10_019 పాలంగి కథలు – దశాబ్దాల నిర్వాణ భావం

Please visit this page

.

.

1950లో

5వ దశకంలో–

.

‘పల్లెటూరయినా పాడీపంటా! అబ్బాయి యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. సంగీతమ్మీద అభిరుచి ఉందట. అందరిచేతా సంగీత సరస్వతి అనిపించుకుంటున్న కూతురి సంగీతాభిరుచిని కాదనడేమోలేననే నమ్మకం! అన్నివిధాలా మంచి సంబంధం!’ నాన్నగారి సంబరం…ఆనందం!

.

‘పట్నవాసంలో పెరిగిన పిల్ల. కరెంటయినా లేని ఆ కుగ్రామంలో నెగ్గుకు రాగలదా? పెద్ద సంసారం. అత్తమామలది కనిపెంచే వయసు. పైగా పెద్ద కొడుకు. పల్లెటూళ్లంటే మీకిష్టం కదా అని దానికి పల్లెటూరి సంబంధం చెయ్యడం ఎంతవరకూ సబబు ఆలోచించండి’. అమ్మ సందేహం…కాదు అనుమానం!

.

‘ఇంకా పదహారేళ్లే కదా…చదివిద్దాం నాన్నా! ఈరోజుల్లో అందరూ డిగ్రీలు చదూకుంటున్నారు. సంగీతంలో ఎంఏ చేయించాలనుకున్నాను దాన్ని. మరోసారి ఆలోచించండి నాన్నగారూ. పైగా పల్లెటూరి సంబంధం. అమ్మ అన్నట్లు ఇబ్బంది పడుతుందేమో!’

.

‘రిటైరై ఉన్న నేను అది పై చదువులు చదివాక, ఎప్పుడు చేస్తాను పెళ్లి?’ ‘ఇదుగో…వింటున్నావా? దాని పెళ్లి బాధ్యత మగపిల్లలమీద పెట్టదల్చుకోలేదు. అయినా ఎంఏ దాకా చదివి ఉద్యోగం చేసుకోకుండా అక్కడే ఉండిపోడు’. నాన్నగారి ఆశ…నాన్నగారి నమ్మకం!

.

‘ఏమైనా దానికి సహనం ఉంది. నెగ్గుకురాగలదు. ఇంక ఆలోచించడానికేం లేదు. దానికి నా మాట మీద గౌరవం ఉంది. ఎవరేమనగలరు నిర్ణయం అయ్యాక!!’

.

నాన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. దారి చూపమని దైవాన్నే వేడుకోటం! అయినా ఎలా జరగాలో నిర్ణయించే ఉంచుతాడు పరమాత్మ! అమ్మా, నాన్న కూడా చిన్నప్పుడే నాలో నాటిన బీజం– దైవమ్మీద భారం వేయడం.

.

అత్తింట్లో వాళ్లకి అనుకూలంగా లేదనిపిస్తే, అందరూ అనుకునేమాటలు…కోడల్ని పుట్టింటికి పంపేస్తార్ట! జాగర్తగా ఉండాలి. బాబోయ్‌!

.

పెళ్లి…పల్లెటూరి జీవితం. అంతా అయోమయం. అందరూ అదిలించేవాళ్లే. హడలగొట్టేవాళ్లే!!

.

6వ దశకం–

.

‘చదూకున్నవాడ్ని. ఉద్యోగం చెయ్యకపోతే బాగోదు’.

.

ఇంట్లో వాళ్లని ఎలాగో కష్టపడి ఒప్పించి, మొత్తానికి ఉద్యోగంలో చేరగలిగారు ఆయన!

.

                                    ………..                         …………….

.

ఉద్యోగపు ఊరు. కొత్త స్నేహితులూ. ‘హాయిహాయిగా ఆమని సాగే…సాగేనా???

.

ఉహూ!! ఇదుగో. ఎంత ఆరునెలలకోసారి మన ఊరు వెళ్లి వస్తున్నా. ఈ ఉద్యోగపూళ్లో లింగులిటుకూమంటూ ఉండిపోవడం కాదు. పాపం! 15 ఏళ్లకే పెళ్లయి ఏటా పిల్లలతో కష్టపడుతోంది మా అమ్మ. మనం పల్లెకు వెళ్లిపోదాం. టౌన్‌లో ఫ్యాక్టరీ ఉద్యోగం చూసుకుని పొలం పనుల్లో నాన్నకి చేదోడుగా నేనూ, ఇంట్లో అమ్మకి సాయంగా నువ్వూ. పెద్ద కొడుకూ, కోడలూ అయినందుకు ఇది మన బాధ్యత’.

.

‘అది కాదండీ…’

‘ఏది కాదు?’

‘అహ…మీ ఇష్టం…’ ఎందుకో ఆ తీవ్రత. నేనేమీ అనందే? కాదంటాననా? ఏమో!! ఏదైనా చెప్పబోతే వాళ్ల సర్వేశ్వర్రావ్‌లా, పుట్టింట్లో వదిలేస్తే? చైనులుగారమ్మాయిలా పుట్టింటికి పంపేస్తే…? అమ్మో….అలా నన్నూ పంపించేస్తే నాన్నగారి పరువు పోదూ…? అయినా నేనేమీ అనకుండానే…? ఏమైనా నాన్నగారికి ఈ వయసులో నావల్ల మనస్తాపమా? ఒద్దు ఒద్దు.

.

మళ్లీ పల్లెటూరి జీవితం. ఎద్దడి నీళ్లూ…కందికంపా, చెరుకుపుల్లలతో వంటా, ఊరచెర్లో బొంతల ఝాళింపు, అయినా మేనకోడల్ని కాదని కొడుకు చేసుకున్నందుకు అత్తగారి అసంతృప్తి. అందుకు నేనేం చెయ్యను? మౌనమే శరణ్యం.

 

శ్లో. ‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన

       తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేనచిత్‌’

.

కాపరానికి వచ్చేరోజు నాన్నగారు నా చేతికిచ్చిన భగవద్గీత బతుకులో దేన్నయినా మౌనంగా భరించే శక్తినిచ్చింది. ధన్యురాల్ని!

.

‘అమ్మావాళ్లూ కంటార్లే! మనకి ముగ్గురుచాలు. పురిటికి వెళ్లినప్పుడు నువ్వే చేయించుకో ఆపరేషను పిల్లలు పుట్టకుండా. నాకు భయం బాబూ. సైకిల్‌ తొక్కకుండా సాగదు కదా నాకు? మా వాళ్లకి మాత్రం ఈ విషయం తెలియడానికి వీల్లేదు సుమా! ఈవిషయం మీ వాళ్లకి కూడా చెప్పు. కాదనడానికి లేదు! అమ్మో పుట్టింటికి….ఒద్దొద్దు….’

.

మూడో పురుటికి పుట్టింటికెళ్లనివ్వరు. ఇక్కడే పోసుకోవాలి.

.

‘ఇంట్లో పురుడు భయమనీ, హాస్పిటల్‌లోనే అలవాటనీ చెప్పు. నన్నడిగితే దానిష్టం అంటాను’.

.

అబ్బా ఎంత గొప్ప ఆలోచన!

.

కత్తిపోట్లు అడ్డుకునే డాలుని!! గట్టిగా కాదనే ధైర్యం కూడానా!

.

పక్కనే ఉన్న అమ్మకి కూడా తెలీకుండా ఆపరేషన్‌ పిల్లలు పుట్టకుండా. పురుడు రాగానే ఆఫీసుకి ఫోన్‌ చేస్తే బయలుదేరి వచ్చి, పిల్లవాడ్ని చూసి, హాస్పిటల్‌లో సంతకం పెట్టి వెళ్లిపోయారు.

.

‘పురుడొచ్చిందని కబురు రాగానే ఎలా వెళ్లిపోయాడో! ఇలాటివి మేం ఎరగమమ్మా!!’ ఊళ్లోవాళ్లంతా బుగ్గలు నొక్కుకున్నార్ట! ‘పట్నంవాళ్లిలాగే ఉంటారు కాబోసు?!’

.

‘ఒద్దన్నా మూడో పురుటికి పుట్టింటికెళ్లింది! ఎన్నాళ్లుంటుంది అక్కడ? వెంటనే పంపించండి’. అత్తగారి నుండి కబురు ఫలితంగా నెలా వెళ్లకుండా, అమ్మ ఎంత వారించినా వినకుండా అత్తింటికి చంటిపిల్లల్తో! చెప్పకుండా చేయించుకున్న ఆపరేషన్‌!  చెప్పడానికి వీల్లేని ఆపరేషన్‌! నీళ్లు తోడ్డంలాంటి బరువు పనులు చేస్తుంటే ఈ శరీరం ఏమైపోతుందోనన్న భయం. పోనీ మీరిప్పుడు చెప్పండంటే ‘ఏం అక్కర్లేదు’ ఇదీ జవాబు. నేనేమైపోయినా ఫరవాలేదా? ఏమో? ప్రేమలేదా? ఉండకుండా ఉంటుందా? ఏమో!!

.

ఆపరేషన్‌ చేయించుకున్నట్లు అత్తగారికి తెలీదుగా. బాలింతతనమే సాగనప్పుడు ఆపరేషన్‌ జాగర్తలెక్కడ….! అయినా, బాధపడ్తున్నానుకాని, శరీరం ఏం కావటం లేదు! భగవంతుడు కాపాడుతున్నాడా? ఏమో!!

.

చాకిరీ, పసివాళ్లూ–రోగాలూ, చావులూ, పుట్టుకలు. అయినా పెద్దల భయం. ఈ శరీరం నాది కాదు. అంతే!!

.

7వ దశకం–

.

‘చదూకున్నదానివని చేసుకున్నాను. ఎందుకంటావేమో. తమ్ముళ్లూ, చెల్లెళ్లూ చదవాలి. మీ వాళ్లల్లా బాగా చదివించాలి. అవును. డాక్టరేట్‌లు కావాలి. ఇంజనీర్లు కావాలి. ఆ నాలుగోదాన్ని, ఐదోదాన్నీ(చెల్లెళ్లు) బీఈడీ చేయించాలని ఉంది. వాళ్లకి సబ్జెక్టులు చెప్పు. ఏమైనా నీ టీచింగ్‌ బాగుంటుందిసుమా!’

.

‘వాళ్లకి ఎటూ చెబుతున్నాను కదా…నేనూ డిగ్రీ కట్టేస్తా. చదూకోడం నాకెంతిష్టమో!’

‘నీకు డిగ్రీలెందుకు? ఏం చేస్తావ్‌? చాల్లే చెప్పింది చెయ్‌’.

‘వాళ్లంతా ఏం చేస్తారో అదే’ అని జవాబు చెప్పే ధైర్యంలేదు. లేదు.

‘జాగర్త. నీ పిల్లలకి పొదుపు నేర్పు. అందరితో ఒంతులొద్దు. నీకోసం ఖర్చుపెట్టుకోకుసుమా. బంగారం మాట ఎత్తకు. ఏమైనా నేననుకున్నట్లుగా ఉండాలి. నాకు అనుగుణంగా లేకుంటే…’

అనుగుణంగా లేకపోవడం ఉండదు. అది నా లక్ష్మణరేఖ!!

.

8వ దశకం–

.

అత్తగారి ఆడపిల్లలకి పెళ్లిళ్లూ, మగపిల్లల పైచదువులూ, పాపం ఎక్కువమంది పిల్లల్ని కని కష్టపడుతున్న అదృష్టవంతురాలు!

‘అమ్మా. నువ్విబ్బంది పడకే. నువ్వు కూర్చో. ఒదిన చేత చేయించు’

‘మీరూ ఇలా వచ్చి కూర్చోండర్రా. అర్భకులు మీరు. ఆవిడ చేస్తుందిలే కాదనదు పాపం’.

‘నాన్నగారూ మీరెందుకు ఈ వయసులో సైకిలెక్కి వెళ్తారు? అన్నయ్యకి చెప్పి చేయించుకోండి’. ఫ్యాక్టరీ నుంచి వచ్చాక ఆడబడుచుల సలహా!

‘ఈ ఊర్నించి రోజూ సైకిల్‌ మీద టౌన్‌కి వెళ్లి రాలేకపోతున్నానమ్మా. చల్లారిపోయిన ఆ క్యారేజీ భోజనం చెయ్యలేకపోతున్నాను. అక్కడే కాపరం పెడదామనుకుంటున్నాను’.

‘ఇలా నీ పెళ్లాం మనల్ని విడదీసి వేరింటి కాపురం పెట్టిస్తుందనుకోలేదురా అబ్బాయ్‌!’

‘అదేం కాదులే అమ్మా. నాకే వెళ్లి రావటం కష్టం అవుతోంది. అయినా పిల్లలంతా నా దగ్గరే ఉండి చదూకుంటార్లే! ఆ చిన్నవాళ్లు మాత్రం ఎలిమెంటరీ స్కూల్‌కి వెళ్తారిక్కడ’.

‘అయితే నీ ఇష్టంరా మరి!’

 

పేరుకి టౌన్‌లో కాపరం. ఎక్కడున్నా నా దైనందిన జీవితం ఒకలాగే! ఇప్పుడు బజారు పనులు కూడా అదనం. రెండు చేతుల్లోనూ సంచీలు మోసుకుంటూ సరుకులు తెచ్చుకుంటూ…బతుకుబండి నన్ను మోసుకుంటూ సాగుతోంది!

.

9వ దశకం–

.

కోడలితనం సాగుతూనే ఉంది. ఆడబడుచుల పెళ్లిళ్లూ…వాళ్ల పురుళ్లూ, పుణ్యాలూ!! వాళ్ల పిల్లల, నా పిల్లల చదువులూ…ఊపిరి సలపకుండా గడిచిపోతోంది కాలం. ఇప్పుడిహ అమ్మా నాన్న కూడా లేరుగా! వదిలేస్తే వెళ్లడానికి!! ఎక్కడికెళ్తానూ…ఇంకెక్కడికెళ్లాలి కనుక!! పాపం! ఏమాటకామాటే చెప్పుకోవాలి! నిజానికి వదిలేస్తానని నోటితో ఎప్పుడూ అనలేదు!

.

నేనూ అత్తనయాను.

.

‘అమ్మా…నీకేమైనా డబ్బు కావాలంటే చెప్పు. డబ్బుకోసం బాధపడక్కర్లేదింక. కానీ నీలాగ నీ కోడళ్లు ఉండాలని ఆశించకు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఉండరు. ఉండలేరు కూడా. ఎప్పుడైనా నేనే వచ్చి పోతుంటాను’. ఏ ఆశా లేకుండా మొద్దుబారిన నా మనసును తట్టి మరీ చెప్పిన కొడుకులు… నన్ను అల్లంతదూరాన ఉంచిన కోడళ్లు! కూతుర్ని పోగొట్టుకున్ననాకు, చదువుకున్న కోడళ్లు ఆ స్థానం భర్తీ చేస్తారని ఆశించిన నాకు ఆశాభంగమే!

.

అత్తనైన నాకు–‘ఇదిగో ఈ రోజుల్లో ఆడపిల్లలతో జాగర్తగా ఉండాలిసుమా. అయినా ఆడపిల్లలు లేని నాకు వాళ్లంటే గారంసుమా…జాగర్తగా మసలుకోవాళ్లతో…వాళ్లకేం పనులు చెప్పకు….’ఆయనగారి హితోక్తా? సలహాయా? హెచ్చరికా??? ఏమో!

‘అది కాదండీ….’

‘ఏది కాదు? కావాలంటే పనివాళ్లని పెట్టుకో. డబ్బులిస్తాను’. ‘‘భగవాన్‌ పార్థసారథీ! ఎవరూ లేరు నాకూ…ఆ గిరిధర గోపాలుడుకాకెవరూ లేరు నాకూ…

తల్లినన్ను వీడిపోయె. తండ్రి నాకు దూరమాయె బందుగులందరూ నన్నేలో పరిహరించినారు స్వామీ….’’ మీరా భజన్‌ గుర్తుతెచ్చుకుని, పాడుకుని వేడుకోవడం తప్ప చేయగలిగినదేముంది? చిన్ననాటి సంగీతం ఓదార్చే నెచ్చెలైంది. ధన్యోస్మీ!!

.

2000–కొత్త మిలీనియం!!!

.

సిమెంటు రోడ్డు వచ్చినా పక్కనే ఉన్న గతుకుల రోడ్డు మీదే బతుకుబండి!

.

మనసుని భగవంతునికప్పగించి, శరీరాన్ని ఒక యంత్రంలా ఉపయోగించడం అలవాటయింది. భగవద్గీత ధర్మమా అని!!

.

శతమానానికి దగ్గరపడుతూ మంచం మీదున్న మామగారి సేవ ఎంతమందికి దొరుకుతుంది!! అదృష్టవంతురాలివి. పుణ్యమంతా నీదే!!!

.

ఈ పుణ్యమంతా ఎక్కడ దాచాలో! ఎందుకు ఉపయోగపడుతుందో…? ఏమో!!

.

‘తల్లున్నప్పుడే పుట్టిల్లు. పాలున్నప్పుడే పరమాన్నం’ అన్నారమ్మా పెద్దలు. మీ మనవల్నీ, కూతుళ్లనీ, అల్లుళ్లనీ ఈ పండగ సెలవులకి ఇక్కడికే తీసుకురండర్రా. మీ అన్నయ్యకి మీరంటే ఎంత ప్రేమో!! గేదె ఈనమోపుగా ఉంది కూడా. మీ పట్నం అల్లుడికీ, పెద్దదానికి మనవలకీ కూడా జున్నంటే తెగ ఇష్టం. మిగిలినవాళ్లు కూడా ఈ పండక్కి ఇక్కడికే వస్తామని ఫోన్‌ చేశారు. సరదాగా గడుపుదురుగాని అందరూ….’

.

‘ఏవండీ! నా ఆరోగ్యం బాగుండటం లేదు. ఇంటా బయటా చేసుకోలేకపోతున్నాను’.

.

‘నీకు మునుపే చెప్పాను…నీ బాధల గురించి నాతో చెప్పొద్దని. ఒంట్లో బాలేకపోతే డాక్టర్‌ దగ్గిరకి వెళ్లి చూపించుకో. నాతో చెబితే నేనేం చెయ్యను. ఇంత వయసైనా రిటైరై కూడా ఫ్యాక్టరీకి వెళ్లి పని చేస్తున్నానా? నా సమస్యలు నీతో చెప్పానా ఎప్పుడైనా?! ఇదంతా నా కోసమా? మీ అందరి కోసం కాదూ? అంత బాధపడ్తావేమిటీ? చెల్లెళ్లూ, తమ్ముళ్లూ అందరూ వస్తున్నారు. ఆత్మీయంగా పలకరించి, వాళ్లందరికీ ఏవేవి ఇష్టమో…చెయ్యడానికి పిండీ అవీ ఆడించాలేమో చూసుకో! సరుకులూ అవీ తెచ్చుకున్నావా? అమెరికా నుంచి అబ్బాయి ఫ్యామిలీ వస్తారేమో ఫోన్‌ చేసి కనుక్కో. కోడళ్లతో జాగర్త!’

.

‘నేను మునపటిలా ఒక్కదాన్నీ సంబాళించుకోలేకపోతున్నానండీ. అలసిపోయాను. శరీరం సహకరించడం లేదండీ. ప్లీజ్‌…!’

.

‘అయితే నన్నేం చేయ్యమంటావ్‌? సరేలే అందరూ వచ్చేసరికి వంటమనిషిని పెట్టించుకో. కానీ దగ్గరుండి వాళ్ల చేత చేయించుకోకపోతే పూర్తిగా వాళ్ల వంట తినలేరు ఎవ్వరూ. చూసుకోమరి. ఇంక నన్ను పడుకోని. పొద్దున్నే పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డువాళ్లు వస్తున్నారు. 7 గంటలకల్లా వెళ్లి పోవాలి ఆఫీసుకి’.

.

‘భగవాన్‌! ఎప్పటికైనా నా భారాన్ని గుర్తించి నన్ను సేదతీర్చి అక్కున చేర్చుకునేవాడు ‘భర్త’ అని నమ్మాను. అటువంటి ఒక రోజు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. ఇది అత్యాశా???’

.

‘కృష్ణా…ఇంతకాలం పుట్టిల్లంటే అమ్మా నాన్నా ఉన్న చోటేననుకున్నాను. కాదని అర్థమైంది స్వామీ. నేను వచ్చింది నీ నుండి. నేను చేరాల్సింది నీ సన్నిధికి! కానీ దేవా! నీ దగ్గరికి రావడానికి సహజమైన దారి ఏదో నాకు తెలియడం లేదు తండ్రీ! ఏం చెయ్యమంటావ్‌?!’

.

‘నిన్ను సాక్షిగా ఉంచుకుని ఈ శరీరం ‘నేను’ కాననే భావనని పెంపొందించుకుని మరీ శరీరంచేత పని చేయిస్తున్నాను కానీ, కాలానికి వశం అయిన శరీరం వయసుకి వశమవుతుంటే, మనసు కూడా అలసిపోయిన స్థితిలో…ఇంతకాలం తర్వాత నువ్వు గుర్తుకొచ్చావ్‌ తండ్రీ! నీ దగ్గరకెలా రావాలో తెలీని నన్ను నీవే నీ సన్నిధికి చేర్చుకో’.

.

శ్లో. సంసార కూపమతిఘోర మగాధమూలం

     సంప్రాప్త్య దుఃఖ శత సర్ప సమాకులస్య

     దీనస్యదేవ కృపణా పదమాగతస్య

     లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం….

.

శ్లో. సంసార సర్ప విషదగ్ధ భయోగ్రతీవ్ర

     దంష్ట్రాగ్ర కోటి పరిదష్ట వినష్టమూర్తే!

     నాగారి వాహన సుధాబ్దినివాస శౌరే

     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం

.

‘‘మదిలో చింతలు మైలలు మణుగులు–వదలవు నీవలి వద్దనక….

  అంతర్యామీ! అలసితి సొలసితి–అంతట నీ శరణిదేజొచ్చితిని…’’

‘‘చిదానంద రూపశ్శివోహంశ్శివోహం’’

I am not the body!

I am not the emotion!

I am not the mind!

I AM THAT I AM

I am one with GOD

.

ఓం తత్సత్‌!!

.

**************************************************************

.