10_010 వాగ్గేయకారులు – పురందరదాసు

పురందరదాసు (1484-1565)

పురందర దాసు గారి పేరు చెప్పగానే మాయామాళవగౌళ రాగంలో వీరు రచించిన సరళీస్వరాలు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, శూలాదులు, దేవరనామాలు చెప్పి తీరాల్సిందే. కర్ణాటక సంగీతానికి మూలాధారమైన ఈ క్రమబద్ధమైన సంగీత స్వర నిర్మితి మనకు వీరందచేసిన పునాది, ఒక గొప్ప అమూల్యమైన సంగీత సంపద అని చెప్పవచ్చు. వీటి ఆధారంగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసించినప్పుడు, కేవలం రాగ, తాళ ప్రకరణలను నేర్వటమే కాక, కంఠ శుద్ధి, గాత్ర సౌరభ్యమ్, సౌలభ్యం కూడా గాయకులలో ఏర్పడతాయి. అందుకే వీరిని ఎంతో గౌరవపూర్వకంగా “కర్ణాటక సంగీత పితామహ” అని పేర్కొంటూ ఉంటారు. 

1484 లో బళ్లారి జిల్లాలోని హంపీ నగరానికి దగ్గర గల పురందరగడ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ వజ్రాల వ్యాపారి అనే మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు తల్లితండ్రులకు ఏకైక పుత్రుడు. అసలు పేరు శ్రీనివాస. తిరుపతి వేంకటేశ్వరస్వామి మొక్కుతో పుట్టినందువలన ఆ పేరు కలిగింది. ముద్దుగా శేయీరు, శీనప్ప, తిమ్మప్ప, తిరుమలయ్య అని కూడా పిలిచేవారట. చిన్నప్పటినుంచి కన్నడ, సంస్కృత భాషలతో బాటు సంగీతమంటే కూడా ఎంతో ఇష్టం. వజ్రాల వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ వృత్తిలో అవసరమైన వజ్రాల పరీక్షలో కూడా చాలా నైపుణ్యం ఉండేది. 

మనకు అంత బాగా తెలియని విషయాలు కూడా వీరి గురించి ఉన్నాయి. ఈయన ఒక గొప్ప భారతీయ తత్వవేత్త, హరిదాసు, వాగ్గేయకారుడు. ఆపై ముఖ్యంగా ఒక సమాజోద్ధారకుడు. ఒక కృష్ణ భక్తునిగా, ఒక వైష్ణవ కవిగా వీరు ద్వైత సాధువైన వ్యాసతీర్థుని శిష్యులు. ఆ విధంగా పండరినాథుని కొలవటం జరిగింది. అంతేకాక వీరి గురువు వీరిని గురించి తమ గేయాలలో ఇలా పేర్కొన్నారు కూడా: ” దాసరేంద్రరే పురందర దాసరాయ “. వీరు కర్ణాటక సంగీతానికి అందచేసిన అపూర్వ సంపద దృష్ట్యా వీరిని సాక్షాత్తూ నారదముని అవతారంగా భావిస్తారు. 

తమకున్న సిరిసంపదలను సకలమూ దానధర్మాదులలో వెచ్చించి హరిదాసు అయ్యారు. వీరి భార్య కూడా కృష్ణ భక్తురాలు కావటం విశేషం. మధ్యయుగపు భారతదేశంలో పరిఢవిల్లిన సంగీత విద్వాంసులలో వీరు ప్రముఖులు. 

ఒక విషయాన్ని నాకు అర్థమయిన పద్ధతిలో ఇక్కడ వివరించదలిచాను. ఉత్తర భారతదేశంలో స్థిరపడిన నన్ను ఇక్కడి హిందుస్తానీ సంగీతజ్ఞులు, గాయకులూ ఎప్పుడూ అడిగే ప్రశ్న మీ సరళీ స్వరాలు మాయామాళవగౌళ రాగంలో ఎందుకున్నాయి? అని. మొట్టమొదటిగా మాయామాళవగౌళ రాగాన్ని క్రొత్తగా సంగీతాన్ని అభ్యసించే విద్యార్థులకై ప్రవేశపెట్టిన మహానుభావుడు పురందర దాసు. మాయామాళవగౌళ రాగం ఎందుకో తెలుసుకోవాలంటే, ముందు ఆ రాగాన్ని గురించి కొంత తెలుసుకుందాం. 

మాయామాళవ గౌళ రాగం – 15వ మేళకర్త రాగం ( రాగ్ భైరవ్ – హిందుస్తానీ సంగీతం )

ఆరోహణ 

స – శుద్ధ రిషభం (R1) – సాధారణ గాంధారం (G 3) – శుద్ధ మధ్యమం(M 1) – పంచమం – శుద్ధ దైవతం (D1) – కాకలి నిషాదం – (N3) స

అవరోహణ (ఇవే శృతులలో ఉంటాయి)

స- ని- ద – ప- మ – గ- రి – స 

పట్టిక                        ఆధార శృతి  1 (హర్మోనియం పై తెలుపు 1 లేక సి నాచురల్ అనుకుంటే )

 

 

 

 

 

క్ర. సం

స్వరం

ఆధునిక పేరు

ఫ్రీక్వెన్సీ నిష్పత్తి

ఫ్రీక్వెన్సీ

1

షడ్జమం (టోనిక్)

S

1

262

2

శుద్ధ రిషభం

R1

(16/15)

279 Hz

3

చతుశృతి రిషభం

R2

(9/8)

294 Hz

4

షట్శృతి  రిషభం

R3

(6/5)

 

3.

శుద్ధ గాంధారం

G1

(9/8)

 

4

 

సాధారణ గాంధారం

G2

(6/5)

314 Hz

5

అంతర గాంధారం

G3

(5/4)

327 Hz

6

శుద్ధ మధ్యమం

M1

(4/3)

349 Hz

7.

ప్రతి మధ్యమం

M2

(17/12)

372 Hz

8

పంచమం

(స్థిర స్వరం)

P

(3/2)

392 Hz

9

శుద్ధ దైవతం

D1

(8/5)

419 Hz

10

చతుశృతి దైవతం

D2

(5/3)

441 Hz

11

షట్శృతి దైవతం

D3

(9/5)

 

10

శుద్ధ నిషాదం

N1

(5/3)

 

11

కైశిక నిషాదం

N2

(9/5)

471 Hz

12

కాకలి నిషాదం

N3

(15/18)

490 Hz

               

ఈ పట్టిక ప్రకారం 15వ మేళకర్త రాగం అయిన మాయామాళవ గౌళలో ఉండే స్వర స్థానాలకు గల ఫ్రీక్వెన్సీల (పౌనః పున్యం) నడుమ ఉండే తేడా క్రొత్తగా సంగీతాన్ని అభ్యసించే వారికి తేలికగా అవగాహనలోకి వస్తుందని పురందరదాసు గారు అనుకుని ఉండవచ్చు. అందుచేత మన సరళీ స్వరాలూ, మిగతా అభ్యాస సంగీతం అంతా ఈ రాగం లోనే వారు రూపొందించి ఉండవచ్చునని నా అభిప్రాయం. తరువాత శతాబ్దాల్లో ప్రాచుర్యంలోకి వచ్చిన హిందుస్తానీ సంగీతం, పాశ్చాత్య సంగీత ప్రభావం వలన అందులోంచి వారి “ప్యూర్ నోట్స్” అనగా శుద్ధ స్వరాలను అనుకరిస్తూ, బిలావల్ గా హిందుస్తానీలో పిలవబడే మన శంకరాభరణంలో వారి అభ్యాస సంగీతాన్ని ఏర్పరుచుకుని ఉండవచ్చు.   

కానీ రెండు రకాల అభ్యాస సంగీతాన్నీ పోల్చి చూసినప్పుడు, పురందరదాసు గారు కర్ణాటక సంగీత అభ్యాసాలు ఎంతో పరిపూర్ణ పరిణతి గాంచినవిగా, అన్ని రకాల తాళాలనూ విలీనం చేసి సమగ్రమైన సంగీత పాఠాలను మనకు అందచేశారు. ఇవి క్రమబద్ధంగా, ముందు కేవలం స్వరాలతో కట్టబడి, తరువాత చిన్న చిన్న గీతాలు, ఆపైన పెద్ద లేక ఘనరాగ గీతాలు గా మెట్లవారీగా విద్యార్థులకు కంఠ శుద్ధీకరణల, విషయంపై అవగాహన పెంచుకోవటంలో చాలా సహాయం చేస్తాయి. ఈ రకపు నిర్మితి మరే ఇతర సంగీత పద్ధతుల్లోనూ కానరాదు. 

చైతన్య మహాప్రభు తో ఆరంభం అయిన భక్తి ఉద్యమం లాగే పురందరదాసు గారు దశ సాహిత్యం అనే ఉద్యమాన్ని ఒక గాయకునిగా, విద్వాంసునిగా ఆరంభించారు. ఈ పరంపరను వారి సమకాలీనులు, వయసులో కొంత చిన్నవారూ అయిన కనకదాసు అనుకరించారు.  

పురందరదాసు గారి రచనలకన్నిటికీ “పురందర విఠల” అనే నామముద్ర ఉంటుంది. వారి జీవితకాలంలోనూ, ఆ తరువాత కూడా వీరి రచనలను ఎంతో ఆదర్శప్రాయంగా అనేక పండితులు భావించారు. ఈనాటికీ కర్ణాటక సంగీతం ఈ విధంగా పటిష్టమైన పునాది గల సంగీతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందుతోందంటే, ఆ శ్రేయస్సును పురందరదాసు గారికి ఇవ్వక తప్పదు.  

సమాజ ఉద్ధరణ 

ఆ రోజుల నాటికి అమలులో ఉన్న ఎన్నో సామాజిక సాంప్రదాయాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని పురందరదాసు గారు తమ భక్తి రచనలను స్థానికులకు అర్థం అయ్యేలా సరళమైన కన్నడ భాషలో వ్రాయటం మరియు పాడటం ద్వారా ప్రయత్నించారు. వీటిలో సామాజిక సంప్రదాయాలలో గల లోపాలను ఎత్తి చూపటం జరిగేది. పరోక్షంగా భక్తికి ఎటువంటి కులాలతో సంబంధం లేదనీ, భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడనీ తెలియజేశారు. కఠినమైన సంస్కృత భాషలో ఉన్న భగవద్గీతా సారాన్ని కూడా అందరికీ తెలియచేసే ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణ భగవానుడిపై నిష్కల్మషమైన భక్తిని చాటే వీరి రచనలలో ముఖ్యంగా వైష్ణవ మధ్వ తత్త్వం కానవస్తుంది. మానవునిలో ఉండే జీవం, అన్నిటికీ మూలాధారమైన భగవంతునికి ప్రతిబింబమనీ, అందుచేత భౌతిక సుఖాలకు బానిసలు కాకుండా, సాధ్యమైనంత పవిత్ర జీవనం మానవులు కొనసాగించాలని ప్రబోధన చేశారు. 

కులవివక్ష 

కులవివక్షపై పురందరదాసు గారు ధ్వజమెత్తారనే చెప్పుకోవచ్చు. వారి ఒక పాటలో “ఆవ కులవాదరేను, ఆవనదరేను ఆత్మ, భావవరియాద మేలే” అనే కీర్తనలో, ఏ కులానికి చెందని మానవత్వాన్ని మరిచిన జీవనం వ్యర్థమని తెలియచేశారు. ఉదాహరణకు, వేర్వేరు రంగుల్లో ఉండే ఆవులు ఇచ్చే పాలు, రకరకాలుగా ఉండే చెరుకు అందించే చెరుకు రసం లా ఒకేలా ఉంటాయని అర్థం వచ్చేలా వివరించారు. కులమనేది మనిషి మనస్తత్వం నిర్ధారిస్తుంది కానీ, జన్మతః లభించేది కాదని పేర్కొన్నారు. బలి ఇవ్వాల్సింది మనలో ఉండే దుర్గుణాలను కానీ అమాయక జంతుజీవాలను కాదని, పేదసాదలకు దానాలు చేయమని అర్థించారు.  

స్త్రీపురుష విభేదం 

గుణగణాలకు స్త్రీ పురుష భేదం ఉండదని చెప్తూ, స్త్రీలు ఎటువంటి నగలనూ ధరించాల్సిన ఆవశ్యకత లేదనీ, మానసిక సౌందర్యం, ఉత్తమ ప్రవర్తనే పెట్టని నగలనీ చెప్పారు పురందరదాసు గారు. 

అస్పృశ్యత 

ఆ రోజుల్లో అత్యధికంగా పాటించబడే అంటరానితనం అనే దురాచారాన్ని ఖండించటానికి వారి గురువైన వ్యాసతీర్థులు, శక్తిసామర్ధ్యాలకు మారుపేరైన విజయనగర సామ్రాట్టు శ్రీకృష్ణదేవరాయలు నుంచి స్ఫూర్తిని పొందారు. “హొయల హోరగితేనే ఊరోలగిల్లవే” అనే కీర్తనలో ఒక మనిషి యొక్క తీరుతెన్నులు మాత్రమే వారు అస్పృశ్యులుగా నిర్ధారించాలి గానీ, వారి పుట్టుక కాదని అంటారు. ఆ ధోరణిలోనే ఏయే గుణాలు అంటరానితనానికి తార్కాణాలో కూడా పేర్కొన్నారు. పురందర విఠల అని అన్నప్పుడల్లా వారి సంకేతం భగవంతుని వైపే. 

ఏటా ఫిబ్రవరి/మార్చి నెలలలో వచ్చే పురందరదాసు గారి ఆరాధన ఉత్సవాన్ని విశ్వవ్యాప్తంగా గల సంగీత ప్రేమికులు, సంగీత విద్యార్థులు వారి కీర్తనలను గానం చేసి జరుపుకుంటారు. 1964 లో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పురందరదాసు గారి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 

 

“ఆడిశిదళెశోదా జగదోధ్ధారణా”… పురందర దాసు కీర్తన – ఎం. ఎస్. సుబ్బులక్ష్మి

*******