12_005 ముకుందమాల – భక్తి తత్వం 12

 

శ్లో॥4    ద్యావాపృధివ్యో రిద మంతరం హి

         వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః

         దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం

         లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్‌ ॥

 

            అంటూ భగవద్గీతలో అర్జునుడు భగవానుడిచ్చిన దివ్యదృష్టితో ఆశ్చర్యచకితుడై అవలోకించిన, దేవదేవుడే స్వయంగా దర్శింపజేసిన రూపం. ఇదే ఆ భగవానుని విశ్వరూపం. పరమేశ్వరుని భక్తితో నమ్మిన భాగవతులందరూ ఏదో ఒకప్పుడు భగవానుని దివ్య విభూతిని దర్శించిన వారే!

 

                        విశ్వరూపపు బ్రహ్మము – విరాట్టయిన బ్రహ్మము

                        ఐశ్వర స్వరాట్టా సామ్రాట్టయిన బ్రహ్మము

                        శాశ్వత బ్రహ్మాండంబు శరీరమ్మయిన బ్రహ్మము

                        ఈశ్వరుడై, మహారాట్టై ఇందరిలో బ్రహ్మము

                        సూర్యునిలో తేజమ్ము సోమునిలో తేజమ్మూ

                        శౌర్యపుటనలుని భాస్వత్తేజము…

 

అంటూ పాడాడు అన్నమయ్య సంభ్రముతో తాను భావించి దర్శించిన విశ్వరూపాన్ని, విరాట్స్వరూపాన్ని వర్ణిస్తూ. పరమపదంలోని పరంజ్యోతిని కీర్తించాడు అన్నమయ్య.

 

                        ఇక పరమ భాగవతోత్తముడు పోతన దర్శించిన త్రివిక్రమమూర్తి.

                        ఇంతింతై వటుడిరతయై మరియు తానింతై నభోవీధిపై

                        నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాసిపై

                        నంతై చంద్రునికంతయై ధృవునిపై నంతై మహార్వాటిపై

                        నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ॥

 

            ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరించిన, భువియు, నభంబును, దివంబును, దిశలును, సముద్రంబులును నిండి ‘‘దర్శనమిచ్చాడు వామనుడు త్రివిక్రమ మూర్తియై.’’ జలదఖిలభూతనివహంబులును తానయై క్రమక్రమంబున భూలోక, భువర్లోక, సువర్లోక మహర్లోకములను దాటి సత్యలోకము కంటె మించిన ఆ మూర్తి ఔన్నత్యాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. అటువంటి అద్భుతమైన విశ్వరూప సందర్శన భాగ్యానికి నోచుకున్న భక్తుని భావావేశం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టేలా వివరిస్తారు ఈపద్యంలో.

 

            ” సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్‌’’ అని వర్ణింపబడ్డ ఆ పరమ పురుషుని విశ్వరూప సందర్శనానందంతో పరవశించిన భక్తుని మనశ్శరీరాల స్థితిని, భావావేశాన్నీ వర్ణిస్తున్నారీ శ్లోకంలో…

 

          ఆ పరబ్రహ్మ సాక్షాత్కారమే పొందగల్గిననాడు ఈ జగత్తు యొక్క పరిమితత్వమూ ఆ పరమాత్మ యొక్క అపరిమితత్వమూ, నిరతిశయము అనుభవానికి వస్తాయి. ఆ పరమపురుషుని విశ్వరూపదర్శనంతో పరవశించిన భక్తుని మనశ్శరీరాల భావావేశాన్ని వర్ణిస్తారు.

 

  1.                బద్ధేనాంజలినా నతేనశిరసా గాత్రైస్సరోమోద్గమైః

                   కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణబాష్పాంబునా

                   నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం

                   అస్మాకం సరసీరుహాక్ష! సతతం సంపద్యతాం జీవితం ॥

 

          ఓ పుండరీకాక్షా! నీ ముందు దోసిలి యొగ్గి, శిరసువంచి, నీ దర్శన పరవశంతో, గగుర్పొడిచిన అవయవాలతో కంఠం గద్గదంచెందగా, అత్యంత ఆనందపరవశాన, నీరు నిండిన కన్నులతో ఎప్పుడూ నీపాదారవింద ధ్యానామృతాన్ని ఆస్వాదిస్తూనే మా జీవితమంతా సాగిపోయేలాగున అనుగ్రహించు తండ్రీ!

 

             శ్లో॥   బహువిధ పరితోష భాష్పపూర

                   స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిమ్‌

                   చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం

                   పరమ సదాశివ భావనాం ప్రపద్యే ॥ (శివానందలహరి)

 

          భగవంతుని ధ్యానించడం, ఆ ఆనందాన్ని అనుభవించడం ఒక అదృష్టం. భగవంతుని తలచకుండా జీవించే వారి జన్మ నిరర్ధకం. అలా తలచగలిగిన జీవితం ఉండీ పొందకుండేవారు దురదృష్టవంతులు. కంసునిలా సదాధ్యానిస్తూనే ఉన్నా, ద్వేషంతో ధ్యానించడం వల్ల, కలగవలసిన ఆనందం కొరవడుతుంది. మరికొందరికి మనసులోని భావాలను వ్యక్తీకరించుకునే అలవాటుండదు. అందువలన కూడా పూర్తి ఆనందం అనుభవించలేరు.

 

          మనసు భగవత్పాదారవింద ధ్యానంలో నిమగ్నం కాగానే ఆ ఆనందంలో, పారవశ్యంలో, ఇంద్రియాలు కూడా పాలుపంచుకున్నప్పటి ఆనందం, మధురమైన పదార్ధాలను ఇంట్లో భార్యాపిల్లలతో, బంధుమిత్రాదులతో ఆశ్రితులతో కలిసి భుజించే ఉత్తముడైన యజమాని ఆనందం వంటిది! మనసు భగవంతుని దర్శనానందాన్ని పొందినపుడు, అప్రయత్నంగా,  బద్ధేనాంజలినా… చేతులు దోసిలి యొగ్గి నమస్కరించడం జరుగుతుంది. నతేనశిరసా! కొండంత దేవుడు కన్నుల ముందు సాక్షాత్కరిస్తే నమ్రతతో శిరసు వంగకుండా ఉండలేదు. గాత్రైస్సరోమొద్గమైః దర్శన పరవశంతో ఒళ్ళు గగుర్పొడవడం, పులకాంకితమవడం సహజం కదా!

 

          కంఠేన స్వర గద్గదే నయనే నోద్గీర్ణ భాష్పాంబునా… భగవంతుని స్తోత్రం చెయ్యాలంటే తన్మయత్వంతో ఆనందంతో కంఠం గద్గదమవడం, ఆ మూర్తిని రెప్పవేయకుండా చూడాలనే మనోభావానికి, ఆనందాశృవులు అడ్డు తగలడమూ, ఈ స్థితిలో ధ్యానామృతాస్వాదన అనుభవించే జన్మమే ధన్యం!  ఈ స్థితికై అనుక్షణం కోరుకుంటూంటాడు భక్తుడు.

 

          అహంకారం భగవత్రాప్తికి ప్రతిబంధకం. అహంకారం తొలగితేనే కాని శిరసువంగదు. అహంకార రహిత స్థితి నందినందుకు గుర్తు శిరసువంగడం. గర్వితులగు రాజులకో, ఉపకారాలాశించి ధనవంతులకో నమస్కరించడం  మామూలే. కానీ అలాకాక ఆ పరాత్పరుని, సహజ ప్రేమతో, భక్తితో శరణువేడి నమస్కరించడం తనను తాను పరమాత్మకు నివేదించుకోవడం అవుతుంది. భక్తి అంతరంగంలో ఉండటమేకాదు. దాన్ని భౌతికంగా కూడా వ్యక్తపరచగలగాలి అంటే మనోవాక్కాయ కర్మలా ఆ పరమాత్ముని సేవలోనే జీవితమంతా గడచిపోవాలన్నమాట. ఈ దశలన్నీ సదా అనుభవిస్తూ ఉండాలన్నదే శ్రీ కులశేఖరుల వారి కోరిక!

 

  1.                హే గోపాలక! హే కృపాజలనిధే! హే సింధుకన్యాపతే

                   హే కంసాంతక! హే గజేంద్రకరుణాపారీణ! హే మాధవ!

                   హే రామానుజ! హే జగత్త్రయగురో! హే పుండరీకాక్ష! మాం

                   హే గోపీజననాథ! పాలయ పరం జానామి నత్వాం వినా.

 

          హే గోపాలా! హే కృపాజలనిధే!! శ్రీకృష్ణపరమాత్మకు సంపూర్ణ శరణాగతి అన్నమాట. ఇతర ఉపాయలన్నీ వదిలి పరమాత్ముడే గతియని నమ్మి వరించడమే శరణాగతి. భగవానుడే భగవత్ప్రాప్తికి ఉపాయం హేగోపాలా! ఆశ్రితవత్సలా! కృపాజలనిధే! గోవులు, గోపాలురు నిన్ను పాలించమని కోరలేదు. అయినా ఆ వంశంలో జన్మించి, వాటిని కాపాడుతున్నావు.

 

          నీ కృపను ఎలా పొందాలో తెలియని నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను కాపాడు ప్రభూ. హే గోపాలా! ఆశ్రిత జనవత్సలా! కృపాజలనిధే! నిన్ను తెలిసీ ఎలా ఏవిధంగా ? అంటే కర్మద్వారానా ? భక్తితోనా? జ్ఞానం పొందా? ఏ ఉపాయం చేత నిన్ను అందుకోవాలో తెలియని నన్ను నువ్వే నీ వాడనుచేసుకో. మాలోని అహంకారకామాలు నిన్నుమాకు దూరం చెయ్యకుండా నీవే కాపాడి, మా యెడల ప్రసన్నుడవుకమ్ము స్వామీ!

 

          హే సింధుకన్యాపతే! మాతల్లి లక్ష్మికి పతివినువ్వు. ఆమె బిడ్డలం మేం. ఆ ప్రేమ స్వరూపిణి సంతానం మేము. మమ్మల్ని అనుగ్రహించు తండ్రీ. హే కంసాంతక! మాలోని రాక్షస గుణాలైన అహంకారకామాది గుణాలను మా నుండి వేరుచేసి, మమ్మల్ని కాపాడు.

 

          హే గజేంద్ర కరుణాపారీణా! ఆనాడు నిన్ను శరణు వేడిన మకర పీడితుడైన గజేంద్రుని కృపతో బ్రోచిన నువ్వు మాయందు కూడా, ఆ విధమైన కరుణను ప్రసరించు తండ్రీ.

 

             ప॥   బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా

                   నీ చరణాంబుజములునే విడజాల కరుణాలవాల ॥ బ్రోచే॥

            చ.    ఆ తురముగ కరిరాజును గాచిన వాసుదేవుడవు నీవు కదా?

                   నాపాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిపట్టి విడువక ॥ బ్రోచే ॥

                   ముజ్జగాలకూ అధిపతివి నువ్వు, నీవు కాక మమ్ము రక్షించే వారెవరు ప్రభూ?

                   అవతారాః సంత్వన్యే……..

                   కృష్ణాదన్యః కోవా ప్రభవతి గోగోప గాపికాముక్యై ॥

 

          అని కృష్ణకర్ణామృతంలో లీలాశుకులు చెప్పినట్లు, ఎన్నో అవతారాలున్నై, కాని కృష్ణా! నీవు తప్ప ఎవరయ్యా, అమాయకులైన గోవులనూ, గోపగోపికలనూ తరింపజేసి ముక్తినిచ్చినవారూ? అందుకే అజ్ఞానుడనైన నన్ను నీవే తప్పనితః పరం బెరుగని నన్ను నీవేరక్షించవలెనయ్యా!

 

          హే పుండరీకాక్షా! నీ నేత్ర సౌందర్యం మా హృదయతాపాన్ని చల్లబరచు చున్నది స్వామీ! సర్వలోకాలలో సర్వవిషయములనూ చూడగలిగిన నీకు మా కోరిక మాత్రం తెలియదా తండ్రీ? నీ నామమే మమ్ములను పవిత్రం చేసినది. మాలో నిన్ను పొందకుండా చేసే పాపాలేవీ మిగిలి లేవుకదా! మమ్ము రక్షించు స్వామీ!

 

                   శరణు శరణు సురేంద్ర సన్నుత

                   శరణు శ్రీసతి వల్లభా

                   శరణు రాక్షసగర్వ సంహార శరణు వేంకటనాయకా

                   ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్నుగొలువగ వచ్చిరీ

                   విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

 

          తన ఆరాధ్య దేవానికి శరణంటారు అన్నమయ్య. శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే! ఈ విధంగా సర్వాత్మనా భగవంతుని శరణాగతియే తరుణోపాయం అంటూ మహారాజు తెలియజేస్తున్నారు.

 

  1.                భక్తాపాయ భుజంగ గారుడమణిః త్రైలోక్య రక్షామణిః

                   గోపీలోచన చాతకాంబుదమణిః సౌందర్య ముద్రామణిః

                   యః కాంతామణి రుక్మిణీ ఘసకుచ ద్వంద్వైక భూషామణిః

                   శ్రేయోదేవశిఖామణి ర్దిశతు నో గోపాల చూడామణిః

 

          సంసార వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధినివారణకై మణిమంత్ర ఔషధాలను ఉపదేశిస్తున్నారు మూడు శ్లోకాలలో. శ్రీ కృష్ణదేవుడు భక్తులకు శ్రేయస్సును కల్గజేయడంలో సులభుడు. 

 

          సంసారాన్ని ఒక త్రాచుపాముతో పోలుస్తారు. ఆ పాముకాటువల్ల, అవిద్య అనే విషం తలకెక్కి, వాస్తవంగా ఉండవలసిన చూపు మారిపోయింది. ఈ విశ్వమంతా భగవంతుని సృష్ఠి! కానీ సర్వేశ్వరుని సృష్టిలోని సర్వవస్తువులూ నావి అనుకోవడం, తాత్కాలికమైన ఈ దేహాన్నే ఆత్మ అనుకోవడం` ఇదుగో ఈ విషప్రభావమే! ఇటువంటి విషానికి విరుగుడు గరుడమణి. ఇది విషాన్ని లాగి వేస్తుంది. లేదూ మంత్రం వేస్తే విషం దిగుతుంది. ఇంకా, ఔషధం సేవిస్తే, విషం విరుగుతుంది. ఆ మణి గోపాలచూడామణి. ఆ మంత్రం శ్రీ కృష్ణమంత్రం. ఆ ఔషధం శ్రీకృష్ణదివ్యౌషధం. ఈ మణిమంత్ర ఔషధాలను సంసారవ్యాధిగ్రస్తులందరూ ఉపయోగించాలనీ, వాటిని గురించి లోకానికి చాటి చెప్పాలనీ, శ్రీ కులశేఖరులు వాటి గొప్పదనాన్ని గురించి వివరించి చెబుతున్నారు. ఈ శ్లోకంలో మొదటిగా మణి యొక్క వైభవం గురించి చెబుతున్నారు. సాధారణంగా పాము తలపై ఉండే మణే పాము విషాన్ని హరిస్తుందంటారు. ఈ మణి గోపాలచూడామణి. ఇతడు దేవతలలో తలమానికం అందుకే దైవశిఖామణి. ఎంతటి ఉన్నతుడో అంతటి సులభుడు.

 

          అతడే త్రైలోక్య రక్షామణి మూడు లోకముల (భూర్భువసువర్లోకములు) వారికి అనిష్టాన్ని తొలగించి, ఇష్టాన్ని చేకూర్చేవాడు శ్రీ కృష్ణుడే! రాక్షామణి R అన్నిలోకముల వారికి, అనిష్టాన్ని తొలగించి, ఇష్టప్రాప్తి కలిగించేవాడు. సంసారబంధాన నున్న వారికి రోగాది నివృత్తి, ఐశ్వర్యప్రాప్తిని కలిగించి కాపాడే స్వామి, ఆత్మజ్ఞానమే కావాలనుకునే వారికి జరామృత్యువుల నుండి కాపాడి, ఆత్మజ్ఞానము నివ్వజాలినవాడు.

         

తరువాయి వచ్చే సంచికలో……

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾