ఉన్న గుణ, విశేషాలను గ్రహించడం లో తోడ్పడటం, భావ ప్రకటనకు ఒక మార్గముగా భాసిస్తున్నాయి.

.

****************************************************

P. Gayatridevi

Hyderabad

Mobile : 9618059298, Mail : gayatriputsa@gmail.com

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

______________________________________________________