12_006 జనకమహర్షి

 

 

ఎక్కడ సీత ! లగ్నమున కెల్లరు వచ్చిరయోధ్యయెల్లత

క్రిక్కిరిసేన్ గదామిథిల ! కీర్తి కిరీటము దాల్చి రూపు పెం

పెక్కగ నిల్చె ఆ దశరధేశ్వరు డల్లదె, ఎంత పుణ్యమో

దక్కెనునాకు ! రాఘవుని ధారగ మారును సీత ఇంతనే !

 

కడుపున పుట్టలేదు; తమకంబున ఏ పురుటింటి వాకిటన్

గడపను దాటి చూచుటకు కన్నులు పెద్దవి చెయ్యలేదు, మా

పొడి పొడి జీవితంబులను పున్నమి వెన్నెల ముంచిపోవగా !

పుడమిని పుట్టినావు కద ! పుత్రిక వైతివి ఎంతభాగ్యమో !

 

నిన్నొక ఇంటి కోడలుగ నిస్తుల తేజ విరాజ సంపదన్

కొన్నవకంబు కూర్పగల గొప్పకులంబది యెద్దియంచు ఏ

నెన్ని విధంబులో తలచి ఈశ్వర చాపము త్రుంచువారికే

కన్నియనిత్తునంటి రఘుకాంతుడు తానయివచ్చెనల్లుడై

రాజమందిరమెల్ల పూజాలయమ్ముగా, రూపొంద చేసె నీపాపవచ్చి

హలమును చేపట్ట శ్రీలక్ష్మి వుదయింప, పొలమెల్ల క్షీరాబ్ధి పొంగులీనె

ఎదురైన యపుడెల్ల పదములు మొక్కంగ, కన్నులు పన్నీటి కాల్వలయ్యె !

 

కడుపు పండక సంతాన కాంక్ష తీర

నెంతో కుందెడు మనసుల ఎట్లో తిరిగి

తల్లి భూదేవి కరుణించి మల్లెపూవు

నొకటి దోసిట వైచె జయోత్సవముగ !

 

వెనుకటి జన్మమందు మరి వేల్పుల నెవ్విది మ్రొక్కినానో తా

తనయగ వచ్చె లక్ష్మి తెలితామర గద్దెగ మారె జన్మముల్

జనకుడుగా తరించుటకు చాలకపోయెనో పుణ్యమంతయున్

జనకుని రూప ధారణకు చాలెను సుప్రీతి అంతె చాలులే !

 

ఈవేళ ఈపూటే ఇక్ష్వాకులింటికి

                        పయనమైపోవు నా ప్రాణపుత్రి

రఘురామ నీడగా, రతనాల మేడగా

                        మహలక్ష్మి మా తల్లి మారిపోవు

వెదురువనము బోలె వేణువు లూదెడు

                        పిలగాలి తరగలు నిలిచిపోవు

పెరిగిన ముచ్చట తరగని ప్రేమలు

                        అత్తవారికి నేడు అంకితమ్ము

 

అమ్మ ! జానకీ ! నాతల్లి ఆడపడుచు

జంటకన్నుల వెన్నెల – పంటపొలము

చేతికందించి పోయిన జీవకళిక

సీత మము వీడి చను పరంజ్యోతి వోలె !       

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——–   ( 0 ) ——-

Please visit this page