10_004 కథావీధి – ఆడవాళ్ళ అంతరంగం

                    

                    ‘ ఆడవాళ్ళ అంతరంగం ’ కథ శీర్షిక లాగే ఒక సగటు స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది కూడా బడిపంతులు గారి కథే. ఆయన శ్రీమతి శారద కథలోని ప్రధాన పాత్ర. పొరుగింటి పద్మక్క గారి కథని బడిపంతులు గారి భార్య ఆయనకు చెప్పగా ఆయన మనకి చెపుతారు.

ఇల్లూ, బడీ, సాయంత్రం పూట బజారు లో షికారులతో సాదా సీదా గా కాలక్షేపం చేసుకునే బడిపంతులు గారి భార్య శారద మంచి స్నేహశీలి, మాటకారి. కొత్తింట్లో కాపురానికి దిగిన నెల్లాళ్ల లోపే వీధిలో అందరితో స్నేహాలు కలిపేసుకుని మేష్టారికి అందరితో అబ్బాయి, అన్న, బావ, మావయ్యా లాంటి వరసలు కలిపించేసింది. చిన్నఊరు, చిన్న బజారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నిత్యావసరాలు, సామాన్లు, జవిళి ( అంటే వస్త్రాలకి రాయలసీమ మాండలికం ) కొనుగోళ్ళ కోసం, ఇంకా బంధుమిత్రుల ఇళ్ళల్లో శుభకార్యాలకి హాజరయ్యేవారు. ఇలాంటి వారితో కొంచెం రద్దీ గానే ఉన్నా పరిచయమైన మొహాలే తరచుగా కనపడుతూ ఉంటాయి. కొత్తగా కనిపించిన ఒక ఉంగరాల జుట్టూ, సిల్క్ లాల్చీ, పంచె కట్టు, ఒక చిన్న తరహా పాలెగాడి వాలకం తో ఉన్న రూపం మేష్టారికి, అంగళ్ళల్లో, టీ హోటళ్లలో తరచుగా కనపడి కొంచెం ఆసక్తిని కలిగిస్తుంది.

ఒకరోజు సాయంత్రం మేష్టారు షికారు చేసి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కున్నాక సహధర్మచారిణి ఎదురింట్లో కొత్తగా పద్మక్క గారు దిగారనీ, భార్యాభర్తలు తమ ఈడు వారేనని, ఇంకా సామాన్లు రాని కారణం చేత ఆవిడ ఒక బకెట్ ఆడిగారనీ, వారిది ఈ జిల్లా కాదనీ ఎక్కడో హిందూపురం ప్రాంతం అనీ, ఆవిడ భర్త చేసేది గుమస్తా ఉద్యోగమే ఐనా ఆయనకి వచ్చిన పేరు ప్రఖ్యాతులకి ఓర్వలేని పై అధికారి ఇలాంటి దూర ప్రాంతానికి ఉన్న ఫళం గా ట్రాన్స్ఫర్ చేయించేశాడనీ వివరం తెలియజేస్తుంది.
మరునాటి ఉదయానికి ఎదురింట్లో కొత్తగా దిగిన ఆసామీ తనకు రోజూ బజార్లో కనపడే ఉంగరాల జుట్టు ఆసామీయే అని మేష్టారు గ్రహించుకుంటారు. అనంతరం పరిచయాలలో అతని పేరు చలపతి అనీ, అతను సర్కారు ఉద్యోగస్థుడనీ తెలుస్తుంది.. ఇతను కాపురం పెట్టిన నాటి నుంచీ వీధిలో సందడి పెరుగుతుంది. వీరి ఇంటికి వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఒకరోజు సాయంత్రం మేష్టారు ఇంటికి వచ్చేసరికి భార్య ఒక తాజా కబురు తో సిద్ధంగా ఉంటుంది. చలపతి గారు కొత్త టేకు కొయ్య నగిషీల నవారు మంచం కొన్నారు. దాని అందం వర్ణించ నలవి కాదు. మేష్టారి భార్య కొనుక్కోదలచిన వాటిలో ఈ నవారు మంచం మొదటిది. కాపురం మొదలై మూడేళ్లు అవుతోంది. అయినా కొనడం అవలేదు. మేష్టారు నెమ్మదిగా సముదాయించి దాటుకొస్తారు. చలపతి గారి టేకు కొయ్య మంచం నవారు మాయక మునుపే వారి ఇంట్లో నిలువెత్తు ఐదు అరల ఇనప బీరువా దిగుతుంది. మెరిసిపోతున్న బీరువాలో ఒక అర కి ప్రత్యేక తాళం ఉంటుంది, డబ్బూ ధన్కం దాచుకోవడానికి. ఇలాంటి తాజా వార్తలు రోజుకొకటి రావడంతో కొంచెం ఆసక్తి కలిగిన మేష్టారు బజార్లో వాకబు చేసి చలపతి గారు వాణిజ్య పన్నుల శాఖ లో గుమస్తా అనీ, తన పై వారికి తన ఆదాయంలో వారికి సంతృప్తికరం గా పంపకం పెట్టని కారణం చేత హిందూపురం లాంటి ప్రదేశం నుంచి ఈ మూలకు పంపించ బడ్డాడనీ, ఇక్కడ కూడా తన సామర్ధ్యం చూపించి కష్టార్జితం చేస్తూ పై వారి కి న్యాయంగా కట్టవలసినంత కప్పాలు కట్టని కారణంగా వారి ఆగ్రహాన్ని పోగు చేసుకుంటున్నాడు అనీ గ్రహించి అదే విషయం భార్యకు తెలియజేస్తాడు. ఆవిడ నిదానంగా, నిర్లిప్తంగా తమకు, ( అనగా మేష్టారికి ) బతకడం చేత కాదనీ, ఆ విషయం ఏనాడో ఋజువై పోయిందనీ, మనకు కోర్కెలు తీర్చుకునే తాహతు లేదనీ, ఏదో దొరికింది తింటాం. మనుషుల్లా ఇలా ఉంటాం. కాకపోతే రెండేళ్ల కొకర్ని లెక్కగా కంటాం అనీ “ ఈ మాత్రానికి లేనిపోని సోదె లు ఎందుకులెండి. ఒక ఇల్లాలు మొగుడు కొట్టినందుకు కాక ఇతరులు నవ్వినందుకు ఏడ్చిందట. మనకు సంపాదన చేతకాక ఇంకొకళ్ళని చూసి ఉక్రోషం పడడం ఎందుకు లెండి ఇహ ఊరుకోండి ” అని సంభాషణ ముగిస్తుంది. ఆ తరవాత చలపతి గారి ప్రసక్తి లేకుండా ఆరు నెలలు గడుస్తాయి. ఒహరోజు సాయంత్రం చలపతి గారు ఇల్లు ఖాళీ చేస్తున్నారు అని భార్య చెప్పినప్పుడు మేష్టారు నిట్టూర్చగా అంతరంగం గ్రహించిన భార్య అలాంటిదేమీ లేదనీ, ఈ మధ్య కాలంలో చలపతి గారు కొన్న డజను కుర్చీలు, డయనింగ్ టేబుల్ మొదలయిన సరంజామా తో ఇల్లు ఇరుకైన కారణంగా పక్క వీధిలో డెబ్భై ఐదు రూపాయల బాడుగ తో కొత్త ఇల్లు తీసుకున్నారనీ, కొత్త ఇంటికి పద్మక్క ఆహ్వానించిందనీ చెపుతుంది.

చలపతి గారు ఆర్థికంగా అందలాలు ఎక్కడం, భార్యకు ఏడు వారాల నగలు చేయించే ఎత్తు వరకూ చేరు కోవచ్చని మేష్టారి సతీమణి ఊహించి వారి జీవితాన్ని ఆసక్తి గా చూస్తుంది, మేష్టారు చలపతి గారి జీవిత నాటకం ఏమి మలుపులు తిరుగుతుందో అని గమనిస్తూ ఉంటారు.

కాలక్రమేణా చలపతి గారి కీర్తి రాష్ట్ర రాజధాని వరకూ వ్యాపించి  అక్కడి పెద్దలు వీరిని ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించి సత్కారం చేద్దామని అనుకుంటున్నారని మేష్టారికి తెలిసి ఆ వివరం భార్య తో చెప్పగా ఆవిడ కొట్టి పారేసి మనిషి ఎదుగుదల సమాజానికి కంటగింపు  గానే ఉంటుంది అనీ, ఎవరో ఓర్వలేని వారి పని అనీ అయినా ఈ విషయం తనకి పద్మక్క ఇంతకు ముందే చెప్పింది అనీ అంటుంది. ఆనతి కాలం లోనే చలపతి గారు ఉద్యోగం మానేయడం, నాలుగు వేల రూపాయల స్కూటర్ కొనడం కొందరి హితైషుల సహాయం తో హోటల్ ప్రారంభించడం, భార్యకి నగా నట్రా చేయించడం, ఆ తరవాత ఒక స్థలం కొని ఇల్లు కట్టడం సాయం చేసిన హితైషులు  అసూయా పరులుగా మారడంతో వారితో తెగతెంపులు చేసుకోవడం అన్నీ చక చకా జరిగిపోతాయి. ఈ అభివృద్ధి అంతా అన్యాయం అయిన మార్గంలోనే సాగింది అన్న నిజం తెలిసిన మేష్టారి సతీమణి అన్ని సందర్భాలలోనూ అదంతా  చలపతి గారి సమర్ధతే అని భర్త తో వాదిస్తుంది. కానీ కొత్త ఇంట్లో కి చలపతి గారు పాత భార్య పద్మక్క తో కాక రెండవ కొత్త భార్య తో గృహ ప్రవేశం చేయడం ఎందుకు జీర్ణించుకోలేక పోయిందో మేష్టారికి అర్ధం కాదు.

*****************