మధురమయిన స్మృతులు మనకు చెరగని తరగని, సంపద. ఈ స్మృతులను మనం వేపచెట్ల చల్లని నీడలతోనూ– కొత్త తాటాకులతో నిర్మించిన పందిరులు అందించే చల్లదనం తోనూ సరిపోల్చవచ్చును.. కాలగమనంతోబాటు ఆ జ్ఞాపకాలు పాతబడవు సరిగదా మరింత ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. ఆ ఆనందం మనకు దైవదత్తం అనుకుంటే, ఆ దేవుడే ఆ ఆనందాన్ని మనకు అనేక విధాలుగా సమకూరుస్తూ ఉంటాడు. ఉదాహరణకు అది ప్రకృతి రమణీయత ద్వారా గానీ లేదా తాను ఎన్నుకున్న కొందరు వ్యక్తులద్వారా కానీ కావచ్చును. అలనాడు శ్రీ త్యాగరాజ స్వామి వారు అన్నట్లు — ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు!
ఈ శీర్షికను నాకు పంచిన అనంతకోటి మిత్రులలో ప్రస్తుతం ముగ్గురు మహానుబావులను గురించి అతి క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను..
మారుతీరావు, మా అన్నయ్య భూపతిరావు 1956 – 60 మధ్య కాలంలో విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో సహాధ్యాయులు. కలిసి చదువుకునేవారు. కలిసి నాటకాలు ( నాటికలు) వేసేవారు. అలా అన్నయ్య ద్వారా మారుతీరావు తో నాకు ఏర్పడిన పరోక్ష పరిచయం ప్రత్యక్ష పరిచయం గా మారినది 1968 – 69 లో. అటు తరువాత కొంతకాలం ఒకరినొకరం ‘గారు’ అని సంబోధించుకునే వాళ్ళం. 1971 నుండి నువ్వు – నువ్వు అన్న పిలుపు ని ఇద్దరం అలవాటు చేసుకున్నాము. అలా ఆ బంధం — అనుబంధమై 2019 వరకు.. అంటే తాను భౌతికంగా కనుమరుగయేవరకు కొనసాగింది. మా కుటుంబాలు కూడా అతి చేరువయ్యాయి. ముఖ్యం గా 2019 లో తాను విజయవాడ రేడియో స్టేషను లో తన నాటిక రికార్డింగ్ కి వచ్చి, అటు పిమ్మట కూడా నాతో మా ఇంటికి వచ్చి నా ఆతిధ్యాన్ని స్వీకరించి, నా వంటకాలను మనసారా మెచ్చుకున్న ఆ సందర్భాలను నేను మరచిపోలేను. మరువను ఇక మరొక మాట — ఇటువంటి మరికొన్ని విశేషాలను జత చేసిన నా వ్యాసాన్ని శిరాకదంబం గతం లో ప్రచురించింది.
ఆ లింక్ : https://sites.google.com/site/siraakadambam/home/02032, slide: 24.
గాయకునిగా, ప్రత్యేకించి శ్రీ అన్నమాచార్య కీర్తనలను శాస్త్రీయ పద్దతులలో మృదుమధురంగా గానం చేయడంలో విశేషమయిన కృషి చేసినవారు శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు. ఆ గళం అమృతాన్ని కురిపిస్తుంది… మైమరపిస్తుంది. అంతే కాదు — శ్రోతలు ఆ గానాన్ని వింటూ పరవశులై అందులో పరమాత్మను సందర్శిస్తారు. హైదరాబాద్ లో నివసించే మా తమ్ముడు శేషగిరిరావు ఆయనకు అత్యంత అభిమాని. అక్కడ జరిగిన ఒక కచేరీ లో వాడు నాకు ఆయనను పరిచయం చేశాడు. ఇది జరిగి ఎన్నో ఏళ్ళు అయింది. కానీ అది ముహూర్తబలమో, ఏమో నాకు తెలియదు కానీ… నాటినుండి ప్రసాద్ గారు నేను తరచుగా కలుసుకోవడం, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండడం జరుగుతూనే ఉంది. ఒక సందర్భం లో నేను శ్రీ ప్రసాద్ గారిని ప్రత్యక్షంగా తిరుపతి లో వారింట కలుసుకుని వారితో కాసేపు ఇష్టాగోష్టి గా మనసు విప్పి ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం సంభవించింది. ఆ అమూల్య సంఘటన నా మనసుపై చెరగరాని ముద్ర వేసింది. ఆయన సౌజన్యం, ఆప్యాయత అక్షరాలకు అందనివి.. నేనొకసారి అమెరికా లో మా అబ్బాయి వద్ద ఉండగా అయన రేవతి రాగం లో పాడిన శ్రీ అన్నమయ్య కీర్తన — “.. నా నాటి బదుకు నాటకము.. ” ను వింటూండగా అప్రయత్నం గా నా కళ్ళు వర్షించాయి. వెంటనే ఈ స్పందనను శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఫోన్ చేసి తెలియజేస్తే అయన విని దానికి ప్రతిస్పందిస్తూ ఒకటే విషయం చెప్పారు ” సుబ్బారావు గారూ .. మీ హృదయం లో ఆర్ద్రత ఉన్నది. అందుకే కీర్తన వినగానే అది కన్నీరై వర్షించింది ” అని… వాస్తవం చెప్పారాయన అనిపించింది !
మధురాంతకం రాజారాం గారు చేయి తిరిగిన రచయిత… 1950 ప్రాంతాలలోనే అయన రచనలు అప్పటి ప్రసిద్ధ మాస పత్రికలలో ఒకటైన భారతి లో ప్రచురింపబడేవి. రచయిత గా ఆయన సేవలు అమూల్యాలు. ఆయన శైలి, కథాంశాలు కూడా ఒక ఫ్రత్యేకతని కలిగి ఉండేవి. అవి వాస్తవాలకు ప్రతిబింబాలై, ఊహా ప్రపంచానికి సుదూరంగ ఉండేవి. రాజారామ్ గారు వృత్తిపరం గా ఉపాధ్యాయుడే అయినా ప్రవృత్తిపరం గా ప్రామాణికమైన రచయితగా గుర్తింపుని, గౌరవాన్ని పొందారు. ఆయన పుత్ర సంతానం నరేంద్ర, మహేంద్ర కూడా తండ్రి అడుగుజాడలలో అడుగులు వేస్తూ రచయితలుగా పేరు గడించారు. నరేంద్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి లో ఇంగ్లీషు శాఖకు ప్రధాన ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశ్రాంత జీవనాన్ని గడుపుతో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రాజారాం గారూ నాకు ఆప్తమిత్రులే.. ఇక తరువాత తరం లో వారి అబ్బాయిలు నరేంద్ర, మహేంద్రలు కూడా నాకు మంచి మిత్రులే ! దురదృష్టవశాత్తూ. మహేంద్ర కొంతకాలం క్రితం కాలం చేసాడు. కాగా, నరేంద్ర, నేను అప్పుడప్పుడు సాహిత్య సభల సందర్భం గా కలుసుకుంటూ ఉండడం, లేదా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండడం పరిపాటి. పెద్దల పట్ల వినయవిధేయతలు, అభిమానం నరేంద్ర వ్యక్తిత్వం లోని ప్రత్యేకతలు. ప్రచురణ అయిన తన రచనలను అనేకం నాకు పంపుతూ ఉండడం అతని సుగుణాలలో ఒకటి. మరిన్ని వివరాలతో నా వ్యాసం శిరాకదంబం సంచిక లో లింక్ :
https://sirakadambam.com/10_012-tolepi-madhurantakamnarendra/
మరొక సందర్భం లో వీలువెంబడి మరికొందరు పెద్దల గురించి ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను. ప్రస్తుతానికి మీ అందరినుండీ శెలవు తీసుకుంటున్నాను.
.
*** ధన్యవాదములు ~ నమస్కారములు ***
.
ఆత్మీయ మిత్రులు శ్రీ రామచంద్రరావు గారి ప్రోత్సాహం తో గత 8 సంవత్సరాలుగా తోక లేని పిట్ట శీర్షికన ఇప్పటివరకు దాదాపు 150 మందికి పైగా నా మిత్రుల గురించి, నాకు పరిచయమయిన పెద్దల గురించి వారి ఉత్తరాలను జత చేస్తూ క్లుప్తంగా వ్యాసాలను శిరాకదంబం పత్రికలో వ్రాయడం జరిగింది. రచన, చిత్రకళ, సంగీతం, గానం రంగాలలో పేరుతెచ్చుకున్నవారు ఎందరో ఈ వ్యాసాలలో ప్రస్తావించబడి ఉన్నారు. వీరిని గురించి చెప్పాలంటే త్యాగరాజస్వామి వారు అన్నట్లు ” ఎందరో మహానుభావులు ..” అన్నమాట ! ఈ వ్యాసాలకు ఇన్నాళ్లుగా, ఇన్నేళ్ళుగా అశేష పాఠకుల నుండి అనుకూల స్పందన వస్తూ ఉండడం ఎంతో ఆనందదాయకం. శ్రీ రామచంద్రరావు గారికి, పాఠక మిత్రులకి, పెద్దలకు నా కృతజ్ఞతలు.
.
నమస్కారములు ~ ధన్యవాదములు. .
.
******************************************************
— Voleti Venkata Subbarao
Vijayawada,
Mobile : ( +91) 85007 64529, Email : susee.venkatavoleti@gmail.com.
____________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
______________________________________________________