11_002 – ఆనందవిహారి

.

మాలతీ చందూర్ – సామాజిక దృష్టి  

.

రచయిత్రిగా తన సాహిత్యంలో చూపించిన ఆదర్శాలను వ్యక్తిగా ఆచరించి చూపిన ఆదర్శనీయురాలు మాలతీ చందూర్ అని ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కీర్తించారు. 

.

మాలతీ చందూర్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఒక  ప్రత్యేక కార్యక్రమాన్ని ఆగష్టు 21వ తేదీ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసింది. అంతర్జాలం యూట్యూబ్ లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖాధ్యక్షురాలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి “మాలతీ చందూర్ – సామాజిక దృష్టి” అనే అంశంపై ప్రసంగించారు.

.

 ఆమె మాట్లాడుతూ… మాలతి 23 ఏళ్ళ వయసులో రచనలు మొదలుపెట్టి, దాదాపు 65 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగు సాహితీలోకానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. 

.

 రచయిత్రిగా తన సాహిత్యంలో చూపించిన ఆదర్శాలను వ్యక్తిగా ఆచరించి చూపిన  ఆదర్శనీయురాలు మాలతి అని కీర్తించారు. విదేశీ భాషలతో కలిపి 350 పుస్తకాలలోని విశేషాలను ఆమె పాఠకులకు పరిచయం చేయడం, 50 ఏళ్ళకు పైగా “ప్రమదావనం” శీర్షికను నిర్వహించడం విశేషంగా చెప్పుకోదగిన విషయాలని  కొనియాడారు. 1992లో తమ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్ తో సత్కరించిందని గుర్తు చేశారు. అది మహిళామణులందరినీ సత్కరించటం వంటిదని వ్యాఖ్యానించారు. 

.

మాలతికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని సంపాదించి పెట్టిన హృదయనేత్రి నవలతోపాటు మరికొన్ని నవలలు, వాటిలోని స్త్రీ పాత్రల గొప్పదనాన్ని మధుజ్యోతి విశ్లేషించారు. కట్టుబాట్లు, ఆచారాలు తదితర సమాజ సహజ ధోరణులకి అతీతంగా ఉండే ఏ కొత్త విషయాన్ని ఆమె తన రచనల్లో చెప్పినా సమాజం అంగీకరించేట్టు చెప్పడం ఆమె రచనా శిల్ప నైపుణ్యమని అభిప్రాయపడ్డారు. ఏ చిన్న విషయాన్నైనా ఒక కథగా మలిచగలిగే ప్రతిభ ఆమె సొంతమని పేర్కొన్నారు. మాలతి రచనలకు సంబంధించిన మరెన్నో విశేషాలను ప్రస్తావించి వక్త తన ప్రసంగాన్ని సుసంపన్నం చేశారు. 

.

 సమితి తరపున బి. నవీన సభకు స్వాగతం పలికి,  మాలతీ చందూర్ తో చిరకాలం అనుబంధం నెరపిన రచయిత్రి వాణీ మోహన్ మాలతిపై రాసిన కవితను చదివారు. 

.

 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సహాయ ఆచార్యులు డా. వై. సుభాషిణి వక్తను సభకు పరిచయం చేశారు. 

.

ఈ కార్యక్రమం యూట్యూబ్ వీడియో –

.

.

***********************************************************************************

.

మా అన్నయ్యతో అనుబంధం

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెళ్ళు పార్వతి, శైలజ, వసంతలక్ష్మి

.

తెలుగువారందరి ఇంటివాడు, గాన గంధర్వుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగి ఏడాది అయిన సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రత్యేక ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీ శనివారం సాయంత్రం యూట్యూబ్ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమం ఆర్ద్రతకు, చిన్ననాటి చిలిపితనానికి, ఆత్మీయ అనుబంధాల మాలికకు వేదికైంది. ప్రేక్షకులకు బాలసుబ్రహ్మణ్యంలోని మరో కోణాన్ని చూపింది. 

.

బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో గొప్ప అనుబంధం కలిగిన ప్రముఖ సినీ నేపథ్య గాయని గోపిక పూర్ణిమ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా…  “ముగురమ్మలు చెల్లెళ్ళయి” అంటూ ఈ సందర్భంగా డా. కాసల నాగభూషణం రాసిన కవితకు నిడమర్తి వసుంధర స్వరాలు సమకూర్చి గానం చేశారు. శనివారం దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు బుజ్జాయి 90వ పుట్టినరోజు కావడంతో సమితి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. 

.

పార్వతి: బాలసుబ్రహ్మణ్యం పెద్ద చెల్లెలు:

 

అన్నయ్య చెన్నై నుంచి వస్తున్నాడంటేనే ఉత్సాహంగా ఉండేది. ఆరోజు మాకు భోజనం క్యారెజీ తెచ్చేవాడు. ఫోటోగ్రఫీ అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. రకరకాల పోజుల్లో మా ఫోటోలు తీసేవాడు. ఇక అన్నయ్య పుట్టినరోజు నాడు భలే హడావుడి జరిగేది. అమ్మ చేసే తినుబండారాలు మేడ మీద ఉన్న అన్నయ్య, అతని స్నేహితులకి ఇచ్చి రావడమే మా పని. అక్కడ ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో కాస్త తొంగి చూస్తే కేకలేసేవారు. అన్నయ్య ఇంట్లో ఉంటే దాగుడుమూతలు ఆడేవాళ్ళం. అన్నయ్య, వదిన, పల్లవి, చరణ్, మా కజిన్స్ అందరం సరదాగా గడిపేవాళ్ళం. ఒకసారి చరణ్ ని ట్రంకుపెట్టెలో పెట్టి మూత మూస్తే పొరపాటున బిగుసుకుపోయింది. ఎంతో ప్రయత్నం చేసి తీస్తే వాడు అందులో చిన్నికృష్ణుడిగా హాయిగా నిద్రపోతూ కనిపించాడు. అన్నయ్య అనగానే ఎన్నో చిలిపి పనులు, మధుర స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆయన చెల్లెళ్ళం అయినందుకు ఎంతో అదృష్టవంతులం.

.

శైలజ: ప్రముఖ సినీ నేపథ్య గాయని:

 

గాయకుడిగా అన్నయ్య ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. మా అనుబంధం గురించి మీకు చెప్పడం వల్ల మేము పడుతున్న బాధ నుంచి కొంత ఊరట కలుగుతుందనిపిస్తోంది.

.

వయసు రీత్యా మాకు అన్నయ్య నాన్న లాంటి వాడు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడాడు. కుటుంబం, అనుబంధాలు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. నేను కొంచెం పెద్దయ్యాక మద్రాసులో అన్నయ్య దగ్గరుండి చదువుకున్నాను. నేను ఊళ్ళో ఉన్నప్పుడు దీపావళికి మాకందరికీ టపాసులు విడివిడిగా ప్యాక్ చేసి పంపేవాడు. ఆయన వస్తున్నాడంటే సంతోషంతోపాటు కొంత భయంగా కూడా ఉండేది. ఎందుకంటే మా చదువుల గురించి పట్టించుకొనేవాడు. అప్పటికప్పుడు చిన్న చిన్న లెక్కల పరీక్షలు పెట్టేవాడు. 

.

నేను తొమ్మిదో క్లాసుకి వచ్చినప్పటినుంచి అన్నయ్యతోపాటు ఊళ్ళు తిరుగుతూ ఎన్నో కచేరీలు చేశాను. అలా మా ముగ్గురు అక్కచెల్లెళ్ళలో ఆయనతో ఎక్కువగా ఉన్నది నేనే. ప్రయణాలప్పుడు ఇంటి విషయాలతో సహా ఎన్నో విషయాలు అన్నయ్య, నేను మాట్లాడుకొనేవాళ్ళం.

.

మా అందరికీ ఆయన పెద్ద అండ. ఏ చిన్న కష్టమొచ్చినా చూసుకుంటాడని ధైర్యంగా ఉండేది. ప్రతి చిన్న శుభకార్యం సంతోషంగా జరుపు కున్నాం. 

మాది పెద్ద కుటుంబం కదా. తన కూతురితో కలిపి ఆరు మందికి పెళ్ళి చేశాడు అన్నయ్య. ఒక నాన్నలాగా ఇంటి భారమంతా మోశాడు. ఆయన ఎంత కష్టపడేవాడో దగ్గరుండి చూసి అర్థం చేసుకున్నాను కాబట్టి ఆయన చెప్పినట్లు మసలుకోవడం, ఆయనకి మంచి పేరు వచ్చేలా నడచుకోవడం చేయాలనుకున్నాను. మాట తీరు, నడవడితోపాటు పాటలు ఎలా పాడాలి లాంటివి నేర్చుకున్నాను. నన్ను తీర్చిదిద్దినది ఎక్కువగా అన్నయ్యే. నన్ను, నా ప్రవర్తనను గమనించిన తరువాత నా మీద ఆయనకి ఎంతో నమ్మకం కూడా కలిగింది. 

.

ఇంట్లో పేకాడడం, ఓడిపోతే పేకముక్కలన్నీ కలిపేసి వెళ్ళిపోవడం, రికార్డింగ్ అయ్యాక రాత్రుళ్ళు మా కజిన్స్ ని కూడా కలుపుకొని సినిమాకు వెళ్ళడం… ఎంత పని ఉన్నా ఇవన్నీ కూడా చేసేవాడు. 

.

అన్నయ్యకి నాన్నంటే చాలా ఇష్టం, అమ్మంటే గౌరవం, భయం. ఏ పరిస్థితిలోనైనా ఎంత విభేదించినా చివరికి అమ్మ చెప్పినదే చేసేవాడు. ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వాళ్ళిద్దరి మధ్య విచిత్రమైన బంధం ఉండేది. నాన్న ఎప్పుడూ శాంతమూర్తే. ఆయన పోవడంతో అన్న చాలా కుంగిపోయాడు. తేరుకొన్న తరువాత అమ్మని తనతో తీసుకెళ్తానని ఎంతగా అడిగినా ఆమె ఒప్పుకోలేదు. నాన్న ఉండిన ఇంట్లోనే ఉండిపోతాననింది. 

.

మాతో గొప్ప అనుబంధం ఉండేది అన్నయ్యకి. రాఖీ పౌర్ణమి నాడు మా పెద్దక్కతో సహా అందరం రాఖీ కట్టేవాళ్ళం. అందుకోసం బాగా ఎదురుచూసేవాడు. అన్నయ్యకి తనతోనే ఎక్కువ అనుబంధం ఉండాలని మా రెండో అక్కయ్య భారతికి ఒక కినుక ఉండేది. తనని కావాలని ఏడిపించేవాడు. 

.

ఏ సందర్భంలో మేమందరం కలిసినా భోజనాల తరువాత మాటలు, మిమిక్రీలు, అంత్యాక్షరి అన్నీ ఉండేవి.

.

పోయిన ఏడాది రాఖీ పౌర్ణమికి వచ్చి రాఖీ కట్టమన్నాడు కానీ కాసేపటికే ఫోన్ చేసి… జలుబుగా ఉంది, రెండ్రోజుల తరువాతైనా కట్టచ్చులే అన్నాడు. ఇక ఆ రాఖీ నా దగ్గరే ఉండిపోయింది.

.

ఇక మేమెప్పటికైనా కోలుకొని పాడగలమా? అని చరణ్, నేను అనుకున్నాం. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకొని వేదికల మీద పాడుతున్నాం. 

అన్నయ్య మాతోనే ఉన్నాడు, మాతో పాడిస్తున్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు.

.

వసంతలక్ష్మి: బాలు గారి చిన్న చెల్లెలు:

 

అన్నయ్య పోవడంతో మా శరీరాల్లో ఒక భాగమే పోయినట్టుగా ఉంది. 

.

ఆయనకంటే 19, 20 ఏళ్ళు చిన్నదాన్ని. చిన్నప్పుడు నాకు  స్నానం చేయించేటప్పుడు సబ్బు నురుగతో పెద్దగా బుడగలు ఊదేవాడు. అన్నయ్యంటే అల్లరే. తను నవ్వకుండా అందరినీ నవ్వించేవాడు. ఆయనతో, చిన్నన్నయ్య జగదీష్ తో మాకు గొప్ప అనుబంధం ఉండేది. 

.

బాగా చిన్నప్పటి నా పుట్టినరోజున నా చేత కేక్ కోయించి “బంగారు తల్లి నా చెల్లెలు” అనే పాట పాడాడు. నేను టెన్త్ పాసైనప్పుడు హోటల్లో పార్టీ ఇచ్చాడు. జ్ఞాపకాల దొంతరలు ఒక్కొక్కసారి మనసుని మెలి తిప్పుతాయి. తెలిసో తెలియకో కొన్నిసార్లు ఆయనని చాలా బాధ పెట్టాం. అయినా పక్షి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు మమ్మల్ని కాపాడాడు. 

.

మా వదిన గురించి చెప్పకపోతే అన్నయ్య గురించి చెప్పడం అనేది సుసంపన్నం కాదు. వాళ్ళ పెళ్ళినాటికి నాకు ఐదేళ్ళు. మమ్మల్ని, ఇంటికి వచ్చే బంధువులని వదిన ఎంతో బాగా చూసింది. నేను అన్నయ్యని ఏదీ నేరుగా అడగలేదు. అన్నీ వదిననే అడిగేదాన్ని మేము పెళ్ళై వెళ్ళిపోతుంటే వాళ్ళు ఒంటరివాళ్ళు అయిపోతున్నారని చాలా బాధపడింది. 

.

నేను బాగా అల్లరి చేసేదాన్నట. ఒకసారి నాన్నగారినే ‘ఏరా’ అన్నానట. అన్నయ్య ఆ మాట అంటూండేవాడు. ‘మద్రాసు మువ్వలు’లో నేను నాటకం వేసినా పాట పాడినా అన్నయ్యకి చెప్పేదాన్ని. నాన్నలాగా ఎప్పటికైనా ఒక్కసారి హరికథ చెప్తానని నేనంటే తను చాలా సంతోషించాడు. ఆ కార్యక్రమానికి తను వస్తానని, స్పాన్సర్ కూడా చేస్తానని అన్నాడు.

.

అన్నయ్య లేడని నేను అనుకోవట్లేదు. ఆయన ఎక్కడ లేడు? ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ గుబాళిస్తూనే ఉంటాయి మీ వెనకే నేనున్నాను… అన్నట్టు ఆయన చెయ్యి మా భుజం మీదే ఉంటుంది. మొన్నటిదాకా ఆయన ఎప్పుడూ పని హడావుడిలో ఉండేవాడు. ఇప్పుడైతే ఎప్పుడైనా ఆయనతో మాట్లాడచ్చు కదా!

.

“ఇన్నాళ్ళు ఎదురుగా ఇకపై ఎదలోన” అంటూ తను తన అన్నయ్య మీద రాసిన పాటను వసంతలక్ష్మి వినిపించారు. 

.

ఈ కార్యక్రమం యూట్యూబ్ వీడియో –

.

 

.

*********************************************************************************** 

.

‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ

.

అంతర్జాలంలో జూమ్ వేదికగా ప్రముఖ రచయిత్రి, గాయని, స్వరకర్త జోశ్యుల ఉమ గారు రచించి, తన కుమారుడు శైలేష్ తో కలిసి స్వరపరిచిన ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ల ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 12వ తేదీన జరిగింది. ఉమ తన ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభించారు. శైలేష్ స్వాగతం పలికారు. సంగీతంలో ఎం. ఏ. చేసిన ఉమ సంగీతంతో బాటు సాహిత్యం లో కూడా ప్రావీణ్యం ఉందని, భక్తి రసంతో బాటు హాస్య రసం అమెకెంతో ప్రీతిపాత్రమైనవని, అందుకే ‘ నవగ్రహ స్త్త్రోత్రాలు వంటి ఎన్నో భక్తి రస రచనలతో బాటు ‘ కాఫీ దండకం ’, ‘ అవకాయ దండకం ’ వంటి పారడీ రచనలు కూడా చేసి గానం చేసి శ్రోతలను అలరించారని తెలిపారు. ‘ స్వరార్ణవ ’ పేరుతో సంస్థను నెలకొల్పి ఎందరికో సంగీతం నేర్పిస్తున్నారని శైలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా విద్యావేత్త, రచయిత్రి, కథకురాలు బాలాంత్రపు లావణ్య పాల్గొన్నారు.

.

రామాయణంలో ‘ సుందరకాండ ’ చాలా ప్రాముఖ్యత కలదని, హనుమంతుడు అందరికీ ఆదర్శమని అంటూ చిన్నప్పటి నుంచీ విన్న పురాణ కథలు తన భక్తి రస రచనలకు ప్రేరణ అని ఉమ పేర్కొన్నారు. ముఖ్య అతిథి లావణ్య, రచయిత్రి ఉమ, ఆమె భర్త శ్యామ్ సుందరం, కుమారులు సత్య సుబ్రహ్మణ్యం, శైలేష్ కలిసి ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ని ఆవిష్కరించారు. 15 నిముషాల నిడివి గల ఈ పాటను ఉమ, ఆమె భర్త, కుమారులు గానం చేశారు. బాలాంత్రపు లావణ్య మాట్లాడుతూ ఈ ‘ సుందరకాండ మహిమ ’ జానపద బాణీలో హరికథా గానం లాగా సాగిందని, భక్తి రసంతో జనరంజకంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై ఆకాశవాణి అధికారి జి. లలిత, విశ్రాంత వ్యాఖ్యాత్రి బి. గజగౌరి మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ స్వరార్ణవ ’ సహ వ్యవస్థాపకురాలు ఊటుకూరి శారద వందన సమర్పణ చేశారు.     

.

***********************************************************************************

.

‘ అమెరికాలో తెలుగు భాషా వికాసం ’ చర్చా కార్యక్రమం

.

2020 లో అమెరికా లో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలలో తెలుగు సూచనలు ముద్రించడం, వాణిజ్య సముదాయాలలో స్వాగత తోరణాలు తెలుగు భాషలోనే వ్రాస్తూ ఉండటం, అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు కావడం వంటి వాటి వలన అమెరికాలో తెలుగు భాష తొలి మెట్టు ఎక్కిందని భావించవలసి ఉంటుందని చర్చా కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ అతిథి శ్రీ మృత్యుంజయుడు అన్నారు. 

.

వ్యవహరిక భాషా ఉద్యమ రూపశిల్పి గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఆగష్టు నెల 29వ తేదీన అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో నగరంలో ‘ శాక్రమెంటో తెలుగు సంఘం ’ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ అమెరికాలో తెలుగు భాషా వికాసం ’ అనే అంశం పైన అంతర్జాలం వేదికగా చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

.

గత తరం పిల్లలకు అమెరికా వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకోవడానికి అవకాశాలు శూన్యం. ఈ తరం పిల్లలకు మనబడి, పాఠశాల, సంస్కృతి వంటి అనేక తెలుగు బడులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించడంలో తల్లిదండ్రుల సాధకబాధకాలు, అమెరికాలో సాహితీ రంగంలో తొలితరం రచయితల పాత్ర, తెలుగు సాహిత్యాధ్యయనం కోసం అమెరికాలో ఉన్న అవకాశాలు వంటి అనేక అంశాలు ఈ కార్యక్రమంలో చర్చించటం జరిగింది.

.

ఈ కార్యక్రమంలో ముగ్గురు విశిష్ట అతిథులు పాల్గొన్నారు. వారు సిలికానాంధ్ర వారి ‘ సుజనరంజని ’ పత్రికా సంపాదకులు, బే ఏరియా సాహిత్య వేదిక ‘ వీక్షణం ’ నిర్వాహకులలో ముఖ్యులు శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు. నాట్స్ పత్రిక ‘ అక్షర ’ మాజీ సంపాదకులు, రచయిత, యూసీ డేవిస్ విశ్వవిద్యాలయం వ్యవసాయ విభాగంలో ఆచార్యులు డాక్టర్ సురేంద్ర దారా గారు, ‘ సిరిమల్లె ’ పత్రిక సంపాదకులు, రచయిత, యూసీ డేవిస్ విశ్వవిద్యాలయంలో జీవ రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యులు శ్రీ మధు బుడమగుంట గారు.

.

శాక్రమెంటో తెలుగు సంఘం వ్యవస్థాపక బోర్డ్ సభ్యులు, ‘ తెలుగు వెలుగు ‘ పత్రిక సంపాదకులు శ్రీ వెంకట్ నాగం గారు ఈ చర్చా కార్యక్రమానికి సంధాన కర్తగా వ్యవహరించారు.

.

శ్రీ మధు గారు మాట్లాడుతూ మాతృ భాష మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాలని పేర్కొన్నారు. మన జీవన విధానంలో మార్పులకు అనుగుణంగా పరభాషా పదాలను కొన్నిటిని మన మాతృభాషలో చేర్చుకున్నామని, దానివలన అచ్చమైన తెలుగును మర్చిపోయే పరిస్తితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

.

శ్రీ సురేంద్ర గారు మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం తెలుగు ఫాంట్లు, సాఫ్ట్ వేర్ లు అందుబాటులో లేవని, ఇప్పుడు అవన్నీ అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు.

.

అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి ఇంట్లో తెలుగు మాట్లాడటం అలవాటు చెయ్యడంతో బాటు కనీసం వారానికొకసారి ఇంట్లోని సభ్యులందరూ అన్య భాషా పదాలను ఉపయోగించకుండా పూర్తిగా తెలుగు లోనే మాట్లాడటం అలవాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.  

.  

అమెరికాలో తెలుగు భాషా వికాసానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఇతర అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చ లో పాల్గొన్న వారికి, ఆత్మీయ అతిథులకు సంధానకర్త వెంకట్ గారు, శాక్రమెంటో తెలుగు సంఘం అధ్యక్షులు రాఘవ్ చివుకుల కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ సభ్యులు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.

ఈ కార్యక్రమం వీడియో –       

.