11_014 కనువిప్పు

వీరసేన మహారాజుకి దానధర్మాలంటే ప్రీతి కానీ గుడ్డి నమ్మకాలూ ఎక్కువే ! జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. రాజు గారి అభిలాషకి కొదవేం ఉంటుంది. రాజుగారికి జ్యోతిష్యం అంటే అభిలాష ఎక్కువ. ఏదో అవుసరం వస్తే జాతకాలు తిరగేయడం కాదు. ఆయనకు ఎప్పుడు తోస్తే అప్పుడు జాతకాలు చెప్పడానికి ఆస్థాన జ్యోతిష్కులనే నియమించుకొన్నాడు. వారికి “ రాజ జ్యోతిష్కుడు ” అని బిరుదు కూడా ఇచ్చేవాడు. ఎవర్ని నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్కులని మాత్రం గట్టిగా నమ్మేవాడు వీరసేనమహారాజు. వాళ్ళు నుంచోమంటే నుంచునేవాడు. కూర్చోమంటే కూర్చునేవాడు. ఒకరోజున వీరసేనునికి వేటకి వెళ్లాలని కోర్కె కలిగింది గాని జ్యోతిష్కులని అడగందే ఎలా వెళ్తాడు ? సేవకుల్ని పిలిచి వాళ్ళని వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు.

జ్యోతిష్కుడు రాగానే “ అయ్యా ! నాకు వెతకి వెళ్లాలని కొరిక కలిగింది. వెల్లమంటారా ? వద్దా ? ” అని అడిగాడు. ఆయన చేతి వెళ్లమీద కొంచెం సేపు ఏవో గుణించి “ అంతా బాగుంది. మీరు నిశ్చింతగా వెళ్ళి రావచ్చు ” అన్నాడు.

ఇంకేముంది ? రాజుగారు తన సేవకులు, సహచరులు అందరూ గుర్రాలమీద బయిలుదేరారు. పల్లెలు దాతారు, పట్టణాలు దాతారు. రాజ్యపు సరిహద్దులలో ఉన్న అడవికి వెళ్లారు. అక్కడో గుడిసె కనబడింది. వాకిట్లో ఒక కుమ్మరివాడు మట్టితో కుండలు చేస్తున్నాడు. రాజుగారు సైన్యంతో ఆ గుడిసె ముందు ఆగారు.

కుమ్మరివాడు రాజును, అట్టహాసాన్ని చూచి ఖంగారు పడి లేచి నుంచుని నమస్కారం చేసి లోపలికి వెళ్ళి చాప తెచ్చి వేసి రాజుగారిని కూర్చోపెట్టి – అందరికీ శుభ్రమైన పాత్రలలో చల్లని మంచినీరు అందించాడు. తరువాత రాజుగారి ఎదుట చేతులు కట్టుకు నిలబడి “ తమరితో ఒక విషయం చెప్పాలని వుంది ” అన్నాడు వినయంగా.

“ చెప్పు ” అన్నారు రాజు గారు.

“ తమర్ని, సైన్యాన్ని, గుర్రాల్ని చూస్తుంటే తమరు వేటకు వెళ్తున్నట్లుగా వుంది ” అన్నాడు కుమ్మరి.

“ సరిగ్గా చెప్పావు. నేను నా సైన్యంతో వేటకే వెళ్తున్నాను ” అన్నాడు రాజు.    

“ తమరు నా మాటవిని ఇక ముందుకు వెళ్ళకండి – వేడితే అవస్థలు పడతారు ” అన్నాడు.

“ పిచ్చివాడా ! ఏం మాట్లాడుతున్నావు ? మేము వచ్చే ముందే జ్యోతిష్కులతో సంప్రదించాము. వాళ్ళన్నారు – రాజా – నిశ్చింతగా వెళ్ళి రండి, మీకేం భయం లేదు అని. నువ్వేమో ముందుకు వెళితే ఆపదలో చిక్కుకొంటారంటున్నావు ” అన్నాడు.

కుమ్మరి ఆశ్చర్యపోయాడు. అయినా మళ్ళీ – “ మహారాజా ! కొంచెం సేపట్లో పెద్దవాన పడుతుంది – అది తుఫానుగా కూడా మారుతుంది. ఆ తుఫానులో చిట్టడవి లో చిక్కుల పాలవుతారు ” అన్నాడు.

రాజుగారికి కోపం వచ్చింది. “ నువ్వు నాకు సలహా చెబుతున్నావా ? మా జ్యోతిష్కులు తిథి వార నక్షత్రాలన్నీ చూసి భేషుగ్గా వుంది వేటకు వెళ్లిరండి అని చెబితే – అది అబద్ధమా ? అక్షరం ముక్క రానివాడివి నువ్వు చెప్పేది నిజమేనని నేను నమ్మి ఆగిపోవాలా ? చాల్చాల్లే ! వెళ్ళి నీ పని చూసుకో. నేను వేటకి వెళ్తాను ” అని బయిల్దేరాడు.

రాజుగారి మాటలు విని కుమ్మరి నిశ్చేష్థుడయి నిలబడి పోయాడు. రాజుగారు తన సైన్యంతో అడవి వేపుగా వెళ్లిపోయాడు. అడవి మధ్యలోకి వెళ్ళేసరికి కారుమబ్బులు కమ్ముకొని వచ్చాయి. అడవిలో అసలే చీకటి. ఇంకా మూసుకుపోయింది. వేగంగా గాలులు వీచసాగాయి. ఉరుములు, మెరుపులతో కుంభవృష్ఠి కురవసాగింది. అడవి అంతా అలగొలు పాలగొలుగా వుంది. నిర్మానుష్యమైన అడవిలో నాలుగువేపులనుండి జంతువుల ఆర్తనాదాలు వినిపించసాగాయి. రాజుగారు సేనతో సహా అడవిలో చిక్కుకుపోయారు. వాయువేగానికి చెట్ల కొమ్మలు, చెట్లు విరిగిపడుతున్నాయి. అందరూ భయభీతులయిపోయారు. అప్పుడు రాజుగారికి అనిపించింది. “ అయ్యో ! కుమ్మరి వాని మాట వింటే ఈ బాధలు రాకపోను కదా ! ” అని.

తుఫాను తగ్గాక రాజుగారు సైన్యంతో వెనక్కి తిరిగి స్వస్థలానికి చేరారు. వెళ్ళీ వెళ్ళగానే రాజు జ్యోతిష్కుదిని పిలిపించాడు. నానా చీవాట్లు పెట్టాడు. అంతే కాదు ఆ పదవిలోంచి అతణ్ని తీసివేశాడు. వెంటనే చదువురాని ఆ కుమ్మరిని తీసుకు రమ్మన్నాడు సైనికుని పిలిచి.

కుమ్మరి రాగానే “ ఇతనికి ఉచితరీతిని సన్మానం చేసి రాజ్య జ్యోతిష్కుది ఆసనం పై కూర్చోబెట్ట ”మన్నాడు. కుమ్మరి వానికి ఇదేం అర్థం కాలేదు. కంగారుపడిపోయాడు. “ రాజా ! చదువులేని వాణ్ని. బీదవాణ్ణి. కుండలు చేసుకునెవాణ్ణీ. జ్యోతిష్యం గురించి అసలేమీ తెలియదు. మీకు నేనేం సలహాలు ఇవ్వగలను ? ” అన్నాడు భయంతో.

“ నీకు చాలా తెలుసు. నేను నీ మాట వినకపోయినందుకు అడవిలో తుఫానులో చిక్కుకుపోయాను. నీ మాట విని వెనక్కు వస్తే నాకు ఈ బాధ లేకపోవును. అందుకనే నిన్ను ఈరోజు నుంచి మా రాజ్య జ్యోతిష్కుడిగా నియమిస్తున్నాను ” అన్నాడు రాజు.

అప్పుడు కుమ్మరి వానికి అర్థం అయింది. “ రాజా ! తుఫాను, ఈదురుగాలి గురించి నాకు గాడిద వల్ల తెలిసింది. మహారాజా ! కుంభవృష్టి, తుఫాను రాబోతుందంటే మా గాడిద చెవులు నిక్కబెడుతుంది. మెడపైకెత్తి నెమ్మదిగా నెమ్మదిగా స్వరం పలికిస్తుంది. ఆ వేళ అలానే చేసింది. అందుకే నేను మిమ్మల్ని వేటకి వెళ్లొద్దన్నాను ” అన్నాడు.

ఆశ్చర్యపడడం వీరసేన మహారాజు వంతు అయింది. కుమ్మరి చెప్పే మాటలు వింటూ రాజు ఇలా ఆలోచించసాగాడు. – మనం జంతువులు తెలివిలేనివి అనుకొంటాము. కానీ అవే ప్రకృతిలోని సంకేతాలను అర్థం చేసుకొంటాయి _ మనం చదువుకొన్న మనుష్యులమైనా ప్రకృతితో సంబంధం కలుపుకోక – ఏవో సమస్యలతో బుర్రలు బ్రద్దలు చేసుకొంటూ వుంటాం. వివేకం అనేది మనిషి జీవితానికి జ్యోతిలా దారి చూపిస్తుంది. దాన్ని ఉపయోగించుకొనే వారికి జ్యోతిష్యంతో పనే లేదు. కుమ్మరి మాటలతో వీరసేనునికి మనస్సులో జ్యోతి వెలిగింది.

                                       ———— ( O ) ————

Please visit this page

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾