. ప్రస్తావన
‘ బాధ్యత ’ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మొదటగా ‘ కుటుంబ బాధ్యత ’. కుటుంబ సభ్యులందరి మంచి చెడ్డలు, భవిష్యత్తు నిర్మాణం వంటివి కుటుంబ పెద్దే చూసుకుంటారు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలో అతనికి సహకరించడం కుటుంబ సభ్యులందరి బాధ్యత. ముఖ్యంగా భార్యది. పరస్పర సహకారం, అవగాహన ఉంటే ఆ కుటుంబం ఏ సమస్యలనైనా సమిష్టిగా, ధైర్యంగా ఎదుర్కొని పురోభివృద్ధి సాగిస్తుంది.
తర్వాత చెప్పుకునేది ‘సామాజిక బాధ్యత’. మన కుటుంబమే కాకుండా మన బంధువులు, స్నేహితులు, మన చుట్టూ ఉండే అందరి మంచి చెడ్డలు కనిపెడుతూ ఉండటమే కాకుండా సమాజ హితం పట్ల శ్రద్ధ, బాధ్యత కలిగి ఉంటే మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్లకి కూడా మంచి జరుగుతుంది. అవసరంలో ఉన్న వాళ్ళకి మనకి కలిగినంతలో సహాయం చెయ్యడం, ఆపదలో ఉన్నవాళ్లకి మనో ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలబడటం వంటివి ఒకరకమైన సామాజిక బాధ్యత లైతే, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించడం వంటివి కూడా మన సామాజిక బాధ్యతలే.
తమ స్వార్థం కోసమో, మరో దాని కోసమో కుటుంబాలను గాలికి వదిలేసి, బాధ్యత మరచి వ్యవహరించే వాళ్ళకి కుటుంబాలను ఏర్పరుచుకునే హక్కు ఉండకూడదు. తనతో బాటు మరి కొందరిని బలి చెయ్యడం సమంజసం కాదు. పశు పక్ష్యాదులు కూడా తమ పిల్లలకి స్వంతంగా తిండి సంపాదించుకునే శక్తి వచ్చే వరకు తమ బాధ్యతను నెరవేరుస్తాయి. అలాగే మన పిల్లలు కూడా స్వశక్తి మీద నిలబడేవరకు అండగా ఉండటం కూడా మన భాధ్యతే. తర్వాత వృద్ధ్యాప్యంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల బాధ్యత. ఈ బాధ్యతలను గుర్తెరిగి నెరవేర్చినప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
ప్రక్కవాడు ఎలా పోతే మనకెందుకు, మనకి బాగానే జరిగిపోతోంది కదా అనుకుని అవకాశం ఉన్నా ఆపదలో ఉన్నవాడికి సహాయం చెయ్యడానికి ముందుకు రాని వాడికి ఎంత సంపద ఉన్నా, సంఘంలో ఎంత పెద్ద హోదా ఉన్నా వ్యర్థమే. సమాజంలో మనం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే ముఖ్యమని గ్రహించకుండా బీద గొప్ప తేడాలతో బాటు, కులమత బేధాలు, స్థాయి బేధాలు వంటివి పరిగణన లోకి తీసుకుని వ్యవహరించడం సమాజ హితం కాదు. ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి మనకెంత హక్కుందో ఆయా బేధాలతో సంబంధం లేకుండా ఇతరులకు కూడా అంతే హక్కు ఉంది. మన స్వార్థం కోసం ప్రక్కవాడి ఆస్తులను ఆక్రమించడం, హక్కులను హరించడం, అవసరానికి అప్పుకోసం వస్తే అధిక వడ్డీలు గుంజుతూ హింసించడం, దౌర్జన్యం చేసైనా తమకి కావాల్సింది సాధించాలనుకోవడం, అడ్డు వస్తే ప్రాణాలు తీసేయడం వంటివన్నీ సమాజానికి హితం కలిగించేవి కాదు. మనతో బాటు మన ప్రక్కవాడిని కూడా ఎదగనివ్వడం మన బాధ్యత అని తెలుసుకోవాలి.
సమాజం పట్ల ప్రజల కెంత బాధ్యత ఉంటుందో రాజకీయ నాయకులకు మరింత ఎక్కువ ఉంటుంది. నిజానికి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చెయ్యడం వారి ప్రధాన బాధ్యత. ఎదుటివాళ్ల మీద దండెత్తి, వారిని నిర్మూలించి తెచ్చున్న అధికారం రాచరికం. తమ బాగోగులు చూడటానికి ప్రజలిచ్చిన అధికారం ప్రజస్వామ్యం. ఇక్కడ పాలకులు ప్రజల ఆస్తులకు ధర్మకర్తలు, సేవకులు మాత్రమే. ప్రజలకు కావల్సిన అవసరాలు తీర్చడం, వారి మంచి చెడ్డలు చూడటం, ప్రశాంత జీవనం కల్పించడం వంటివి వారి ముఖ్యమైన విధులు. అది నెరవేర్చలేకపోతే వారు రాజకీయానికే అనర్హులు, దురదృష్టవశాత్తూ రాజకీయం అంటే రాచరికం అనుకుంటున్నారు ఇప్పటి రాజకీయనాయకులు. పదవి వచ్చేవరకు ప్రజాస్వామ్య వాదులు… వచ్చాక ( అ ) రాచరిక వాదులు. బాధ్యత గాలికొదిలేసి తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యంగా ప్రవర్తించడం గర్హనీయం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రతిఫలం తీసుకుని పని చేసే ప్రజా సేవకులు. వారు తమ హోదాని, అధికారాన్ని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన పనులను చెయ్యడానికి ఉపయోగించడం వారి బాధ్యత. అధికార దర్పం, జులుం ప్రదర్శించడం, లంచగొండితనం, అధికార దుర్వినియోగం వంటి అవలక్షణాలున్న వారు ఉద్యోగానికి అనర్హులు. కానీ ఇక్కడ కూడా మన దురదృష్టమే కనబడుతుంది.
బాద్యత నెరిగి ప్రవర్తించే ప్రభుత్వంలోని నాయకుల వలన ప్రజలకు ఉపయోగపడే పథకాలు, సదుపాయాలు వంటివి రూపు దిద్దుకుంటాయి. తమ విధులు తెలిసిన ఉద్యోగులు, అధికారుల వలన అవి సక్రమంగా అమలు జరుగుతాయి. తమ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు మనకి వద్దు…. నిస్వార్థంగా సేవ చేసే వారే పాలకులుగా ఉండాలని ప్రజలు గట్టిగా కోరుకుంటే తప్పకుండా దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. మార్పు రాజకీయ నాయకుల చేతిలో లేదు. మన చేతిలోనే ఉంది అని ప్రజలందరూ గ్రహిస్తే అందరికీ…. తద్వారా దేశానికి ప్రయోజనం.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao