11_014 ఆనందవిహారి

    పాలగుమ్మి పద్మరాజు – ఒక స్పూర్తి

 

బహుముఖ ప్రజ్ఞాశాలుల గురించి మనందరం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే, ఒకే వ్యక్తిలో ఇంత ప్రజ్ఞ, ఇన్ని కోణాలు ఉండడం సాధ్యమా… అని ఆశ్చర్యపరిచే అత్యంత అరుదైన వ్యక్తి పాలగుమ్మి పద్మరాజు అని తెలియజెప్పింది “నెల నెలా వెన్నెల” కార్యక్రమం. అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతిని పురస్కరించుకొని శనివారం సాయంత్రం అంతర్జాలంలో ప్రసారమైన ఈ కార్యక్రమంలో  “పాలగుమ్మి పద్మరాజు – ఒక స్ఫూర్తి” అంశంపై పాలగుమ్మి సీత ప్రసంగించారు. మొదట అమరజీవి తెలుగు జాతి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసిన సీత… అనంతరం కెమిస్ట్రీ అధ్యాపకుడు,  సాహితీవేత్త, సినీ రచయిత,  దర్శకుడు, వైణికుడు, స్వరకర్త, గీత రచయిత అయిన తన తండ్రి పాలగుమ్మి పద్మరాజు స్ఫూర్తిమంతమైన జీవితం గురించి మాట్లాడారు. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన మొదటి రచయిత ఆయనేనని గుర్తు చేస్తూ ఆ వైనాన్ని వివరించారు. 1950లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన చిన్న కథల పోటీకి…. 1949లో జరిగిన నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో తను రాసిన “గాలివాన” కథని తనే “సైక్లోన్” పేరిట అనువదించి పంపారని అన్నారు. 23 దేశాల నుంచి 53 కథలు ఎంపిక కాగా, అందులో ఆయన కథ రెండో బహుమతికి ఎంపికైందని వెల్లడించారు. అంతేకాక, 1966లో ఒక విదేశీ ప్రచురణ సంస్థ కోసం “స్టోరీస్ ఆఫ్ ఇండియా” పేరిట నట్వర్ సింగ్ రూపొందించిన 13 మంది రచయితల కథా సంకలనంలో పద్మరాజు రాసిన కథ “ఆన్ ద బోర్డ్” (పడవ ప్రయాణం)  రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్ చంద్ తదితర మహామహుల కథల సరసన నిలిచిందని గుర్తు చేశారు. ఈ కథనే ఇతివృత్తంగా తీసుకొని ఎన్ ఎఫ్ డి సి (నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) నిర్మాణ సారథ్యంలో ప్రముఖ దర్శకుడు సేతుమాధవన్ సినిమా తీశారని, రెండు నంది, రెండు జాతీయ పురస్కారాలను అందుకున్న ఇది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైందని అన్నారు. ఆయన రెండు చలనచిత్రాలకి దర్శకత్వం కూడా నిర్వహించారని చెప్పారు. ఆయన తన చివరి పన్నెండేళ్ళూ సినీ నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రక్రియలలో తన తలలో నాలుకగా ఉండేవారని ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి పేర్కొన్నారని తెలిపారు. 

ఎక్కువగా చదివి తక్కువగా రాసిన పద్మరాజు… 

కవిత్వం రాయడంతో మొదలుపెట్టి శృంగారం, హాస్యం, బీభత్సం, నేర పరిశోధన, రాజకీయ వ్యంగ్య విమర్శ,  తదితర అన్ని రకాలనీ తన కథలలో, నవలలో ప్రయోగించారని,  అయినా అన్ని ప్రక్రియలలోనూ ఆయన కథానికనే ఎక్కువగా ఇష్టపడేవారని తెలిపారు. చిన్నపిల్లల విషయాలను పెద్దలకి తెలియజెప్పే కథలు కూడా ఆయన కలం నుంచి జాలువారాయని అన్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోనే బాల్యాన్ని గడిపిన ఆయన… ఆ నదీమతల్లి, పడవలు, తెరచాపలు, పచ్చని పొలాలు, అక్కడి మనుషులు కలిగించిన ప్రేరణతో రచయిత అయ్యారని తెలియజేశారు. అందుకే ఆయన కథలలో అవన్నీ కనిపిస్తాయని, తనకి తెలిసిన వ్యక్తులే వాటిలో సజీవంగా నిలిచిపోయారని వివరించారు. వాటిలోని కొన్నిటి సారాంశాన్ని వినిపించారు.  

పద్మరాజుది “గత చూపు” అని, ఆ చూపు గతంలో జరిగిన సార్థకమైన విషయాలనే తీసుకుంటుందని, అదే ఆయన కథలలోని గాఢతకి, ఆర్ద్రతకి కారణమని దేవులపల్లి కృష్ణశాస్త్రి పేర్కొన్నారని చెప్పారు. ఆయన తనకి గురువని గొల్లపూడి అనేవారని చెప్తూ… ఇంకొందరు వెనకటి తరంలో ప్రసిద్ధులైనవారి అభిప్రాయాలను కూడా వెల్లడించారు.  

నంది, సాహిత్య అకాడమి పురస్కారాలను అందుకున్న పద్మరాజు వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ఒక విలక్షణమైన విషయాన్ని వెల్లడించారు. మద్రాసులో ఉండగా తన తండ్రి ఎక్కువగా సిటీ బస్సులలో ప్రయాణించేవారని, ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఆయన పర్సు కొట్టేసేవారని వక్త తెలిపారు. అయితే, తనకి తెలియకుండా ఎంతో చాకచక్యంగా తన పర్సులని దొంగతనం చేసేవారి నైపుణ్యాన్ని ఆయన మెచ్చుకొనేవారని చెప్పారు. వాళ్ళెలా దొంగతనం చేస్తారో కనిపెట్టాలనుకొనేవారని, కానీ ఆయన ఉద్దేశం నెరవేరనేలేదని చెప్పారు. ఆయనలోని ఈ విచిత్ర గుణం వల్లే ఆయన కథలలోని పాత్రలు మంచివని గాని చెడ్డవని గాని ఉండవని, అవి చదివేవారికి ఏ సూత్రాలూ చెప్పవని అన్నారు. ఈత, టెన్నిస్, ఇంకా… తన దుస్తులు, ఇంట్లోవాళ్ళ దుస్తులు కుట్టేంత కుట్టుపని వంటి అనేక అభిరుచులు ఆయనకి ఉండేవని వెల్లడించారు. తన తండ్రి పోయిననాటికి తన వయసు ఇరవై ఐదే అని, అయినా ఆయన మాటలు, చేతలే తనని ఇప్పటికీ నడిపిస్తున్నాయని సీత చెప్పారు. 

పద్మరాజు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివుకొని కాకినాడ, భీమవరం కళాశాలల్లో విద్యార్థులకు కెమిస్ట్రీ బోధించారని సీత  పేర్కొన్నారు. 

   కార్యక్రమ వ్యాఖ్యాత బాలాంత్రపు లావణ్య వక్తను పరిచయం చేస్తూ… పాలగుమ్మి, బాలాంత్రపు కుటుంబాలు మూడు తరాలుగా స్నేహం నెరపుతున్నారనే అపురూపమైన విషయాన్ని వెల్లడించారు. ముప్పై ఏళ్ళుగా మీడియా రంగంలో పనిచేస్తున్న సీత, రామోజీ ఫిలిం సిటీ, జీ టీవీ, మా టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఓటీటీ సంస్థల్లో ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారని చెప్పారు.

 

కార్యక్రమం వీడియో…. ఈ క్రింద…..

   లైఫ్ సంస్థ సేవా కార్యక్రమాలు

 

తమ తండ్రి గారైన ప్రముఖ కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి పేరు మీద వారి కుమారులు ఏర్పాటుచేసిన లక్ష్మీపతిరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ( LIFE ) తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ నగరంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 45 మంది పిల్లలకు ఇటీవల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.    

ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉన్న ఆ పిల్లల విద్యావసరాల నిమిత్తం ఆర్థిక సహాయం చేయవలసినదిగా ఐ. సి. డి. ఎస్. వారి విజ్ఞప్తి మేరకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి చేతుల మీదుగా లైఫ్ సంస్థ ప్రతినిధులు వక్కలంక రామకృష్ణ, వక్కలంక కృష్ణమోహన్ ఒక్కొక్కరికి పదివేల రూపాయిలు చొప్పున 45 మందికి మొత్తం నాలుగు లక్షల యాభై వేల రూపాయిలు అందజేశారు.  

ఈ కార్యక్రమంలో లైఫ్ సంస్థతో బాటు హైదరాబాద్ కి చెందిన వసుధా ఫౌండేషన్, మరికొందరు మిత్రబృందం కూడా పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని లైఫ్ సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, కృష్ణమోహన్, వసుధా ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకటరామరాజు భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వలన పిల్లలు తమ చదువులను ఆపవలసిన అవసరం లేదని, చేయూతనందించడానికి ఇటువంటి వదాన్యులు ఉన్నారని, సహాయం పొందిన పిల్లలు తమ వంతు బాధ్యతగా శ్రద్ధగా చదివి వృద్ధిలోకి రావలసి ఉందని జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంకా ఐ.సి.డి.ఎస్ పి.డి శ్రీమతి జి.వి సత్యవాణి గారు, డి.సి.పి.ఓ వెంకట్ గారు, హైదరాబాద్ కి చెందిన వసుధ ఫౌండేషన్ ప్రతినిధులూ పాల్గొన్నారు.

 

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com