11_010 ఇంటింటా చిలకల పందిరి

హిందూ పండుగలు చాలా విశిష్టమైనవి. అందులో తెలుగు వారి పండుగలు మరింత విశిష్టమైనవి. వాటి ప్రాశస్త్యాన్ని, మన జీవనంలో అవి ఎలా మమేకం అయ్యాయో వివరిస్తూ ప్రముఖ రచయిత, కాలమిస్ట్ కీ. శే. రావూరు వెంకట సత్యనారాయణరావు గారు వ్రాసిన వ్యాస పరంపర ‘ తెలుగు పండుగలు ’ నుంచి…..

ఈ వ్యాసాలను అంతర్జాతీయ తెలుగు సంస్థ తమ పత్రిక ‘ తెలుగు వాణి ‘ లో 1976 లో ప్రచురించింది.

 

పండుగ అనగానే గృహాన్ని, దేహాన్ని చక్కగా అలంకరించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ఆనాడు దేవతలు నట్టింట అడుగుపెడతారని అభిప్రాయం. గృహాలు అలంకరించివుంటే వారు ఆనందించి కొంచెం నిలబడి తీరుబడిగా దీవించి వెడతారని విశ్వాసం.

 

పండుగ సందర్భాలలో ఇదివరకే చెప్పినట్లు, గృహాలు ఎంతో చక్కగా అలంకరించబడతాయి. ‘ నిత్యకల్యాణం పచ్చతోరణం ’ అనే సామెతకు ఉదాహరణగా నిలుస్తాయి. గృహంలో వారు చిలకల గుంపులాగా ఎగిరిపోతూ వుంటారు. ఆటలు, పాటలు, విందులు, వేళాకోళాలు, విహారాలు, సహకారభావనలు – ఎన్నో తొంగిచూస్తూ వుంటాయి ప్రతి గృహంలో.

 

అన్ని పండుగలు అలాగే వున్నా సంక్రాంతి పండుగలో ప్రత్యేకత వుంది. పంటల కాలంలో వచ్చే పండుగ గనుక మనస్సులు ఎంతో ఆనందంగా ఉండటం సహజం. ఆ సంబరంలో ఇంటిని అలంకరించడంలో ఎంతో నేర్పూ, తీర్పూ కనిపిస్తుంది. ఇళ్లకు ఎన్నాళ్లు ముందుగానో వెల్ల వేస్తారు. మసిపట్టిన వంటిళ్లను కూడా గీకిగీకి సున్నవేసి వెలుగులోకి తెస్తారు. ఇళ్ల ప్రహరీలకు కూడా వెల్లవేయడం లేదా చిలుము కొట్టడం జరుగుతుంది. అంతేకాదు – పశువుల కొట్టాలను, గుడిసెలకు కూడా చిలుము కొడతారు. అంటే ఇంట్లో ఏ భాగం కూడా మామూలుగా ఉండకూడదని వారి అభిప్రాయం.

 

గుమ్మాలకు, కిటికీలకు, కొన్ని సందర్భాల్లో దూలాలకు జేగుర్లు పూస్తారు. గడపలకు పసుపు, కుంకుమ పెడతారు. వాకిళ్ళల్లో రంగవల్లులు అలంకరిస్తారు.

 

ధనుర్మాసం  నెలరోజులు నడుస్తుంది. ఆ నెలరోజులూ ముంగిట రంగవల్లులు అలంకరిస్తారు.వాటిలో గోబ్బెమ్మలు, వాటిలో రకరకాల పువ్వులు, వాటిని ముగ్గులలో చేర్చి సంతోషంతో గంతులు వేసే ఆడపిల్లల ముసిముసినవ్వులు, భోగి పండుగనాడు అభ్యంగన స్నానాలు, కొత్త దుస్తులు, వంటినిండా నగలు, అవి అందించే నవ్వులు ఈ అన్నిటితో అమరులుగా మారిపోతారు ప్రతి ఇంట్లో సభ్యులు.

 

ప్రతి ఇంటికి అడపడచులు, అల్లుళ్లూ ఆహ్వానింపబడతారు. అల్లుళ్ళకు రాజసత్కారాలు, కూతుళ్లకు చనువుతో నిండిన సత్కారాలు, బావామరదళ్ళ సరసాలు, ముసలిదంపతుల చమత్కార సంభాషణలు. అసలు ప్రతివారూ ఆనందంతో గంతులు వేస్తూవుంటారు. అనుకోని హాస్యాలు వెల్లి విరుస్తాయి అందరి పెదవులనుంచి. రకరకాల పిండివంటలు, వడ్డనలలో కూడా ఎంతో అలంకారం, అందం, వయ్యారం, “ నవ్వులతో బువ్వలు ” అనే పల్లెటూరి సామెత సార్థకమవుతుంది పండుగ రోజుల్లో.

 

మరో విశేషమేమిటంటే – పండుగ దినాల్లో తాము ఆరగించి ఆనందించడంతోనే తృప్తీ పడకుండా – ఇతరులకు కూడా దానధర్మాలు చెయ్యడం జరుగుతుంది. తెల్లవారిలేచినప్పటి నుంచి అనేకమంది భిక్షకులు వస్తారు వాకిట్లోకి. కొందరు చక్కని పాటలు పాడతారు. కొందరు దీవనలందిస్తారు. కొందరు ఇంటిని ఆలయంగా, ఇంట్లో వాళ్ళను దేవతులుగా పోల్చి పొగిడి పోతూ ఉంటారు. ఎక్కడ చూచినా సిరి, చిరునవ్వులు.

                                                                           ————-

                                       రంగవల్లులు : తటవర్తి జ్ఞానప్రసూన

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾