11_020 ద్విభాషితాలు – నాన్న రూపాయి

 

పాత బీరువా..

రహస్య అరలో..

ఎర్రటి ఫోల్డింగ్ పర్సులో..

నాన్న..తన అదృష్టంగా భావించి దాచుకొన్న…

మాయని రూపాయి కాగితం!

 

నాన్న  సేద్యం చేసిన భూమి..

తన అనంతరం కరిగిపోయినా..

మా వూరిలో మా ఆకాశహార్మ్యం..

నా చిరునామాలో చెరిగిపోయినా..

ఈ రూపాయి…

నా బాల్యాన్ని..నాన్న వైభవాన్ని.. గుర్తుచేసే.. ఓ తీయటి జ్ఞాపకం!

 

రూపాయి విలువ..

వెలిగిపోతున్న కాలంలో…

పండగనాడో.. తన పుట్టినరోజు నాడో..

మా ఊరిని ఆశ్రయించుకొన్న శ్రామికులకు..  

నాన్న పంచిన రూపాయిలు..

నేటికీ కధలుగా వినిపిస్తాయి.

 

నాన్న ఇచ్చిన రూపాయితో..

మా ఊరి అమ్మవారి జాతరలో.. రంగులరాట్నంపై..  

అక్క గజారోహణ…

నేను అశ్వారోహణ చేసేవాళ్ళం.

 

నాన్న.. అమ్మకిచ్చిన రూపాయిలు..

బీరువాలో  చీరల మడతల్లో..

ఫిక్స్ డ్  డిపాజిట్లయి.. చెల్లికి.. పుట్టినరోజు బహుమతులయ్యేవి.

 

నాన్న రూపాయంటే..

ఓ ప్రేమ ముద్ర!

ఓ భరోసా!

మా భవిష్యత్తు!

మా మొత్తం జీవితం!

అందుకే…

నాన్న రూపాయిని..

నేను పవిత్రంగా దాచుకొన్నాను.

 

నేటి తరానికి..

నా సెంటిమెంట్ ఓ వెర్రితనంలా ఉండొచ్చు.

జాతీయధనంలో ఒక రూపాయిని..

నిరూపయోగం చేసినట్లు  అనిపించొచ్చు.

అయినా.. ఈ రూపాయిని..

నేను ఖర్చుపెట్టలేను.

దీన్ని తాకితే..

నాకు..నాన్న వేళ్ళస్పర్శ.. తగిలినట్లుంటుంది.

ఇది నన్ను  వెన్నంటి ఉండే..

నాన్న అభయ హస్తంలా వుంటుంది. 

ఈ రూపాయిపై ముద్రించిన..

మహాత్ముడి చిత్రం..

నా కళ్ళకు నాన్నలా కనిపిస్తుంది!

 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾