10_020 నా స్టేటస్ చూడు

.

“ఏమండోయ్! నా స్టేటస్ చూసారా ? ” అని గావుకేక పెట్టింది చారుమతి. కరోనా వచ్చిన సమయంలో ప్రాణాయామం నేర్చుకుని ప్రాణపాయం నుండి ఇప్పటికీ  కాపాడుకుంటున్న ముకుందం ఉలిక్కిపడ్డాడు. నిముష నిముషానికి వాట్సాప్ లో స్టేటస్ మార్చి, ” చూసారా! చూసారా! అని  భార్య చారుమతి బుర్ర తినేస్తోంది.

” అబ్బ! నీ స్టేటస్ నేను చూసే లోగానే కొత్తది పెట్టేస్తావు మరి. యెట్లాగే చూసేది? ” విసుగ్గా  అన్నాడు.                                              

“ అదేమరి.. మీకు నాకు తేడా.. నేను ఎప్పటికప్పుడు అప్డేటుగా ఉంటానండి ” అంది గర్వంగా తలఎగరేస్తూ.   

  “ అప్డేటుగా ఉండడం అంటే ఇల్లు తుడవడం, వంటచేయడం, పిల్లాడికి డ్రస్ వేయడం, నాకు టిఫిన్ పెట్టడం లాంటివి స్టేటస్ గా పెట్టడం.. కాదనుకుంటాను చారూ ! పెడ్తే పెట్టవు. ‘ లాక్‌డౌన్ లో మా శ్రీవారు ‘ అంటూ నేను అంట్లుతోముతున్నది, బట్టలు వుతుకుతున్నది పెట్టావు. మా ఆడాళ్ళు కూడా ఆ పన్లన్ని చెయ్యమంటున్నారని కాలనీ మగాళ్లు గోలపెట్టారే! ఏదైనా ముఖ్యమైన ఈవెంటులు ఉంటే పెట్టాలి గానీ ఇదేం పిచ్చే.. ” అన్నాడు దీనంగా. 

 “ అమ్మో! అలా స్లో అయితే మా గ్రూపులో ఉన్న వనజాక్షి, విశాలాక్షి రెచ్చిపోయి నాకన్న ర్యాంకింగ్ లో ముందుకొచ్చేస్తారని భయం. ఇప్పటివరకు నా స్టేటస్ కే ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు తెలుసా ! నేను టాప్ ర్యాంకర్ ని మా గ్రూపుల్లో ”….. అంది లేని కాలర్ ఎగరేస్తూ.                 

“ ఏంటి! దీన్లో కూడా ర్యాంకింగా? ఇదేవన్నా ఐఐటి పరిక్షా?..  ” ఆమె వెర్రికి  ఏమనాలో తెలియక వెర్రి నవ్వొకటి నవ్వాడు.

” మా కిట్టీ పార్టీలో ఇవన్నీ పెద్ద చర్చనీయాంశాలండి. వ్యూయర్స్ తక్కువ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళకు పార్టీ ఇవ్వాలి తెలుసా! ” అంది గొప్పగా.

“ నీ తలకాయి! నీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అంతమంది చూస్తారు. దాన్లో ఎవరెక్కువేంటి? ” అని నసిగాడు.                            

“ మీరు మరీను! నాకున్న గ్రూపుల్లో నేనే ఫస్ట్! ” అని కాళ్ళు ఊపుతూ చెప్పింది. 

“ ఏంటి! ఆ కిట్టీ పార్టీ గ్రూపుల్లోనా? ” అని ` ఎమోజీ బొమ్మ ` లా గట్టిగా నవ్వాడు.

“ అదొకటే కాదండి బాబు!….  వేరేవి కూడా ఉన్నాయి. చాలా గ్రూప్సుకి నేనే అడ్మిన్ తెలుసా.. ” అంది

” ఎడ్మిన్ !.,.హ్హ హ్హ. అదేదో పెద్ద కంపనీ కి సి.ఇ.ఓ పోస్టులా ? `ముఠా మేస్త్రీ` అంటే బావుంటుందేమో ! ” ..వెక్కిరించాడు.

“ సి.ఇ.ఓ. అంటే గుర్తొచ్చిందండోయ్! మా గ్రూపులో ‘ స్వర్ణలలిత ’ బంగారం షాపుల సి.ఇ.ఓ. గారి భార్య కూడా మెంబరు తెలుసా! ”… చెప్తుంటే మొహం గర్వంగా వెలిగిపోయింది.

 ” ఆవిడకి మీతో ఏం పనిట?.. ఆశ్చర్యంగా అడిగాడు.

” ఆవిడ మంచి స్టాటస్ ఉన్న మనిషి కదాని జాయిన్ చేసుకున్నాం ”.    

“ అదేం కాదే! మీతో బంగారం స్కీములు కట్టించడానికి చేరుంటుంది ”.. అనుమానంగా అన్నాడు.

“ భలే కనిపెట్టారే! గూఢచారి నూట పదహారులా! నన్ను నెలకి పదివేలు స్కీములో చేరమని చంపేస్తోంది. అందరూ జాయిన్ అయ్యారు కూడా ”.

“ చెప్పానా! ఊరికే ఎవ్వరూ గ్రూపుల్లో జాయిన్ అవ్వరు. అక్కడ కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదిద్దామని వస్తారు. అలాంటి జగత్ జెంత్రి అయ్యుంటుంది ఆవిడ కూడా!… కాస్త జాగ్రత్త గా ఉండు ”

“ సర్లేండి! ఎక్కడ నాకు బంగారం స్కీము డబ్బులు ఇవ్వవలసి వస్తుందోనని వంక. అంతే కాదు, నేను మరిన్ని మంచి గ్రూపుల్లో కూడా సభ్యురాల్నికూడా ! ” అంది గొప్పగా. 

“ తెలుసులే ! .… ‘ వంటనేర్చుకో ఇంతి పూబంతి ‘ అనే కొత్తరకాల వంటలు చేసి, మొగుళ్లని ఎలా భయపెట్టాలో అనే గ్రూపు…,  ‘ ఆన్ లైన్ బిస్కెట్ తిని చావండి! ’ అనే ఇంట్లో బిస్కెట్లు ఎలా చేయాలోచూపించే గ్రూపు….. ”                 

“ తిని చావండి కాదండి! తిని చూడండి ! ” అని సరిచేయ్యబోయింది చారుమతి. 

” అదేలే! ఇంకోటేంటి? ‘ యోగం-యమాసనం ’ అదేం గ్రూపే? ” 

“ ఛీ ఛీ తప్పండి ! యోగం – ఆసనం ” దాంట్లో యోగా నేర్పుతారు తెలుసా అని చేతులూ కాళ్ళు సాగదియ్యడం మొదలు పెట్టింది…

“ అవును విన్నాను. ఆ మధ్య ఒక ఆవిడ తప్పుగా అదేదో ఆసనం వేసి, విప్పదియ్యడం  చేతకాక అలా ఒకరోజు అంతా ఉండిపోయిందిటిగా. చాలా ప్రమాదం సుమీ ! నువ్వు చెయ్యకే. నా ఆఫీస్ దూరం కూడాను. నేను పరుగెట్టుకుంటూ రాలేను నీకోసం…. ” అని భయంగా మొహం పెట్టాడు.  

“ అబ్బే ! నేను చేస్తున్నట్టు స్టేటస్ ఫోటోలు పెడతాను, అంతే ”… అంది తెలివిగా. 

“ఇంతేగా నీ గ్రూపులు ” అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

“ అయ్యో రామ! అవే కాదండి. ` నేను పాడితే ఊరంతా అదిరిపోదా? ` అనే సంగీతం గ్రూపు కూడా ఉంది.                  

“ ఏంటి ఊరంతా పారిపోదా? ”… ఉడికించాడు ముకుందం.  

“ అబ్బ! అన్నీ మీకు వేళాకోళమే! ” అంటూ కోపంగా బెడ్ రూంలోకి పోయింది. 

” చారూ ! చారూ ! కోపం వద్దు.. సరదాకి జోక్ చేసాను” అంటూ బ్రతిమాలాడ్డo  మొదలెట్టాడు ఎక్కడ తిండి పెట్టదో అనే భయం కొద్ది.  

xxxxxxxxx

ఆ ఆదివారం పొద్దున్నేసూన్నాణ మూర్తి  తన డైలీ స్టేటస్ పెర్మనెంటు గా ఆకాశంలో పెట్టుకుని వ్యూయర్స్ కి ఫోజిస్తున్నాడు. ముకుందం బధ్ధకంగా లేచి మరింత లేజీగా పళ్ళు తోముతున్నాడు.

చారుమతి తన గ్రూపుల ఎడ్మిన్లతో జూమ్ చాటింగ్ లో ఉంది.                     

” ఎన్నైనా చెప్పండి కామాక్షి గారూ ! నా స్టేటస్ కి మాత్రం అమేరికా నుండి కూడా బోల్డు వ్యూస్, విషెస్ వస్తున్నాయి తెలుసా? “….అంటూ గప్పాలు కొడుతోంది.

“ చారూ! కాఫీ ! ” అరిచాననుకుని మూలిగాడు. ముకుందం మూలుగుకి కి అంగుళం కూడా కదలకుండా…

“ అబ్బా ఉండండి! మంచి ఇంపార్టెంటు మీటింగ్ లో ఉన్నాను ” అంది ఏదో అంతర్జాతీయ సమావేశంలో వున్నట్లు. 

‘ దీని స్టేటస్ ల గోల తగలెయ్యా! ఈ వాట్సాప్ ను కనిపెట్టిన వాడికి నా ఉసురు తగలా !. సంసారాలు సర్వనాశనం చేసేసాడు ‘…. అని లోపల అనుకోబోయి పైకే అన్నాడు. 

“ మీకు కుళ్ళు! నేను వాట్సాప్ లు, ట్విట్టర్లను చూసి తెలివైనదానిని అయిపోతున్నానని కదా! ” అని మీటింగ్ క్లోజ్ చేసి వస్తూ అంది.

” అవును మరి! నువ్వు చూసే ఆ గ్రూపుల్లో డంప్ చేసే చెత్తoతా చదివేస్తే జ్ఞానం వచ్చిందా? ” అని వెర్రిగా నవ్వి గుడ్లు తేలేసాడు.

రోజు రోజుకి చారుమతి, కొత్త స్టేటస్ ఫోటోల కోసం వెర్రిత్తిపోతోంది. ఏది చూస్తే అది స్టేటస్ ఫోటో లా అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చారుమతి స్టేటస్ పిచ్చి వల్ల ముకుందానికి మనశ్శాంతి కరువయ్యింది..ఏదోవిధంగా చారుమతిని స్టేటస్ పిచ్చి నుంచి తప్పించాలని ఆలోచించాడు. 

ఎప్పుడో పోయిన బామ్మ మళ్లీ ‘ బకెట్టు తన్నిసింది ‘ అని బాసు తో అబద్ధం అడి నాలుగు రోజులు సెలవు సంపాదించాడు.

చారుమతిని పిల్లల్ని తీసుకుని పాపికొండలు విహారయాత్రకెళ్ళాడు. చారుమతి గొప్పగా ‘ పాపికొండలతో నా బంగారు కొండలు ` అని మొగుడు, పిల్లాడితో అరడజను ఫోటోలు స్టేటస్ లో పెట్టింది. అది చూసిన ముకుందం బాసు పెళ్ళాం… 

“ ఎంచక్కా మీ ఆఫీసులో పని చేసే ముకుందం పెళ్ళాం పిల్లలని ఊళ్ళు అవి తిప్పుతున్నాడు.  మీరూ ఉన్నారు ! ఎప్పుడు చూసినా పని… పని… అని నన్ను పట్టించుకోవడం మానేశారు ” అని ఉతికి ఆరేసింది.

సెలవు అయ్యి ముకుందం ఆఫీసుకి వెళ్ళేసరికి బాసు తన సీట్లో కూర్చోడం మానేసి గుమ్మం లోనే కుర్చీ వేసుకొని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ముకుందం రాగానే ట్రాన్సఫర్ ఆర్డర్ చేతిలో పెట్టి…….

” అభినందనలోయ్ ముకుందం.. నిన్న పాపికొండలు.. రేపు నీ బతుకు చట్టుబండలు.. శంకరగిరి మాన్యం లో స్టేటస్ ఫోటో అప్డేట్ చేసుకో ” అని సింహంలా గర్జించి తన కేబిన్ లోకి పోయాడు. వెనకే పిల్లిలా కేబిన్లో దూరి కాళ్ళవేళ్ళ పడి ఆర్డరు మార్పించుకునేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది. 

xxxxxxxxx

                                                                                                                                                 

” చారూ ! సంసారం లో గుంభనం ఉండాలి. పడకగది ఫోటోలు స్టేటస్ లో పెట్టలేం కదా ! అన్నీ రోడ్డు మీద వెళ్ళే వాళ్లకి తెలిస్తే, ఎంత  ప్రమాదమో! ” అన్నాడు ఉపోద్ఘాతం గా. బాస్ కాళ్ళు ఎంత రహస్యంగా పట్టుకున్నది చెప్పాడు.

” అయ్యో! అలాగాండి! ఐతే జాగ్రత్తగా వుండండి ” అంది అమాయకంగా. 

” నేను కాదే..నువ్వు.. స్టేటస్ పెట్టడం మానేస్తావా? నేను ఉద్యోగం మానేయనా? ” అన్నాడు దీనంగా. 

” సరే! మీరు ఉద్యోగమే చెయ్యండి ” ఆంది ఉదారంగా.

‘ హమ్మయ్య! దీని బుర్ర స్టేటస్ మారినట్టుంది ‘. అనుకుని మనఃశాంతి అనే స్టేటస్ ని  అప్డేట్ చేసుకుని పడుకున్నాడు అమాయకపు ముకుందం.

అర్థరాత్రి ఏదో చప్పుడు వినిపించి లేచాడు ముకుందం. మంచం మీద చారుమతి కనపడలేదు. ఇల్లంతా వెతికాడు. వీధిలోకి పరుగెట్టాడు. ఎక్కడా కనబడలేదు. రెండు వీధుల అవతల ఉన్న గోరీల దొడ్డి లోకి దూకి, తన చింపిరి జుట్టు, నలిగిన బట్టలతో సెల్ఫీ తీసుకుని స్టాటస్ గా పెట్టే కార్యక్రమంలో ఉంది చారుమతి. అది చూసిన ముకుందం హతవిధీ! అంటూ నెత్తిమీద తువ్వాలేసుకుని ఆమెకేసి పరుగెట్టాడు. ఆకాశం లో చంద్రయ్య అది చూసి నవ్వుతో స్టేటస్ అప్డేట్ చేసుకుంటున్నాడు.

                                                             

**********************************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************